బంగ్లాదేశ్‌ ఎన్నికలు సవ్యంగా జరుగుతాయా?

1971లో పాకిస్తాన్‌నుండి విముక్తి పోరాటం చేసి బంగ్లాదేశ్‌ విడివడింది. ఆ పోరాటంలో 30 లక్షల మంది దాకా చనిపోయారని అంచనా.  ఆ సమయంలో స్వాతంత్రేచ్ఛతో అవామీ లీగ్‌ పాకిస్తాన్‌తో తలపడగా కొందరు పాకిస్తాన్‌ పక్షాన నిలిచి…

1971లో పాకిస్తాన్‌నుండి విముక్తి పోరాటం చేసి బంగ్లాదేశ్‌ విడివడింది. ఆ పోరాటంలో 30 లక్షల మంది దాకా చనిపోయారని అంచనా.  ఆ సమయంలో స్వాతంత్రేచ్ఛతో అవామీ లీగ్‌ పాకిస్తాన్‌తో తలపడగా కొందరు పాకిస్తాన్‌ పక్షాన నిలిచి తిరుగుబాటు చేసిన అవామీ లీగ్‌ వారిని పాకిస్తాన్‌ సైన్యం చేత చంపించారు. అలా 380 మంది బంగ్లాదేశీయుల చావుకి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకుడైనవాడు అబ్దుల్‌ ఖాదర్‌ మూలా. 

అతను నాయకత్వం వహిస్తున్న పార్టీ జమాత్‌-ఎ-ఇస్లామీ ప్రతిపక్షంలో వుండగా, నాటి తిరుగుబాటుదారు అవామీ లీగ్‌ పార్టీ యిప్పుడు అధికారంలో వుంది. ప్రధాని షేక్‌ హసీనా మూడేళ్ల క్రితం ఇంటర్నేషనల్‌ క్రైమ్‌ ట్రైబ్యునల్‌ ఏర్పరచి నాటి యుద్ధనేరాలపై విచారణ జరపమన్నారు. ఆ ట్రైబ్యునల్‌ యిచ్చిన తీర్పు ప్రకారం మూలాను డిసెంబరు 13న ఉరి తీసి, అతని జన్మస్థలంలో సమాధి చేశారు. 

వెంటనే జమాత్‌ అభిమానులు దేశమంతా అల్లర్లు లేవదీశారు. బాంబులు పేలాయి. కొట్లాటలు, దుకాణాలపై దాడులు జరిగాయి. 2014 జనవరి 5 న జరగవలసిన ఎన్నికలు శాంతియుతంగా జరుగుతాయా? లేదా అని అందరూ సందేహిస్తున్నారు. సైన్యం సహాయంతో ఆనాటికి పరిస్థితి అదుపులోకి వస్తుందని హసీనా ధైర్యంగా వుంది.  ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ అధినేత్రి బేగం ఖలీదా జియా, ప్రస్తుత ప్రభుత్వం గద్దె దిగి, ఆపద్ధర్మ ప్రధానిగా వేరెవరినైనా కూర్చోబెడితే తప్ప ఎన్నికలలో పాల్గొనబోమని ప్రకటించారు. ఎన్నికలు ఎలా జరుగుతాయో వేచి చూడాలి. 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]