హైందవేతరులను పెళ్లాడిన హిందువులకు విడాకులు రావు

సివిల్‌ మ్యారేజి చట్టం కింద కాకుండా హిందూ వివాహాల చట్టం క్రింద ఒక హిందువు హిందువు కానివారిని పెళ్లి చేసుకుంటే ఆ చట్టం కింద విడాకులు యివ్వడానికి వీలుపడదని బొంబాయి హై కోర్టు గత…

సివిల్‌ మ్యారేజి చట్టం కింద కాకుండా హిందూ వివాహాల చట్టం క్రింద ఒక హిందువు హిందువు కానివారిని పెళ్లి చేసుకుంటే ఆ చట్టం కింద విడాకులు యివ్వడానికి వీలుపడదని బొంబాయి హై కోర్టు గత నెలలో తీర్పు యిచ్చింది. నిరంజని అనే ఒక హిందువు రోషన్‌ పింటో అనే క్రైస్తవుణ్ని హైందవ సంప్రదాయాల ప్రకారం 1999లో పెళ్లి చేసుకుంది. తర్వాత వాళ్లిద్దరికీ పేచీలు వచ్చాయి. 

తనపై క్రూరత్వం చూపుతున్నాడన్న కారణం చూపి ఆమె ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోరింది. హిందూ మ్యారేజీ యాక్టు ప్రకారం పెళ్లి సమయానికి యిద్దరూ హిందువులై వుండాలి. అంతేకాదు, విడాకులకు దరఖాస్తు చేసుకునే సమయంలో కూడా హిందూమతాన్ని అవలంబిస్తూ వుండాలి. పింటో పెళ్లి సమయంలో క్రైస్తవుడు, యిప్పటికీ మతం మార్చుకోలేదు. క్రైస్తవుడిగానే కొనసాగుతున్నాడు. ఈ కారణాల వలన ఫ్యామిలీ కోర్టు విడాకుల దరఖాస్తును తోసిపుచ్చింది. ఆ తీర్పుపై నిరంజని హైకోర్టుకి వెళ్లింది. హైకోర్టు కూడా యిదే విషయాన్ని స్పష్టం చేసింది. 

కొన్ని ప్రేమవివాహాల్లో హైందవేతరులు తమ ప్రేయసి/ప్రియుడి కోరిక మేరకు హైందవ సంప్రదాయాలను మన్నిస్తూ పెళ్లి చేసుకుంటారు. విదేశీవనితలు మనవాళ్లని పెళ్లాడే సందర్భాలు కూడా వార్తల్లో చూస్తున్నాం. వారు హిందూసంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లిని రిజిస్టర్‌ చేయించినా ప్రయోజనం వుండకపోవచ్చు. హిందూ పెళ్లికే విలువ లేనపుడు రిజిస్ట్రేషన్‌ వలన చట్టబద్ధత కలగదు కదా! అందువలన రిజిస్టర్‌ మ్యారేజి నియమాల ప్రకారం తగిన నోటీసు యిచ్చి మళ్లీ పెళ్లి చేసుకోకపోతే యిలాటి చిక్కులు తప్పవు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ – న్యూస్‌, వ్యూస్‌, రివ్యూస్‌ – (జనవరి 2014)