ఆరుషి హత్య కేసులో ఆమె తలిదండ్రులను హైకోర్టు వదిలేసింది. వాళ్లు నిర్దోషులని నిర్ద్వంద్వంగా ప్రకటించలేదు. వాళ్లకు సంశయలాభం యిచ్చింది. నిర్ధారణగా చెప్పగల (కన్‌క్లూజివ్) సాక్ష్యాలు ప్రాసిక్యూషన్ అందించలేకపోయిందని అభిప్రాయ పడింది. ఈ సమస్య కేసు మొదటి నుంచీ ఉంది. అందువలన సిబిఐకు అక్షింతలు వేయడంలో తప్పు లేదు. అయితే కింది కోర్టు జడ్జి మీద చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆయన కొన్ని అంకెలను ముందే స్థిరీకరించుకున్న లెక్కల మేస్టారిలా వ్యవహరించాడని, అతుకుల బొంతలా వున్న వాస్తవాలను ఒక పద్ధతిలో పెట్టడానికి సినిమా డైరక్టరులా స్క్రీన్‌ప్లే రచించాడని విసుర్లు విసిరింది.
తన భావోద్వేగాలకు లొంగి, అత్యుత్సాహం ప్రదర్శించి, తన ఊహాశక్తికి పనిచెప్పి పక్షపాత బుద్ధితో కేసును పరామర్శించాడని అంది. వాస్తవాలను వక్రీకరించాడని, స్వీయనియంత్రణ కోల్పోయాడనీ, అసలు అతను ఎంచుకున్న మౌలిక ప్రతిపాదన (ప్రిమైస్) తప్పనీ, జగమొండిలా వ్యవహరించి రుజువుకాని సాక్ష్యాలపై ఆధారపడి అభూతకల్పనలు చేశాడనీ తిట్టిపోసింది. ఇది కాస్త టూమచ్‌గా వుంది.
సాక్ష్యాలన్నీ నిక్కచ్చిగా వుండే ఓపెన్ అండ్ షట్ కేసులో తప్ప తక్కినవాటిలో న్యాయమూర్తులు జరిగింది ఏమై వుంటుందో ఊహించక తప్పదు. ఊహలో లోపాలుంటే చెప్పాలి తప్ప యిన్ని చివాట్లా? నేను యీ కేసు గురించి నాలుగేళ్ల క్రితమే 2013 డిసెంబరులో విపులంగా నాలుగు పేజీల కథనం రాశాను. కింద లింకులు యిస్తున్నాను. ఓపికుంటే చదవండి.
ఎమ్బీయస్ : ఆరుషి కేసులో తీర్పు సబబేనా? – 1
ఎమ్బీయస్ : ఆరుషి కేసులో తీర్పు సబబేనా? – 2
ఎమ్బీయస్ : ఆరుషి కేసులో తీర్పు సబబేనా? – 3
ఎమ్బీయస్ : ఆరుషి కేసులో తీర్పు సబబేనా? – 4
దానిలో నేను కొన్ని ప్రశ్నలు లేవనెత్తాను. ఇవి యిప్పటికీ రిలవెంటే. కేసు ఓ కొలిక్కి రాకపోవడానికి కారణం ఏమిటి? హత్యాస్థలంలో ఆధారాలు సేకరించలేక పోవడం, పోలీసులు అక్కడకి వచ్చేటప్పటికే యిరుగూపొరుగూ వచ్చి అక్కడ నానా కంగాళీ చేసేయడం! దానివలన యిప్పుడు లాభపడిందెవరు? తల్వార్ దంపతులు! సంశయలాభం (బెనిఫిట్ ఆఫ్ డౌట్) పొందారు. అలా జరగడానికి కారకులెవ్వరు? వాళ్లే. ఇంట్లో కూతురు హత్య జరగగానే విద్యావంతులైన వ్యక్తులుగా పోలీసులకు ఫోన్ చేయాలి కదా. చేయలేదు. పనిమనిషి వచ్చాక చుట్టుపక్కల వాళ్లను పిల్చుకురా అని చెప్పారు. అలా వచ్చినవాళ్లలో ఎవరో పోలీసులకు ఫోన్ చేస్తే వారొచ్చారు.
ఎందుకలా చేశారో తల్వార్లు తృప్తికరమైన సమాధానం యివ్వాలిగా. వచ్చాక కూడా పోలీసులు చాలా మొహమాటంగా వ్యవహరించారని అర్థమవుతుంది. హేమరాజ్ శవం డాబాపై పడి వుంది. వీళ్లు వెళ్లి చూడను కూడా చూడలేదు. టెర్రేస్ తలుపు తాళంచెవి ఏది? అని అడిగితే తల్వార్ ఏమో ఎక్కడో పోయింది అన్నాడు. పోలీసులు తలుపులు పగలకొట్టలేదు. సరే అని తలవూపి వెళ్లిపోయారు. శవం బయటపడిందన్నా, యింకా అనేక విషయాలు బయట పడ్డాయన్నా ఇంటి పక్కాయన కూపీ లాగడం వలననే జరిగాయి. ఆ తర్వాత పోలీసులు, సిబిఐ కేసును ఎన్ని రకాలుగా తిప్పాలో అన్ని రకాలుగా తిప్పారు.
