ఫిబ్రవరి 8న జరగబోయే దిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో 1.46 కోట్ల మంది పాల్గొనబోతున్నారు. ఫలితాలు 11న. తలపడే పార్టీలు మూడిట్లో బిజెపి, కాంగ్రెసు జాతీయ పార్టీలు, ఆప్ ప్రాంతీయ పార్టీ. బిజెపి ఎప్పటిలాగానే జాతీయ సమస్యలు ఎత్తుకుని, 'సిఏఏను వ్యతిరేకించేవాళ్లందరూ టుక్‌డే టుక్‌డే గ్యాంగ్, వాళ్లను అదుపు చేయాలంటే హిందువులందరూ సంఘటితం కావాల'నే లైను తీసుకుంది. కాంగ్రెసు ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ దళితులు, ముస్లిముల ఓట్ల కోసం గేలం వేస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ మాత్రం బహుజాగ్రత్తగా దాని జోలికి పోకుండా 'స్థానిక సమస్యలే నాకు ముఖ్యం. దిల్లీ నా అభివృద్ధే నా జపం, తపం, వేరేదీ నాకు ముఖ్యం కాదు' అంటున్నాడు. మొత్తం మీద చూస్తే హంగ్ అసెంబ్లీ రావచ్చని కొందరు, అబ్బే ఆప్‌కే మొగ్గుంటుంది, గతంలో వచ్చినన్ని ఎలాగూ రావు కానీ అని కొందరు అంటున్నారు. బిజెపి స్వీప్ చేస్తుందని ఎవరూ అనటం లేదు.
నిజానికి 2019 పార్లమెంటు ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే బిజెపి దిల్లీ అసెంబ్లీని కైవసం చేసుకుని తీరాలి. దానికి 65 అసెంబ్లీ సెగ్మెంట్‌లలో మెజారిటీ వచ్చింది మరి. అయితే పార్లమెంటు తర్వాత జరిగిన అయిదు అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ప్రాభవం తగ్గినట్లు తేలుతోంది. ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్నచోట ఆ పార్టీ గెలుస్తోంది. లేని చోట కాంగ్రెసు గట్టిపోటీ యిస్తోంది. హరియాణాలో మాత్రమే బిజెపి మళ్లీ అధికారంలోకి వచ్చినా ప్రాంతీయ పార్టీ సహాయంతో వచ్చింది. తాజాగా ఝార్‌ఖండ్‌లో ప్రాంతీయ పార్టీకి అధికారం అందించాల్సి వచ్చింది. ఇవన్నీ చూసి అరవింద్ తనను తాను ప్రాంతీయ పార్టీగానే చూపుకోదలచాడు. 2014లో జాతీయ పార్టీగా ఫీలై పోయి, దేశమంతా పోటీ చేసి భంగపడ్డాడు. పంజాబ్‌లో కాస్త ఉనికి ఉన్నా, అదీ తగ్గుముఖం పట్టింది. ఉన్న దిల్లీని ఊడగొట్టుకోకుండా ఉంటే చాలనుకుంటున్నాడు.
సలహాదారుగా పెట్టుకున్న ప్రశాంత్ కిశోర్ ఏం చెప్పాడో ఏమో, గత ఏడాదిగా, సరిగ్గా చెప్పాలంటే పార్లమెంటు ఎన్నికల తర్వాత అరవింద్ నోరు మూత పడింది. దిల్లీ వంటి అర్ధరాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా, మోదీని ఎదిరించడానికి ముందు వరుసలో నిలబడేవాడు. తామిద్దరూ ఒకే ఫాయా వాళ్లం అన్నట్లు ప్రవర్తించేవాడు. పోనుపోను తనేమిటో తెలిసి వచ్చింది. మోదీ తీవ్ర జాతీయవాదం ముందు తను నెగ్గురు రాలేనని గుర్తించాడు. అందుకని కశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఎత్తివేయగానే అందరి కంటె ముందు అభినందించాడు. ఆ చర్యను స్వాగతించాడు. అయోధ్య తీర్పు వచ్చినపుడు కూడా! ఇప్పుడు ఎంత కవ్వించినా సరే జాతీయ వివాదాల్లోకి పోకుండా 'దిల్లీ ప్రజలే నాకు ముఖ్యం, దాని అభివృద్ధే నాకు కావాలి' అని చెప్తున్నాడు.
