cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: చూసీ చూడంగానే

సినిమా రివ్యూ: చూసీ చూడంగానే

సమీక్ష: చూసీ చూడంగానే
రేటింగ్‌: 2/5
బ్యానర్‌:
ధర్మపథ క్రియేషన్స్‌
తారాగణం: శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ, మాళవిక సతీషన్‌, పవిత్ర లోకేష్‌, అనీష్‌ కురువిల్ల, వెంకటేష్‌ కాకుమాను తదితరులు
కూర్పు: రవితేజ గిరిజాల
సంగీతం: గోపి సుందర్‌
ఛాయాగ్రహణం: వేదరామన్‌
నిర్మాత: రాజ్‌ కందుకూరి
కథ, కథనం, దర్శకత్వం: శేషా సింధు రావు
విడుదల తేదీ: జనవరి 31, 2020

చదువు అబ్బక ప్యాషన్‌ని ఫాలో అయ్యే యువకుడు, చాలా క్యాజువల్‌గా మద్యం సేవించే యువతులు, అంతే కామన్‌గా అబ్బాయిల వన్‌నైట్‌ స్టాండ్లు, సరదా డేటింగ్‌లు, కాఫీషాప్‌లో హ్యాంగౌట్లు... నేటి తరం యువత పద్ధతులు, అలవాట్లని ప్రతిబింబించే ఈ చిత్రంలో కథే పాత చింతకాయ పచ్చడిలా వుంది. నడకలో, నడవడికలో నవీన పోకడలు చూపించే పాత్రలు ప్రేమ విషయానికి వచ్చే సరికి ఇంకా 'నువ్వే కావాలి' నాటి 'కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు' ప్రశ్నల నుంచి ప్రోగ్రెస్‌ అయినట్టు అనిపించరు. అలవాట్లలో ఎంతగా అడ్వాన్స్‌ అయినా కానీ ఎమోషన్ల పరంగా ఎప్పుడూ కాన్‌స్టంట్‌గా వుంటామనేది చెప్పడం ఉద్దేశమో, లేక ఎమోషనల్‌ లవ్‌స్టోరీ తీస్తే అవుట్‌డేటెడ్‌ అనిపిస్తామనే భయంతో ట్రెండుకి తగ్గట్టు వుండాలని చేసిన ప్రయత్నమో కానీ ప్రధాన పాత్రల తీరులోనే నిలకడ లేక ఈ రొటీన్‌ లవ్‌స్టోరీ నిలబడలేకపోయింది.

ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుంటారు. కొన్నేళ్ల తర్వాత ఆ అమ్మాయి అతడిని వదిలేసి పోతుంది. అతనో వెడ్డింగ్‌ ఫోటోగ్రాఫర్‌ అవుతాడు. ఓ పెళ్లిలో ఓ అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. ట్విస్ట్‌ ఏమిటంటే ఆ అబ్బాయి కంటే ముందే ఆ అమ్మాయి అతడిని గాఢంగా ప్రేమించేసింది. ప్రేమించిన వాడికి తన ఫీలింగ్స్‌ కూడా చెప్పుకోలేని ఆ అమ్మాయి అయిదేళ్ల తర్వాత 'టామ్‌ బాయ్‌'లా మారిపోయి విదేశాలనుంచి తిరిగి వస్తుంది. అబ్బాయిలతో కలిసి మందు కొడుతుంది. కుర్రాళ్లతోనే షికార్లు, సరదాలు చేస్తుంటుంది. ఆ కుర్రాడిని అప్పుడే అంతగా ప్రేమించిన అమ్మాయి ఎందుకని ఆ విషయం చెప్పలేకపోతుంది? దానికో కారణముంటుంది.

సహజమైన సంభాషణలు, ఆకట్టుకునే మూగ ప్రేమలు అడపాదడపా అలా తొలకరి జల్లులా హాయిగా పలకరించిపోయినా కానీ చాలా భాగం మాత్రం అర్థం లేని మూగ రోదనతో, అర్థం కాని భావజాలంతో, అర్థరహితమైన అయోమయపు భావోద్వేగాలతో విసిగిస్తుంటుంది. మాట్లాడుకుంటే అయిపోయే దానికి పతాక సన్నివేశం వరకు దానిని వాయిదా వేస్తే కానీ సినిమా నడవదు కనుక మధ్యలో ఆర్టిఫిషియల్‌ డ్రామాతో నింపేసారు. ఎనిమిదేళ్లుగా ప్రేమిస్తున్న వాడు క్లియర్‌గా తన పట్ల ఆకర్షితుడయ్యాడనేది తెలుస్తూనే వున్నా కానీ మరెవరో వచ్చి పెళ్లి చేసుకుంటానంటే సరేనంటుంది. ఒకవేళ అతని ఫీలింగ్స్‌ ఏమిటనేది ఆమెకి తెలియకూడదనేది దర్శకురాలి స్క్రీన్‌ప్లే అనుకున్నా కానీ కొత్త కుర్రాడు శివ కందుకూరి తన నటనతో ఆమెలో ఆ 'డౌట్‌' క్రియేట్‌ చేయడంలో విఫలమయ్యాడు.

