ఈ అక్టోబరు 1 అల్లు రామలింగయ్యగారి శతజయంతి. నిజానికి హాస్యనటుడుగా ఆయన చాలా దూరం ప్రయాణించాడు. ఆయన అంత్యక్రియలు ఏ హాస్యనటుడికీ జరగనంత ఘనంగా జరిగాయి. దానికి ఓ ప్రధాన కారణం, ఆయన సుదీర్ఘమైన ఇన్నింగ్సయితే మరో ముఖ్య కారణం, ఆయన కుటుంబం. ఆయన కుమారుడు అల్లు అరవింద్ మేటి నిర్మాత. మనుమడు అల్లు అర్జున్ యువతరం హీరో. అల్లుడు, అందరికీ తెలుసు, మెగాస్టార్ చిరంజీవి. అంటే ఓ చలనచిత్రకుటుంబానికి పాట్రియార్క్, పెద్దదిక్కు ఆయన. కానీ ఇది ఆయన స్వయంకృషితో నిర్మించుకున్న సామ్రాజ్యం. చెప్పుకోదగ్గ నేపథ్యం ఏమీలేకుండా అష్టకష్టాలు పడి మెట్లుమెట్లుగా శిఖరాన్ని అధిరోహించిన కథ.
ఆయనది పాలకొల్లు. ప్రజానాట్యమండలిలో సభ్యుడు. ఆ విధంగా డా।। రాజారావుగారితో పరిచయం ఏర్పడింది. ఆయన తీసిన ‘‘పుట్టిల్లు’’ సినిమా ద్వారా ఈయన సినీరంగ ప్రవేశం జరిగింది. ఆ సినిమా ఫెయిలయింది. అల్లు పెర్శనాలిటీకి వేషాలు వచ్చి పడలేదు. ఆయన సినిమా సినిమాకు వేషాలు వెతుక్కున్నారు. చిన్నా, చితకా అనేక వేషాలు వేశారు. ‘‘మాయాబజారు’’లోది పెద్ద వేషమే ననాలి. వంగర, యీయన కలిసి కౌరవుల దగ్గిర శర్మ, శాస్త్రి అనే యిద్దరు పురోహితులుగా వేశారు. శకుని వెంట తిరుగుతూ, లక్ష్మణకుమారుణ్ని పొగుడుతూ, మాయాబజారు ఏర్పడ్డాక మగపెళ్లివారమంటూ అడావుడి చేయబోయి, చిన్నమయ్య గాంగ్ చేతిలో అపహాస్యం పాలైన ఆ జంటను ఎప్పటికీ మర్చిపోలేం. ఆ జంటలో శర్మ అల్లు, శాస్త్రి వంగర.
ఇలాటి వేషాల్లో వంగర పెట్టింది పేరు. నిజంగా కూడా ఆయన వేదపండితుడు. బ్రాహ్మణ వేషాలు ఆయనకు కొట్టినపిండి. అంతటి సీనియర్ పక్కన నిలబడడం ఎవరికైనా కష్టమే. కానీ అల్లు నిలబడ్డారు. వంగర పక్కన ఏమాత్రం తేలిపోకుండా బక్క బ్రాహ్మడిలా బ్రహ్మాండంగా నటించారు. డైలాగ్స్ రీత్యా చూస్తే ఇద్దరిలో వంగరకే ఎక్కువ డైలాగులున్నాయి. కానీ అల్లు రియాక్షన్స్ చాలా బాగుంటాయి. డైలాగులు లేకుండా వంతపాడినట్టు నటించడం కష్టమైన పని. కానీ ఆయన ఆ పని చేసి చూపించాడు. ‘అసలు గోంగూరంటే ఏమిటో తెలుసా మీకు!’ అని అదోలా మొహం పెట్టి, ఈ అజ్ఞానులతో ఎలా వేగాలిరా దేవుడా అన్నట్టు చూసే అల్లు మొహం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
ఇక గింబళీ దగ్గిర ఫిజికల్ కామెడీ అయితే చెప్పనే అక్కరలేదు. అల్లు ఒళ్లు ఎలా కావాలంటే అలా వంగింది. కెవి రెడ్డి గారి సొంత సినిమా ‘శ్రీ కృష్ణార్జుయుద్ధం’లో ‘అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామిని’ పాట అభినయిస్తూ ఆయన విన్యాసాలు చాలా బాగుంటాయి. మాయాబజారు ప్రభావమో ఏమో కానీ అల్లుకి వచ్చినవాటిల్లో పురోహితుడి వేషాలు ఎక్కువ. నిజానికి ఆయనకు మంత్రాలు రావుట. స్టేజిమీద సరదాగా ఐటమ్స్ యిచ్చినపుడు ఓ ‘మాక్’ సత్యనారాయణ వ్రతం చేసి చూపించేవాడాయన. ‘అప్పు చేసి పప్పుకూడు’ సినిమాలో అల్లుది షావుకారు పాత్ర. సందేహిస్తూనే సియస్సార్‍కి అప్పు ఇస్తూవుంటాడు. రేలంగి వద్ద నాటకం టిక్కెట్లు కొంటాడు. డబ్బులేదు పోవయ్యా అంటే నస పెడతాడు.
