అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు యింకా పూర్తిగా వెలువడలేదు. కొన్ని గంటల తర్వాత వెలువడినా అది న్యాయవివాదంగా మారడం తథ్యం. ఓడిపోయినవాళ్లు కోర్టుకి వెళ్లడం, వాదోపవాదాలు జరగడం, వాళ్లు తీర్పు వెలువరించేసరికి కొన్ని వారాలు పడతాయని సులభంగా వూహించవచ్చు.
బైడెన్ గెలవడం ఖాయమని అనిపిస్తోంది – మనకే కాదు, ట్రంప్‌కు కూడా! అందుకే పేచీలు మొదలుపెట్టాడు. కొన్ని రాష్ట్రాలు పోస్టలు ఓట్లను ముందుగానే లెక్కిస్తానంటే కూడదన్నాడు. ఇప్పుడు పోలింగు టైము అయిపోయింది కాబట్టి, వాటిని లెక్కించకూడదంటున్నాడు. కొన్ని రాష్ట్రాలలో లెక్కించాలట, కొన్నిటిలో లెక్కించకూడదట. విధానపరమైన మార్పులేమైనా చేయాలంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే చేయాలి తప్ప, మధ్యలోకి వచ్చాక చేస్తానంటే కుదరదు.
కరోనా అంటే ట్రంప్‌కు, అతని ముఠాకు భయం లేదు కానీ, మామూలు మనుష్యులందరూ జాగ్రత్తగానే వుంటున్నారు. అందుకే ఎన్నడూ లేనంతగా, దాదాపు 10 కోట్ల మంది, పోలింగు రోజు గుమిగూడకుండా, ఎర్లీ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇది 2016లో పోలయిన మొత్తం ఓట్లలో 69 శాతంట. ఇక పోస్టల్ ఓటు హక్కును కూడా చాలామందే ఉపయోగించుకున్నారు.
వీరి ఓట్లను లెక్కించకూడదని అనడమంటే, వారి ప్రజాస్వామిక హక్కును హరించడమే. సాక్షాత్తూ అధ్యక్షుడే అలా అనడం ఘోరం కాక మరేమిటి? కావాలంటే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, మళ్లీ లెక్కించాలని అడగవచ్చు. పోలింగు బూతులపై దాడులు జరిపి బాక్సులు ఎత్తుకుపోయారని, యంత్రాలను పాడుచేశారని రుజువులు చూపగలిగితే, రీపోలింగు అడగవచ్చు. అంతేకానీ ఫలానావాళ్ల ఓట్లు లెక్కలోకి తీసుకోకూడదని అనడం అన్యాయం కదా!
అమెరికన్ విధానంలో పాప్యులర్ ఓటులో ఎక్కువ ఓట్లు వచ్చినా, ఎలక్టొరల్ కాలేజీలో ఎక్కువ ఓట్లు వచ్చినవారే నెగ్గుతారు. ఈ నియమం ప్రకారమే ట్రంప్ క్రితంసారి నెగ్గాడు, హిల్లరీ క్లింటన్‌కు సంఖ్యాపరంగా ఎక్కువ ఓట్లు వచ్చినా! ఈసారి ట్రంప్‌కు పాప్యులర్ ఓట్లు ఎక్కువ వచ్చి (ఆ సూచనలేమీ కనబడటం లేదనుకోండి), బైడెన్‌కు ఎలక్టొరల్ కాలేజీలో ఎక్కువ ఓట్లు వచ్చాయనుకోండి అప్పుడు కూడా ట్రంప్ తగాదా పెట్టుకునేవాడు – పాప్యులర్ ఓట్లే లెక్కలోకి తీసుకోవాలని! అలాటి మొండిఘటం అతను.
తను ఎలాగైనా అధ్యక్షుడిగా కొనసాగదలచుకున్నాడు. అది సాగడానికి ఎన్ని నియమాలైనా మార్చేయాలని పంతం పడుతున్నాడు. ‘చెప్పి కొట్టాడనన్నట్లు’ ఇలా ప్రవర్తిస్తానని పాపం మొదట్నుంచి చెప్పాడు – హరి గిరిమీద పడ్డా, గిరి హరిమీద పడ్డా నేనే మళ్లీ అధ్యక్షుణ్ని అవుతాను. లేకపోతే ఊరుకోను సుమా అని ప్రజలను హెచ్చరించాడు కూడా.
