జగ‌న్ పాల‌న‌లో కాటేస్తున్న క‌నురెప్ప‌

పోలీసులంటే అంద‌రికీ ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన వాళ్లు. అలాంటి పోలీసులే శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌గా మారితే ఏం చెప్పాలి? ఎవ‌రికి చెప్పాలి? క‌ంటికి రెప్ప‌లా ఉండాల్సిన పోలీసులు …వాళ్లే కాటేస్తుంటే ఇక చెప్ప‌డానికి ఏముంటుంది? ఇటీవ‌ల కాలంలో…

పోలీసులంటే అంద‌రికీ ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన వాళ్లు. అలాంటి పోలీసులే శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌గా మారితే ఏం చెప్పాలి? ఎవ‌రికి చెప్పాలి? క‌ంటికి రెప్ప‌లా ఉండాల్సిన పోలీసులు …వాళ్లే కాటేస్తుంటే ఇక చెప్ప‌డానికి ఏముంటుంది? ఇటీవ‌ల కాలంలో ఆంధ్ర‌ప్ర దేశ్‌లో పోలీసుల వ్య‌వ‌హారం తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. 

పోలీసుల అరాచ‌క‌త్వంపై జ‌గ‌న్ స‌ర్కార్ ఉక్కుపాదం మోప‌క పోతే మాత్రం త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించ‌క త‌ప్ప‌దు. పోలీసుల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు న‌ష్టం జ‌రిగిన త‌ర్వాత …వారిపై చ‌ర్య‌లు తీసుకున్నంత మాత్రాన బాధిత కుటుంబాలకు ఒన‌గూరే ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌దు.

పోలీసుల అరాచ‌క‌త్వం సామాన్యుల ఉసురు తీస్తోంది. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకోవ‌డం జ‌గ‌న్ స‌ర్కార్‌కు ప్యాష‌న్‌గా మారింద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. గ‌త కొంత కాలంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పోలీసుల వ్య‌వ‌హారం ప్ర‌జ‌ల్ని భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తోంది. 

ఒక‌వైపు దుర్ఘ‌ట‌న‌ల‌కు బాధ్యులైన పోలీస్ అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటున్నా … వారి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రావ‌డం లేదు. పేరుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెబుతున్నా …కేసుల విష‌యంలో నిందితుల‌తో అమాన‌వీయంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. దీంతో అంతిమంగా ప్ర‌భుత్వానికే చెడ్డ పేరు వ‌స్తోంది. జ‌గ‌న్ స‌ర్కార్‌కు మ‌చ్చ తెచ్చిన కొన్ని సంఘ‌ట‌న‌ల గురించి తెలుసుకుందాం.

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్‌ షేక్‌ అబ్దుల్‌ సలామ్‌ (45), భార్య నూర్జహాన్‌ (38), కుమారుడు దాదా ఖలందర్‌ (10), కూతురు సల్మా (14) ఈ నెల 3న పాణ్యం వద్ద గూడ్స్‌ రైలు కిందపడి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు.   

పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు బాధితుడు తీసుకున్న సెల్ఫీ వీడియో శనివారం వెలుగు లోకి వ‌చ్చింది. దీంతో ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నంద్యాల వన్‌టౌన్‌ సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌లను సస్పెండ్‌ చేయడంతోపాటు పలు సెక్షన్ల కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.  

గ‌త నెల‌లో రాజ‌ధాని రైతుల‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు న‌మోదు చేశారు. ఈ సంద‌ర్భంగా నిందితుల‌ను అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా న‌ర‌సరావుపేట స‌బ్‌జైలు నుంచి గుంటూరు జిల్లా జైలుకు నిందితుల‌ను త‌ర‌లిస్తూ వారి చేతుల‌కు సంకెళ్లు వేయ‌డం తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తించింది. జ‌గ‌న్ స‌ర్కార్‌ తీవ్ర విమ‌ర్శ‌ల‌పాలైంది.  

అమ‌రావ‌తి రైతుల‌కు సంకెళ్లు వేయ‌డంలో ఎస్కార్టు సిబ్బంది నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని భావించి గుంటూరు గ్రామీణ జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ఎనిమిది మంది పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకున్నారు. ఆరుగురు హెడ్‌కానిస్టేబుళ్ల‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. అలాగే ఎస్కార్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్న ఆర్ఎస్ఐ, ఆర్ఐల‌కు చార్జి మెమోలు ఇచ్చారు. ఆ త‌ర్వాత రెండుమూడు రోజుల‌కే సస్పెన్ష‌న్ వేటు ఎత్తి వేయ‌డం గ‌మ‌నార్హం.

జూలైలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర్లోని సీతానగరం పోలీస్ స్టేషన్లో వెండుగమిల్లి ప్రసాద్ అనే  దళిత యువకుడిని అవమానించారు. స్టేషన్లో ఇన్‌చార్జి ఎస్ఐ షేక్ ఫిరోజ్ ఆ యువకుడికి ట్రిమ్మర్ తో గుండు చేయించారు. 

ఈ ఘటనకు బాధ్యులైన‌ పేర్కొంటున్న సీతానగరం ఇన్‌చార్జి ఎస్ఐ షేక్ ఫిరోజ్, ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేశారు. అదే నెల‌లో  ప్ర‌కాశం జిల్లాలో కిర‌ణ్‌కుమార్ అనే యువ‌కుడు మాస్క్ ధ‌రించ‌లేద‌నే కార‌ణంతో చీరాల టూటౌన్ ఎస్ఐ విజ‌య్‌కుమార్ చావ‌బాదాడు.

అత‌న్ని చీరాల ఏరియా వైద్య‌శాల‌లో చేర్చారు.  పరిస్థితి విష‌మించ‌డంతో కుటుంబసభ్యులు గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ కిరణ్‌కుమార్ ప్రాణాలు కోల్పోయాడు.  ఈ ఘ‌ట‌న‌పై వెంట‌నే స్పందించిన సీఎం జ‌గ‌న్ బాధితుడి కుటుంబానికి రూ.10 ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించి ద‌ర్యాప్తున‌కు ఆదేశించారు. చీరాల టూటౌన్ ఎస్ఐ విజ‌య్‌కుమార్‌ను వీఆర్‌కు పంపారు.  

పైన పేర్కొన్న ఏ ఘ‌ట‌న అయినా నాగ‌రిక స‌మాజం హ‌ర్షిస్తుందా? న‌ంద్యాల ఘ‌ట‌న‌లో సీఐని స‌స్పెండ్ చేసినంత మాత్రాన పోయిన ఆ న‌లుగురి ప్రాణాలు తిరిగి వ‌స్తాయా? రాజ‌ధాని రైతుల‌కు బేడీలు వేసిన వాళ్ల‌ను స‌స్పెండ్ చేసి, తిరిగి రెండు రోజుల‌కే ఎత్తి వేయ‌డం ఏంటి? ఎవ‌రిని మ‌భ్య పెట్టాల‌ని ప్ర‌భుత్వం ఇలా చేస్తోంది? అలాగే ద‌ళిత యువ‌కుడికి ఏకంగా ఓ ఎస్ఐ శిరోముండ‌నం చేయించ‌డం గ‌తంలో ఎన్న‌డైనా జ‌రిగిందా? ఏంటీ దురాగ‌తాలు?

ఇవి కేవ‌లం వెలుగులోకి వ‌చ్చిన‌వి మాత్రమే. రానివి ఇంకెన్నో. జ‌గ‌న్ పాల‌న‌లో ఒక‌వైపు సంక్షేమ ప‌థ‌కాలు ప‌క్కాగా అమ‌ల వుతూ మంచి పేరు వ‌స్తున్న త‌రుణంలో, మ‌రోవైపు ఇలాంటి దుర్ఘ‌ట‌న‌లతో చెడ్డ‌పేరు కూడా అదే స్థాయిలో మూట‌క‌ట్టుకోవాల్సి వ‌స్తోంది. పోలీసుల వ్య‌వ‌హార శైలిపై ఇప్ప‌టికే హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.

స్వ‌యంగా డీజీపీని పిలిపించుకుని చీవాట్లు పెట్ట‌డాన్ని మ‌రిచిపోవ‌ద్దు. అయినా పోలీసుల తీరులో మార్పు రాలేదు. మ‌రోవైపు జ‌గ‌న్ స‌ర్కార్ త‌ప్పు చేసిన పోలీసుల‌ను అరెస్టు చేశామ‌ని గొప్ప‌లు చెప్పుకుంటుందే త‌ప్ప , వాటిని పున‌రావృతం కాకుండా క‌ట్ట‌డి చేయ‌డంలో విఫ‌ల‌మ‌వుతోంద‌ని విమ‌ర్శ‌లున్నాయి. పోలీసుల అరాచ‌కాల‌కు బేడీలు వేసేదెప్పుడు?

ఈ పలుకులకు పరమార్థం లేదు, ప్రయోజనం లేదు