బాలీవుడ్ డస్కీ బ్యూటీ బిపాసా బసు.. ఒకప్పుడు బాలీవుడ్‌లో సెన్సేషన్. ఇప్పుడంటే జోరు తగ్గిందిగానీ, బాలీవుడ్ తెరకి సరికొత్త గ్లామర్ తెచ్చిన నటిగా బిపాసా పేరు బాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆమె నటించిన సినిమాలు.. వాటిల్లో ఆమె ఒలికించిన గ్లామర్ అలాంటివి. గ్లామర్ మాత్రమే కాదు, యాక్షన్ సినిమాల్లోనూ తనదైన ముద్ర వేసిన బిపాసా బసు, తెలుగులోనూ ఓ సినిమాలో నటించింది. అదే ‘టక్కరిదొంగ’. మహేష్ హీరోగా వచ్చిందీ సినిమా. తన కెరీర్ గురించీ, పెళ్ళాడబోయేవాడి గురించీ బిపాసా బసు ఏమంటోందో చూద్దాం.
అవును, అనారోగ్యమే ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టేలా చేసింది
బిపాసా బసు అంటే ఎప్పుడూ పెర్‌ఫెక్ట్ ఫిట్‌నెస్‌తో వుండే ముద్దుగుమ్మ గుర్తుకొస్తుంది. మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకొచ్చిన బిపాసా ఎప్పుడూ ఫిట్‌నెస్ కోల్పోలేదు. ఒకప్పుడు కాస్త బొద్దుగా వుండేది, ఇప్పుడు బాగా స్లిమ్ అయ్యింది.. అదే తేడా. బొద్దుగా వున్న బిపాసా ఎందుకు సన్నబడిందో తెలుసా.? ఆమె అనారోగ్యానికి గురయ్యిందట, ఆస్టియోపోరోసిస్ అనే రుగ్మతకు గురవడంతో, డాక్టర్ సూచన మేరకు సన్నబడ్డానని చెబుతోంది బిపాసా. ఇకపై డాన్సులు చేయడం కుదరదు, యాక్షన్ సినిమాల్లో నటించడం కష్టం.. అని డాక్టర్ చెబితే, దాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుని, ఫిట్‌నెస్ మీద శ్రద్ధపెట్టాననీ, అందుకే ఇప్పుడిలా వున్నాననీ బిపాసా చెప్పుకొచ్చింది.
ఇలా నేనున్నందుకు గర్వంగా వుంది
‘సెన్సేషనల్ హిట్ సినిమాల్లో నటించిన ఆనందం ఎప్పటికీ మిగిలిపోతుంది..’ అని చెప్పే బిపాసా, కెరీర్ తొలి నాళ్ళలో అందరిలానే తానూ ఇబ్బందులు ఎదుర్కొన్నాననీ, ఒక్కసారి ఫేమ్ వచ్చాక, దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టంగా మారిపోయిందనీ.. కాలక్రమంలో కెరీర్ పట్ల అవగాహన పెరిగి, ఎత్తు పల్లాల గురించిన వాస్తవాలు తెలుసుకుని.. ఇప్పుడు నటిగా, వ్యక్తిగా మెచ్యూరిటీ సంపాదించుకున్నానని అంటోంది. ఇప్పుడిలా వున్నందుకు చాలా ఆనందంగా వుందని చెప్పిన బిపాసా, స్టార్ డమ్ అభిమానులు ఇచ్చిందేననీ, అందులో చిక్కుకోకుండా అభిమానుల్ని మరింతగా మెప్పించే చిత్రాలు చేస్తానని వెల్లడించింది.
దాని గురించి మాట్లాడాల్సిందేమీ లేదు
బిపాసా – జాన్ అబ్రహాం.. వీరిద్దరూ భార్యాభర్తల్లా వుండేవారు ఒకప్పుడు. పెళ్ళి చేసుకోకపోయినా, ఇద్దరూ కలిసి సహజీవనం చేశారనే రూమర్స్ అప్పట్లో వచ్చాయి. అందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు కూడా. ఒకరి మనసు ఇంకొకరికి ఇచ్చేసుకున్నాక, కలిసి జీవించడానికి పెళ్ళి అవసరమా? అని బిపాసా, జాన్ ప్రశ్నించిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు జాన్ అబ్రహాంకి పెళ్ళయిపోయింది. బిపాసా ఒంటరిగా మిగిలిపోయింది. జాన్ గురించి ప్రస్తావిస్తే, అది గడచిపోయిన విషయం, దాని గురించి మాట్లాడటానికేమీ లేదు.. అని తేల్చేసింది బిపాసా బసు.
పెళ్ళి ఆలోచనలేమన్నా…
ఇప్పుడే కాకపోయినా, ఖచ్చితంగా పెళ్ళి చేసుకుంటానంటోంది బిపాసా బసు. ‘నాకంటూ కొన్ని ఆలోచనలు వున్నాయి పెళ్ళికి సంబంధించి. నేను ఇప్పుడెలా స్వేచ్ఛగా వున్నానో, పెళ్ళయ్యాక కూడా అదే స్వేచ్ఛని కలిగి వుండాలి.. అలా నన్ను గౌరవించాలి నన్ను పెళ్ళాడబోయే వ్యక్తి.. నా స్వేచ్ఛకు సంకెళ్ళు వేస్తానంటే కుదరదు.. అందుకే నా భావాలకు తగ్గట్టుగా వుండే వ్యక్తి కోసం అన్వేషిస్తున్నా.. దొరికినప్పుడు అందరికీ పరిచయం చేస్తా..’ అంని బిసాసా పెళ్ళాడబోయే వ్యక్తి, అతనికి వుండాల్సిన క్వాలిటీస్ గురించి వివరించింది.