‘‘అరేయ్… ఇయ్యాళ మన సీఎం సెంద్రబాబునాయుడు నంద్యాలలో మీటింగెట్టారు సూసావా’’
‘‘సూడకపోవడమేంటెహె.. మూడ్రోజుల్నించి చూస్తానే వున్నా.. రెండ్రోజుల పాటూ సొంతూళ్లూ అదేలే.. కుప్పంలో టూరింగు జేసినాడా.. బస్సు టిక్కెట్టు కొనుక్కోనాకి పదిరూపాయలు అప్పు చేసినాడా.. నిన్న నన్ను మించిన మొనగాడు ఇండీపెండెన్సొచ్చాక ఈ స్టేట్లో పుట్టనేలేదంటూ డబ్బా కొట్టుకున్నాడా.. ఇయ్యాల నంద్యాల గడపలో డవలప్మెంటు వరాలన్నీ కురిపించినాడు గదా’’
‘‘మరందుకే నువు సరిగ్గా ఫాలో కాలేదనేది’’
‘‘ఇప్పుడేటైనాది బావా’’
‘‘మన నంద్యాలని ఏటి సేత్తానన్నాడు..?’’
‘‘అన్నాడ్లే బావా.. యిసాపట్నం లాగా జేత్తా అన్నాడు..’’
‘‘అంటే ఏటౌతాదన్నమాట’’
‘‘అదేలే.. పెద్దపెద్ద రోడ్లూ.. రోడ్ల మద్దెలో సెట్లూ…’’
‘‘మరద్దే నాకు కాలేది. ఇంకా నీ బొందా.. నీ పిండాకూడూ.. అయి కాదురా.. నంద్యాలని యిసాపట్నం చేయడవంటే మన కోసం ఓ సముద్రం తెచ్చి పెడతారన్నమాట’’
‘‘నీకొక నైన్టీ ఎమ్మెల్ ఎక్కువైనట్టుంది బావా’’
‘‘సాల్లే ముయ్యెహె. ఆయన్జెప్పింది అదే.. మనూరు యిసాకపట్నం అయపోడం అంటే.. మనకో సముద్రం తెచ్చిపెట్టేస్తారు.. అక్కడ మనకో బీచీ ఉంటాది.. బీచీ ఇసకలో మనం సందేళల్లో ఎంచక్కా పొట్టి పొట్టి చడ్డీలు యేస్కోని ఆడుకోవచ్చు కూడా..’’
‘‘మన నందేల అసలే కరువుతో మొహం వాచిపోయుండాది బావా… ఊరించబాక.. ఈ బీచీ.. సముద్రమూ అంతా నిజమేనంటావా…’’
‘‘యిసాకపట్నం అంటే యింకేటుంటాది రా యెదవా.. అదేటదీ.. రెండచ్చరాల బీచీ ఊరోటుండాలే’’
‘‘గోవానా?’’
‘‘అద్దే.. నీ బుర్రలో కూడా కూసంత గుజ్జుండాదొరేయ్! ఆ గోవాలో లాగా.. మన బీచీలో కూడా ఫారిన్నుంచి వొచ్చే అమ్మాయిలు పొట్టి చడ్డీలు, అంతకంటె పొట్టి జాకెట్లు యేస్కోనీ బాలుతో ఆడుకుంటా ఉంటారబ్బా…’’
‘‘అప్పడు మనం గూడా బీచీ ఒడ్డులో బటానీలో, చెనిక్కాయ గింజిలో అమ్ముకోవచ్చు బావా’’
‘‘సీస్సీ.. నెలతక్కవ యెదవా.. నీది కుక్కబుద్దేరా… అంత బీచీ అంత డెవలప్మెంటూ వొచ్చినాక.. యింకా బటానీలు, చెనిక్కాయలేంట్రా… ఎంచక్కా డ్రగ్గులూ, ఎల్లెస్డీలూ అమ్ముకోకుండా..’’
‘‘అవును బావోయ్…’’
‘‘కాబట్టి…’’
‘‘మనూళ్లో బీచీ పెట్టేదాకా సైకిలుకి ఓటెయ్యద్దొంటావా..?’’
‘‘నేను కాదెహె.. సెందరబాబు సెప్తోంది కూడా అదేనెహె… ’’
‘‘నువు సూపర్ బావా’’
– కపిలముని