తను సమైక్యవాదో, విభజనవాదో సోమవారం చెప్తానని అన్నారు చంద్రబాబు. 'అందరూ నేను ఏం చెప్తానా అని చూస్తున్నారు.' అని కరక్టుగా గెస్ చేశారు. నిజమే సోనియా ఎక్కణ్నుంచో వచ్చారు. ఆయన యిక్కడివాడే. ఇక్కడే పుట్టి, యిక్కడే పెరిగి, యీ రాష్ట్రాన్నే పాలించి, ప్రతీ తాలూకాలో కొందర్ని పేరుపేరునా పలకరించగల భూమిపుత్రుడు. ఇక్కడి ప్రజల మనోభావాలు కాచివడపోసినవాడు. తన దగ్గరకు వచ్చేసరికి రాజకీయంగా కొన్ని అంచనాలు తప్పవచ్చు కానీ మొత్తం మీద తెలుగుజాతి ఎలా ఆలోచిస్తుందో, దేనికి స్పందిస్తుందో కక్షుణ్ణంగా తెలిసినవాడు. పైగా 'తెలుగువారంతా ఒకటే, తెలుగు ఆత్మగౌరవం కాపాడాలి' అనే నినాదంపై ప్రభవించిన తెలుగుదేశం పార్టీలో ఎదిగి, దాన్ని సొంతం చేసుకున్న నాయకుడు. అలాటాయన రాష్ట్రవిభజనకు ఒప్పుకున్నపుడు అందరం ఉలిక్కిపడ్డాం. 'రాజకీయ అవసరాల కోసం యిలాటి తీర్మానం చేయించారు కానీ మనసులో తెలుగువారంతా కలిసే వుండాలని కోరుకునే వ్యక్తి యీయన' అని సీమాంధ్రులే కాదు, తెలంగాణ ప్రజలు కూడా ప్రగాఢంగా నమ్మారు. డిసెంబరు 9 ప్రకటన తర్వాత రాజీనామాల ప్రహసనానికి స్క్రీన్‌ప్లే ఆయనదే అని ఆయన సమర్థకులు, విమర్శకులు అందరూ నమ్మారు. అందుకే ఆయన విభజన మంత్రానికి తెలంగాణలో చింతకాయలు రాలలేదు. డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి దాపురించింది. బాబు మేధావి కాబట్టి ఆయనకు ముందే సమాచారం తెలుస్తుందని, చక్రం అడ్డేసి విభజన అడ్డుకోగలరని, ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఢిల్లీలో మేనేజ్ చేస్తారని సీమాంధ్రులలో చాలామంది నమ్ముతారు.
అలాటి బాబు యిమేజి యీ మధ్య మసకబారింది. రాష్ట్రం విడిపోదని ఆయనను మభ్యపెట్టి కాంగ్రెసు హఠాత్తుగా తెలంగాణ బిల్లు తెచ్చి ఆయనను యిరకాటంలో పెట్టిందని, ఎటూ చెప్పలేక కొట్టుమిట్టులాడే స్థితి కల్పించిందని అనుకోసాగారు. బిల్లు వచ్చాక ఆయన రాజధాని నిధుల గురించి మాట్లాడి నిందపడ్డారు. ప్రజల్లో సమైక్యనినాదం బలంగా వినబడడంతో నాలిక కరుచుకుని, సమన్యాయం పల్లవి అందుకున్నారు. సమన్యాయం గురించి మేం ఎప్పుడో చెప్పాం అంటారు కానీ అదెలా వుండాలో యిప్పటికీ స్పష్టంగా చెప్పరు. సీమాంధ్రలో పర్యటనకు వెళ్లినపుడు అక్కడి ఉధృతి తట్టుకోలేక సమైక్య ఉద్యమానికి మద్దతు యిస్తానన్నారు. సీమాంధ్ర టిడిపి నాయకులను ఉద్యమంలోకి పూర్తిగా దింపారు. వాళ్లు తాము ప్రణబ్ కమిటీకి యిచ్చిన లేఖకు కాలదోషం పట్టిందని అనేదాకా వెళ్లిపోయారు. పార్లమెంటులో సమైక్యం పేరు చెప్పి రచ్చరచ్చ చేశారు. విభజన గురించి ప్రతీ పార్టీకి ఒక క్లారిటీ వచ్చింది, టిడిపికి మాత్రం రాలేదు. తక్కిన పార్టీలు వాళ్లని వెక్కిరించడానికి అది అనువుగా దొరికింది. టీవీ చర్చల్లో ప్రతిభావంతంగా మాట్లాడిన టిడిపి నాయకుణ్ని దెబ్బ కొట్టాలంటే 'ఇంతకీ మీది విభజనవాదమా? సమైక్యవాదమా?' అని అవతలివాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇక అక్కణ్నుంచి వీళ్లు 'మేం స్పష్టంగా ఎప్పుడో చెప్పాం' అంటూ అస్పష్టంగా మాట్లాడతారు.
