‘బొంకరా బొంకరా పోలిగా అంటే.. టంగుటూరు మిరియాలు తాటికాయలంత’ అన్నాట్ట వెనకటికి ఒక మహానుభావుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్న జీవిత విశేషాలు కూడా అంతకంటె సరళంగా ఏమాత్రం లేవు. ఏదో నలభయ్యేళ్లు పూర్తయింది కదాని.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అందరూ అభినందించారు. మంచిదే. తెలుగు రాజకీయాల్లో ఈ స్థాయిలోని రాజకీయ నాయకుడు ఇంత సుదీర్ఘ అనుభవాన్ని నిలబెట్టుకోవడం.. గొప్పవిషయమే. ఆ సందర్భంగా అన్ని టీవీ ఛానెళ్లకు ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు.
ఈ సందర్భంగా తాను రకరకాల వింతలు విశేషాలను కూడా వారితో పంచుకున్నారు. అందులో పీవీ నరసింహారావుకు ఆర్థిక సంస్కరణల గురించి నేర్పడం లాంటి చిన్నెలు కూడా కొన్ని ఉన్నాయి.
అంతకంటె చిత్రమైనది ఏంటయ్యా అంటే.. ‘ఆ రోజుల్లో ఇందిరాగాంధీ తో మాట్లాడి వైఎస్ రాజశేఖరరెడ్డికి టిక్కెట్ నేనే ఇప్పించా.. ’ అంటూ చంద్రబాబునాయుడు ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పేర్కొనడం ప్రజలకు సరదా టాపిక్ గా మారిపోయింది.
చాలా సందర్భాల్లో నేనూ- రాజశేఖర రెడ్డీ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చాం అని చంద్రబాబు నాయుడే చెబుతూ ఉంటారు. అప్పట్లో ఇందిరా కాంగ్రెస్ పార్టీకి ఎదురొడ్డి రెడ్డి కాంగ్రెస్ (సిండికేట్ కాంగ్రెస్) తరఫున గెలిచిన నాయకుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత వారంతా ఇందిరా కాంగ్రెస్ లోనే విలీనం అయ్యారు. అలాంటి నాయకుడికి తాను సిఫారసు చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించానని చంద్రబాబునాయుడు చెప్పుకుంటే జనం నవ్వకుండా ఏం చేస్తారు?
ఈ ఇంటర్వ్యూల్లో స్వోత్కర్ష ఉండడం సహజం. కానీ మరీ ఈ రేంజిలోనా.. ప్రజాదరణలో గానీ.. ప్రజల మనిషిగా పేరు తెచ్చుకోవడంలో గానీ.. వైఎస్సార్ తీరుతో చంద్రబాబునాయుడుకు పోలిక ఉన్నదా అని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. వైఎస్సార్ ఒక పార్టీ కట్టుబాట్లకు పద్ధతులకు లొంగి ఉండబట్టి జాతీయ రాజకీయాల్లోకి, రాష్ట్ర రాజకీయాల్లోకి మారుతూ ఉండబట్టి.. ఆయన లేటుగా ముఖ్యమంత్రి అయ్యారు.
చంద్రబాబు ఒక పార్టీని అక్రమంగా చేజిక్కించుకోబట్టి.. ఏకపక్షంగా తాను పదవిని దక్కించుకుని సుదీర్ఘకాలం పాలన సాగించారు.. అంతే తప్ప.. మరీ ఈ రేంజిలో సొంత డబ్బా కొట్టుకుంటే ఎలా.. జనం నవ్వుకుంటారనే భయం కూడా నాయకులకు ఉండదా…. అని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.