హైపర్ ఆది …జబర్దస్త్‌లో నవ్వులు పూయించడంలో దిట్టగా విశేష గుర్తింపు పొందిన యాక్టర్. పంచ్ డైలాగ్‌లకు పెట్టింది పేరు. జబర్దస్త్‌లో ఎంతోమంది కమెడియన్స్ ఉన్నా.. హైపర్ ఆదికి ఓ ప్రత్యేకత ఉంది.
జబర్దస్త్ అంతగా పాపులర్ కావడానికి హైపర్ ఆది స్కిట్లే ప్రధాన కారణమంటే అతిశయోక్తి కాదు. వర్తమాన పరిస్థితులకు తగ్గట్లు పంచ్ డైలాగ్‌లతో కామెడీ పండించడంలో తనకు తానే సాటి అని హైపర్ ఆది నిరూపించు కున్నాడు.
గత కొంత కాలంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ప్రత్యర్థులపై అదిరిపోయే పంచ్‌లు వేస్తూ హైపర్ ఆదిని గుర్తుకు తెస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి , బీజేపీ నేత కిషన్‌రెడ్డిపై అలాంటి పంచ్ విసిరి నవ్వులు పూయించాడు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 15న వరద నష్టంపై ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ రాశారని, ఇప్పటి వరకు స్పందించలేదని విమర్శించారు.
ఇదే తమ పార్టీకి చెందిన కర్ణాటక సీఎం లేఖ రాస్తే పీఎం వెంటనే స్పందించి రూ.669 కోట్లు విడుదల చేశారని, అలాగే గుజరాత్‌కు రూ.500కోట్లు కేటాయించారని కేటీఆర్ సంబంధిత వివరాలను మీడియా ముందు ఉంచారు. కానీ తెలంగాణ సీఎం లేఖకు మాత్రం స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో నలుగురు బీజేపీ ఎంపీలు ఉండి ఒక్క పైసా కూడా తీసుకు రాలేదని ధ్వజమెత్తారు. ఇక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నిస్సహాయ మంత్రి అని, బీజేపీ బాధ్యత రాహిత్య పార్టీ అని అదిరిపోయే పంచ్‌లు విసిరారు. తమది మనసున్న ప్రభుత్వమని, మరో 100కోట్లు ఇచ్చైనా, అందరికీ సహాయం అందిస్తామని కేటీఆర్ చెప్పుకొచ్చారు.