‘‘రాష్ట్రంలో ఉన్న మొత్తం పార్లమెంటు స్థానాలలో తమ పార్టీని గెలిపించండి.. కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి కావలసిన పథకాలను, నిధులను వీర బీభత్స స్థాయిలో తీసుకువస్తాం’’ అని ప్రాంతీయ పార్టీలు, ఎన్నికలవేళ ప్రకటనలు గుప్పించడం చాలా మామూలు సంగతి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఇదే తరహాలో 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీసుకువస్తానని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా 16 ఎంపీ సీట్లు ఇచ్చినట్లయితే కేంద్రం మెడలు వంచుతామని పలు సందర్భాలలో అన్నారు.
కానీ గత రెండు దఫాలుగా కేంద్రంలోని మోడీ సర్కారు 16, 25 వంటి పరిమిత సంఖ్యలతో అవసరం ఉండని సంపూర్ణ మెజారిటీ గల ప్రభుత్వంగానే ఏర్పడింది! వీరితో వారికి అవసరం లేకుండా పోయింది! అందుకే వీరు మిన్నకుంటున్నారు! అయితే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 16 చాలవు అనే ఉద్దేశంతో సరికొత్త రాజకీయానికి ప్రయత్నిస్తున్నారు!
తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. హైదరాబాద్ సీటు మీద కేసీఆర్ కు ఎలాంటి కోరిక లేదు. అప్రకటితంగా ఆయన దానిని అక్బరుద్దీన్ ఓవైసీకి రాసి ఇచ్చేశారు. అక్కడ గులాబీపోటీ నామమాత్రంగా జరుగుతుంటుంది. దానికి ప్రతిగా ముస్లిం ప్రాబల్యం ఉన్న అనేక ఇతర నియోజకవర్గాలలో ఎంఐఎం మద్దతును కేసీఆర్ పొందుతుంటారు. కనుక తెలంగాణలో సాధించడానికి మిగిలింది కేవలం 16 సీట్లు మాత్రమే.
ఈ లెక్కన శక్తి యుక్తులు అన్నీ ఖర్చు చేసి నూటికి నూరు శాతం ఫలితాలను సాధించి.. మొత్తం 16 లో గెలిచినా కూడా తాను కలగంటున్న ప్రధాని సీటును అందుకోవడానికి అది చాలదు.. అనే సత్యాన్ని కెసిఆర్ గ్రహించారు. అందుకే జాతీయ పార్టీ ప్రయత్నం అన్నది స్పష్టం.
తిమ్మిని బమ్మిని చేసి 30కి పైగా ఎంపీ స్థానాలు సొంతంగా తన ఖాతాలో ఉండేలాగా చక్రం తిప్పితే కేంద్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించవచ్చు అనేది కెసిఆర్ తాజా ఆశ. ఎందుకంటే ప్రధాని పదవికి రేసులో ఉండే ఇతర పార్టీల కీలక నాయకులు నితీష్ కుమార్, మమతా బెనర్జీ తదితరుల రాష్ట్రాల్లో సంఖ్యాపరంగా ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్నాయి. పోల్చి చూస్తే తెలంగాణలో సీట్ల సంఖ్య తక్కువ. దాదాపు 300 మంది ఎంపీల బలం అవసరం కాగల కేంద్ర ప్రభుత్వానికి, 16 సీట్ల రాష్ట్రం నుంచి తనను నాయకుడిని చేయమంటే.. ఆ ప్రతిపాదన ఎలా వర్కౌట్ అవుతుంది? కాదు! అనే క్లారిటీ ఉన్నది కనుకనే కెసిఆర్ ఇప్పుడు జాతీయ పార్టీ కోసం తపన పడటం.
ఇతర రాష్ట్రాలలో ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు కెసిఆర్ కు ఆశ పుట్టిస్తుండవచ్చు గాక.. కానీ మోడీ వ్యతిరేకులు అందరికీ కూడా ఆశలు ముస్లిముల మీదనే ఉంటాయి! అలాంటప్పుడు ఆ ఓటు బ్యాంకును చీల్చడం మినహా కేసీఆర్ చేయగలిగేది ఏముంటుంది? అనేది ఒక చర్చ. అటువంటి నష్టం విపక్ష నేతలకు జరగకుండా ఉండాలంటే ఎన్నికలకు ముందే పొత్తులు కుదరాలి. కానీ ఎన్నికలకు ముందు పొత్తుల వలన తాను ఆశిస్తున్న ప్రయోజనం నెరవేరదని ఇతర ప్రాంతాలలో కూడా సీట్లు గెలవగలిగితే ఎన్నికల తర్వాత మాత్రమే తన ప్రతిపాదనకు మన్నన దక్కుతుందని కేసీఆర్ ఆలోచన.
మరి అలాంటప్పుడు ఈ జాతీయ పార్టీ అడుగులు ఎలా పడతాయో? ఇతర రాష్ట్రాలలో విజయాలు నమోదు చేయడం ఎలా సాధ్యమో? చూడాలి! ఉర్దూలో, హిందీలో కూడా అనర్గళంగా మాట్లాడుతూ.. మోడీని విమర్శించడంలో జనరంజక ప్రసంగాలు చేయగలిగిన కేసీఆర్.. వాటితో ఇతర రాష్ట్రాల్లో అక్కడి విపక్షాలకు ఉపయోగపడగలరు అనడం తథ్యం! అదే సమయంలో కేవలం ఆ ప్రసంగాలతో ఇతర రాష్ట్రాలలో కూడా, తన పార్టీకి సీట్లు గెలుస్తారా అంటేనే కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి! అది తెలుసుకోవడానికే ఆయన ఈ కసరత్తు చేస్తున్నారు! మొత్తానికి ప్రధాని పదవిని టార్గెట్ చేశారు.. వస్తే సరే, రాకపోతే ఆయనకు పోయేదేముంది!