పెట్టుబడి దారులకు పుట్టిన విష పుత్రికలు మన పత్రికలు అన్నాడు మహాకవి శ్రీశ్రీ…ఈ విషయం అందరికీ దాదాపుగా తెలిసిందే. అయితే ఇక్కడ గమనించాల్సింది మరొకటి వుంది. శ్రీశ్రీ ఎన్ని దశాబ్దాల కిందట ఈ మాట చెప్పారు అన్నది. ఇక్కడ మెచ్చుకోవాల్సింది శ్రీశ్రీ భవిష్యత్ దర్శనాన్ని. ఎందుకంటే. నిజానికి శ్రీశ్రీ ఈ మాటలు చెప్పిన నాటికి మీడియా పరిస్థితి మరీ అంత దారుణంగా లేదు. మీడియాలో పెట్టుబడిదారులు ప్రవేశించారంతే. కానీ ఎడిటోరియల్ వ్యవహారాల్లో అరేబియా ఒంటె మాదిరిగా సర్వం తామై ప్రవేశించలేదు.
గత కొన్నేళ్లుగా మీడియా విలు వలు కొల్పోతోంది అనే ఓ మాట వినిపించేది. కానీ ఇప్పుడు చూస్తుంటే విలువలే కాదు సానుభూతి కూడా కొల్పోతోంది. మీడియా మీద విమర్శలే తప్ప, మద్దతు పలికేవారి సంఖ్య రాను రాను తగ్గిపోతోంది. ఇదంతా మీడియా స్వయం కృతమే. ఈ మాట చెప్పడానికి అస్సలు మొహమాట పడాల్సిన పని లేదు. జర్నలిస్ట్ లకు విలువ లేకపోయినా ఫరవాలేదు. కానీ జనాల్లో కాస్తయినా సానుభూతి లేదా మద్దతు వుండాలి. జనం మద్దతు వుంటే లేదా జనం సానుభూతి వుంటే కొంతయినా జర్నలిజం బతికి వున్నట్లే. అలా కాకుండా అటు క్రెడిబులిటీ అనే విలువ కోల్పోయి, ఇటు జనాల మద్దతు లేదా సింపతీ కోల్పోతో ఇక మీడియా మిగిలేదెక్కడ? సాధించేదెక్కడ?
మీడియాలో పెట్టుబడి దారులు చాలా కాలం కిందటే ప్రవేశించినా, దాన్ని తమ తమ ప్రయోజనాల కోసం వాడేవారేమో కానీ మీర ప్రభుత్వాలను దించేయడానికి, రాజకీయ నాయకుల వ్యక్తిత్వ హననానికి, తమ తమ కుల ప్రయోజనాలకు, తమ తమ అభిమాన పార్టీల అధికార సాధనకు వాడేంతగా దిగజారలేదు. కానీ ప్రస్తుత పరిస్థితి వేరు.
ఇప్పుడు మీడియా అంటే ఎవ్వరికి విలువ లేదు.
ఇప్పుడు మీడియా అంటే ఎవ్వరికీ సానుభూతి లేదు.
ఇప్పుడు మీడియా అంటే ఎవ్వరికీ గౌరవం లేదు.
ఇప్పుడు మీడియా అంటే ఎవ్వరికీ అబ్బురం కాదు.
ఇప్పుడు మీడియా అంటే జనాలకు మిగిలింది భయం మాత్రమే.
అవును ఇప్పుడు అధికారంలొ వున్నవారు, అధికారులు, ఆఖరికి సాదా సీదా జనాలు అందరికీ మిగిలింది భయం ఒక్కటే.
ఇప్పుడు ఆర్నాబ్ అనే నోరుపెట్టుకుని పైకి వచ్చిన జర్నలిస్ట్ సంగతే చూడండి. తెలుగునాట టీవీ9 రవిప్రకాష్ సంగతే చూడండి. అయ్యోపాపం అనే వారు వున్నారా? పోలిటికల్ స్టాండ్ కు అనుగుణంగా మద్దతు పలికిన వారు తప్ప. ఎందుకంటే వీరంతా జర్నలిజం..సెన్సేషనలిజం అనే రెండింటి మధ్య వున్న సున్నితమైన గీతను దాటేసారు కాబట్టి. రేపు మరెవరైనా అంతే.