కాంగ్రెసులో అయితే తలొక నాయకుడు తలొక విధంగా మాట్లాడినా చెల్లుతుంది. తక్కిన పార్టీల్లో నాయకుడు ఏం చెపితే అదే ఫైనల్. టిడిపిలో ఎందరు ఏం మాట్లాడినా నేను చెప్పినదే ఖరారు అని బాబు ఎప్పుడో చెప్పారు. తక్కిన అన్ని విషయాల్లో అది అమలవుతుంది – విభజన విషయంలో తప్ప! సరే తక్కినవాళ్లతో పనేముంది, మీరే చెప్పండి అని అడిగితే ఆయన మీకు పిల్లలెందరు అని అడుగుతాడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆఫీసరులా. ఎన్ని రకాలుగా ప్రశ్న అడిగినా జవాబు తిన్నగా రాదు. అదేదో సినిమాలో 'ఇంకో అరటిపండు ఏది?' అనే ప్రశ్నకు హాస్యగాడు 'ఇదే' అని జవాబిచ్చి ఎదుటివాళ్లకు పిచ్చెక్కించినట్లు బాబు 'నేను స్పష్టంగా చెపుతున్నానే' అంటూ సందిగ్ధంగా మాట్లాడుతూ అందర్నీ ఏడిపించారు. ఇన్నాళ్లకు కచ్చితమైన సమాధానం చెప్తానంటే హమ్మయ్య మిస్టరీ విడిపోతుంది అనుకున్నాను. కానీ డిటెక్టివు నవలలో ఆఖరి పేజీల దాకా రహస్యం విప్పనట్టు, యీయన కూడా సోమవారం చెప్తాను అన్నారు. ఎందుకో తెలియలేదు. ఆయన శనివారం నాడు మాట్లాడే సమయానికి వేళ మించిపోలేదు. బాగా పొద్దుపోయింది, అందరూ నిద్రలో జోగుతున్నారు. నేను చెప్పినా బుర్ర కెక్కదు అనడానికి లేదు. మధ్యాహ్నం రెండు గంటలకు యీ మాట చెప్పారు. ఇప్పుడే చెప్పండి, ఎల్లుండి దాకా ఎందుకు అని గట్టిగా నిలదీస్తే కోపం తెచ్చుకుని అసలు చెప్పనే చెప్పను పో అంటారేమో తెలియదు. ఆయన కవిహృదయం తెలియకుండా తనువు చాలించవలసి వస్తుందేమో అని భయపడి ఎవరూ కిమ్మనలేదు.
కిరణ్ వ్యవహారం చూడబోతే సోమవారం నాడు చంద్రబాబు రహస్యం బయటపడుతుందా లేదాన్న టెన్షన్ పట్టుకుంది. ఇన్నాళ్లూ కిరణ్ స్టార్ బ్యాట్స్‌మన్ అంటూ వచ్చారు. అప్పటికీ ఒవైసీ చెప్తూనే వున్నారు – కామెంటేటర్ల మాటలు నమ్మకండి అని. సడన్‌గా కిరణ్‌ని బౌలర్‌ని చేసేసి, గుగ్లీ వేశారంటున్నారు. ఆయన వేస్తేనే గుగ్లీ అయిందా యీ ఉపాయం మేం ఎప్పుడో చెప్పాం అంటూ సాక్షి మొత్తుకుంటోంది. గుగ్లీ కాదు, గాడిదగుడ్డూ కాదు, ఢిల్లీ వాళ్లు దీన్ని నోబాల్‌గా డిక్లేర్ చేస్తారు అంటున్నారు టి-వాదులు. 