అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరు వేంకటగిరినాధుని విశ్వసించే అశేష భక్తకోటి సేవించుకునే అపూర్వ పుణ్యభాగ్యాన్ని మరొకరు నియంత్రిస్తారా? ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీనివాసుని భక్తులు కనీసం దర్శించుకోవడానికి కూడా వీల్లేకుండా.. నిషేధాజ్ఞలు విధిస్తారా? తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అంటే.. భగవంతునికి, భక్తులకు సేవ చేయడానికి దక్కిన పదవులు అనుకుంటున్నారా? లేదా, తిరుమల స్వామివారి మీద తాము గుత్తాధిపత్యం చేయడానికి దక్కిన హక్కుగా ఎంచుతున్నారా? అనేది అర్థం కావడం లేదు. ఆలయంలో మహా సంప్రోక్షణ జరుగుతున్నంత మాత్రాన ఏకంగా భక్తులను కలియుగ వైకుంఠం అయిన తిరుమల గిరులకే అనుమతించకుండా.. నిషేధించడం అనేది దుర్మార్గం లాగా కనిపిస్తోంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ నిర్వహించనున్నారు. పన్నెండేళ్ల కోసారి నిర్వహించే గర్భాలయం శుద్ధి, మరమ్మతులనే ఇలా వ్యవహరిస్తారు. ఈ మరమ్మతులను ప్రత్యేకంగా తయారుచేసిన పదార్థాలతో అర్చకులే నిర్వహిస్తారు. స్వామి అంశను ఆవాహనం చేసిన పూర్ణకుంభాన్ని గర్భాలయం వెలుపల మరోచోట ప్రతిష్టించి దానిని బాలాలయంగా వ్యవహరిస్తారు.
ఈ క్రతువు మొత్తం శాస్త్రోక్తంగా నిర్వహించడం మంచిదే. గతంలో కూడా ఇలా నిర్వహించారు. 2006లో కూడా జరిగింది. కానీ గతంలో ఎన్నడూ కూడా భక్తుల దర్శనాలను నిషేధించడం అనేది జరగలేదు. మహా సంప్రోక్షణ లేదా జీర్ణోద్ధరణ అన్ని ఇతర ఆలయాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. కానీ భక్తుల ప్రవేశాన్నే పూర్తిగా నిషేధించడం అనేది మాత్రం ఎక్కడా ఉండదు. పైగా తొలుత నాలుగు రోజుల పాటూ మహా సంప్రోక్షణ జరుగుతుందని పేర్కొన్న అధికారులు, ఆ తరువాత.. ఏకంగా ఎనిమిదిరోజుల పాటూ (ఆగస్టు 10వ తేదీ సాయంత్రం నుంచి 17వ తేదీ ఉదయం వరకు ) భక్తుల తిరుమల ఆగమనాన్నే నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేయడం విశేషంగా కనిపిస్తోంది. ఇది తిరుమలేశుని పట్ల మహాపరాధమే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలోనూ మహా సంప్రోక్షణ జరిగేప్పుడు ప్రతిరోజూ పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తుండేవారు. ఈసారి ఏకంగా భక్తులను తిరుమలకు అనుమతించడమే నిలిపేశారు. నిజానికి భగవంతునికి- భక్తులకు మధ్య సంధానకర్త అయిన సేవకుడి పాత్రలో ఉండవలసిన బోర్డు ఇలాంటి దుందుడుకు నిర్ణయాలు తీసుకోవడం విమర్శలకు గురవుతోంది.
మహా సంప్రోక్షణ సమయంలో మొత్తం భక్తులను ఆలయంలోకి అనుమతించడం సాధ్యం కాదు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ అందుకు ప్రత్యామ్నాయంగా వీలయ్యేఅంత మంది భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించేలా ఏర్పాట్లు చేయవచ్చు. ఆ వారం రోజుల పాటూ తిరుమలల భక్తులు ఎవ్వరికీ బస కేటాయించకుండా.. తిరుపతి నుంచి ఉదయం భక్తులను పరిమితంగా అనుమతిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వారు సాయంత్రానికి తిరిగి తిరుపతికి వచ్చేస్తారు. చేయదలచుకుంటే అందుకు తగిన మార్గాలు అనేకం స్ఫురిస్తాయి.
కానీ టీటీడీ బోర్డు మాత్రం.. ఏకపక్షంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుమలకు భక్తుల రాకనే ఏడు రోజులకు పైగా పూర్తిగా నిలిపివేస్తూ అరాచకానికి పాల్పడుతున్నదనే విమర్శలు వస్తున్నాయి.