మొత్తం మీద చూస్తే అరవింద్ చేసిన వాగ్దానాలను పూర్తిగా నెరవేర్చలేక పోయినా, ఎంతో కొంత గట్టి ప్రయత్నం మాత్రం చేశాడని దిల్లీ పౌరుల అభిప్రాయం. తక్కిన ముఖ్యమంత్రులు సాధారణంగా పట్టించుకోని అతి ముఖ్య విషయాలు అతను పట్టించుకున్నాడు. అవి విద్య, వైద్యం! వాటికి బజెట్‌లో 40% కేటాయించాడు. దిల్లీ ప్రభుత్వ స్కూళ్లు ఫలితాలలో అదరగొట్టేస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. దేశమంతా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జబ్బు పడుతూ, కార్పోరేట్ హాస్పటళ్లు వెలిగిపోతున్న తరుణంలో ఆరోగ్య విషయంలో అతని మొహల్లా క్లినిక్‌లు సూపర్ హిట్ అయ్యాయి. వాటిల్లో లోపాలు లేవని కావు. కానీ చెప్పుకోదగ్గంత బాగా నడుస్తున్నాయవి. ఇవి కాక దిల్లీ సామాన్యులు అవస్థలు పడుతూ వచ్చినది విద్యుత్, నీరు విషయంలో. అతను ఎంతో హోమ్‌వర్క్ చేసి నీటి బిల్లులను తగ్గించగలిగాడు. విద్యుత్ విషయంలో కూడా గణనీయమైన ప్రగతి సాధించాడు.
ఎన్నికల జిమ్మిక్కులలో భాగంగా గత ఆర్నెల్లుగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంటున్నాడు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. రాష్ట్ర బిజెపి నాయకుడు, అయితేగియితే ముఖ్యమంత్రి అనుకుంటున్న మనోజ్ తివారి, ''మేం నెగ్గితే 5 రెట్లు ఫ్రీగా యిస్తాం'' అంటున్నాడు. ఇదెక్కడి చోద్యం అని జనాలు విస్తుపోతున్నారు. ప్రస్తుతం ఆప్ 400 యూనిట్ల విద్యుత్ వరకు 50% సబ్సిడీ యిస్తోంది. ఆర్థికస్థాయితో సంబంధం లేకుండా పౌరులందరూ 67 ప్రయివేటు ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకోవచ్చు, 44 ప్రయివేటు ఆసుపత్రులలో శస్త్రచికిత్సలు చేయించుకోవచ్చు. ''ఇవన్నీ చేస్తూ కూడా రాష్ట్ర బజెట్‌ను 31 వేల కోట్ల నుండి 60 వేల కోట్లకు అంటే రెట్టింపు చేశాం, దేశంలో అన్ని రాష్ట్ర బజెట్‌లు లోటులో వుండగా, మాది ఒక్కటే మిగులులో వుంది' అంటున్నాడు అరవింద్. ఎన్నికల వాగ్దానాల్లో బిజెపి తక్కువేమీ తినలేదు. మేం గెలిస్తే పార్లమెంటులో చట్టం చేసి 2000 అక్రమ కాలనీలను క్రమబద్ధం చేస్తాం అంటున్నారు.
ఎవరి పాలనలోనైనా అత్యంత సున్నితమైన అంశం శాంతిభద్రతలు. పోలీసులు అతి చేయకమానరు, దానికి రాష్ట్రప్రభుత్వం బాధ్యత వహించకా మానదు. దిల్లీ విషయంలో ముఖ్యమంత్రి అదృష్టమేమిటంటే ఆ లోపాన్ని కేంద్రంపై నెట్టేయవచ్చు. ప్రస్తుతం సిఏఏ ఆందోళనలతో, జెఎన్‌యు క్యాంపస్ గొడవలతో దిల్లీ అట్టుడుకుతోంది. ముఖ్యంగా షహీన్‌బాగ్ ఒక తలకాయనొప్పి వ్యవహారంగా తయారైంది. అయితే ఆ బాధ్యతంతా కేంద్ర హోం శాఖ తన నెత్తిన వేసుకుంది. అందువలన అరవింద్ ఆ జోలికి వెళ్లటం లేదు. అతను అక్కడకు వెళ్లాలని, తమకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడాలని, వెంటనే అతన్ని దేశద్రోహి, హిందూద్రోహి వగైరా అనాలని బిజెపి ముచ్చటపడుతోంది. కానీ అరవింద్ వాళ్లని ఒబ్లయిజ్ చేయటం లేదు.
