లేడీ అమితాబ్, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఏదో చెప్పాలని అనుకుంటున్నారు. కానీ అసలు విషయం తప్ప కొసరు సంగతులు చెబుతున్నారామె.
కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆమె పెనుగులాడుతున్నట్టు కనిపిస్తోంది. ఇటు కాంగ్రెస్‌లో ఉండలేక, అటు ఇప్పటికిప్పుడు బీజేపీలోకి వెళ్లలేక తీవ్ర అశాంతికి గురవుతున్నట్టు ఆమె ప్రకటనలు చూస్తే అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిపై విజయశాంతి తాజాగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేతల్లో కొందరిని సీఎం కేసీఆర్ ప్రలోభ పెట్టి, మరికొందర్ని భయపెట్టి టీఆర్ఎస్లోకి తీసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి పార్టీ మార్పించారని విజయశాంతి ఆరోపించారు.
అయితే టీఆర్ఎస్ చేసిన ఆ పని వల్లే ఇప్పుడు తన నెత్తి మీదికి వచ్చినట్టైందన్నారు. కాంగ్రెస్‌ను బలహీనపరచడం వల్ల ఇప్పుడు తెలంగాణలో బీజేపీ సవాలు విసిరే స్థాయికి వచ్చిందని, ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్‌కు వర్తిస్తుందని విజయశాంతి విసుర్లు విసిరారు.
కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్గా వచ్చిన మాణిక్కం ఠాగూర్ మరికొంత ముందుగా రాష్ట్రానికి వచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు మెరుగ్గా ఉండేవన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితిని కాలం, ప్రజలే నిర్ణయించాలని రాములమ్మ తన ట్వీట్లో పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని విజయశాంతి పరోక్షంగా చెప్పకనే చెప్పారు.అలాగే కాంగ్రెస్‌కు ఇక భవిష్యత్ లేదని చెప్పడం, మరోవైపు బీజేపీ సవాల్ విసురుతోందనడం ద్వారా ఆ పార్టీ రానున్న రోజుల్లో ప్రధాన ప్రత్యర్థి అవుతుందని పరోక్షంగా ఓ మెసేజ్‌ను పంపినట్టైంది.
ఈ నేపథ్యంలో బీజేపీలోకి విజయశాంతి వెళుతుందనే ప్రచారానికి ఆమె తాజా ట్వీట్ మరింత బలం చేకూర్చుతోంది.