సరే, యిలాటి ప్రలాపాలు ట్రంప్‌కు కొత్తేమీ కాదులే, కానీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక ఎన్నో తరాలుగా నెలకొన్న విధానాలను అనుసరించక ఏం చేస్తాడులే అనుకున్నాం. కానీ ఏమౌతోంది? అతను తన మద్దతుదారులను రెచ్చగొట్టాడు. వాళ్లు ఆయుధాలు పట్టుకుని వీధుల్లో వీరవిహారం చేస్తున్నారు. పోలీసులతో తలపడుతున్నారు. ఓట్లు లెక్కించే సెంటర్లపై దాడులు చేస్తున్నారు.
ఇలాటిది అమెరికాలో జరుగుతుందని ఎన్నడైనా ఊహించామా? మేం నెగ్గితీరాలి, లేకపోతే కౌంటింగు జరగనియ్యం అని ప్రజలు బాహాటంగా ప్రదర్శనలు చేయడం ప్రజాస్వామ్య లక్షణమా? ఇదేనా అమెరికా గర్వంగా చెప్పుకునే హక్కుల పరిరక్షణ? నల్లవాళ్లకే కాదు, బైడెన్‌కు ఓటేసిన తెల్లవాళ్ల ఓటింగు హక్కులకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నమాట! అమెరికా రాజకీయవాతావరణం నవ్వులపాలైన యీ ఘట్టం అమెరికా కర్మఫలం. ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన చేష్టల ఫలితం బూమెరాంగ్ అయి వారినే కొడుతోంది.
అమెరికా తమది ప్రజాస్వామ్య దేశమని, ప్రపంచ పోలీసులా వ్యవహరిస్తూ, ఏ దేశంలో ప్రజాస్వామ్యానికి భంగం కలిగినా వెంటనే జోక్యం చేసుకుని, దాన్ని సరిదిద్దుతూ లోకం మొత్తంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు కృషి చేస్తున్నానని చెప్పుకుంటూ వచ్చింది. దాని దృష్టిలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేది కమ్యూనిజమొక్కటే.
కమ్యూనిజమే కాదు, ఆ వాసనలున్న సోషలిజం, వామపక్షవాదం, పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకించడం, కార్మికులకు వత్తాసు పలకడం – యివన్నీ కూడా దాని దృష్టిలో కమ్యూనిజాలే. బైడెన్ డెమోక్రాట్. కార్మికుల వైపు కాస్త మొగ్గుతాడంతే. ఆ మాత్రానికే ట్రంప్ దృష్టిలో కమ్యూనిస్టు అయిపోయాడు. సాధారణ అమెరికన్ దృష్టికోణం అలా వుంటుంది. ‘అందరికీ సమానావకాశాలు’ వంటి మాటలు మాట్లాడితే చాలు కమ్యూనిస్టు ముద్ర కొట్టేస్తారు.
సాటి దేశస్తుడినే అలా అంటున్నారంటే, యితర దేశాలలో వున్న రాజకీయనాయకులను వీళ్లు ఎలా బ్రాండ్ చేస్తారో ఊహించుకోవచ్చు. రష్యా, దాని అధీనంలో కొంతకాలం వున్న తూర్పు యూరోప్ దేశాలు, చైనా, ఉత్తర కొరియా, ఉత్తర వియత్నాం వంటివి కమ్యూనిస్టు బ్లాక్‌గా పేరుపొందాయి. వాటితో కఠినంగా వ్యవహరించారంటే పోనీలే అనుకోవచ్చు.