అసలు అల్లువారికి బయట కూడా నస పెట్టడం అలవాటుట. ఓ పట్టాన డైలాగు తెముల్చుకోరుట. ‘రామలింగయ్యగారూ షాట్ రెడీ’ అంటుంటే ‘వచ్చేస్తున్నా’ అంటూనే డైలాగులు చూస్తూ కూచునేవారట. కొత్తరకంగా ఎలా చెప్పాలి అన్న ధ్యాసే ఆయనది. మూసపాత్రల్లో వైవిధ్యం తేవడం ఎలా అన్నదే ఆయన ప్రధాన సమస్య. స్కూలు టీచరు, గుంటనక్క గుమాస్తా, విలన్ దగ్గిర అసిస్టెంట్, ఇందాకా చెప్పిన పౌరోహిత్యం బ్రాహ్మడు, ఇవే కదా ఆయన చేసిన పాత్రల్లో ఎక్కువభాగం! వెరయిటీ కనబరచడం అంటే మాటలా? ‘‘మిస్సమ్మ’’లో స్కూలు టీచరు పాత్రే తీసుకోండి. కొత్త పంతులు, పంతులమ్మ వచ్చాక అతని ఉద్యోగం ఊడుతుంది. అందుకని వాళ్లని ఎలాగైనా ఊస్ట్ చేయించి తన ఉద్యోగం తను మళ్లీ రాబట్టుకుందామని ప్రయత్నం. సినిమా చివర్లో రమణారెడ్డిని వెంటబెట్టుకు వస్తాడు. ఎన్టీయార్, సావిత్రీ భార్యాభర్తలు కారని రమణారెడ్డి అనగానే అల్లుని మొదటి రియాక్షన్ – ‘అమ్మ! మొగుడుపెళ్లాలని ఎంత నాటకం ఆడారు, రండి జమీందారుగారితో చెప్పి వాళ్ల ఉద్యోగం పీకించేద్దాం’ అంటాడు. రమణారెడ్డికి సావిత్రి గోల, ఇతనికి తన ఉద్యోగం గోల! తలచుకున్నప్పుడల్లా నవ్వు వస్తుంది.
డైలాగులు ఓ పట్టాన పట్టుబడక పోవడంతో డైరక్టర్లు గోల పెట్టేవారు. చివరకి తెరమీద ఎఫెక్టు చూస్తే అదిరిపోయేవారు. మళ్లీ అల్లు దగ్గరకి పరుగులు పెట్టేవారు. పి. పుల్లయ్యగారు సినిమా తీసినంత సేపు అల్లుని విమర్శిస్తూ ‘తర్వాతి సినిమాకి నిన్ను ఛస్తే తీసుకోను’ అనేవారు. సినిమా పూర్తయి హిట్టయ్యాక ఇంకో సినిమా మొదలెట్టగానే హీరోని బుక్ చేయడం అయ్యాక నెక్స్‌ట్ బుక్ చేసేది అల్లునే! ఆయన గురించి ఏదో ఒక పాత్రను సృష్టించేవారు. పుల్లయ్యగారి ‘‘ప్రేమించిచూడు’’ సినిమాలో రేలంగి వెంటబడి ‘బావా’ ‘బావా’ అంటూ పిలుస్తూంటాడు. గుమాస్తా చేత అలా పిలిపించుకోవడం రేలంగికి ఒంటికి కారం రాసుకున్నట్టుంటుంది. రేలంగి తర్వాత పద్మశ్రీ పొందిన తెలుగు హాస్యనటుడు అల్లు. ఆ తర్వాత చాలా రోజులకు బ్రహ్మానందానికి వచ్చింది.
