కపిలముని : విశాఖ పేరుతో మహా కుట్ర!!

రాష్ట్ర విభజన జరిగిపోతే సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధాని ఏమిటి? ఈ విషయంలో ఇప్పటికే రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇదివరకు ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడకపూర్వం రాజధాని కర్నూలులో ఉన్నది కాబట్టి.. ఈసారి కూడా కర్నూలులోనే ఏర్పాటు…

రాష్ట్ర విభజన జరిగిపోతే సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధాని ఏమిటి? ఈ విషయంలో ఇప్పటికే రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇదివరకు ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడకపూర్వం రాజధాని కర్నూలులో ఉన్నది కాబట్టి.. ఈసారి కూడా కర్నూలులోనే ఏర్పాటు చేయాలని కోరేవారు కొందరు. కర్నూలు మరీ హైదరాబాదు అంచుల్లోనే ఉన్న సిటీ గనుక.. అక్కడ కాకుండా.. మరెక్కడైనా రాయలసీమలో ఏర్పాటుచేయాలనే వారు కొందరు. సీమాంధ్ర ప్రాంతానికి మధ్యలో ఉండేలా గుంటూరు ఒంగోలు జిల్లాల వద్ద ఏర్పాటు కావాలని అనేవారు కొందరు. ఇలా ఇక్కడి ప్రజలే తర్జన భర్జనలు పడుతూ ఉన్నారు. బాధ్యతగల పదవుల్లో నాయకులు స్పష్టంగా ఈ రాజధాని డిమాండ్‌వైపు ఇంకా వెళ్లలేదు. అందరూ సమైక్యాంధ్ర పాట మాత్రమే పాడుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో తెలంగాణ నాయకులకు సీమాంధ్ర రాజధాని గురించి తెగ శ్రద్ధ పుట్టుకొచ్చేసింది. తెలంగాణ ప్రజాప్రతినిధులు కొందరు జీవోఎంకు ఒక నివేదిక సమర్పించారు. 

అందులో సీమాంధ్ర ప్రాంతానికి విశాఖను రాజధానిగా ఏర్పాటుచేయాలని వారు సిఫారసు చేశారు. మన రాష్ట్రంలో హైదరాబాదు తర్వాత అత్యంత ఆధునికమైన నగరం విశాఖ పట్టణమే గనుక.. సీమాంధ్రకు సంబంధించిన పరిపాలన వ్యవస్థలు, హైకోర్టు, డీజీపీ కార్యాలయం అన్నీ ఒకేసారి అక్కడకు తరలించేయడం సులువు అని వారు ప్రతిపాదిస్తున్నారు. 

అయితే సీమాంధ్రకు విశాఖపట్టణంను రాజధానిగా ప్రతిపాదించడం అనేది తెలంగాణ నాయకుల కుట్రగా కనిపిస్తోంది. సీమాంధ్ర శాశ్వతంగా రావణకాష్టంలా రగులుతూ ఉండడానికి తెలంగాణ నాయకులు చేస్తున్న నవీన కుట్ర, కూహకంలాగా ఈ ప్రతిపాదన కనిపిస్తున్నది. ఎందుకో పరిశీలిద్దాం.

1) హైదరాబాదులో జరిగిన పొరబాటునే ఇప్పుడు రిపీట్‌ చేయాలని తె-నేతలు ప్రతిపాదిస్తున్నారు. రాష్ట్ర ఆదాయం మొత్తాన్ని అభివృద్ధిపేరిట ఖర్చుచేసి సకల సదుపాయాలను హైదరాబాదులో మాత్రమే ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడు ఈ నగరం కోసం అందరూ కొట్టుకుంటున్నారు. రేపు అదే రకంగా సమస్త అభివృద్ధిని ఇప్పటికే ఆ ప్రాంతానికి నెంబర్‌వన్‌గా ఉన్న విశాఖలో పెట్టాలనడం అంటేనే అది కుట్ర కింద లెక్క. 

2) విశాఖ పేరు ఇంకా కీలకంగా తెరమీదకు వచ్చినదగ్గరినుంచి.. ఆ ప్రాంతమంతా తగాదాలు మొదలవుతాయి.  ఉత్తరాంధ్ర మొత్తం దానికి జై కొడతారు. గుంటూరు నుంచి దిగువకు ఉన్నవారంతా వ్యతిరేకిస్తారు. ఇలా వారిలో వారే కొట్టుకుని తగాదాలు పడడం మొదలవుతుంది. 

3) రాయల సీమ అటు నీళ్లు, ఇటు పారిశ్రామిక రంగం, అటు రాజధాని ఏదీ లేని ప్రాంతం అవుతుంది. ఆ ప్రాంతం వాసులంతా నిత్య అసంతృప్తితో వేగిపోవడం మొదలవుతుంది. 

4) విశాఖ నగర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పరంగా ఇప్పటికే చాలా వరకు అభివృద్ధి చెంది ఉన్న నగరం. ఇక్కడ రాజధాని అంటే.. కొత్తగా పెట్టవలసిన ఖర్చు తగ్గుతుంది. అంటే కొత్త రాజధాని కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధుల ప్యాకేజీ ఇవన్నీ బాగా తగ్గుతాయి. కేంద్రం నుంచి వారు ఇవ్వదలచుకున్న నిధుల్లో కోత పెట్టేలా చేస్తే, తెలంగాణకు కూడా అభివృదిధ పేరిట సమాన, పెద్ద ప్యాకేజీలు అడగవచ్చునని వారి ఆలోచన. 

ఇలా సీమాంధ్రలో తగాదాలు పుండు సృష్టించే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిదులు విశాఖను రాజధానిగా ఎంపికచేసేలా జీవోఎంకు నివేదికలో పేర్కొన్నారని భావించాల్సి వస్తోంది. ఇక్కడ అత్యంత గర్హనీయమైన విషయం ఏంటంటే… సీమాంధ్రకు ఎక్కడ రాజధాని పెట్టాలనే విషయాన్ని తాము ప్రతిపాదించాలని తె-నాయకులు తెగబడ్డం. వారి బుద్ధి యావత్తూ ఇప్పటికీ వక్రంగానే సాగుతున్నదనడానికి దీన్ని నిదర్శనంగా భావించాలేమో. 
అలాకాకుండా.. తమ ప్రాంత వికాసానికి తమ ప్రాంత ప్రజల అభివృద్ధికి ఏం కావాలో, విభజన నేపథ్యంలో సీమాంధ్రుల ఒత్తిడికి గురికాకుండా తమ ప్రాంతానికి ఏం న్యాయం జరగాలో అనే విషయాల వరకు మాత్రమే పరిమితం అయితే.. వారికి సజావుగా వారి ప్రజల వద్దనుంచి మంచి పేరు దక్కుతుంది. 

-కపిలముని

[email protected]