కానీ దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మధ్య ఏసియా.. యిలా ఎక్కడైనా సరే, ఎవరైనా పాలకుడు ప్రజాహిత కార్యక్రమాలు తలపెట్టాడంటే చాలు, వాడు అమెరికా దృష్టిలో కమ్యూనిస్టే, ప్రజాస్వామ్య విరోధే. వాణ్ని గద్దె దింపాల్సిందే. దిగనంటే చంపేయాల్సిందే. ఆ దేశపు సైన్యాధిపతిని ఎగదోసి, వాడి చేత ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన ఆ పాలకుణ్ని ఖైదు చేయించి లేదా హత్య చేయించి, అక్కడ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాల్సిందే!
అలా అధికారంలోకి వచ్చిన సైనిక నియంత ప్రజాస్వామ్యాన్ని కాలరాసినా, ఏళ్ల తరబడి ఎన్నికలు జరపకపోయినా, జీవితాంతం తనే పాలకుడనని ప్రకటించుకున్నా, నిరసనలు నిర్దాక్షిణ్యంగా అణచివేసినా అమెరికా పట్టించుకోదు. మతం పేర అధికారం చెలాయించినా, ప్రజలను జైళ్లలో కుక్కినా ఏమీ అనదు, పైగా నిధులు, ఆయుధాలను యిచ్చి ప్రోత్సహిస్తుంది కూడా. తన విధానాలతో ఏకీభవించని పలువురు యితర దేశ నాయకులను సిఐఏ ద్వారా చంపించింది. వారి జాబితా రాయబోతే ఒక పేజీ చాలదు.
ఇదంతా అమెరికాపై ద్వేషంతో రాస్తున్నది కాదు. సాల్వడార్ ఎలెండీ గురించి రాస్తే మీకు తెలియకపోవచ్చు. బాగా తెలిసిన ఒకటి రెండు ఉదాహరణలు యిస్తే మీకే అర్థమౌతుంది. ఇప్పుడు సౌదీ అరేబియా వుంది. అక్కడ ప్రజాస్వామ్యం వుందా? ఇండియా దగ్గరకు వచ్చేసరికి ‘మీ దేశంలో మానవహక్కులు కాపాడబడటం లేదు, బాలల చేత పనిచేయిస్తున్నారు, అందుకని మీ వస్తువులు కొనం.’ లాటి లక్ష షరతులు పెడతారు. మరి సౌదీలో యివన్నీ కాపాడేస్తున్నారా? అయినా అమెరికా వాళ్లకు అన్ని విధాలా సహాయ పడుతుందెందుకు?
నాలుగేళ్ల క్రితం ఫిడెల్ కాస్త్రో చనిపోయినప్పుడు వచ్చిన కథనాలు చదివే వుంటారు. అతను క్యూబాలో వామపక్ష ప్రభుత్వాన్ని స్థాపించాడు. అంతే కదా, హత్తెరీ మా పెరట్లో వుంటూ రష్యాతో సఖ్యంగా వుంటావా? అంటూ ఆ దేశంపై ఎన్నిసార్లు దండెత్తారో, ఎన్నిసార్లు అతన్ని చంపించడానికి చూశారో చదివి వుంటారు.
కాస్త్రో అమెరికాపై దండెత్తాడా? మీ దేశం కూడా లెఫ్టిస్టు కావాలని అన్నాడా? అతని మానాన అతన్ని బతకనిచ్చారా? దక్షిణ అమెరికాలోని దేశాలన్నిటిలో అమెరికా జోక్యం చేసుకుంటూనే వుంది. ప్రభుత్వాలను పడగొడుతూ, నిలబెడుతూనే వుంది. తన పని తను చూసుకుంటే చాలదా? అమెరికాకు చాలదు.
ఇక బంగ్లాదేశ్ ఆవిర్భావ సమయంలో జరిగింది గుర్తు చేసుకోండి. 1947లో ఆవిర్భవించిన పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ (పంజాబీ, సింధీ, ఫష్తూన్ వంటి జాతులతో కూడినది), తూర్పు పాకిస్తాన్ (బెంగాలీ)గా వుండేది. జనాభా రీత్యా తూర్పు పాకిస్తాన్ పెద్దది. అయినా ఆదాయంలో సింహభాగం పశ్చిమ పాకిస్తాన్ వారే తీసుకునేవారు. వాళ్లే అధ్యక్షులుగా వుంటూ, రాజకీయ అధికారాలన్నీ వారి చేతిలోనే పెట్టుకునేవారు.
