'జానపద సినిమాలు – అక్కినేని' అని వినగానే ఈ తరం వారికి ఇదేదో దుష్టసమాసం అనిపించవచ్చు. అతకని రెండు భాషల పదాలను కలిపి బొంత కుట్టేసినట్టు అనిపించవచ్చు. తెలుగుమాట, సంస్కృతపదం కలిపేసి పుష్పచెట్లు, వృద్ధతల్లి అన్నట్టు వుంటుందనుకోవచ్చు. ఎందుకంటే నాగేశ్వరరావుగారి ఇమేజికి, అందరూ అనుకునే జానపద సినిమాకీ పొత్తు కలవదు. జానపద హీరో అనగానే ఆజానుబాహువయి వుండాలి. కండలు ప్రదర్శించాలి. కత్తి తిప్పాలి. మొరటుగా వుండాలి. అవతలవాణ్ని చావ చితక్కొట్టేట్టు వుండాలి. మనసనేది వుంటుందో లేదో తెలియదు కానీ హీరోయిన్‌ను మోటుగా వాటేసుకోవాలి. ఇవేవీ అక్కినేని గారి ఇమేజికి సరితూగేవి కావు. ఆయన నాజూకు మనిషి. హీరోయిన్‌ను అతి సుతారంగా తాకే మనిషి. వీలైతే ఆమె శరీరాన్ని కూడా తాకకుండా మనసును మాత్రం కదిలించి వదిలేసే మనిషి. అక్కినేని అనగానే కళ్లముందు ఆవిష్కరించే రూపం భగ్నప్రేమికుడు, త్యాగమూర్తి. తాను వలచిన అమ్మాయిని మరో మిత్రుడికోసం వదిలి వెళ్లిపోయే మనిషి. ఒక్కోప్పుడు అపార్థం చేసుకుని మనసును గాయపరచుకునే ప్రేమైకమూర్తి. వైఫల్యం చెంది బాధగా దిగంతాలకో, పరలోకానికో వెళ్లిపోయే కథానాయకుడు. మరి జానపద నాయకుడి తీరు అలా క్కాదే! మనసుతో వ్యవహారం జాన్తానై. అపజయం అంగీకరించడమా… అబ్బే తెలియని విద్య! కోరుకున్నది సాధించాల్సిందే. అవతలివాడు గురువుగారు కావచ్చు, మాంత్రికుడు కావచ్చు కాళికాదేవికి బలి యిచ్చైనా సరే, తన మనోరథం ఈడేర్చుకోవలసినదే!
అందువల్ల జానపదాలకు, అక్కినేనికి చుక్కెదురు అనుకుంటే…! ఇక్కడ ఒక్క నిమిషం ఆగి కొన్ని విషయాలు నెమరేసుకోవాలి – ఈరోజు అక్కినేని ఈ స్థానంలో ఉన్నారంటే దానికి కారణం – బాలరాజు, కీలుగుఱ్ఱం, స్వప్నసుందరి వుంటి జానపద చిత్రాలు. ఆయన తొలి థాబ్దంలోని చిత్రాలన్నీ జానపదాలే. జనవరి 1941లో విడుదలైన ఆయన తొలి సినిమా ధర్మపత్ని సాంఘికమనుకోండి. తర్వాత పదేళ్ల పాటు చూసుకుంటే అంటే డిసెంబరు 1950 వరకూ నుండి సీతారామజననం ('44), మాయాలోకం (45) , ముగ్గురు మరాటీలు (46), పల్నాటియుద్ధం (47), రత్నమాల (48), బాలరాజు (48), లైలా మజ్నూ (49), కీలుగుఱ్ఱం (49) స్వప్నసుందరి (50) శ్రీ లక్ష్మమ్మకథ (50) పల్లెటూరి పిల్ల (50) పరమానందయ్య శిష్యులు (50) – 12 సినిమాలు. వీటిల్లో సాంఘికం ఎక్కడుంది?
