బెంగాల్లో రెండు ప్రఖ్యాత ఫుట్‌బాల్ టీములున్నాయి – మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్. కలకత్తాలో ఫుట్‌బ్యాల్ మ్యాచ్‌లు సాధారణంగా హింసాయుతంగానే వుంటాయి. ఆటగాళ్లు తమలో తాము తన్నుకోవడమే కాదు, ప్రేక్షకులు కూడా ఆటగాళ్లపై రాళ్లు విసురుతూంటారు. 2012 డిసెంబరు 9 న ఐ-లీగ్ మ్యాచ్ సందర్భంగా మోహన్ బగాన్ టీము సరిగ్గా ఆడటం లేదని కోపగించుకున్న దాని అభిమాన ప్రేక్షకులు వారిపై రాళ్లు విసిరారు. వాళ్లు ఆట మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు. మ్యాచ్ ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ వాళ్లు బతిమాలినా వినలేదు. వారితో పోటీ పడుతున్న ఈస్ట్ బెంగాల్ టీము 'మోహన్ బగాన్ క్రమశిక్షణ ఉల్లంఘించింది' అంటూ ఆరోపణ చేశారు. ఈ ఆరోపణపై ఫెడరేషన్ వాళ్లు వెస్ట్ బెంగాల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్‌గా వున్న జస్టిస్ ఎకె గంగూలీని విచారించమని కోరారు. ఆయన డిసెంబరు 24 న ఢిల్లీలో ఫెడరేషన్ ప్రతినిథులు, రెండు క్లబ్బుల ప్రతినిథులతో సమావేశం ఏర్పాటు చేసి జరిగిందేమిటో విచారణ జరిపారు. ఆ తర్వాత తన వద్ద పనిచేస్తున్న లా విద్యార్థినిని పిలిచి నోట్సు డిక్టేట్ చేశారు. ఆ రాత్రి ఆయన తయారు చేసిన రిపోర్టు ఆధారంగా ఫెడరేషన్ మోహన్ బగాన్‌పై చర్య తీసుకుంది. ఆ టీమును ఐ-లీగ్ నుండి రెండేళ్లపాటు నిషేధించారు. నిషేధం ఎత్తివేయమని టీము కోరగా రూ.2 కోట్ల జరిమానా తీసుకుని ఎత్తివేశారు.
ఆ ఎకె గంగూలీ ఎవరో కాదు, తనపై వచ్చిన లైంగిక ఆరోపణల కారణంగా ఆ చైర్మన్ పదవికి జనవరి 6న రాజీనామా చేసిన జస్టిస్ గంగూలీయే. ఆయన బెంగాల్ మానవహక్కుల కమిషన్ చైర్మన్‌గా వుండగా తృణమూల్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాడు. 2012లో మమతా బెనర్జీని ఎరువుల ధరలు నియంత్రించ లేకపోయావ్ అంటూ ఓ సామాన్య రైతు నిలదీశాడు. వెంటనే మమత అతనిపై మావోయిస్టు ముద్ర వేసి జైల్లో తోయించింది. నెలల తరబడి జైల్లో మగ్గిన ఆ రైతు కమిషన్‌ను ఆశ్రయించాడు. ప్రభుత్వం అతనికి రూ. 2 లక్షల పరిహారం యివ్వాలని గంగూలీ ఆదేశించినా మమత లక్ష్యపెట్టలేదు. కేసు హైకోర్టుకి వెళ్లింది. గంగూలీ ఆదేశాన్ని మన్నించాలని హై కోర్టు తీర్పు చెప్పింది. అలాగే మమతపై కార్టూన్ వేసిన పాపానికి జాదవ్‌పూర్ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ను అరెస్టు చేయిస్తే గంగూలీ అరెస్టు చేసిన పోలీసులపై చర్య తీసుకోవాలని, ప్రొఫెసరుకు రూ. 50 వేలు పరిహారం యివ్వాలనీ తీర్పు చెప్పాడు. మమత పట్టించుకోలేదు. ప్రొఫెసరుగారు హైకోర్టుకి వెళ్లారు. ఇలాటి చైర్మన్ మాకు వద్దు అంటూ మమత గతంలో రెండు సార్లు ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసింది.
