స్టేజీ మారేలోగా వెయిటేజీ పడిపోతన్నాది…

మామూలుగా అయితే ఒక్కొక్క దశ దాటేకొద్దీ పాకం కొద్దిగా చిక్కబడుతూ పోవాల. కానీ ఏపీ అభివృద్ధి అనేది గడిచేకొద్దీ పలచబడిపోయేలాగా.. రివర్సు గేరులో నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒకవైపు లక్షలకోట్ల పెట్టుబడులు అని ముఖ్యమంత్రి ప్రకటించిన…

మామూలుగా అయితే ఒక్కొక్క దశ దాటేకొద్దీ పాకం కొద్దిగా చిక్కబడుతూ పోవాల. కానీ ఏపీ అభివృద్ధి అనేది గడిచేకొద్దీ పలచబడిపోయేలాగా.. రివర్సు గేరులో నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒకవైపు లక్షలకోట్ల పెట్టుబడులు అని ముఖ్యమంత్రి ప్రకటించిన వెంటనే.. రాష్ట్రమంతా ప్రజల్లో ప్రధానంగా యువతరంలో ఒక ఉత్సాహం ఉప్పొంగుతుంది. ఎంఓయూ కాపీలను అందుకుంటున్న పారిశ్రామిక వేత్తలందరూ ముఖ్యమంత్రితో దిగిన ఫోటోలను పేపర్లలో చూస్తోంటే.. వారికి ఏదో కొత్త ఆశలు పుడుతుంటాయి.

అదిగదిగో అవన్నీ వచ్చేస్తున్నాయి.. అని అనిపిస్తూ ఉంటుంది. రోజులు గడిచేకొద్దీ.. ఆశలు సన్నగిల్లుతూ ఉంటున్నాయి. ఒప్పందాలు చేసుకోవడం వరకు రాష్ట్రప్రభుత్వం బీభత్సంగా సక్సెస్ అవుతోందని చెప్పాలి. మూడో సీఐఐ సదస్సులో దాదాపుగా మూడులక్షల కోట్ల రూపాయలకు మించిన పెట్టుబడులకు ఒప్పందాలు (ఎంఓయూలు) కుదిరినట్లుగా రకకాల వార్తలను బట్టి తెలుస్తున్నది. అయితే ఈ ఒప్పందాల్లో నికరంగా కార్యరూపం దాలుస్తున్నది..ఎన్ని? అనే దగ్గరే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. 

ఒప్పందం చేసుకున్న సంస్థ ఆ తర్వాత.. ప్రాజెక్టు రిపోర్టుతో సహా కంపెనీ నెలకొల్పడానికి ముందుకు వస్తే.. రిపోర్టు ప్రకారం సాధ్యాసాధ్యాలను పరిశీలించి… ప్రభుత్వం భూ కేటాయింపులు గట్రా చేస్తుంది. ఆ తర్వాత.. వారు సొమ్ము పెట్టుబడి పెట్టి కంపెనీలను ఏర్పాటు చేయాలి. కొందరు ప్రభుత్వం కేటాయించిన భూమిని తనఖాపెట్టి.. బ్యాంకు రుణాలు తీసుకుని.. కొన్ని సంవత్సరాలు ఆ సొమ్ము వాడుకుంటూ.. కాలయాపన చేసి.. తర్వాత కంపెనీ పెట్టకుండానే చేతులెత్తేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 

అందరూ ఇలాంటి మోసగాళ్లు ఉంటారనే నిరాశాపూరిత వాదన కాదు గానీ.. భూముల కేటాయింపు సమయంలోనే నిర్దిష్టమైన నిబంధనలతో జరగాలి. ఎప్పటిలోగా కంపెనీ పనులు ప్రారంభిస్తారు. ఎప్పటికి పని ప్రారంభమవుతుంది.. అనేవి ఖచ్చితంగా తేల్చుకోవాలి. కానీ ప్రభుత్వం అలా గట్టిగా అడిగితే పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోతారని భయపడుతున్నట్లుగా.. అవేమీ లేకుండా… మొక్కుబడి నిబంధనలతో భూములు కేటాయించేస్తోంది.

ఆ తర్వాత కంపెనీలు పనులు ప్రారంభం అయ్యాక.. ఉద్యోగాలు వస్తాయి. తీరా కంపెనీ మొదలయ్యేసరికి ఎంఓయూలో చెప్పినన్ని ఉద్యోగాలు తెలుగువాళ్లకు దక్కుతాయో లేదో క్లారిటీ ఎప్పటికీ ఉండదు. అంతా పూర్తయి.. ఆ కంపెనీ ఉత్పత్తి ప్రారంభం అయిన కొంత కాలానికి గానీ. దానివలన అసలు అభివృద్ధి ఏమిటో మనకు అర్థంకాదు.

అయినా సరే.. సీఐఐ సదస్సల ఒప్పందాలను మనం తప్పుపట్టరాదు…
ఆ రకముగా.. ప్రగతి నిరోధకులు అనే ముద్ర వేయించుకోరాదు.
ఏది ఎలా జరుగుతూ ఉన్నా.. ఎదురుచూస్తూ ఉండాలంతే…

-కపిలముని