తూర్పు పాకిస్తాన్ వాళ్లవరైనా ప్రధానమంత్రి అయితే వాళ్లను దింపేసేవారు. ఇదంతా తూర్పు పాకిస్తాన్‌కు మంటగా వుండేది. సైన్యంలో 5 శాతం మందే బెంగాలీలే ఉండేవారు. సైనిక నియంతలైన ఆయూబ్ ఖాన్ (పదవీకాలం 1958-69), యాహ్యా ఖాన్ (1969-1971)ల హయాంలో యీ వివక్షత మరీ ఎక్కువైంది.
1970లో 313 స్థానాలున్న పార్లమెంటుకు ఎన్నికలు జరిగితే 160 స్థానాలు తూర్పు పాకిస్తాన్‌కు చెందిన ముజిబిర్ రహమాన్‌కు దక్కాయి. అతన్నే ప్రధానిని చేయాలి. కానీ 81 స్థానాలు గెలుచుకున్న పశ్చిమ పాకిస్తానీ సింధీ భుట్టో తనే ప్రధాని అవుతానన్నాడు.
యాహ్యా ఖాన్ మద్దతుతో అతను ప్రజాస్వామ్యవిరుద్ధంగా ప్రవర్తిస్తూ వుంటే దానిని అనుక్షణం తను కనుసన్నల్లో వుంచుకుని కాపాడుతూ వస్తున్న అమెరికా ఏం చేయాలి? ముజిబుర్‌కు మద్దతివ్వాలి కదా! లేదు. అతన్ని జైల్లో పెట్టి, తూర్పు పాకిస్తాన్‌పై జాతిహననం కావించిన సైనిక నియంత యాహ్యా ఖాన్‌కు మద్దతిచ్చింది. జోర్డాన్, ఇరాన్‌ల ద్వారా వారికి ఆయుధాలు సరఫరా చేసింది.
అభాగ్యులైన తూర్పు పాకిస్తానీయులకు అండగా నిలిచి, వారి స్వాతంత్ర్యపోరాటానికి మద్దతు నిచ్చిన ఇండియాపై దండెత్తడానికి యుఎస్‌ఎస్ ఎంటర్‌ప్రైజ్ అనే యుద్ధనౌకను బంగాళాఖాతానికి పంపింది. ఆనాడు ఇండియాకు మద్దతుగా రష్యా అణ్వాయుధాలతో నిండిన రెండు నౌకలను పంపింది కాబట్టి, అమెరికా దడిసి ఆగింది కానీ లేకపోతే ఇండియాపై దండెత్తేది.
ఇదీ అమెరికా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే తీరు! ప్రజాస్వామ్యయుతంగా నియమానుసారంగా ఎన్నికలు జరిగే ఇండియాపై దండెత్తడం, ప్రజాస్వామ్య హక్కులు కాలరాసిన పాక్ సైనిక నియంతను కాపాడడం! ఇక్కడే కాదు, కంబోడియా (నేటి కంపూచియా)లో పోల్ పాట్ అనే కమ్యూనిస్టు నియంత దేశజనాభాలో నాల్గో వంతు మందిని చంపించేశాడు.
అతనికి ఐరాసలో సభ్యత్వం లేకుండా చేద్దామని జపాన్ ప్రతిపాదిస్తే, వియత్నాంకు అతను విరోధి అనే ఏకైక కారణం చూపి అమెరికా అతనికి అండగా నిలబడింది. అతను జరిపిన మారణకాండకు ఆయుధాలు సరఫరా చేసిందన్న వార్తలు కూడా వున్నాయి.
