పబ్ లే డ్రగ్స్ వ్యాప్తికి కీలకం అని తేలుతోంది. ఎక్సయిజ్ శాఖ దర్యాప్తు చేస్తున్నపుడు ప్రతి వారినీ పబ్ ల గురించి అడుగుతోంది. పబ్ లను నియంత్రించాలని, అవసరమైతే పబ్ లను రద్దు చేసి, ఆ కల్చర్ ను అరికట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే పబ్ లను నియంత్రించడం కానీ, పబ్ లపై దాడులు చేయడం కానీ సాధ్యమయ్యే పనేనా?
ఎందుకంటే హైదరాబాద్ లో చాలా పబ్ తో రాజకీయ, సినిమా జనాలకు సంబంధాలు వున్నాయి. చాలా వాటిలో రాజకీయ ప్రముఖులు, సినిమా జనాలు భాగస్వాములుగా వున్నారు. ఈ విషయం బహిరంగ రహస్యమే. నైజాంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఒకరు ప్రముఖ పబ్ లో భాగస్వామి. ఇదే పబ్ లో ఓ ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా స్లీపింగ్ పార్టనర్ అని వినికిడి.
ఏడాది క్రితం ఓపెన్ అయిన ఓ పబ్ లో టాలీవుడ్ టాప్ మాస్ స్టార్ ఒకరికి భాగస్వామ్యం వుందని వార్తలు వచ్చాయి. అదే పబ్ లో తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పవర్ ఫుల్ నాయకుడు స్లీపింగ్ పార్టనర్ అని వదంతులు వున్నాయి.
టాలీవుడ్ సీనియర్ హీరో ఒకరు భారీ మధ్యం దుకాణం చాలా విలాసవంతమైన ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. తరుణ్ ఒకప్పుడు పబ్ నిర్వహించి, డ్రగ్స్ వ్యవహారాలు బయటకు వచ్చాక, వదిలేసుకున్నారు. సినిమా రంగానికి చెందిన ఒకరిద్దరు చిన్న హీరోలు పబ్ లు లేదా హుక్కా రెస్టారెంట్ లు రన్ చేస్తున్నారన్న గుసగుసలు వున్నాయి.
ఇలా రాజకీయ నాయకులు, బడా సెలబ్రిటీలు కలిసి, వాటాలు వేసుకుని, పెట్టుబడులు పెట్టి పబ్ లు రన్ చేస్తుంటే, వాటి మీద చర్యలు వుంటాయని, అసలు పబ్ లే లేకుండా చేస్తారని ఎలా అనుకోగలరు ఎవరైనా?