ఇదంతా వాళ్లెవరి కోసం చేశారు? స్వలాభం కోసమా? తల్వార్‌లకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను కామాపు చేయడానికి ఎంత చేయాలో అంతా చేశారు. మధ్యమధ్యలో కొందరు వేరే అధికారులు వచ్చి కొన్ని విషయాలు బయటకు లాగడం, మళ్లీ యింకొందరు వచ్చి గందరగోళం చేయడం.. యిలా నడిపారు కేసుని. అలా నడపడం వలననే యిప్పుడు తల్వార్లు లాభపడ్డారు. కేసు సుప్రీం కోర్టుకి వెళ్లినా వాళ్లకు శిక్ష పడనంత చాకచక్యంగా కేసుని కంగాళీ చేశారు పోలీసులు, సిబిఐ వారు. కాస్సేపు తల్వార్లు హత్య చేయలేదనే నమ్ముదాం. అలా అయితే వాళ్లు అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కానీ చెప్పటం లేదు.
ప్రాసిక్యూషన్ వాదన తప్పు అని నిరూపించడంలోనే తమ శక్తియుక్తులు ఖర్చు చేస్తున్నారు. కూతురి శవం బయటపడినపుడు వాళ్ల రియాక్షన్లు విడ్డూరంగా వున్నాయి. ఆరుషి గదిలోకి వేరే వాళ్లు వచ్చే అవకాశం లేదు అని సిబిఐ వాదన. ఆ విషయాన్ని సందేహరహితంగా నిరూపించ లేకపోతున్నారు మీరు అని హైకోర్టు అంది. ఆ యింటి ప్లానును (వికీపీడియా సౌజన్యంతో) హేమరాజ్, ఆరుషి, ఆమె తల్లిదండ్రుల ఫోటోలతో సహా పైన యిస్తున్నాను. ఇరుపక్షాల వాదనలూ ఆ వ్యాసంలో రాశాను. హేమరాజ్‌ను ఆరుషి బెడ్‌రూమ్‌లో చంపేసి డాబా మీదకు లాక్కెళ్లారని రుజువు చేయలేకపోయారు అంది హైకోర్టు.
సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ అనే ఒక వాదనాపద్ధతి వుంది. దాని ప్రకారం అలా జరగడానికి ఆస్కారం ఉంది. తల్వార్లు నిర్దోషులే అయితే తమ యింటిని పూర్తిగా ఎందుకు సోదా చేయించలేదు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఎలా చూసినా వారి ప్రవర్తన వింతగా వుంది.కింది కోర్టు న్యాయమూర్తిని ఘాటుగా విమర్శించిన హైకోర్టు తల్వార్ల అసహజ ప్రవర్తన గురించి ఏమీ వ్యాఖ్యానించలేదు. పైగా తప్పుడుతడకలుగా విచారణ జరిపిన సిబిఐ అధికారులపై చర్యకు సిఫార్సు చేసినట్లు లేదు. ఆ వ్యాసంలోనే కేసులను సిబిఐ ఎలా నీరుకారుస్తోందో రాశాను. ఈ నాలుగేళ్లలో అమిత్ షాతో సహా హిందూత్వ వాదులందరిపై కేసులూ వీగిపోయాయి.
రేదర్ వీగిపోయేట్లా ప్రాసిక్యూషన్ వ్యవహరిస్తోంది. అమిత్ షా వంటి వాళ్లు అమాయకులని కోర్టు విశ్వసించడంతో సరిపోదు. వాళ్లపై తప్పుడు కేసులు పెట్టి వేధించినందుకు సిబిఐ అధికారులను, ప్రాసిక్యూషన్ లాయర్లను జైలుకి పంపాలి. అలా ఒకరిద్దర్ని పంపినపుడు సిబిఐ అధికారులు స్వీయరక్షణకైనా నోరు విప్పుతారు. అధికారంలో వున్నవారి ఆదేశాల మేరకు తాము సాక్ష్యాధారాలను తారుమారు చేశామని, దానిలో స్వలాభం ఏమీ లేదని కోర్టుకి విన్నవించుకుంటారు. ఈ కేసులో కూడా హైకోర్టు సిబిఐపై, పోస్టుమార్టమ్ సరిగ్గా చేయని డాక్టరుపై, కూటసాక్ష్యం చెప్పిన సాక్షులపై కేసులు పెట్టమని తీర్పులో సిఫార్సు చేయాలి. అప్పుడే యీ తీర్పుకి గౌరవం.హైకోర్టు తీర్పు తర్వాత చాలామంది తల్వార్లపై సానుభూతి కురిపిస్తున్నారు.
బిడ్డను పోగొట్టుకోవడంతో పాటు అప్రతిష్ఠ కూడా మూటగట్టుకున్నారని, జైలుకి కూడా వెళ్లారని జాలి పడుతున్నారు. నిజంగా ఏం జరిగిందో ఆ సర్వసాక్షి ఐన పరంధాముడికి తెలియాలి. కేసు గురించి బాగానే చదివాక నాకు అనిపించేదేమిటంటే – ఇది పరువు హత్య. హేమరాజ్‌తో అనుచిత ప్రవర్తన వలననే కూతుర్ని తండ్రి చంపేశాడు. హత్య కప్పిపుచ్చడానికి తల్లి సహకరించింది. వాళ్లు కావాలనే సాక్ష్యాలు లేకుండా చేశారు.
వచ్చిన పోలీసులు కూడా అది గ్రహించారు. ఆ ప్రాంతాల్లో పరువు హత్యలు సాధారణం కాబట్టి తలితండ్రుల పట్ల జాలితో చూసీచూడనట్లు వదిలేశారు. పక్కింటాయన ప్రమేయం లేకపోతే కేసు అంతటితో ముగిసిపోయేదే. కానీ విధి మరోలా తలిచింది. కేసు పెద్దదైంది. అప్పుడు తల్వార్లు పలుకుబడి ఉపయోగించారు. ఇది పెద్దింటి వ్యవహారం కాబట్టి యిలా ముగిసింది. ఏ మధ్యతరగతి వాళ్లో అయితే యింకోలా నడిచేది.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]