మధ్యయుగాల్లో యూరోపియన్ దేశాలు యితర దేశాలకు వెళ్లి వాటిని వలసప్రాంతాలుగా మార్చుకున్నాయి. అమెరికా అవతరించి, నిలదొక్కుకునేనాటికి ఏవీ మిగల్లేదు. రెండవ ప్రపంచయుద్ధంలో దెబ్బ తిన్న యూరోప్ దేశాలు బుద్ధి తెచ్చుకుని, క్రమేపీ విత్‌డ్రా అయిపోసాగాయి. అప్పుడు అమెరికా సామ్రాజ్యవాదదేశంగా మారింది.
పాతకాలపు వలస ప్రభుత్వాలు కాకుండా కీలుబొమ్మ ప్రభుత్వాల ద్వారా ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూడసాగింది. ఏ దేశంలోనైనా సరే తమ భావాలకు విరుద్ధమైన భావాలున్న వారు నెగ్గుతారన్న అవకాశం వుందంటే చాలు, తన చెప్పుచేతల్లో వుండే సంస్థల ద్వారా అబ్జర్వర్స్ రూపంలో అక్కడ అవతరించడం, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనడం, ఎన్నిక చెల్లనేరదంటూ కిరాయి ఆందోళనలు జరిపించడం చేస్తూ వచ్చింది.
తమకు కావలసినవాడైతే రిగ్గింగ్ చేసినా, ఎన్నికలు బహు భేషుగ్గా జరిగాయంటూ సర్టిఫికెట్లు యిస్తుంది. అనేక దేశాల తమకు అనుకూల విధానాలు అవలంబించేవారు ఎన్నికలలో నిలబడినప్పుడు వారికి సిఐఏ ద్వారా నిధులందించింది. ‘‘ద ప్రైస్ ఆఫ్ పవర్’’ అనే పుస్తకంలో సేమూర్ హెర్ష్ అనే జర్నలిస్టు అలా నిధులందుకున్న దేశదేశాల నాయకుల గురించి రాశాడు. వారిలో మొరార్జీ దేశాయి కూడా వున్నారని అతను పొరపాటుగా రాయడంతో మన దేశంలో వివాదం చెలరేగింది. మొరార్జీ హెర్ష్‌పై కేసు వేసి, ఆ ఆరోపణ తప్పని నిరూపించుకున్నారు.
ఇలా ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని, తనకు అనుకూలమైన రీతిలో లేని పక్షంలో, ఎక్కడున్నా నాశనం చేస్తూ వచ్చి అరాచకం సృష్టించిన అమెరికాకు యిప్పుడు అది బ్యాక్‌ఫయర్ అయింది. పక్కవాడికి చేతబడి చేస్తే వెనక్కి తన్ని మనకే పళ్లు రాలాయి అన్నట్లు! అక్కడి ఎన్నికలే వివాదాస్పద మయ్యాయి.
‘‘ఒక్కడు’’ సినిమాలో తెలంగాణ శకుంతలకు పెంపుడు కుక్క వుంటుంది. ఏదైనా వస్తువుని విసిరేస్తే, తెచ్చి తనకివ్వడం ప్రాక్టీసు చేయిస్తుంది. సినిమా చివర్లో ప్రత్యర్థులపై ఆమె బాంబు విసిరితే కుక్క దాన్ని కూడా నోట పట్టుకుని ఆమె వద్దకు తిరిగి తెస్తుంది. బాంబు పేలుతుంది. అలా అయింది అమెరికా గతి.
ఇవాళ్టికి కూడా ట్రంప్ నేను లీగల్ ఓట్లతో నెగ్గేశాను. వాళ్లు యిల్లీగల్ ఓట్లతో మా నుండి విజయాన్ని దొంగిలించాలని చూస్తున్నారు అంటూ పాట పాడుతున్నాడు. ‘‘స్టాప్ ద స్టీల్, చోరీ ఆపేయ్, కౌంటింగ్ నిలిపేయ్’’ అని నినాదాలు యిస్తూ అతని మద్దతుదారులు పోలింగు కేంద్రాలపై దాడి చేసి, లెక్కించడం ఆపుదామని చూస్తున్నారు.
