ఇదేదో సినిమా క్యాప్షన్ కాదు. నిజంగానే ఎండలకు సంబంధించిన మేటర్ ఇది. మార్చిలో అడుగుపెట్టాం. మెల్లమెల్లగా ఎండల్ని అలవాటు చేసుకోవాల్సిందే. లేదంటే ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. జనాలు ఎన్ని చేసినా, ఈ ఏడాది మాత్రం ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ ముందే చెప్పేసింది.
గత ఏడాదితో పోల్చి చూస్తే.. ఈ ఏడాది ఒక సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. రుతుపవనాల రాకకు ముందువరకు.. అంటే మే నాలుగో వారం వరకు ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదని ప్రకటించింది.
మధ్యభారతంలో వేడి ప్రభావం ఎక్కువగా ఉంటుందని… పంజాబ్ నుంచి తెలంగాణ వరకు వడగాలులు వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తోంది. మరీ ముఖ్యంగా ఏప్రిల్ నాలుగో వారం నుంచి మే నెల మొదటి 2 వారాలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.
తెలంగాణలో వడగాలులు వీస్తాయని, కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ సెంటీగ్రేడ్, రాయలసీమలో 0.5 డిగ్రీల సెంటిగ్రేట్ మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంటోంది వాతావరణ శాఖ. గత వేసవిలో కురిసినట్టు.. ఈ వేసవికి అకాల వర్షాలు కురిసే జాడలు కూడా లేవంటోంది.