'తెలంగాణ తథ్యం, యిలాటి చీప్ ట్రిక్కులు చేసి సీమాంధ్రులను మోసగించకండి' అని తెరాసవాళ్లు హితవు పలుకుతున్నారు. సీమాంధ్రులపై వాళ్లకు యింత జాలి ఎందుకో నాకు తెలియదు. రాక్షసజాతి వాళ్లు మోసగించబడితే చంకలు గుద్దుకోవాలి తప్ప వాళ్లను కాపాడాలని చూడడమెందుకు? ఏమైనా తేడా వస్తే సీమాంధ్రులే వాళ్ల నాయకుల పని పడతారు. సీమాంధ్రుల చేతిలో శాస్తి జరగకుండా సీమాంధ్ర నాయకులను తెరాసవారు ఎందుకు రక్షించడం? పైగా యిలాటి సందర్భాల్లో తెలంగాణ తథ్యం, అరిచి గీపెట్టినా రాక మానదు అంటారు. కాంగ్రెసులో విలీనం చేస్తారా అంటే పార్లమెంటులో బిల్లు పాసయ్యేదాకా మాకు నమ్మకం లేదు. పొత్తు గురించైనా, విలీనం గురించైనా అప్పుడే మాట్లాడతాం అంటారు. కిరణ్ చేష్టలు ఎటువంటి ప్రభావం కలిగించవు, ఢిల్లీ మా చేతిలో వుంది అంటూనే టి-నాయకులందరూ స్పీకరు ఆఫీసుకి వెళ్లి కిరణ్ నోటీసు చూసి అసెంబ్లీ నిబంధనల పుస్తకాలు తిరగేశారు, ఆ నోటీసులో లోపాలు ఎంచే పనిలో పడ్డారు. చివరకు దాన్ని తిరస్కరించాలని స్పీకరును కోరుతున్నారు. దానికి విలువ లేకపోతే యింత హైరాన ఎందుకు?
ఇంతకీ కిరణ్ చేసినదేమిటి? 'బిల్లును తిరస్కరించాలని కోరుతూ తీర్మానం పెడతాను, అనుమతించండి' అని స్పీకరుకు నోటీసు యిచ్చారు. 10 రోజుల నోటీసు యివ్వాలి కానీ స్పీకరు తలచుకుంటే ఓ నియమానికి వెసులుబాటు యివ్వవచ్చు. సిఎం ముఖ్యమంత్రిగా యిచ్చాడా? ప్రభుత్వం తరఫున యిచ్చాడా? అన్న మీమాంస అనవసరం. శాసనసభా నాయకుడిగా యిచ్చాడు. దట్సాల్. గడువు పెంచమని ఉత్తరం రాసినప్పుడు కూడా టి-మంత్రులు యిటువంటి శంకలు లేపారు. కాబినెట్ అనుమతి తీసుకోకుండా ఒక్కడూ ఎలా రాస్తాడు, పట్టించుకోకండి అని కేంద్రాన్ని కోరారు. శాసనసభా నాయకుడిగా ఆయనకు ఆ అధికారం వుందని గుర్తించిన కేంద్రం, రాష్ట్రపతి ఆ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించారు. అడిగినదానిలో ఎన్నో వంతు యిచ్చారన్నది అప్రస్తుతం. గడువు అడగడానికి నువ్వెవరు? అని ప్రశ్నించలేదు. సరే యిప్పుడు బిల్లును తిప్పి పంపాలని కోరడానికి గల కారణాలంటూ కిరణ్ ఏం చెపుతున్నారు? దీనిలో హేతుబద్ధత లేదు, ప్రాతిపదిక లేదు, ఏకాభిప్రాయ సాధన లేదు, పాలనాపరంగా ప్రయోజనం లేదు. టిడిపి కూడా నోటీసు యిచ్చింది. ఏమని? 'బిల్లు అసమగ్రంగా వుంది, రాజ్యాంగ ఉల్లంఘనలు వున్నాయి, తప్పుల తడకగా వుంది.' అని. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో లేవనెత్తిన అంశాల్లో ముఖ్యమైనవి – 'ఏ బిల్లులోనైనా అదెందుకు చేస్తున్నారో ఉద్దేశం తెలపాలి. అది దీనిలో లేదు. ఆర్థికాంశాల నివేదిక యివ్వలేదు. రాజ్యాంగంలో లేని ఉమ్మడి రాజధాని అంశాన్ని బిల్లులో చొప్పించారు. తమ అభిప్రాయం చెప్పకుండా అసెంబ్లీ అభిప్రాయం కోరుతూ అసెంబ్లీని కించపరుస్తున్నారు'.