అవతల బైడెన్, తన అనుచరుల చేత ‘కౌంట్ ఎవిరి ఓట్’ అనే పేర ప్రదర్శనలు చేయిస్తున్నాడు. ట్రంప్ కోర్టుకి వెళ్లడం ఖాయం కాబట్టి, కోర్టులో అతన్ని ఎదుర్కోవడం చాలా ఖరీదైన వ్యవహారం కాబట్టి, ఆ ఖర్చుల నిమిత్తం డెమోక్రటిక్ పార్టీ తన అభిమానుల నుంచి విరాళాలు సేకరిస్తోంది. అంటే ప్రజాస్వామ్యయుతంగా నెగ్గినా కోర్టు ఖర్చులకు బోల్డు ఖర్చు పెట్టే స్తోమత వున్న ధనికుడైతే తప్ప న్యాయం దక్కదన్నమాట! ఇదెక్కడి ప్రజాస్వామ్యం బాబూ!
అసలక్కడి న్యాయవ్యవస్థే గమ్మత్తుగా వుంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులను ఎంచుకునేది సాటి న్యాయమూర్తులు కాదు, దేశాధ్యక్షుడు. సెనేట్ ఆమోదిస్తుంది. సరే, ఒకసారి పదవి చేపట్టాక నిష్పక్షపాతంగా వుంటాడని భావిద్దాం. కానీ వాళ్లకు ఆ పదవి జీవితాంతం వుంటుంది. తమంతట తాముగా రిటైర్ అయితే తప్ప, బలవంతంగా తీసేస్తే తప్ప, చచ్చిపోయేదాకా పదవిలో వుంటారు.
దాదాపు 45 శాతం మంది అలాగే వున్నారిప్పటిదాకా. వృద్ధాప్యం వచ్చాక, శారీరక దృఢత్వం, మానసికమైన చురుకుదనం తగ్గుతాయనే కదా, ఉద్యోగాల్లో పదవీ విరమణ చేయిస్తారు.
న్యాయమూర్తులంటే చూసినది, చూడనది, విన్నది, విననది అన్నీ కలబోసి, అన్ని కోణాలలో పరిశీలించి, మేధస్సు అప్లయిచేసి కదా తీర్పులివ్వాలి? చావుకి దగ్గరపడినా ఆ నేర్పు అలాగే వుంటుందని ఊహించగలమా? కానీ వాళ్ల రూలు అలాగుంది. సుప్రీం కోర్టులో 9 మంది న్యాయమూర్తులుంటే 4గురు డెమోక్రాట్ ప్రెసిడెంట్లు నియమించినవారు కాగా, 5 గురు రిపబ్లికన్ ప్రెసిడెంట్లు నియమించినవారు.
ఈ ఐదుగురిలో ముగ్గుర్ని సాక్షాత్తూ ట్రంపే నియమించాడు. వారిలో ఒకరిని ఎన్నికలకు కొద్ది వారాల ముందే, ప్రక్రియను కుదించేసి గబగబా నియమించాడు. ఈ కారణాల చేత తమకు న్యాయం జరగదని డెమోక్రాట్ల భయమై వుంటుంది. లేకపోతే స్పష్టంగా కనబడుతున్న మెజారిటీని నిరూపించుకునే సింపుల్ కేసుకై పెద్ద పెద్ద లాయర్లను నియమించుకోవడం, ఫీజుల కింద వారికి బోల్డంత చదివించుకోవడం దేనికి?
కోర్టుల్లో ఏం జరుగుతుందో తెలియదు, కోర్టు తీర్పు వచ్చాక కూడా ట్రంప్ దాన్ని అంగీకరిస్తాడో, తనకు వ్యతిరేకంగా వస్తే ధిక్కరిస్తాడో తెలియదు. అతని అనుయాయులు మిన్నకుంటారో, రోడ్లపైకి వచ్చి తుపాకీలతో స్వైరవిహారం చేస్తారో, దానికి డెమోక్రాట్ల స్పందన ఎలా వుంటుందో తెలియదు.