అల్లుకి పాట పాడడం వచ్చు. సరదాగా స్టేజీ మీద కూడా పాటలు పాడేవారు. చిన్నపుడు బుర్రకథలు, జానపద గీతాలు పాడేవారు. వ్యక్తిగతంగా ఆయనకు జాషువాగారి పద్యాలు చాలా యిష్టం. స్నేహితుల మధ్య పాడి వినిపిస్తూండేవారు. భావం ఎరిగి ఫీలవుతూ పాడేవారు. ఆయనకు జనంలో కలిసి తిరగడం చాలా యిష్టం. ప్రజాసమస్యల పట్ల మంచి అవగాహన వుంది. ప్రజానాట్యమండలి సభ్యుడని చెప్పాను కదా, వామపక్ష భావాలు ఉండేవి. నేను మద్రాసులో వుండగా పాండీ బజారులోని ‘‘రాణి బుక్ స్టాల్’’ అనే పుస్తకాల షాపుకి వెళ్లేవాణ్ని. అక్కడకు ఆయన సాయంత్రం వస్తూండేవారు. ఏపాటి భేషజం లేకుండా అందరితో కబుర్లు చెప్పేవారు. రాజకీయాల గురించి ఆవేశంగానే మాట్లాడేవారు. ఆయన కమ్యూనిస్టు పార్టీ వాలంటీరుగా పనిచేసిన రోజుల గురించి చెప్పేవారు. ఆయనది మంచి అబ్జర్వేషన్. రైల్లో ముష్టివాళ్ల పాటలు, బయట అడుక్కునేవాళ్ల పాటలు పట్టుకుని వాటికి తన చమత్కారం పూసి పారడీ చేస్తూ పాడేవారు.
కె.విశ్వనాథ్‍గారు తన సినిమాల్లో అల్లుకి చిరస్మరణీయమైన పాత్రలు యిచ్చారు. ‘సీతామాలక్ష్మి’, ‘శంకరాభరణం’ ‘సప్తపది’ . ఒకటా? రెండా? శంకరాభరణంలో మధ్వ బ్రాహ్మణ లాయర్‍గా ఆయనది మార్వలెస్ పాత్ర. అల్లు తన మూసపాత్రలను కొత్తగా ఎలా ప్రెజెంటు చేయాలా అని చూసేవారని చెప్పాను కదా, ‘‘బుద్ధిమంతుడు’’ సినిమాలో లంచం బదులు ‘అమ్యామ్యా’ అన్న మాట కాయిన్ చేసింది ఆయనే! అది సంభాషణా రచయిత అయిన ముళ్లపూడి వారి ఎక్కవుంటులో పడిపోయినా ఆ పదసృష్టికర్త అల్లువారే! అది మన జాతీయపదాల నిఘంటువులోకి ఎక్కిపోయేటంత పాప్యులరయిన పదం! పి.పుల్లయ్య, విశ్వనాథ్‍గార్ల లాగే బాపు-రమణలకు కూడా అల్లు అంటే ఫాసినేషన్. వాళ్ల తొలి సినిమాల్లోనూ, పౌరాణిక సినిమాల్లోనూ అల్లు లేకపోయినా, ‘బుద్ధిమంతుడు’ నుండి చాలా సాంఘిక సినిమాల్లో ఉన్నారు. ‘‘మంత్రిగారి వియ్యంకుడు’’లో చిరంజీవిలాటి స్టార్ ఉన్నా సినిమా టైటిల్ ఆయన పేర మీద పెట్టలేదు. అల్లు పేర పెట్టారు.
