అల్లూరి సహచరుడి వారసులు ఒక ఇంటివారయ్యారు!

గంటం దొర సంచరించిన స్థానిక ప్రాంతాన్ని స్వాతంత్ర సమరయోధులు జ్ఞాపకార్ధంగా ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దుతామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు సహచరుడు తలలో నాలుక అయిన వారు గాం గంటం దొర. ఆయన అల్లూరితో కలసి తెల్ల దొరల మీద సాహసోపేతమైన పోరాటాన్ని చేశారు. అల్లూరి ఆచూకీ తెలియచేయాలని తెల్ల దొరలు ఆయనను జైలులో బంధించి హింసించినా చెప్పలేదు.

ఆయన అంతలా నిబద్ధతతో పనిచేశారు. అల్లూరిని బ్రిటిష్ వారు హత్య చేసిన తరువాత ఆయన అనుచరులు బ్రిటిష్ సైన్యం మీద ఎదురొడ్డి పోరాడారు. అలా బ్రిటిష్ సైన్యం చేతిలో ఆయన వీర మరణం పొందారు. ఆయన కుటుంబం మాత్రం ఆనాటి నుంచి నేటి వరకూ పేదరికంతోనే మగ్గుతోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా వారికి సొంత ఇల్లు అన్నది లేకుండా పోయింది. ఎట్టకేలకు అల్లూరి ప్రియ శిష్యుడు అయిన గంటం దొర వారసులకు సొంత ఇల్లు దక్కింది.

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బట్టపనకుల పంచాయతీ లంకవీధిలో గంటందొర వారసులకు ఎన్ సి సి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో రెండున్నర కోట్ల నిధులతో సొంత నివాసాలు నిర్మించి అందించారు. మొత్తం పదకొండు మంది వారసులకు ఒక్కొక్కరికీ రెండు పడక గదుల పత్రాలు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. గంటం దొర సంచరించిన స్థానిక ప్రాంతాన్ని స్వాతంత్ర సమరయోధులు జ్ఞాపకార్ధంగా ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దుతామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

గాం గంటం దొర వారసుల సమస్యను గుర్తించి క్షత్రియ సంస్థ ఆధ్వర్యంలో సొంత గృహాల నిర్మాణానికి రాజులు కొంతమంది పూనుకున్నారు. వారు అన్ని విధాలుగా చేసిన సహకారంతోనే ఈ నివాసాలు దక్కాయని గంటం దొర వారసులు కృతజ్ఞతలు తెలిపారు.

3 Replies to “అల్లూరి సహచరుడి వారసులు ఒక ఇంటివారయ్యారు!”

Comments are closed.