అంతిమంగా అంతర్యుద్ధం రాకపోవచ్చు కానీ, రాబోయే కొద్దివారాలు, కనీసం కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకరంగా వుండవచ్చు. జరగకపోతే మంచిదే, కానీ జరుగుతుందేమోనన్న అనుమానం రావడం కూడా అవమానకరమే కదా అంటాన్నేను. దీని కంతా కారణం ట్రంప్ తెంపరితనం. ఇది ఒక వ్యక్తి గురించిన అభిశంసన కాదు, అమెరికన్ సమాజం తగలబడిన చందం గురించిన ఆవేదన.
ట్రంప్ తన స్వభావాన్ని ఎక్కడా దాచుకోలేదు. గత నాలుగేళ్లగా తన వికృతరూపాన్ని, వాచాలత్వాన్ని, మొండితనాన్ని ప్రదర్శిస్తూనే వున్నాడు. ఎవరినీ, ఏ వ్యవస్థనూ లెక్కచేయనని చాటుకుంటూనే వున్నాడు. అయినా యిలాటి వాడికి మద్దతిచ్చిన వాళ్లు ఎంతమంది వున్నారో చూడండి. ట్రంప్ దాదాపు గెలిచేటంత స్థాయిలో వాళ్లు ఓట్లేశారు కదా! ఎందుకు అంటే ఆర్థికవ్యవస్థ నిలబెట్టాడు అంటారు.
మన ఇండియన్ ఓటర్లయితే ఎచ్1బి వీసాల విషయంలో కఠినంగా వున్నాడు కాబట్టి, అంటారు. నేను చెప్పిన రైల్వే కంపార్టుమెంటాలిటీ ఉదాహరణను దాదాపు అందరూ ఆమోదించారు. అక్కడున్న మధ్యవయస్కులైన ఇండియన్లు ‘మేమైతే ఎలాగోలా వచ్చేసి స్థిరపడిపోయాం. సగం అమెరికన్ కల్చర్‌లో పెరిగిన మా పిల్లల భవిష్యత్తేమిటి? వాళ్లకు మంచి ఉద్యోగాలు రావాలంటే పోటీ పడగలగాలి.
ఇక్కడున్న అమెరికన్లతో ఐతే పోటీ పడగలరు కానీ, ఇండియా నుంచి బుద్ధిగా చదువుకుని వచ్చినవాళ్లతో పోటీ పడలేరు. అందువలన ఇండియా నుంచి ఎవరూ రాకుండా చూడాలి. రానివ్వనంటున్న ట్రంపే ముద్దు.’ అనుకుని ఓటేశారట.
అలాగే బైడెన్ వస్తే సంక్షేమరాజ్యం అంటాడని, బడుగువర్గాల వారిని నెత్తిన పెట్టుకుని, వారికై పథకాల కోసం పన్నులు పెంచుతాడని, నల్లవాళ్లకు కొమ్ములొస్తాయని, యిలాటి ఆలోచనాధోరణితో ధనికులైన ఎన్నారైలు కూడా ట్రంప్‌కు వేశారట. సరే, మన ఇండియన్లు ఎవరికి ఎక్కువ సంఖ్యలో ఓటేసినా, మానినా పెద్దగా తేడా రాదు కానీ, స్థానిక ప్రజలలో కూడా ట్రంప్ విధానాలను, వ్యక్తిత్వాన్ని సమర్థించేవారున్నారని తేటతెల్లమౌతోంది కదా.
నిజానికి ట్రంప్‌ను మీడియా మొదటినుంచీ ఎండగడుతూనే వుంది. ఫాక్స్ టీవీ తప్ప తక్కినవన్నీ అతనికి వ్యతిరేకమే. మొత్తం 22 వేల చిల్లర అబద్ధాలు, మాటమార్చడాలు, బుకాయింపులు చేశాడని లెక్క కట్టి ప్రచారం చేసింది. ఇంత చేసినా ట్రంప్‌కి అంతే విస్తారమైన ఓటుబ్యాంకు వుందంటే అర్థమేమిటి?