పాత్రికేయులు ''మీరు షహీన్‌బాగ్‌కు ఎందుకు వెళ్లటం లేదు? వారి కారణంగా ట్రాఫిక్ యిబ్బందులు వస్తున్నాయి కదా. దిల్లీ ఎడ్మినిస్ట్రేటర్‌గా మీకు బాధ్యత లేదా?'' అని గుచ్చిగుచ్చి అడిగినా యితను ''నేను వెళ్లడం వలన వాళ్లు ఆందోళన మానేస్తారా? వాళ్ల సమస్య కేంద్ర ప్రభుత్వ విధానంతో. కేంద్రమే పరిష్కరించాలి దాన్ని' అని సమాధానం చెప్తున్నాడు. ''సిఏఏ గురించి మీ అభిప్రాయం ఏమిటి?'' అంటే ''ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్య, నిరుద్యోగ సమస్య. దాన్ని పరిష్కరించకుండా యివన్నీ ఏమిటి?'' అని అన్నాడు. ''దిల్లీలో ఆరు శరణార్థుల క్యాంపులు ఉన్నాయి కదా, అది మీకు సమస్యగా తోచటం లేదా?'' అని అడిగితే ''ఆరు క్యాంపుల కోసం దేశమంతా అగ్గిపెడతారా? నాకు సంబంధించినంత వరకు దిల్లీలో అన్ని మతాల వారి సమస్యలూ నేను తీర్చాలి.'' అని తెలివిగా తప్పించుకున్నాడు.
ఓట్లు మతాల వారీగా చీలిపోకుండా చూడాలని అతని తాపత్రయం. హిందూత్వ హవా నడుస్తున్న యీ రోజుల్లో అతనికి అది చాలా అవసరం. ప్రాంతాల వారీ చీలడం కూడా నివారించాలని అతను అనుకుంటున్నాడు. దిల్లీలో పూర్వాంచల్ – తూర్పు ఉత్తర ప్రదేశ్, బిహార్. ఝార్‌ఖండ్ – నుంచి వలస వచ్చిన జనాభా 25% దాకా ఉన్నారు. వారిని ఆకట్టుకోవాలని కాంగ్రెసు కీర్తి ఆజాద్‌ను తీసుకుని వచ్చింది. బిజెపి భోజపురి గాయకుడు, నటుడు మనోజ్ తివారిని రాష్ట్ర అధ్యక్షుడిగా చేసింది. అరవింద్ పేదలందరూ తమకు ఓటేస్తారని ఆశ పెట్టుకున్నాడు.
అరవింద్‌కు ఎంత పేచీకోరుగా, తిక్క మనిషిగా పేరున్నా, సమర్థ పరిపాలకుడిగా, అవినీతిరహితుడిగా కూడా పేరుంది. ఇటీవల అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం మానేశాడు. అతనికి తూగే ముఖ్యమంత్రి అభ్యర్థిని బిజెపి చూపించలేక పోతోంది. గతంలో కిరణ్ బేదీని తీసుకుని వస్తే ఆమె తన నియోజకవర్గంలో కూడా నెగ్గలేక పోయింది. ఈసారి హర్షవర్ధన్, విజయ్ గోయల్, పర్వేశ్ వర్మ వంటి చాలామంది ఆ పదవి ఆశిస్తున్నారు. అందువలన ఎవరి పేరూ చెప్పటం లేదు. మహారాష్ట్రలో, హరియాణాలో, ఝార్‌ఖండ్‌లో ముఖ్యమంత్రి పేరు ముందుగా చెప్పి బావుకున్నది లేకపోయింది. అందువలన యీసారి మోదీ కేంద్రంగానే యీ ఎన్నికలు జరుగుతాయి అని చెప్పుకుంటున్నారు.
