పోటాపోటీగా సాగిన ఈ ఏడాది ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ దశలో వెనుదిగింది. ఫైనల్ కు ఒక అడుగు దూరంలో హైదరాబాద్ ఓడిపోయింది. ఆ మ్యాచ్ లో కూడా సంచలన విజయం సాధిస్తుందేమో అనే స్థితి నుంచి ఎస్ఆర్హెచ్ ఓటమి పాలయ్యింది. ఈ ఏడాది ఐపీఎల్ ను ఎస్ఆర్హెచ్ ప్రారంభించిన తీరుతో పోలిస్తే ముగింపు బాగా ఉందని చెప్పవచ్చు. లీగ్ లో ఈ జట్టు ఈ స్థాయికి కూడా చేరుతుందని చాలా మంది ఊహించి ఉండకపోవచ్చు.
మంచి జట్టుతోనే బరిలోకి దిగినా.. ఆటగాళ్లు గాయాలపాలవ్వడంతో ఎస్ఆర్హెచ్ రూపురేఖలు మారిపోయాయి. కీలక ఆటగాళ్లు గాయాలతో దూరం కావడం లేదా లీగ్ కు పూర్తిగా దూరం కావడంతో హైదరాబాద్ జట్టుకు ఎదురుదెబ్బలు తగిలాయి. ఎప్పుడూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించే భువనేశ్వర్ కుమార్ గాయంతో దూరం కావడంతోనే మొదటి దెబ్బ పడింది.
ఒకవేళ భువనేశ్వర్ వంటి దేశీ ఫాస్ట్ బౌలర్ అందుబాటులో ఉంటే.. అతడికి సందీప్ శర్మ, నటరాజన్ లు తోడయి ఉంటే ఈ జట్టు కథ మరోలా ఉండేది!
సందీప్ శర్మ, నటరాజన్ లు అద్భుతంగా బౌల్ చేశారు. మూడో ఫాస్ట్ బౌలర్ గా ఎవరు జట్టులోకి వచ్చినా వారు ధారాళంగా పరుగులు ఇస్తూ వచ్చారు. దీంతో కొన్ని మ్యాచ్ లలో జట్టుకు ఓటమి తప్పలేదు. హోల్డర్ అందుబాటులోకి వచ్చే వరకూ మూడో ఫాస్ట్ బౌలర్ దొరకలేదు.
అప్పటికే ఏడెనిమిది మ్యాచ్ లు పూర్తయ్యాకా హోల్డర్ జట్టులోకి వచ్చాడు. అక్కడితో కానీ మూడో ఫాస్ట్ బౌలర్ సమస్య తీరలేదు! హోల్డర్ విదేశీ ఆటగాడు కావడంతో.. అతడిని జట్టులోకి తీసుకోవడంతో..బెయిర్ స్టో ను పక్కన పెట్టాల్సి వచ్చింది. అదే భువీ ఉండి ఉంటే.. జట్టు కూర్పు బాగుండేది.
ఇక మిచెల్ మార్ష్ పూర్తిగా అందుబాటులో లేడు. విలియమ్సన్ లేట్ గా వచ్చాడు. ఇన్ని ప్రతిబంధకాలున్నా.. టాప్ ఫోర్ లో నిలిచి, ప్లే ఆఫ్ వన్ లో బెంగళూరు జట్టును ఓడించి మూడో స్థానంలో నిలిచింది హైదరాబాద్. దీనికంతా వార్నర్, విలియమ్సన్, రషీద్ ఖాన్ , హోల్డర్, నబీల ప్రదర్శనే కారణంగా నిలిచింది. సందీప్ శర్మ, నటరాజన్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే.
అన్నింటికీ మించిన ఎదురుదెబ్బ మంచి ఫామ్ లో ఉన్న వృద్ధిమాన్ సాహా కూడా చివరి మ్యాచ్ లకు దూరం కావడం. నిన్నటి మ్యాచ్ కు కూడా సాహా అందుబాటులో లేడు. ఇలా ఆటగాళ్ల గాయాలు.. సన్ రైజర్స్ అవకాశాలను దెబ్బతీశాయి. మంచి కూర్పు అవకాశాలు దూరం అయ్యాయి. అయినా మెరుగైన స్థానంలో నిలిచిన ఎస్ఆర్హెచ్ ను అభినందించాలి.