చాలా సన్నివేశాల్లో బలవంతపు ఎమోషన్లు ప్రధాన పాత్రలపై ఎలాంటి ఎంపథీ కలిగించవు. తల్లితో హీరోకి కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వుందనేది సరిగ్గా ఎస్టాబ్లిష్‌ చేయరు. హీరో తల్లి చాలా స్ట్రిక్ట్‌ అనేది క్యారెక్టరైజేషన్‌ కావచ్చు కానీ పవిత్ర లోకేష్‌ని చూస్తే అయ్యో పాపమనే అనిపిస్తుంటుంది తప్ప ఎక్కడా నోరెత్తి కొడుకుని గదిమిన సందర్భం కూడా వుండదు. 'ఫోకస్‌ లేదు' అంటూ హీరో పాత్ర పదే పదే చెబుతుంటుంది కానీ ఆ లోపాన్ని సరిగ్గా చూపించే ఒక్క సన్నివేశం కూడా పడలేదు. ఇన్‌ఫ్యాక్ట్‌ డైరెక్టర్‌కి సరయిన ఫోకస్‌ లేక అనేక విషయాలని టచ్‌ చేస్తూ ఏదో ఒక కన్‌ఫ్యూజింగ్‌ రొమాన్స్‌ స్టోరీ తెరకెక్కిందనే భావన కలుగుతుంది.

లీడ్‌ క్యారెక్టర్లు 'వుడీ అలెన్‌' పాత్రల తరహాలో మధ్యలో మనతో, అంటే ప్రేక్షకులతో డైరెక్ట్‌గా కమ్యూనికేట్‌ చేస్తుంటారు కానీ ఆ టెక్నిక్‌ కూడా ఎఫెక్టివ్‌గా పండిన సీన్‌ ఒక్కటీ లేదు. ద్వితియార్ధంలో కాలేజ్‌లో అసలు హీరోయిన్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో కనిపించే స్టోరీ ఒక్కటీ కాస్త 'చూడబుల్‌'గా వుంటుంది. ఆ ఎపిసోడ్‌ అయిన తర్వాత రెగ్యులర్‌ క్లయిమాక్స్‌ కోసం వేసుకునే క్లీషేస్‌ అన్నీ సినిమా ఆడియన్స్‌ని సీరియస్‌గా తీసుకున్నారన్న ఫీలింగ్‌ ఇవ్వవు. షార్ట్‌ ఫిలిం తరహాలో నచ్చకపోతే స్ట్రీమింగ్‌ ఆపేస్తారనే ధోరణి తప్ప నిజంగా ఆకట్టుకోవాలనే తపనతో చేసిన అనుభూతిని చివరి ఘట్టం అస్సలు కలిగించదు.

శివ కందుకూరి కొత్త వాడయినా ఓకే అనేలా నటించాడు. కానీ ఈ పాత్రకి మరింత ఎక్స్‌ప్రెసివ్‌ ఫేస్‌తో పాటు క్యారెక్టర్‌ని అర్థం చేసుకుని అందులోకి ప్రవేశించి సహజంగా చూపించేంత సామర్ధ్యం అవసరం. అది శివకి లేదు. వర్ష ఈ చిత్రానికి తెర మీద ప్రధానాకర్షణగా నిలిచింది. ఆమె మాత్రమే ఆ పాత్ర తాలూకు పెయిన్‌ని కెమెరా ముందు చూపించగలిగింది. తెర వెనుక గోపి సుందర్‌ సంగీతం ప్లస్‌ పాయింట్‌ అయింది. నీ పరిచయముతో, వెనకనే వున్నా పాటలు ఆకట్టుకుంటాయి.

షార్ట్‌ ఫిలింని వెండితెరపై చూస్తోన్న భావన కలిగించడం, కన్‌ఫ్యూజింగ్‌ ఎమోషన్స్‌తో అస్సలు ఎమోషనల్‌ కనక్ట్‌ లేకుండా చేయడం వల్ల 'చూసీ చూడంగానే' చాలా చోట్ల చేతిలో మౌస్‌ వుంటే ఇదంతా స్కిప్‌ చేసేసి ముందుకి డ్రాగ్‌ చేసేయాలనే ఫీల్‌ ఇస్తుంది. అటు ఎమోషనల్‌ సినిమా తీయాలా, లేక ఇటు ట్రెండ్‌ని ప్రతిబింబించే 'టచ్‌ అండ్‌ గో' ప్రేమలని తెరకెక్కించాలా అనే అయోమయంలో ఎటూ కాని టేస్ట్‌లెస్‌ కాక్‌టెయిల్‌  రొమాన్స్‌లా తయారైంది.

బాటమ్‌ లైన్‌: చూడ్డానికేం లేదులే!

గణేష్‌ రావూరి

 


×