‘‘బుద్ధిమంతుడు’’ సినిమాలో ఆయన విలన్ నాగభూషణం వద్ద గుమాస్తా. అనేక సినిమాల్లో ముఖ్య విలన్ నాగభూషణమైతే పక్కన అర్భకుడు, కుయుక్తిపరుడుగా అల్లు, మొరటుగా ఉండే మరో చిన్న విలన్ ఉండేవారు. ఈ త్రయం ప్రతీ సినిమాలోనే తప్పనిసరి. కొన్నాళ్లకు నాగభూషణం స్థానంలో రావు గోపాలరావు వచ్చారు కానీ అల్లు స్థానం మాత్రం వేరెవరూ తీసుకోలేక పోయారు. రాఘవేంద్రరావుగారి సినిమాల్లో కూడా కంటిన్యూ అయిపోయారు అల్లు. ‘‘ముత్యాలముగ్గు’’ రావు గోపాలరావుతో చేతులు కలిపి ఎస్టేటును దోచుకుంటాడు. చివరిలో కోతి పిచ్చి పట్టుకుంటుంది. అసలా కోతిపిచ్చి ఐడియా కన్సీవ్ చేయడం రమణగారి గొప్పయితే దాన్ని సుపర్బ్‌గా యాక్ట్ చేయడం అల్లుగారి గొప్ప. ఆయన అచ్చు కోతిలాగే చేతులు ముడుచుకోవడం, చూడడం, తినడం – మర్చిపోలేని పాత్ర! కానీ అల్లు మార్కు టాప్‍క్లాసు హ్యూమర్ పండినది, ‘‘అందాల రాముడు’’లో వేసిన ‘తీతా’. ఆ సమయంలో ఆయన కొడుకు పోయినా దుఃఖం మర్చిపోవడానికి షూటింగుకి వచ్చేశారు.
అల్లు మధ్యాహ్నం నిద్ర వదులుకునేవారు కారు. భోజనం కాగానే షాట్ పెడితే ఒప్పుకునేవారు కారు. పావుగంటయినా పడుక్కోపోతే ఫ్రెష్‍నెస్ రాదు అనేవారు. ‘డైలాగులు పట్టుబడవు. మీకు ఫిల్ము, టైము వేస్టవుతాయి.’ అని వాదించి ఓ దిండు తీసుకుని ఓ మూల పడుక్కునేవారు. ఒక్కోప్పుడు అవుట్‌డోర్ షూటింగుల్లో ఆయన అలా చెట్టునీడ నిద్రపోతూ వుంటే యూనిట్ వాళ్లు మర్చిపోయి వెళ్లిపోయిన సందర్భాలు కూడా వున్నాయని రావి కొండలరావు గారు రాశారు.
అల్లు వారికి ప్రాక్టికల్ జోక్స్ మహా యిష్టం. సాధారణంగా యాక్టర్లు రైల్లో వెళ్లేటప్పుడు కిటికీ తలుపులు మూసేస్తారు, అభిమానులు పట్టుకుంటారని. కానీ అల్లు తలుపులు తెరవడమే కాదు, ప్లాట్‍ఫాం పైకి దిగిపోయేవారు. జనం మధ్య వుండడమే ఆయనకు సరదా. ఓ సారి నెల్లూరు స్టేషన్లో అలాగే దిగి జనం చుట్టుముట్టాక కింద వెతుక్కోవడం మొదలెట్టారు అల్లు. ఏమైందని అడిగితే ‘పర్సు పడిపోయింది’ అన్నారు. వాళ్లూ వెతక నారంభించారు. ఇంతలో రైలు కదిలింది. ‘పోన్లెండి, వస్తా’ అని రైలెక్కేశారు అల్లు. పక్కనున్న యాక్టర్ అడిగారు ‘ఎంత పోయిందేమిటి?’ అని. ‘ఊరికే సరదాకి. పర్సూ లేదు, ఏం లేదు. కొంతసేపు వెతుకుతారు. తర్వాత నన్ను తిట్టుకుంటారు. తిట్లూ దీవెనలూ రెండూ తగలాలి ఆర్టిస్టుకి’ అంటూ నవ్వారట అల్లు.
రామలింగయ్యగారు హోమియో వైద్యం చేసేవారు. ఓ హోమియో మాత్రల పెట్టె ఎప్పుడూ ఆయన పక్కనే వుండేది. ఆయన కోసం కాదు, ఎవరికైనా బాగా లేదంటే వెంటనే మందు వేసేవారు. హోమియో డాక్టరు కావడం వల్లనే డాక్టర్ అల్లు రామలింగయ్య అయ్యారు. హోమియో వైద్యం మీద ఆయనకు ఎంత ప్రీతి అంటే రాజమండ్రిలో ఓ హోమియో కళాశాలకు విరాళం యిచ్చారు. ఆ కాలేజీకి ఆయన పేరే పెట్టారు. అది ఇప్పటికీ నడుస్తోంది. ఓ సారి ఆయన విజయచిత్రలో రాసుకున్నారు. చిన్న చిన్న వేషాలు వేసుకునే రోజుల్లో ఆయనకు కారు మీద మోజు ఉండేదట. కష్టపడి అప్పు తీసుకుని ఓ సెకండ్‍హేండ్ కారు కొన్నారట. అది ఓ పట్టాన నడిచేది కాదుట. ఓ రోజు యాక్సిడెంటు కూడా చేసింది. రిపేరు తడిసిమోపెడయింది. చివరికి కారు అమ్మేసి సైకిలు మీదనే తిరిగేవారట. మరి అప్పు తీర్చడం ఎలా? దానికి హోమియో వైద్యం అక్కరకు వచ్చింది. అప్పిచ్చినవాడి యింట్లోనూ, వాళ్ల బంధువులింట్లోనూ కొన్నేళ్లపాటు హోమియో వైద్యం చేసి ఋణవిముక్తులయ్యారట.