ఆర్నాబ్ డిస్కషన్లు భలే డేరింగ్ అనేవారు వున్నారు, ఇది జర్నలిజమా? అని ఈసిడించే వారూ వున్నారు. ఈయన నోరు పెట్టుకు పడిపోతాడు. అవతలివారిని మాట్లాడనివ్వడు అని విమర్శించేవారు వున్నారు. ఈ దేశంలో చట్టం అందరికీ సమానమే మీడియా అయినంత మాత్రాన అదనపు కొమ్ములు మొలుచుకురావు. బైక్ ల మీద ప్రెస్ అని రాసేసుకున్నంత మాత్రాన డ్రయివింగ్ లైసెన్స్, సి బుక్ చూపించుకోవాల్సిన పని లేదనుకుంటే భ్రమే.
జర్నలిస్ట్ అయినంత మాత్రాన..'' మిస్టర్ డిజిపి..'' అంటూ ఇష్టం వచ్చినట్లు నిలదీస్తానంటే ఎలా? అక్కడ మీ దగ్గర పాయింట్ వుండొచ్చు..లాజిక్ వుండొచ్చు. కానీ మాట్లాడేందుకు, రాసేందుకు ఓ భాష అనేది వుంది. దాన్ని జర్నలిజం దాటకూడదు. మీడియా వేరు సోషల్ మీడియా వేరు. మీడియాకు స్వేచ్ఛ వుంటే, సోషల్ మీడియాకు మితి మీరిన స్వేచ్ఛ వుంది. అది చూసి, మీడియా కూడా ఆ దోవనే పోతాను అంటే సోషల్ మీడియా మాదిరిగానే ఎవరికి పుట్టిన బిడ్డ అన్నట్లు వుంటుంది తప్ప ఓ కేరాఫ్ అడ్రస్ అనేది వుండదు.
తెలుగునాట మీడియా
అసలు మన తెలుగునాట మీడియ పరిస్థితే చూద్దాం. ఒక దినసరి మగ వ్యవసాయ లేదా భవన నిర్మాణ కూలీ వేతనం రోజుకు అయిదారు వందల నుంచి ఏడెనిదిమి వందలు. అంటే నెలకు ఎలా లేదన్నా 15 వేలకు పై మాటే. కానీ తెలుగు రాష్ట్రాల్లో పట్టణాలు, మండలాల్లొ వుండే విలేకరి అనే హోదా దగ్గర ప్రారంభమయ్యే మీడియా జనాల్లో 50శాతంనికి పైగా జనాల జీతం అంత లేదంటే నమ్మగలరా?
ఒకప్పుడు విలేఖరి, ఆ తరవాత విలేకరి, ఆపై రిపోర్టర్, మీడియా ఇలా రకరకాలుగా మారిన స్థానిక జర్నలిస్ట్ ల్లో 90శాతం మంది నెలవారీ సంపాదని వెయి నుంచి మూడు వేలు మాత్రమే అంటే నమ్మగలమా? కాస్త పెద్ద మండలం అయితే ఇద్దరు ముగ్గురు, పెద్ద పట్టణం అయితే ఇద్దరు ముగ్గురు వంతున విలేకరి లేదా రిపోర్టర్లను అపాయింట్ చేసుకున్నాయి మీడియా సంస్థలు అన్నీ.
