రివ్యూ: ఏమో గుర్రం ఎగరావచ్చు
రేటింగ్: 2/5
బ్యానర్: చెర్రీ ఫిలింస్ ప్రై.లి.
తారాగణం: సుమంత్, పింకీ సావిక, కాంచి, తాగుబోతు రమేష్, హర్షవర్ధన్ తదితరులు
కథ-మాటలు: ఎస్.ఎస్. కాంచి
సంగీతం: ఎమ్.ఎమ్. కీరవాణి
ఛాయాగ్రహణం: చంద్రమౌళి
నిర్మాత: పూదోట సుధీర్ కుమార్
కథనం, దర్శకత్వం: చంద్రసిద్ధార్థ్
విడుదల తేదీ: జనవరి 25, 2014
చాలా కాలంగా విజయాలు లేని సుమంత్ కొంత గ్యాప్ తీసుకుని చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ చిత్రం చేసాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘మధుమాసం’ ఫర్వాలేదనిపించుకుంది. ‘ఆ నలుగురు’, ‘అందరి బంధువయ’లాంటి ఉత్తమ చిత్రాలు తెరకెక్కించిన చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో ఆహ్లాదకరమైన టైటిల్‌తో, కీరవాణి స్వర సారథ్యంలో సినిమా అంటే అంతో ఇంతో నమ్మకం ఏర్పడడం ఖాయం. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఈ గుర్రం నిలబడగలిగిందా… విజయాన్ని అందుకునేంత ఎత్తుకి ఎగరగలిగిందా?
కథేంటి?
టెన్త్ క్లాస్ పాస్ కావడానికి గజిని మొహమ్మద్‌లా దండయాత్రలు చేసే పల్లెటూరి బుల్లెబ్బాయికి (సుమంత్) తన మరదలు నీలవేణి (పింకీ) అంటే చాలా ఇష్టం. అమెరికాలో సెటిల్ అయిన నీలవేణికి పెళ్లి సంబంధాలు చూస్తుంటే, తన చాదస్తపు తండ్రికి నచ్చజెప్పలేక బుల్లెబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అవుతుంది నీలవేణి. అతడిని చేసుకుని అమెరికా తీసుకెళ్లి… ఆ తర్వాత విడాకులు ఇచ్చి నచ్చిన పెళ్లి చేసుకోవాలనేది నీలవేణి ఆలోచన. ఇదంతా తెలిసినా కానీ పెళ్లికి సరేనంటాడు బుల్లెబ్బాయి.
కళాకారుల పనితీరు!
సుమంత్ ఇంతవరకు ఎక్కువగా సీరియస్ క్యారెక్టర్స్‌లోనే కనిపించాడు. ఈసారి కాస్త వినోదాత్మక పాత్ర పోషించాడు. అయినా కానీ తన బెస్ట్ పర్‌ఫార్మెన్స్ మాత్రం ఎమోషనల్ సీన్స్‌లోనే ఇవ్వగలిగాడు. కామెడీ అతని కప్ ఆఫ్ టీ కాదు. థాయ్‌ల్యాండ్‌కి చెందిన పింకీ సావిక ఎన్నారై పాత్రకి సూట్ అయినా కానీ భాష తెలియకపోవడం వల్ల భావ ప్రకటనలోను బాగా ఫెయిల్ అయింది. లిప్ సింక్ ఇవ్వడానికి కూడా పింకీ బాగా ఇబ్బందిపడి, తన నటనతో ఇబ్బంది పెట్టింది. రచయిత కాంచి తన కామెడీతో నవ్వించడానికి విఫలయత్నం చేసాడు. తనలోని రైటర్ సహకరించినట్టయితే యాక్టర్ సక్సెస్ అయ్యేవాడేమో. ఇక్కడ రెండిందాల చెడి ఈ చిత్రానికి పెద్ద మైనస్ అయ్యాడు. తాగుబోతు రమేష్ రొటీన్‌కి భిన్నంగా ఈసారి తాగలేదు. తాగకపోతే అతని కామెడీ పండదు! హర్షవర్ధన్, అన్నపూర్ణ, సుధ తదితరులంతా తమకి అలవాటైన పాత్రల్లో నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
‘మర్యాద రామన్న’ సినిమాకి కథ అందించిన కాంచి ఆ చిత్ర కథని కాపీ కొట్టాడని విమర్శలకి గురయ్యాడు. ‘అవర్ హాస్పిటాలిటీ’ అనే ఆంగ్ల మూకీ చిత్రం కథని యథాతథంగా తీసుకొచ్చి ‘మర్యాద రామన్న’కి కథ ఇవ్వడంతో ఆ రహస్యం దాగలేదు. దాని తర్వాత మళ్లీ అతను కథ అందించిన చిత్రమిదే. ఈసారి హిందీలో అక్షయ్‌కుమార్, కత్రినాకైఫ్ నటించిన ‘నమస్తే లండన్’ సినిమా కథని కాస్త అటు ఇటు చేసి ఈ కథ రాసుకున్నాడు. ఒరిజినల్ కథకి తన టచ్ ఇచ్చే ప్రయత్నంలో స్టోరీ గాడి తప్పింది. డైలాగ్ రైటర్‌గాను కాంచి ఫెయిలయ్యాడు. కామెడీ కావాల్సిన ఈ చిత్రం బ్యాడ్ డైలాగ్స్ వల్ల బోర్ కొట్టించింది. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఫార్వర్డ్ మెసేజుల్ని, పొడుపు కథల్ని, కొన్ని పాపులర్ కోట్స్‌ని తన డైలాగ్స్‌గా వాడేసుకున్నాడు.