సుప్రీంకోర్టు జడ్జిగా వున్నపుడు చాలామందికి కంటకంగా తయారవడంతో గంగూలీ అంటే రాజకీయనాయకులకు కూడా మంట. 2010లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేపై నేరపరిశోధనలో జోక్యం చేసుకున్నందుకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షలు కట్టాలని తీర్పు యిచ్చాడు. 2 జి స్కామ్‌లో రాజాను జైలుకి పంపిన యిద్దరు జడ్జిల్లో యీయన ఒకడు. సుప్రీం కోర్టు ఉరిశిక్ష విధించిన కేసుల్లో రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించడం సరికాదని, అది న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకోవడమేననీ ఓ సందర్భంలో వ్యాఖ్యానించాడు. ఇలాటి న్యూసెన్సు పార్టీకి ఎలా బుద్ధి చెప్పాలా అని బుర్రబద్దలు కొట్టుకుంటున్న వారికి న్యాయవిద్యార్థిని చేసిన ఆరోపణ అందివచ్చింది. అసలు ఆ కేసులో మనబోటి సామాన్యులకు ఎన్నో సందేహాలు వస్తున్నాయి.
గంగూలీగారు అసభ్యంగా ప్రవర్తించి వుంటే ఆ అమ్మాయి ఆయన వద్ద తన ట్రెయినింగ్ నెలల తర్వాత కూడా ఎందుకు కొనసాగించింది? 2012 డిసెంబరు అంటే నిర్భయ కేసు గురించి దేశమంతా చర్చిస్తున్న రోజులవి. మామూలు జనాలే అత్యాచారాల గురించి నిర్భయంగా ఫిర్యాదు చేస్తున్నారే, మరి న్యాయవాది అయిన ఆ మహిళ ఫిర్యాదు చేయలేదేం? అప్పుడే కాదు, యిప్పటికీ పోలీసు కేసు పెట్టలేదేం? చిన్న యాక్సిడెంటు జరిగి ఇన్సూరెన్సు క్లెయిమ్‌కి వెళితే 'పోలీసు రిపోర్టు యిచ్చారా? ఎఫ్ఐఆర్ కాపీ పట్టుకురమ్మనమని' అంటారే, మరి యింత ప్రఖ్యాతుడిపై యీమె ఆరోపణ చేస్తే కంప్లయింటు చేయలేదేం అని సుప్రీంకోర్టు అడగకుండా ఓ కమిటీ వేసిందెందుకు? ఆ ఆరోపణల్లో వాస్తవం వుందని కమిటీ వాళ్లు అన్నా గంగూలీ రాజీనామా చేయలేదు. చివరకు దీనిలో జోక్యం చేసుకోమని రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని కేంద్ర కాబినెట్ నిర్ణయం తీసుకున్న మూడు రోజులకు ఆయన రాజీనామా చేశాడు. వెంటనే ''ఈ కేసు ముగిసినట్టే'' అని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఇందిరా జైసింగ్ ప్రకటించారు. అంటే రాజీనామా చేస్తే బాధితురాలి బాధ తీరిపోయినట్టేనా? గంగూలీగారికి శిక్ష పడనక్కరలేదా? అంటే ఆయన తప్పు చేయలేదా? ఆయనను అవమానించి పదవిలోంచి దింపడం తప్ప యీ రాజకీయనాయకులకు వేరే లక్ష్యం లేదా?
కొసమెరుపు ఏమిటంటే – యీయన రాజీనామా చేసిన తర్వాత మోహన్ బగాన్ వాళ్లు మళ్లీ పుంజుకున్నారు. 'మాపై తీర్పు చెప్పిన రాత్రే ఆయన ఆ అమ్మాయితో సరసమాడడం, అది విరసంగా మారడం జరిగింది. ఆయన అహం దెబ్బ తినివున్న అలాటి మూడ్‌లో వున్న తీసుకున్న నిర్ణయం సరిగా ఎలా వుంటుంది? అందువలన ఆ నాటి రిపోర్టును పరిగణనలోకి తీసుకోకుండా ఫుట్‌బాల్ ఫెడరేషన్ వాళ్లు మా రెండు కోట్లూ మాకు తిరిగి యివ్వాలి' అని కోరుతున్నారు.
ఎమ్బీయస్ ప్రసాద్ – న్యూస్, వ్యూస్, రివ్యూస్ – (జనవరి 2014)