లాభాలు, టర్నోవర్, స్కర్యులేషన సంగతి పక్కన పెడితే దాదాపు డజను పత్రికలు మరో డజను చానెళ్లు వున్నాయి. ఇవి కాక జిల్లాల వారీగా లోకల్ గా ఇబ్బడి ముబ్బడిగా పత్రికలు వున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కేవలం విలేకరి లేదా రిపోర్టర్ గా పని చేసేందుకు కావాల్సిన జనాల సంఖ్యే పాతిక వేలకు పై మాటే. అంటే నెలకు అయిదారు వందల నుంచి మహా అయితే అయిదు వేల లోపు జీతానికి పనిచేయడానికి కావాల్సిన జనాల సంఖ్య పాతిక వేలు. ఏ దుకాణంలో పని చేసినా నెలకు పదివేల జీతం ఇచ్చే రోజులు ఇవి. అలాంటిది కనీసం డిగ్రీ చదవి ఇంత అతి తక్కువు జీతానికి రిపోర్టర్ గా పని చేయడం అంటే ఏమనుకోవాలి.
చాలా పత్రికలు, ఛానెళ్లు జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో పని చేసే వారికి జీతాలు కూడా సరిగ్గా ఇవ్వవు. తిరిగా వారు ఇచ్చే రిటర్న్ ఆదాయం మీద పడి బతకుతున్నాయి. యానివర్సరీలు, స్పెషల్ ఎడిషన్ల పేరిట జనాల మీద పడి ప్రకటనలు తెచ్చి ఇవ్వాల్సిన బాధ్యత రిపోర్టర్లదే. ఎవరు బాగా ప్రకటనలు తేగలిగితే వాడే గొప్ప జర్నలిస్ఠ్.
కొన్ని పత్రికలు కొత్తగా ఫ్రాంచైజీ అనే పద్దతిని కనిపెట్టాయి. అంటే ఏదైనా జిల్లాలో ఆ పత్రిక పేరు మీరు వాడుకుని, ప్రచురించుకోవచ్చు. దానికి ఇంత అని నెల నెలా ఇంత అని ఫ్రాంచైజీ ఫీజు కట్టాల్సి వుంటుంది. అలాగే లోకల్ తెచ్చుకునే ప్రకటనల ఆదాయాన్ని పంచుకోవాల్సి వుంటుంది. ఇప్పుడు చెప్పండి ఇది మీడియా అనాలా? వ్యాపారం అనాలా?
మండల పట్టణ కేంద్రాల్లో జర్నలిజం ఏనాడో దిగజారిపోయింది. యువతరం కొత్త ఆశలతో జర్నలిజంలో అడుగుపెట్టిన తరువాత కానీ తెలియడం లేదు ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు. దీంతో ఈ తరహా వ్యవహారంలోనే బతికేయాలని అనుకుంటున్నవారు అలాగే వుండిపోతున్నారు. ఇష్టం లేని వారు తప్పుకుంటున్నారు. చాలా చోట్ల ఈ తరహా వ్యవహారంలో వుండాలి అనుకుంటున్నవారు కేవలం చానెళ్లు, పత్రికలు ఇచ్చే ఆదాయం సరిపోక, పక్కదోవ పడుతున్నారు.
గతంలో వార్తల సేకరణకు ఇన్ ఫార్మర్లను పెట్టుకునేవారు. ఆ విధంగా తోటి రిపోర్టర్ల కన్నా ముందుగా సమాచార సేకరణ చేసి శహభాష్ అనిపించుకునేవారు. ఇప్పుడు ఎక్కడ మట్టి తీస్తున్నారు? ఎక్కడ గ్రావెల్ తవ్వుతున్నారు. ఎక్కడ రోడ్ మీద బిల్డింగ్ మెటీరియల్ వేసారు? ఎక్కడ అక్రమ సారా కాస్తున్నారు? ఎక్కడ ఇసుక తవ్వి తీస్తున్నారు లాంటి సమాచారం సేకరించడం కీలకంగా పెట్టుకున్నారు. తెల్లవారితే చాలా బైకులు తీసుకుని ఊళ్లమీద పడి, ఇలాంటి వ్యవహారాలు తెలుసుకుని తమ వాటా తాము తీసుకుంటున్నారు. అందరు జర్నలిస్ట్ లు ఇదే పని చేస్తున్నారు అన్నది నా ఉద్దేశం కాదు. కానీ కొంత మంది జర్నలిస్ట్ లు చేసే పని ఇదే.