కీరవాణి సంగీతం సోసోగా సాగింది. ‘ఓ నీలవేణి’, ‘సంపంగి పువ్వు’ పాటలు మినహా మిగతావేమీ ఆకట్టుకోవు. నేపథ్య సంగీతంతో సినిమాకి ఊపిరి పోయాలని ఆయన అయితే ప్రయత్నించారు కానీ సినిమానే హోప్‌లెస్‌గా తయారైంది. సినిమాటోగ్రఫీ ఓకే. దర్శకుడు చంద్రసిద్ధార్థ్ కథాబలం ఉన్న చిత్రాల్ని బాగా నడిపించగలడు. కానీ ఈ సినిమా కథ చాలా వీక్‌గా ఉండడంతో పాటు దానికి రాసుకున్న కథనం కూడా గాడి తప్పడం వల్ల దర్శకుడిగా తనేమీ చేయలేకపోయాడు.
హైలైట్స్:
- చెప్పుకోతగ్గ హైలైట్స్ ఏమీ లేవు
డ్రాబ్యాక్స్:
- ఇవైతే బాగానే డామినేట్ చేసాయి
విశ్లేషణ:
ప్రథమార్థం గోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికాలో సెట్ చేసారు. ఫస్టాఫ్ వరకు నేటివ్ అప్పీల్‌తో ఏదో అలా అలా సాగిపోతుంది. నవ్వించడానికి రచయిత ఎన్నో పాట్లు పడినా హాయిగా నవ్వుకునే సన్నివేశం కానీ, సంభాషణ కానీ లేకుండా సాగిపోయిన సినిమా ఇంటర్వెల్ తర్వాత అయినా వేగం పుంజుకుంటుందని ఆశిస్తే… అంతవరకు అక్కడక్కడే పచ్చిక మేస్తూ తచ్చాడిన గుర్రం, ద్వితీయార్థంలో గోడకి దిగ్గొట్టిన పోస్టర్‌లో గుర్రం మాదిరి అక్కడే బిగుసుకుపోతుంది.
తనకి నచ్చిన వాడిని సెలక్ట్ చేసుకునే వరకు హీరోని తన వెంట ఉంచుకునే సీన్స్‌లో ఎలాంటి డ్రామా పండలేదు. హీరోయిన్ బ్యాడ్ యాక్టింగ్‌కి తోడు సపోర్టింగ్ కాస్ట్ కూడా కలిసి సినిమాని కిచిడీ చేసి వదిలారు. హీరోయిన్‌పై హీరోకి అంతులేని ప్రేమ ఉందనేది అక్కడక్కడా మాటల్లోనే వినిపిస్తుంది తప్ప తెరపై ఎక్కడా కనిపించదు. హీరోయిన్ చివరకు రియలైజ్ అయి తన బావే తనకి సరిజోడి అని రియలైజ్ అవుతుందనేది ప్రిడిక్టబుల్ ఎండింగ్. అలాంటప్పుడు ఆ రియలైజేషన్ పార్ట్‌లోనే డ్రామా బాగా పండాలి.
కానీ అందుకోసం రాసుకున్న సన్నివేశాలు, పరిచయం చేసిన పాత్రలు చాలా వీక్‌గా ఉండడంతో అసలు హీరోయిన్ ఏమి కోరుకుందో, చివరకు ఆమెకి హీరోలో ఏమి కనిపించిందో, ఎందుకు అతడే కావాలని చెప్పిందో అనేదానికి అర్థం లేకుండా పోయి, సినిమానే అర్థం లేకుండా మిగిలిపోయింది. సన్నివేశాల్లో స్టఫ్ లేనప్పుడు ఆ రొటీన్ క్లయిమాక్స్‌ని ఏదో కాస్త ముందుకి లాగి త్వరగా ముగించేస్తే కనీసం ఎక్కువ సేపు వాయించలేదనే పేరైనా దక్కేది. కానీ ఎందుకూ కొరగాని సన్నివేశాలకి తోడు, అవసరం లేని పాటలు పెట్టి కాలయాపన చేసి విసుగుని గుణించారు. ‘ఏమో గుర్రం ఎగరావచ్చు..’ ఈ సినిమా కూడా వర్కవుట్ అయిపోవచ్చు అని అనేసుకున్నారేమో కానీ ఈ గుర్రం ఎగరడం కాదు కదా… కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడింది. హీరో క్యారెక్టర్ పదే పదే తను చేసే పనులు చేయాలా వద్దా అని చేతుల్తో తూకమేస్తూ లెక్క చూసుకుంటూ ఉంటుంది. అలాగే ఈ చిత్ర రూపకర్తలు కూడా తమ సినిమాలో ఎన్ని లోపాలున్నాయో చిత్రం తీయక ముందే తూకమేసి చూసుకుని ఉంటే… తెరమీదకి వచ్చాక తెలుసుకుని చింతించాల్సిన పని తప్పేది.
బోటమ్ లైన్: అమ్మో గుర్రం ఎగిరి తన్నింది!
– జి.కె.