వైకాపా కూడా బిల్లు అసమగ్రంగా వుంది కాబట్టి తిప్పి పంపండి అని కోరుతూ వచ్చింది. కానీ ఇప్పుడు కిరణ్ ఒక కొత్త అంశాన్ని చేర్చారు. 'అసెంబ్లీకి వచ్చినది బిల్లే కాదు, డ్రాఫ్టు బిల్లు అని హోం శాఖ చెప్పింది. ఆర్టికల్ 3 ప్రకారం అసెంబ్లీకి పంపవలసినది బిల్లు తప్ప డ్రాఫ్టు బిల్లు కాదు. బిల్లు పంపితే అప్పుడు చర్చిద్దాం. ప్రస్తుతానికి దీన్ని చర్చించే పని లేదు.' అని సాంకేతిక అంశాన్ని లేవనెత్తారు. ఇది యిప్పటిదాకా ఎవరూ గమనించనిది కాబట్టి సడన్‌గా తెరపైకి వచ్చింది కాబట్టి దీన్ని గుగ్లీ అనసాగారు. ఈ మలుపుతో అందరూ ఉలిక్కిపడ్డారు. న్యాయనిపుణులు కిరణ్ వాదనలో బలం వుందని అంగీకరిస్తున్నారు. అఫ్ కోర్సు కొందరు వేరే రకంగా కూడా మాట్లాడుతున్నారు. అది సహజం. కోర్టులో యిరుపక్షాల న్యాయవాదులూ చెరోలా వాదించకపోతే కోర్టే వుండదు. అంతిమంగా నిర్ణయం ఎలా జరిగినా యీ విషయంలో వివాదం, పేచీ వుందన్న మాట మాత్రం ఒప్పుకుని తీరాలి. ఇది యీ థలో లేవనెత్తినందుకు కిరణ్‌పై కోపం తెచ్చుకున్నవారు 'ఇది యిప్పుడే గుర్తుకు వచ్చిందా? 42 రోజుల పాటు 90 మంది చర్చించాక యిప్పుడు చెప్పడమేమిటి?' అని మండిపడుతున్నారు.
కోర్టులో కేసు నడిచేటప్పుడు ఏ సాక్ష్యాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టాలో లాయరు లెక్క లాయరుకు వుంటుంది. పేకాటలో ఏ ముక్క ఎప్పుడు వాడాలో ఆటగాడికి ఓ లెక్క వుంటుంది. ముందులో యీ పాయింటు చెప్పలేదు కాబట్టి, ఎప్పటికీ చెప్పకూడదు అని అనడానికి లేదు. ఏ పాయింటైనా ఎప్పుడైనా లేవనెత్తవచ్చు. వాజపేయి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఉపయోగపడిన ఒక్క ఓటు – గిరిధర్ గొమాంగ్ది. ఆయన అసెంబ్లీకి కూడా ఎన్నికయ్యాడు కాబట్టి ఆయన గురించి ఎవరూ పట్టించుకోలేదు, లెక్కలో వేయలేదు. అయితే అక్కడ ఓటింగులో పాల్గొనలేదు కాబట్టి, యిక్కడ ఓటేయవచ్చు అన్న లీగల్ పాయింటును కాంగ్రెసు వాజపేయి ప్రభుత్వాన్ని పడగొట్టింది. ఆ మాట ముందే చెప్పలేదేం అని కాంగ్రెసును అడగలేం కదా. ఇన్నాళ్లు, యిందరు మాట్లాడాక.. అంటే మాట్లాడితే నష్టం ఏముంది? పుష్కరకాలంగా ఉద్యమం నడుస్తున్నా ఎంతసేపూ బయట చర్చలే తప్ప అసెంబ్లీలో జరగలేదు కదా, యిన్నాళ్లకు కొద్దిగా జరిగింది. సంతోషించాలి.