కింది స్థాయిలో పని చేసే కొందరు జర్నలిస్ఠ్ ల పనితీరు ఇలా వుంటే, ప్రచురణ కేంద్రాల్లో, ప్రసార కేంద్రాల్లో పని చేసే జర్నలిస్ట ల పరిస్థితి మరీ దారుణం. పది వేల నుంచి పాతిక వేల లోపు జీతానికి పని చేయాల్సి వుంటుంది. గతంలో యూనియన్లు, కేంద్రం వేజెస్ రికమెండేషన్లు వుండేవి. ఇప్పుడు చట్టాల్లో వుండే రకరకా లోసుగులు వాడి వేజ్ బోర్డ్ సిఫార్సులు అనేవి అమలు కాకుండా చేసారు. దినదినగండం నూరేళ్ల ఆయుష్షు అనే పరిస్థితి వీరిది. మీడియాలో పనిచేసే తొంభై శాతం జనాల పరిస్థితి ఇలా వుంటే కేవలం పదిశాతం మంది మాత్రమే మంచి జీతాలు ఆర్జిస్తున్నారు.
మీడియాలో పని చేసే వారి పరిస్జితి ఇలా వుంటే మీడియాను నడుపుతున్నవారు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. అయితే వైట్ లేదంటే బ్లాక్ అనే పద్దతిలో ఆదాయం సంపాదించుకుంటున్నారు. నిజానికి చాలా మీడియా సంస్థలు లాభాల్లో లేవు. అయినా కూడా మీడియా సంస్థలను పట్టు వదలకుండా నడపడం వెనుక కారణం ఏమై వుంటుంది? ఇదంతా మీడియా మీద ప్రేమే అనుకోవాలా? లేదా మీడియా పేరు అడ్డం పెట్టుకుని సాగించే వ్యవహారాల మీద ప్రేమ అనుకోవాలా? మీడియా సంస్థ అయినా మీడియానే..ఆ సంస్థ సాగించే అనుబంధ వ్యాపారాలు అన్నీ మీడియానే? వాటి మీద ఈగవాలినా మీడియా మీద దాడే? ఇదెక్కడి చోద్యం? మీడియా అయితే స్థలాలు ఆక్రమించుకోవచ్చా? అక్రమ నిర్మాణాలు సాగించుకోవచ్చా?
ఓ మీడియా సంస్థకు ఏడాదికి అయిదు కోట్లు నష్టం వస్తుంది అనుకుందాం. అయిదేళ్లో పాతక కోట్లు. కానీ ఈలోగా ఏ ప్రభుత్వమో దయతలచ్చి ఎక్కడన్నా ఇంత స్థలం ఇచ్చిందీ అంటే చాలు, ఈ నష్టం అంతా కవర్ అయిపోతుంది. లేదా ఏ పార్టీ అన్నా దొడ్డిదారిన జీతాల బిల్లు భరించకపోతుందా? లేదా ఏ ప్రభుత్వం అయినా దొడ్డిదారిన సాయం చేయకపోతుందా? మరి ఇలా సాయం సంపాదించే ఆలోచన వున్నపుడు, సాయం పొందినపుడు ఆ మీడియా నాన్ బయాస్డ్ గా ఎలా వుండగలదు?
కచ్చితంగా ఏదో ఒక పార్టీ వైపు మొగ్గాల్సిందే. అలా మొగ్గినంత మాత్రాన సమస్య కాదు. అలా మొగ్గడం వల్ల నిజాలు దాచాల్సి వస్తుంది. అబద్దాలు ప్రచారం చేయాల్సి వస్తుంది. అక్కడే వస్తుంది క్రెడిబులిటీ సమస్య. అప్పుడే పోతుంది ప్రజల్లో పరపతి. అసలు ఈ రేటింగ్ ఆ రేటింగ్ లు అన్నవి పక్కన పెట్టి, ఏదైనా అవసరం అంటే తుపాను, వరదలు, ప్రమాదాలు, లేదా ఎన్నికల టైమ్ లో తప్పించి మిగిలిన రెగ్యులర్ రోజుల్లో న్యూస్ చానెళ్లు చూసేవారు ఎంత మంది? ఒకప్పుడు క్రేజీగా వున్న న్యూస్ చానెళ్లు ఇప్పుడు ఎందుకు అలా తయారయ్యాయి? అవి నిర్వహించే డిస్కషన్లు ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఎందుకు మారుతున్నాయి.