ట్రంప్‌కి వ్యక్తిగత అహంకారం, జాత్యహంకారం, పన్నులు ఎగ్గొట్టే దుర్బుద్ధి, పర్యావరణం పట్ల నిర్లక్ష్యం, పేచీకోరుతనం, మహిళల పట్ల చులకన, తనతో విభేదించేవారి పట్ల శత్రుత్వం, గెలవడానికి ఏ పద్ధతైనా అవలంబించవచ్చనే ఆలోచనా ధోరణి, అవతలివాళ్లను చులకనగా మాట్లాడే నోటి దురుసు – యివన్నీ ఉన్నాయని తెలిసినా అతని ఆర్థిక విధానాల పట్ల ఆమోదం తెలిపి ఓటేశారంటే దానికి అర్థం – అమెరికా ప్రస్తుతం లక్ష్మినే ఆరాధిస్తోందని! గతంలో సరస్వతిని ఆరాధించడం వలన లక్ష్మి కరుణించిందని రాశాను.
ఇప్పుడు మంచీమర్యాదలను పక్కనపెట్టి కేవలం లక్ష్మినే ఆరాధించడం వలన సమాజంలో అశాంతి ప్రబలి, పార్వతి మహిషాసుర మర్దని అవతారం ఎత్తవలసి వస్తుంది.
బైడెన్ అధికారంలోకి వచ్చినా ట్రంప్ అభిమానులు చల్లారిపోతారని, అల్లరి చేయడం ఆపుతారని అనుకోవడానికి లేదు. దీని పర్యవసానాలు చాలాకాలం వుండవచ్చు. వారి సమాజంలో ఘర్షణ తప్పదనిపిస్తోంది. దీనిని మన దేశంతో పోల్చి చూడండి. మన దగ్గర అధికార బదిలీ ఎంత స్మూత్‌గా జరుగుతుందో గమనించండి. ఒక పార్టీ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయి,
మరొకరికి గద్దెను అప్పగించిన సందర్భాలు అనేకసార్లు జరిగాయి. అలాటప్పుడు ఏ అల్లర్లయినా జరిగాయా? ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన నాయకులను సామాన్యుడి తన ఓటుతో కూలదోసినప్పుడు, వాళ్లు యిలా వీధుల్లో అల్లర్లు చేయించారా? కౌంటింగు దగ్గర అనుమానాలొస్తే ఆ సెంటరు వరకు మళ్లీ లెక్కించాలని వాదిస్తారు. రిటర్నింగ్ ఆఫీసరు తప్పు చేశాడని భావిస్తే కోర్టుల కెళ్లి తేల్చుకుంటారు. అంతేగానీ ఫలానా ఓట్లు లెక్కించకూడదంటూ తుపాకీలతో ప్రదర్శనలు చేస్తారా?
మనకు స్వాతంత్ర్యం యిస్తామన్నపుడు భారతీయ ప్రజలకు పరిణతి లేదు, చాలామంది నిరక్షరాస్యులే, ప్రజాస్వామ్యపు విలువలు తెలియవు. వారా వ్యవస్థకు తగరు. వారికి దేశం అప్పగిస్తే కుక్కలు చింపిన విస్తరి అవుతుంది అని పాశ్చాత్య నాయకులెందరో వాదించారు. 70 ఏళ్లగా కేంద్రంలో, రాష్ట్రాలలో అనేక ఎన్నికలు, ఉపయెన్నికలు, మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి.
ఎక్కడైనా అమెరికాలోలా జరిగిందా? ఎమర్జన్సీ విధించి, నియంతగా పేరుబడిన ఇందిరా గాంధీ కూడా ఎన్నికలలో ఓడిపోయానని తెలియగానే కిమ్మనకుండా అధికారం అప్పగించి దిగిపోయింది. ఎన్నికల ఫలితాలు ఒప్పుకోమని ఆమె అభిమానులు రోడ్ల మీదకు రాలేదు.
ఈనాటి ఘటనల తర్వాతైనా అమెరికా ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో యితర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, ఆ ప్రజలకు ప్రజాస్వామ్యం గురించి లెక్చర్లు యివ్వడం, మానేస్తే మంచిది. ఎవరికి యిచ్చినా యివ్వకపోయినా మనకు యివ్వనక్కరలేదని గ్రహిస్తే చాలు.
మేరా భారత్ మహాన్!
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2020)
[email protected]