ఈ డ్రాఫ్టు బిల్లు అంశం ముందే చెప్పలేదేం అని విభజనవాదులే కాదు, వైకాపా కూడా కిరణ్‌ను కోప్పడుతోంది. ముందే చెప్పి వుంటే హోం మంత్రిత్వ శాఖ అబ్బే టైపింగు మిస్టేక్ అని సవరించి పంపేసి వుంటే యీ యిస్తోకు వేస్టు అయిపోయేది. ఇక్కడ అతితక్కువ టైములో అతి పెద్ద పని చేయడానికి కేంద్రం పరుగులు పెడుతోంది కాబట్టి, సాధ్యమైనన్ని స్పీడు బ్రేకర్లు కల్పించడమే విభజన ఎదుర్కునేవారి వ్యూహం. అసలు యీ 'డ్రాఫ్టు (ముసాయిదా) బిల్లు' అనే మాటకు ఎంత విలువుంది? రాష్ట్రపతి పంపించిన లేఖలో 'బిల్లు' అని వుంది కాబట్టి అది బిల్లే, హోం శాఖ సెక్రటరీ రాసిన ఉత్తరంలో ఏమున్నా పట్టించుకోనక్కరలేదు అని వాదిస్తున్నారు కొందరు. రాష్ట్రపతి లేఖను, బిల్లును పంపించేది హోం శాఖే. అన్నీ వాళ్ల ద్వారానే నడుస్తాయి. వాళ్లు యింత పొరబాటు ఎలా చేశారు? అని ఆశ్చర్యపడనక్కరలేదు. తెలంగాణ బిల్లు విషయంలో అన్నీ అడ్డదిడ్డంగానే చేశారు. టేబులు ఐటంగా పెట్టడం దగ్గర్నుంచీ ఎన్నో నియమోల్లంఘనలు. పార్లమెంటులో మెజారిటీ వుంది అన్న అహంకారంతో కళ్లు మూసుకుని పోయి గుడ్డిగా ముందుకు వెళ్లిపోయారు. అయినా హోం సెక్రటరీ స్థాయిలో యిది ముసాయిదా బిల్లు అని రాసేటంత పిచ్చిపని చేస్తారా? చేశారు. ఎందుకంటే గత్యంతరం లేక. రాష్ట్రప్రభుత్వం ఆర్థిక వివరాలు అడిగింది. న్యాయశాఖ అభిప్రాయం అడిగింది. బిల్లు ఉద్దేశం అడిగింది. ఇతర శాఖలు యిచ్చిన సమాచారం ఏదని అడిగింది. వీటికి హోం శాఖ వద్ద సమాధానం లేదు. అందుకని 'అవేమీ లేవు. మాకు సమాచారం యిచ్చిన శాఖలన్నీ వాటిని వెనక్కి తీసేసుకున్నాయి. మా దగ్గర ఏమీ లేదు.' అని చెప్పింది. పైగా 'న్యాయశాఖ ఏం చెప్పిందో మీకెందుకు? అయినా అవన్నీ మీకనవసరం. మేం యిక్కడ చూసుకుంటాం. అయినా మీ అసెంబ్లీ సరిగ్గా నడవటం లేదు. గమనిస్తున్నాం.' అంటూ దబాయింపు ఒకటి.
కేంద్రం కానీ, మంత్రుల ముఠా కానీ మొదటినుండే ఇదే ధోరణి కనబరచింది. అఖిలపక్షం అంటూ ఏర్పాటు చేసినప్పుడు కానీ, మంత్రుల ముఠా వద్ద వివిధ పార్టీల అభిప్రాయాలు సేకరించినపుడు కానీ వాళ్లు ఏదైనా సమాచారం అడిగితే 'మా దగ్గరేం లేదు, మా అభిప్రాయం ఏమీ చెప్పం, మీరు చెప్పదలచినదేదో చెప్పేసి వెళ్లండి, ప్రశ్నలు అడక్కండి. మేం చేయాల్సిందేదో తర్వాత మేం చేస్తాం' అనే జవాబు చెప్పారు. అందుకనే బిజెపి 'మీ దగ్గరే సమాచారం లేకపోతే, దేని ఆధారంగా మా అభిప్రాయం చెప్పాలి?' అని ప్రశ్నించి జవాబు యివ్వడం మానేసింది. ఈ పెత్తందారీ ధోరణే హోం శాఖ లేఖ తప్పుగా రాసేందుకు కారణమైంది. అభిప్రాయం కోరినపుడు అసలు బిల్లు అనీ, వివరాలు అడిగినపుడు ముసాయిదా బిల్లనీ రెండు నాల్కలతో మాట్లాడింది. ఇంతకీ యిది ఉత్తుత్తి బిల్లా, గట్టి బిల్లా అని అసెంబ్లీ నిలదీస్తే ఏం చెపుతుందో చూడాలి. గతంలో మూడు రాష్ట్రాలు విడగొట్టినపుడు బిల్లులే పంపింది తప్ప ముసాయిదా బిల్లు కాదు. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే యీ స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకో హోం శాఖ చెప్పాలి. అసెంబ్లీతో పని లేదు అని అనుకునేవాళ్లు ఒక విషయం గమనించాలి. అసెంబ్లీ అభిప్రాయం పార్లమెంటుపై బైండింగ్ కాదు. దాని ప్రకారమే పార్లమెంటు నడవాలని లేదు, నడవకూడదనీ లేదు. కానీ అభిప్రాయం అంటూ అడగాలి. అందుకే 'బిల్లు లోపభూయిష్టంగా వుంది, అభిప్రాయం చెప్పం' అంటూ గతంలో బిహార్ అసెంబ్లీ విభజన బిల్లు తిప్పిపంపినపుడు కేంద్రం ఏమీ చేయలేక వూరుకుని, మళ్లీ కొన్నాళ్లకు సవరించి పంపింది.