కొన్ని దినపత్రికలదీ ఇదే తీరు అని కొత్తగా చెప్పనక్కరలేదు. గతంలో తెలుగు రాష్ట్రాలు రెండూ ఒక్కటిగా వున్నపుడు ఈ దినపత్రికల తీరు కొంత వరకే జనాలకు అర్థం అయ్యేది. కానీ ఇప్పుడు రాష్ట్రాల విభజన జరిగిన తరువాత రెండు చోట్ల రెండు భిన్నమైన పత్రికా పద్దతులు పాటిస్తున్నపుడు జనాలకు మరింత క్లారిటీ వచ్చింది. సోషల్ మీడియా అనేది ఎప్పటికప్పుడు ఈ లొసుగులు అన్నింటినీ బయటకు తీసి ఉతికి ఆరేస్తుంటే జనాలకు మరింత స్పష్టత దొరికింది.
మరి ఇలాంటి నేపథ్యంలో మీడియా అంటే సానుభూతి ఎందుకు వస్తుంది? రమ్మన్నా రాదు. ఆర్నాబ్ కావచ్చు, రవిప్రకాష్ కావచ్చు, మరి కొంత మంది కావచ్చు. ఏ గూటి పలుకులు ఆ గూట్లో పలికే చిలకలుగా మారిపోతున్నారు తప్ప, జర్నలిస్ట్ గా మిగలడం అసాధ్యంగా వుంది. ఒక సంస్థలో పని చేస్తే అమరావతి కి మద్దతు, మరో చోట పని చేస్తే అమరావతికి వ్యతిరేకం అయితే ఆ జర్నలిస్ట్ కు విలవ ఎలా వుంటుంది?
శ్రీశ్రీ పెట్టుబడిదారుల విషపుత్రికలు అన్నాడు కానీ ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా వుంది. దేశ ఆర్థిక వ్యవస్థను, రాజకీయ వ్యవస్థలను శాసించగల స్థితిలో వున్న కార్పోరేట్ సంస్థలకు మీడియాలో పరోక్ష, ప్రత్యక్ష పెట్టుబడులు వున్నాయి. మరింక అలాంటి మీడియా సంస్థల నుంచి నిస్పక్షపాతమైన నిజాలు ఎలా బయటకు వస్తాయి? అలా నిజాలకు దూరమై, వ్యాపారాలకు దగ్గరైన మీడియాకు ఏదైనా జరిగితే జనాల నుంచి సింపతీ ఎలా వస్తుంది? మంచి పనయింది అని అనకుండా వుంటే అదే పది వేలు. కానీ ఈ మీడియా సంస్థల తీరు చూస్తుంటే ఆ పరిస్థితి కూడా తెచ్చుకునేలాగే వుంది.
దేశంలోని రాజ్యాంగ, అధికార వ్యవస్థలు ఏనాడో భ్రష్టుపట్టిపోయాయి. మీడియా పని తీరు ఇలా అఘోరిస్తోంది. న్యాయవవస్థ కూడా ఆటు పోటులకు గురవుతోంది. కీలకమైన నాలుగు వ్యవస్తలు ఇలా డీలా పడితే ఇక ఈ దేశానికి ఏది దిక్కు? ఎందుకంటే ఈ వ్వవస్థలు ఈ రాజకీయ ప్రభావిత ఊబినుంచి బయటకు రావడం అన్నది అంత వీజీ కాదు.
చాణక్య