'సంసారం' అనే సాంఘిక సినిమా డిసెంబరు 1950లో వచ్చింది. మళ్లీ ఆ వెనువెంటనే జానపదాలు. 1951 లో ఆయన సినిమాలు – మంత్రదండం, స్త్రీ సాహసం, సౌదామిని, మాయలమారి మళ్లీ జానపదాలే కదా, అందువల్ల ప్రజలకు ఆయన్ను సన్నిహితం చేసినవి జానపదాలే! ఆయన తన 7 వ సినిమాతోనే సిల్వర్ జూబిలీ స్టార్ అయ్యారు. ఆ సినిమా బాలరాజు! మాయలూ, మంత్రాలూ, శాపాలూ, వరాలూ.. అన్నీ వున్న ఫక్తు జానపదం. నిర్మాతగా ఆయన తొలి ప్రయత్నం అన్నపూర్ణా ద్వారా తీసిన 'దొంగరాముడు' కాదు, అంజలీదేవి గారితో, యితర మిత్రులతో కలిసి తీసిన 'మాయలమారి' అనే 1951 నాటి జానపద సినిమా. అక్కినేని గారి కెరియర్‌లో గొప్ప మ్యూజికల్స్ – అంటే అన్ని పాటలూ బాగుండేవి – వాటిలో ముఖ్యమైన మూడు – సువర్ణసుందరి, జయభేరి, రహస్యం – జానపదాలే! అక్కినేని కెరియర్ బిల్డింగులో జానపదాలు ప్రముఖ పాత్ర వహించాయని చెప్పడానికి ఏమాత్రం సందేహించ నక్కరలేదు.
ఎందుకిలా జరిగింది? ఎందుకంటే జానపద సినిమాల పవర్ అలాటిది. వాటిలో కథ సూటిగా వుంటుంది. పాత్రలు ఏ మాత్రం కాంప్లికేషన్ లేకుండా వుంటాయి. అందువల్ల చిన్నపిల్లలకు, పెద్దల్లో వున్న చిన్నపిల్లవాడికి, (చందమామ పత్రిక నచ్చని పెద్దలున్నారా?) ఆట్టే చదువురానివాళ్లకు కథ బాగా అర్థమౌతుంది. మన జనాభాలో ఎక్కువ శాతం వున్నది వారే కాబట్టి ఆ తరహా సినిమాలు ఛట్టున తలకెక్కుతాయి. ఇప్పటిదాకా ప్రేక్షకులను ఏడిపించిన జానపద సినిమా లేదు. హీరోకు కష్టాలు వచ్చినా ఎలాగూ సుఖాంతం అని మనకు ముందే తెలుసు. అందుకే బి, సి సెంటర్లలో రిపీటెడ్ ఆడియన్సు వచ్చేది జానపద సినిమాలకే! ఇప్పుడు వస్తున్న యాక్షన్ సినిమాల్లో, సైఫై సినిమాల్లో, పాము సినిమాల్లో కూడా జానపద జాడలున్నాయి. సినిమా కళ యింత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోనే యిలా వుంటే సినిమా రూపు దిద్దుకుంటున్న ఆ రోజుల్లో 50 ఏళ్ల క్రితం అంతగా పరిణతి చెందని ప్రేక్షకులకు బుర్ర కెక్కేది జానపదాలే! అందువల్ల జానపదాల ద్వారానే నాగేశ్వరరావుగారు జనులకు చేరువయ్యారు. ''పాతాళభైరవి'' నాటికి నాగేశ్వరరావుగారికున్న జానపద హీరోయిజం అప్పుడు రామారావుగారికి లేదు. జానపదాలతో నాగేశ్వరరావుగారు ఎంత మమేకం అయిపోయారంటే సాంఘికాలకు ఆయన పనికి రాడంటారేమోనని ఆయన ప్యాంటు, చొక్కాతో ఫోటోలు తీయించుకుని, నిర్మాతలకు పంపారు.