రామలింగయ్యగారి స్టామినా గొప్పది. ‘మనవూరి పాండవులు’ సినిమాలో చూడండి. పాండవులు పాండవులు తుమ్మెదా పాటలో ఆ ఐదుగురూ ఆయన ఒళ్లు ఎంత హూనం చేసేస్తారో గుర్తు తెచ్చుకోండి. అందులో అల్లుది రావుగోపాలరావు పక్కన గుంటనక్క పాత్ర. పేరు కన్నప్ప. ఊతపదం కనక్షన్. ఈ పాటలో ‘మోసెయ్ మోసెయ్ తుమ్మెదా, కనక్సను తీసెయ్ తీసెయ్ తుమ్మెదా’ అంటూ పాండవుల్లో నలుగురు అల్లును భుజాల మీద మోసి, కింద పడేసి, కుమ్మేసి చంపుకు తింటారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అల్లు వాయిస్‍ను చాలా బాగా ఇమిటేట్ చేసి పాడారు. అందులోనే కాదు, ఎన్నో సినిమాల్లో ఆయన్ని మిమిక్రీ చేశారు. అల్లు తెరపై పాటలు పాడడమే కాదు, డాన్సులు చేశారు కూడా. బాగా పెద్దవారయిపోయాక కూడా ఓ సినిమాలో రంగు రంగు పాంట్లు వేసుకుని డాన్సు చేశారు. ఈ వజ్ ఏ స్పోర్ట్ ఫర్ ఎవిరీథింగ్! చివరిదాకా జీవితంమీద ఆశాభావంతోనే వున్నారు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు. అవస్థ పడకుండా, అవస్థ పెట్టకుండా పోయారు.
అల్లు అభివృద్ధికి కారణం, ఆయన నిర్మాతగా మారడం. గీతా ఆర్ట్స్ స్థాపించి ముందులో చిన్న సైజు సినిమాలు తీసేవారు. ‘‘బంట్రోతు భార్య’’, ‘‘దేవుడే దిగివస్తే’’ ఇలాటి రీమేక్స్‌తో ప్రారంభించారు. తన సినిమా కదాని తనే ముఖ్యపాత్ర వేసేసే పిచ్చిపనులు చేయలేదు. ‘‘దేవుడే దిగివస్తే’’ సినిమాకు ఆధారం ఓ తమిళ డ్రామా నుంచి సినిమాగా మారిన ‘‘కలియుగ కణ్నన్’’. దానిలో ముఖ్యపాత్రధారి తమిళ హాస్యనటుడు తేంగాయ్ శ్రీనివాసన్. అంటే పెర్శనాలిటీ అదీ ఉంటుందనుకోండి. మరీ అల్లులా చిన్న పెర్శనాలిటీ కాదు. ఆ సినిమాను తెలుగులో తీస్తూ అల్లు ఆ పాత్ర సత్యనారాయణ గారికి యిచ్చారు. తను అతని వియ్యంకుడి పాత్ర, విలన్ లాటిది, అది తీసుకున్నారు.
అల్లు కుమారుడు అరవింద్ చిత్రనిర్మాణంలో ఆరితేరారు. క్రమంగా పెద్ద నిర్మాతగా ఎదిగిపోయారు. చిరంజీవితో బంధుత్వం కలవడంతో ఇక ఆ జంటకు ఎదురు లేకపోయింది. ఇప్పుడు అరవింద్ కుమారుడు అర్జున్ కూడా పెద్ద హీరో, పాన్ ఇండియా హీరో అయ్యారు. అల్లు వారసత్వం చిత్రసీమలో నిరాఘంటంగా సాగిపోతోంది. అందుకే ఆయన శతజయంతి ఘనంగా జరిగింది. ఆయనపై పుస్తకం కూడా విడుదలైంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2022)