ఇప్పుడు బిల్లు తిప్పిపంపితే రాష్ట్రపతిని అవమానించినట్లే అని కొందరు వాదిస్తున్నారు. ఉత్తుత్తి బిల్లు పంపి అసెంబ్లీని అవమానించవచ్చా మరి? రాష్ట్రపతి పరువు తీయడానికి కారణభూతమైన హోం శాఖే నింద మోయాలి. రాష్ట్ర ఎసెంబ్లీ తన గౌరవాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు ఊరుకుంటే భవిష్యత్తులో కేంద్రప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం సీమాంధ్రను, తెలంగాణను కూడా అడ్డదిడ్డంగా విభజించే హక్కు పొందుతుంది. బిల్లు సవరించడం పెద్ద కష్టం కాదు కానీ, సమయం లేదు అని సణిగితే అంత అవ్యవధిగా విభజన ప్రతిపాదన చేయమని ఎవడు చెప్పాడన్న ప్రశ్న వస్తుంది. శ్రీకృష్ణ కమిటీ ఐదో ప్రతిపాదన ప్రకారం విభజన చేయాలంటే అన్ని ప్రాంతాల వారినీ ఒప్పించి చేయాల్సింది. ఇష్టారాజ్యంగా చేయబోతే యిలాగే జరుగుతుంది.
సోమవారం నాడు ఒవైసీ సూచన మేరకు న్యాయనిపుణులను అడ్వకేట్ జనరల్‌ను స్పీకరు అసెంబ్లీకి రప్పిస్తారా? అందరూ ప్రశ్నలడిగి, సమాధానాలు రాబట్టవచ్చు. కానీ వాళ్లు చెప్పిన సమాధానాలు రుచించకపోతే ఎమ్మెల్యేలు వూరుకుంటారా? గోల చేయరా? స్పీకరు పోడియంను చుట్టుముట్టినట్లే, అడ్వకేట్స్ పానెల్‌ను కూడా ఘొరావ్ చేసి నినాదాలు యివ్వవచ్చు. అసలు అసెంబ్లీని సాగనిస్తారా? లేదా అన్నదే పెద్ద ప్రశ్న. టి- ఎమ్మెల్యేలు యీ లోపునే న్యాయకోవిదులను సంప్రదించి, కిరణ్ వాదనలో బలం వుందని గ్రహించినట్లయితే అసెంబ్లీ నడవకుండా చేయడానికే ఎక్కువ అవకాశం వుంది. జానారెడ్డి ఆదివారం ఢిల్లీ వెళ్లి ట్రెయినింగ్ అయి వస్తున్నారు. ఆయన ఏదో ఒక వాదన లేవనెత్తకుండా వుండడు. దాన్ని మరొకరు ఖండించకుండా వుండరు. ఈ గోల, గందరగోళంలో చంద్రబాబు సమైక్యవాది అవునో కాదో చెప్తారో లేదో నాకు సందేహమే. నాలుగురోజులు యిలా గడిపేసి, అసెంబ్లీకి యిచ్చిన గడువు అయిపోయింది కాబట్టి మాకు తోచినది మేం చేసేస్తాం అని కేంద్రం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే యిలాటి అవకతవకల బిల్లుకు వత్తాసు పలికే బాధ్యత బిజెపిపై పడుతుంది. అదే జరిగితే చరిత్రలో కాంగ్రెసుతో బాటు బిజెపి కూడా దోషిగా నిలబడుతుంది. అసెంబ్లీ సవ్యంగా నడవని పక్షంలో చంద్రబాబు మనోభావాలు ఆయన మనసులోనే దాగి వుంటాయి. అదెప్పటికీ రహస్యమే! – (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2014)