ఏందోనబ్బా.. ఒక్కోసారి మనసంతా అదోమాదిరిగా అయిపోతాది. ఒంట్లో పేనం కొడిగట్టేసినట్టుండాదంటారే.. ఒళ్లంతా అట్టా అయిపోతాది. అంతా ఆ మాదిరిగా గందరగోళం అయిపోయినప్పుడు ఏదైనా మందులేసుకుంటే కొంచిం గుణం కనపడతాది. కొందురు మాత్తరం కిక్కిచ్చే మందుంటాదే అదిగూడా పుచ్చుకుంటారంట.. ఇంకా గుణం కనపడతాదంట!
నా మట్టుకు నాకు మనసులో దిగులుగా ఉండినా.. యిచారంగా ఉండినా.. కుశాలగా ఉండినా.. ఎట్టా ఉండినా గూడా.. నాకు దెలిసిన మందు ఒక్కటే. ఈ జగనుండాడే.. ఆయన్ను గురించి నాలుగు తిట్లు తిట్టిపోసినామంటే.. ఇహ అంతే.. మనసంతా తేలిగ్గా అయిపోతాది. జగన్ మనకి మందులాంటోడబ్బా.
ఈ మద్దెన ఈ పిలగాడి పితలాటకం ఇంకా జాస్తయిపోయుండాది. ఆ యాత్ర మొదలెట్టిన కాణ్నించీ దివారాత్రాలు నన్ను తిట్టిపోయడమే పనైపాయె. నేనూరుకుంటిననుకో.. ఆయబ్బ జెప్పేదంతా నిజమేనని జనం అనుకుంటారు గదా.. కాబట్టి మనవేంటి సెయ్యాల.. మనం గూడా రోజూ పొద్దున లెగిసినకాణ్నించీ.. ఏదో ఒకటి జగను గురించి తిట్టిపోస్తా ఉండాల. తిట్టటానికి నా దగ్గిర శానా తెలివితేటలు ఉండాయనుకో.. నలబయ్యేళ్ళబట్టీ.. నేను పోగేసిన సంపద అంతా అదే గదా.. అందుకే ఎడా పెడా తిట్టేస్తా ఉంటా!
కానీ యేటి జెయ్యాల,.. ఆయబ్బ జెనం కాడికి పోతావుండె. రోజుకు నాలుగూళ్లు తిరిగేస్తండాడు. మనం ఈ ఊరు గెవుడు దాటి జనం కాడికి పోకపోతిమి. మన దగ్గిర ఎన్ని యెరైటీ యెరైటీ తిట్లున్నా గూడా యినేవోళ్లన్నా మారతా వుండాల గదా.. అందుకనే ఈ మాదిరి జేస్తండా…
అది పార్టీ మీటింగా, అదికార్ల మీటింగా, కొరియా కారు కంపెనీ వోళ్ల మీటింగా, పేపరూటీవీ వోళ్ల మీటింగా.. మోడీ జైట్లీ మీటింగా… ఏదీ వారా లేదబ్బా.. మీటింగు ఏదైనా సరే.. తొలీగా సుక్లాంబరదెరం పాడుకునేమాదిరిగా.. కాసేపు జగనబ్బయ్యను నానా మాటలూ తిట్టేస్తే.. మనసు నిమ్మళం అయిపోతాది. గుండె గుబగుబ తగ్గిపోతాది. ఆనక ఏమైనా మాటాడుకోవచ్చును.
పొద్దునలేసినా కాణ్నించీ.. పెతిసారీ జగనబ్బయ్య అస్టోత్తరం పాడతా ఉంటే గానీ.. నా మట్టుకు పొద్దుగుంకే యేళకి నిద్దర పట్టడం లేదబ్బా…
– కపిలముని