నేను చెప్పేదానిలో కొంత పొసగని విషయం వున్నట్టు అనిపిస్తోందా? అక్కినేని ఆజానుబాహువు కాదు, కండపుష్టి వున్నవాడు కాదు అంటూనే జానపదహీరోగా రాణించాడు అనడం అసంబద్ధంగా వుందా? ఇక్కడే నాగేశ్వరరావుగారి ప్రతిభ బయటపడుతుంది. జానపదాల్లో సైతం ఆయన తన ఆంగికానికి, వాచికానికి సరిపోయే పాత్రలే ఎంచుకున్నారు. ఉదాహరణకి ''బాలరాజు'' సినిమాలో నాగేశ్వరరావుగారు కత్తి పట్టలేదు. వేణువు పట్టి జనాలందరినీ సమ్మోహితులను చేశారు. ఆడదంటే ఏమిటో, ప్రేమంటే ఏమిటో తెలియని గొల్లపిల్లవాడిగా – చూడచక్కని చిన్నది, ఏపుగా ఎదిగిన పిల్లది ఒకతె ఒంటి స్తంభం మేడ దిగివచ్చి వెంటబడ్డా కన్నెత్తి చూడని ముగ్ధబాలుడిగా ఆంధ్ర ప్రేక్షకుల హృదయాలను అపహరించారు. 'బాలరాజు' శూరత్వంతో కాదు ప్రేమతత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బాలరాజు వచ్చిన పదేళ్ల తర్వాత ''సువర్ణసుందరి'' సినిమాలో నాగేశ్వరరావు మళ్లీ ఓ అభిశప్త ప్రేమికుడి పాత్ర వేశారు. ఆకర్షణశక్తిలో దానికీ దీనికీ సామ్యమూ వుంది, వ్యత్యాసమూ వుంది. బాలరాజు లాగే ''సువర్ణసుందరి''లో వేణువు పట్టుకుని ప్రియురాలిని ఆకర్షించడమూ వుంది. ప్లస్ కత్తి యుద్ధమూ వుంది, కాగడాలతో యుద్ధమూ వుంది. బాలరాజు హీరోలో ముగ్ధత్వం వుంటే సువర్ణసుందరి హీరోలో పరిపూర్ణత వుంది, శారీరక దార్డ్యత వుంది. ''బాలరాజు''కి దీటైన విజయాన్ని ''సువర్ణసుందరి'' సాధించింది. ''స్వప్నసుందరి''లో నాగేశ్వరరావు ఓ దేవకన్యను కలలో చూసి ప్రేమించి సాధించడం కనబడుతుంది. ''బాలరాజు''లో ఎస్.వరలక్ష్మిలా దీనిలో జి.వరలక్ష్మి ఆయన వెంటబడుతుంది. కానీ ఈయన అంజలికే అంకితమవుతాడు. దీనిలో హీరో వీరరసం చివరిలోనే కనబడుతుంది. తక్కినదంతా లవర్‌బోయ్‌గానే కనబడతారు.
దీని తర్వాత రెండేళ్లకు వచ్చిన ''జయభేరి'' సినిమా కూడా జానపదమే కానీ, అందులో నాగేశ్వరరావుగారి ఖడ్గవిన్యాసం కనబడదు, కళావిన్యాసం కనబడుతుంది. సినిమా రెండు భాగాలుగా అనుకోవచ్చు. కళ కళ కోసం కాదు, ప్రజలకోసం అని చూపించడం మొదటిభాగం. కళాకారుడు ప్రజల్లో వుండకుండా రాజాస్థానంలో వుంటే కలిగే అనర్థాన్ని రెండో భాగంలో చూపారు. ఈ సినిమాలో నాగేశ్వరరావుగారు తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు.
క్రమేపీ జానపదాలనుండి నాగేశ్వరరావుగారు ఉద్దేశపూర్వకంగానే తప్పుకున్నారు. పోనుపోను జానపదాల స్థాయి తగ్గి, బొత్తిగా చీప్ సెట్టింగులతో ద్వితీయశ్రేణి నటులతో తీసేశారు. అలాటి పరిస్థితుల్లో ''రహస్యం'' ఆఫర్ వచ్చింది. భారీ తారాగణం, అంతకుమించిన భారీ సెటింగ్స్, పరమాద్భుతమైన పాటలు, మరుపురాని సంగీతం, వేదాంతం వారి దర్శకత్వం. ''రహస్యం'' తీసేనాటికి నాగేశ్వరరావుగారు 40లలో వున్నారు. పూర్ణచంద్రుడిలా మిలమిలలాడుతూ వున్నారు.కత్తియుద్ధాలూ చేశారు, మారు వేషాలూ వేశారు, ప్రేమికుడిగా, త్యాగధనుడిగా రాణించారు. కథలో గందరగోళం వల్ల సినిమా ఆశించినంత విజయం సాధించలేక పోయినా నటుడిగా నాగేశ్వరరావు వెలిగారు.
ఏతావాతా గమనించవలసిదేమిటంటే – జానపద చిత్రాల అభివృద్ధికి అక్కినేని వారి కంట్రిబ్యూషన్ ఎంతో వుంది. అలాగే అక్కినేని వారి కెరియర్‌కు జానపద చిత్రాల కంట్రిబ్యూషన్ చాలా వుంది. అందువల్ల 'జానపదాలు-అక్కినేని' అనేది దుష్టసమాసం కాదు, అందమైన ద్వంద్వసమాసం. అక్కినేని మరణం తర్వాత ఆయన పార్థివశరీరం వద్ద పెట్టిన ఫోటో చూడండి – ''కీలుగుఱ్ఱం''లో యువరాజు స్టిల్! ''దేవదాసు'', ''ప్రేమాభిషేకం''లో తాగుబోతు స్టిల్ కాదు. అంటే మరణంలో సైతం జానపద చిత్రాల నీడ ఆయనను వెన్నంటే వుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2014)