మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తన అధిక ప్రసంగానికి మూల్యం చెల్లించుకుంటున్నాడు. చంద్రబాబు మెప్పు కోసం జగన్‌ను ‘మా వాడు’ అంటూనే తీవ్ర దూషణలకు పాల్పడుతూ వస్తున్న దివాకర్‌రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం అదును చూసి త్రి‘శూలం’ దించింది. అనంతపురం జిల్లా యాడికిలోని త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజును జగన్ సర్కార్ రద్దు చేసి దివాకర్‌రెడ్డికి షాక్ ఇచ్చింది. కొనుప్పలపాడులో 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపురాతి గనుల లీజుల్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
చంద్రబాబు ప్రభుత్వం సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి మరో ఐదేళ్లు గడువు పొడిగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను జగన్ సర్కార్ వెనక్కి తీసుకుంది. ఫ్యాక్టరీ నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా లీజు ప్రాంతంలో 38,212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి తవ్వకంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
గత కొంతకాలంగా తమను జగన్ సర్కార్ వెంటాడుతోందని జేసీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తమ బస్సులపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆర్‌టీఐ అధికారులతో దాడులు చేయించి సీజ్ చేయించిందని కొంతకాలంగా జేసీ ఆరోపిస్తున్నాడు. ఇప్పుడు త్రిశూల్ కంపెనీ గనుల లీజుల్ని రద్దు చేయడంతో జేసీ గగ్గోలు పెడుతున్నాడు. తనను జగన్ సర్కార్ టార్గెట్ చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘జగన్ మావాడే అయినప్పటికీ నన్ను వదిలిపెట్టడం లేదు’ అని జేసీ అంటున్నాడు. అయితే జగన్ ఫ్యాక్షన్ పాలన సాగిస్తున్నాడని గనుల లీజుల రద్దుపై స్పందిస్తూ వ్యాఖ్యానించాడు.