ఏ సినిమా ఏ స్థితిలో ఆగిపోతుందో అర్థం కాని పరిస్థితి. అన్నీ బాగున్నాయనుకొన్న కొన్ని సినిమాలు సెట్స్‌లో ఉండగానే ఆగిపోతాయి. కొన్ని చిత్రీకరణ పూర్తి చేసుకొన్నా…. ల్యాబుల్లో నుంచి బయటికి రావు. వీటి వెనకాల రకరకాల కారణాలుంటాయి. మొత్తంగా బొమ్మ తెరపై చూసుకొనేంతవరకు నమ్మలేని పరిస్థితి. ఈ రోజు విడుదల కావాల్సిన `ఏమో గుర్రం ఎగరావచ్చు` వ్యవహారం కూడా అదే. నిన్నటిదాకా ఆ సినిమా విడుదలవుతోందని నిర్మాత ప్రకటించారు.
అయితే ఈ రోజు మాత్రం బొమ్మ తెరపై పడలేదు. ఆర్థిక కారణాలవల్ల సినిమా ల్యాబుల్లో నుంచి బయటికి రాలేకపోయింది. ఈ చిత్రానికి తొలుత మదన్ నిర్మాత. అయితే ఆయన కొన్ని కారణాలవల్ల బయటికి వచ్చాడు. మరో నిర్మాత పూదోట సుధీర్‌కుమార్ ప్రాజెక్టును హ్యాండిల్ చేశాడు. తొలి రోజుల్లో చిత్రీకరణ కోసం మదన్ పెట్టిన కోటిన్నర పెట్టుబడిని విడుదల రోజు తిరిగి ఇవ్వాలని మాట.
అయితే ప్రస్తుత నిర్మాత పూదోట సుధీర్‌కుమార్ ఆ డబ్బును సిద్ధం చేయలేకపోయాడని తెలిసింది. దీంతో ఆ సినిమా ల్యాబుల్లో నుంచి బయటికి రాలేకపోయింది. మరి ఎప్పుడు సినిమా ఆర్థిక ఇబ్బందులనుంచి గట్టెక్కుతుందో, గుర్రం ఎప్పుడు ఎగురుతుందో చూడాలి. సుమంత్, పింకీ సావిక జంటగా నటించిన చిత్రమిది. చంద్రసిద్ధార్థ్ దర్శకత్వం వహించారు.