ఏపీలో రాజకీయం చాలా రంజుగా సాగుతోంది. అసలు రంగంలో ఉన్న పార్టీలు రెండే అయితే.. ఆ రెండు పార్టీల మాటలను, సవాళ్లను, ప్రతిసవాళ్లను, వారిద్దరూ ఒకరి మీద ఒకరు కాలు దువ్వడాన్ని, ఆరోపణలు చేసుకోవడాన్ని సమస్తం.. గట్టున కూర్చున్న మూడో పార్టీ నిర్దేశిస్తోంది. ఇది చాలా చిత్రమైన పరిణామం.
ఒక వైపు ప్రత్యేక హోదా ముగిసిపోయిన ఎపిసోడ్ అని పదేపదే వల్లె వేస్తూ ప్యాకేజీ వస్తే చాలు అంటూ రాష్ట్ర్రప్రభుత్వం గోల చేస్తూ ఉన్నప్పటికీ.. జగన్ చాలా ప్రాక్టికల్ గా మడమ తిప్పకుండా.. ప్రత్యేకహోదా కోసం తన పోరాటాన్ని సాగిస్తూనే ఉన్నారు. ఆ అంశం మీద నుంచి ప్రజల దృష్టి మళ్లిపోకుండా, అది పూర్తిగా మరుగున పడిపోకుండా ఆయన కాపాడుకుంటూ వస్తున్నారు. ఒకరకంగా ఇవాళ మళ్లీ ప్రతి ఒక్కరూ కూడా.. ఏదో ఒక సందర్భంలో ప్రత్యేకహోదా అనే మాట కూడా మాట్లాడుతున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి ద్వారా మాత్రమే సజీవంగా ఉన్నదని మనం గుర్తించాలి. ప్రత్యేకహోదా సాధించడానికి పార్లమెంటులో నిరంతరాయ పోరాటం.. ఆ తర్వాత.. సమావేశాల చివరిరోజుదాకా అంశం తేలకుంటే రాజీనామాలు అనేది జగన్ నిర్దిష్ట ఎజెండా!
అయితే మధ్యలో పవన్ కల్యాణ్ తన అవిశ్వాసం మాటతో ఆయన పోరాటాన్ని డైవర్ట్ చేయడం మాత్రమే కాదు.. డైల్యూట్ కూడా చేశారు. ప్రయోజనం సాధించేది కాకపోయినప్పటికీ.. కేంద్రాన్ని కాస్త బద్నాం చేయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో.. పవన్ మేధావులకు అవిశ్వాసం ఆలోచన వచ్చింది. పవన్ కు కూడా అది రుచించి.. తెదేపా, వైసీపీల చిత్తశుద్దికి దాన్ని ముడిపెట్టారు. వైసీపీ వెంటనే దాన్ని అందుకుంది గానీ.. తెదేపా మీనమేషాలు లెక్కిస్తోంది.
కాకపోతే… ఇప్పుడు తగినంత బలం లేని వైసీపీని తొలిపోటు మీరు పొడిచేయండి.. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటూ పవన్ కల్యాణ్ ఇంకాస్త రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తొలుత సభలు ప్రారంభం కావడానికి ముందే మీరు అవిశ్వాసం ప్రతిపాదించేస్తే.. ఆ తర్వాత.. నేను చూసుకుంటా అని ఆయన చెబుతున్నారు. నాయకుల ప్రతిమాటా సవాళ్లు, ప్రతిసవాళ్ల కోసమే సాగుతున్నట్లుగా ఉన్నది తప్ప.. ప్రాక్టికాలిటీతో ఒక్క అడుగు కూడా పడడం లేదని అంతా అనుకుంటున్నారు.