దిల్లీ ఎన్నికలు బిజెపికి చాలా ముఖ్యం. ఈ ఏడాదిలోనే బిహార్‌లో ఎన్నికలు జరుగుతాయి. వచ్చే ఏడాది 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతాయి. అపజయాల పరంపర నుంచి బయటపడితే తప్ప క్యాడర్‌కు ఉత్సాహం కలగదు. సాధారణంగా బిజెపికి సోషల్ మీడియా బలం ఎక్కువ. ఆప్ యీ విషయంలో దానికి పోటీ యివ్వగలదు. వాళ్లు ''అచ్ఛే బీతే పాంచ్ సాల్, లగే రహో కేజ్రీవాల్'' నినాదంతో ఊదరగొట్టేస్తున్నారు. సర్వేలు చేయించుకుని ఆప్ పార్టీ తన ఎమ్మెల్యేలలో 15 మందిని డ్రాప్ చేసింది. 24 మంది కొత్తవాళ్లకి సీటు యిచ్చింది. 46 మంది పాతవాళ్లే. 1.30 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. ఫండ్ రైజింగ్ డిన్నర్ ద్వారా 1.50 కోట్లు సంపాదించారు.
పాత చరిత్ర చూస్తే – 2014 పార్లమెంటు ఎన్నికలలో బిజెపికి 47% ఓట్లు, కాంగ్రెసుకు 33% ఓట్లు, ఆప్‌కు 15% ఓట్లు వచ్చాయి. 2019 పార్లమెంటు ఎన్నికలలో బిజెపికి 57%, కాంగ్రెసుకు 18%, ఆప్‌కు 22% వచ్చాయి. 2014లోనూ, 2019లోనూ సీట్లు 7కి ఏడూ బిజెపికే! అయితే యిది 2015 నాటి అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిబింబించ లేదు. బిజెపికి 32% ఓట్లు, 3 సీట్లు వచ్చాయి. ఆప్‌కు 54% ఓట్లు, 67 సీట్లు వచ్చాయి. కాంగ్రెసుకు 10% ఓట్లు వచ్చాయి కానీ ఒక్క సీటూ రాలేదు. అందువలన దిల్లీ ఓటరు పార్లమెంటుకి ఒకలా, అసెంబ్లీకి మరొకలా వేస్తున్నాడు. 2019 ఎన్నికలలో ఒడిశా ఓటరు అలాగే వేశాడు. ప్రధానిగా మోదీని, ముఖ్యమంత్రిగా నవీన్‌ను కావాలనుకున్నాడు. దిల్లీవాలా కూడా అలాగే వేస్తాడని పరిశీలకులు ఊహిస్తున్నారు. కానీ 2017లో జరిగిన మునిసిపల్ ఎన్నికలలో ఆప్‌కు 28% ఓట్లు మాత్రమే వచ్చాయి. అలా చూస్తే ఆప్ ఓట్లు 2015లో 54%, 2017లో 26%, 2019లో 22%.. అంటే తగ్గుతూ వస్తోందన్నమాట. కాబట్టి బిజెపికి ఎక్కువ ఛాన్సుంది అనుకోవచ్చు.
ఈసారి బిజెపి వ్యతిరేక ఓట్లను కాంగ్రెసు చీల్చి, ఆప్‌కు నష్టం చేస్తుందని కొందరంటున్నారు. కాంగ్రెసు దళితులు, ముస్లిములపై ఆశ పెట్టుకుంది. వాటి మద్దతుతోనే 2019 పార్లమెంటు ఎన్నికలలో 5 అసెంబ్లీ సెగ్మెంటులలో మెజారిటీ వచ్చింది. 2015లో దళిత నియోజకవర్గాలు 12టిలోనూ ఆప్ పెద్ద మార్జిన్లతో నెగ్గింది. సిఏఏ పట్ల అరవింద్ అస్పష్ట వైఖరి కారణంగా యీ సారి ముస్లిములు ఆప్‌ను దూరం పెడతారో, లేక పరిపాలన ముఖ్యం అనుకుని అక్కున చేర్చుకుంటారో చూడాలి. వారి ఓట్లు 10 నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేయగలవు. 2015లో ఆప్ 10% లోపు మార్జిన్‌తో 10 సీట్లు గెలిచింది. అవి యీసారి గెలవక పోవచ్చు. మూడిటిలో ఆప్‌కు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ అవి ఏ మేరకు ఎక్కువున్నాయో ప్రస్తుతం చెప్పలేం.
ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2020)
[email protected]