గతవారంలో బాపు వర్ధంతి సందర్భంగా బాపురమణల అపూర్వమైన స్నేహబంధానికి గుర్తుగా నిలిచిన ‘‘లక్ష్మి’’ కథ గుర్తుకు వచ్చింది. బాపుది గీత, రమణది రాత కాబట్టి బాపు కార్టూన్లలో కూడా రమణ హస్తం వుందని అనుకుంటారు కొందరు. కానీ తమాషాగా రమణ పేర వెలువడిన తొలి కథకు బాపు ఘోస్ట్‌రైటింగ్ చేసిపెట్టారు! ఇది చాలా వింతగా తోచే విషయం.
బాపు తన పేర రాసిన కథల్లో ఒకటి ‘‘అమ్మ-బొమ్మ’’ చిన్న పిల్లవాడిగా వున్నపుడు రాసినది. ‘‘బాల’’ అనే పాప్యులర్ పిల్లల పత్రికలో పడింది. మరొకటి ‘‘మబ్బూవానా మల్లెవాసనా’’ (1957) అని ఆంధ్రపత్రిక వీక్లీలో పడింది. రమణగారు రాసినట్లే వుంటుంది. మరి ‘‘లక్ష్మి’’ కథ ఎలా వుంటుంది?
తెలియదు. ఎందుకంటే ముళ్లపూడి కథల సంపుటాలు వేటిల్లోనూ దాన్ని చేర్చలేదు. అది 1953 ప్రాంతంలో ఆంధ్రప్రభ వీక్లీలో పడినట్లు బాపురమణలకు గుర్తు తప్ప కథాంశమేమిటో యిద్దరికీ గుర్తు లేదు. పాత సంచికలేవీ దగ్గర పెట్టుకోలేదు. రమణగారి కథాసంకలనం లోంచి ‘‘ఛాయలు’’ కథను తీసుకుని ఇంగ్లీషులోకి అనువాదం చేయడం ద్వారా ఆయన పరిచయం సంపాదించగానే ‘‘ఇది ఎప్పుడు ఏ సంచికలో తొలిసారి పడింది?’’ అని అడిగాను. ‘‘ఏమోనండి, అప్పట్లో చాలా రచనలు, చాలా పేర్లతో రాశాను కానీ అవేమీ దొరకటం లేదు’’ అన్నారాయన.
ఇక అప్పణ్నుంచి రమణగారి రచనల గురించి నా అన్వేషణ ప్రారంభమైంది. మా తమ్ముడు శ్రీధర్ హైదరాబాదులోని లైబ్రరీలలో పాత సంచికల్లోంచి ఆయన రచనలని అనుకున్నవి సేకరించి, జిరాక్స్ కాపీలు మద్రాసులోని నాకు పంపేవాడు. నేను రమణగారికి చూపించి, అవునా కాదా అని నిర్ధారించుకునేవాణ్ని. అలా పోగేసిన కొన్నిటితో ‘‘బొమ్మా-బొరుసూ’’ (1995) పుస్తకం తయారయ్యి బాగా అమ్ముడుపోయింది.
మొత్తం ఆయన రచనలన్నీ 8 సంపుటాల సాహితీసర్వస్వంగా వేయాలని పట్టుబట్టి చివరకు 2001లో తొలి సంపుటాన్ని తేగలిగాం. మిస్సయిన రచనల గురించి మాట్లాడుతూంటేనే ‘‘లక్ష్మి’’ కథ గురించి తెలిసింది కానీ ఆంధ్రప్రభ పాత సంచికలు దొరకలేదు. హైదరాబాదులోని ఆంధ్రప్రభ ఆఫీసులో అడిగితే లేవన్నారు.
రమణ 1953లో ఆంధ్రపత్రికలో ఉద్యోగంలో చేరేనాటికి ఆ ఏడాదే ఆంధ్రప్రభ వీక్లీలో ఆయన రెండు కథలు ‘‘ఛాయలు’’(1953 ఫిబ్రవరి), ‘‘ఆకలీ ఆనందరావు’’ (1953 జులై) ప్రచురితమైన చాలా పేరు తెచ్చుకున్నాయి. నగర వాతావరణంలో రాసిన తొలి తెలుగు కథలనవచ్చు వాటిని. చైతన్య స్రవంతి శైలిలో రాసిన ఆ కథలు మామూలు ఫార్మాట్‌లో యిమడవు. మరి ఈ ‘‘లక్ష్మి’’ కథ వాటి కంటె ముందే ప్రచురించబడింది. పోనీ అది ఆయన సొంత రచనా అంటే కాదు, ఘోస్ట్ చేత రాయించినది!
‘ఇలా తొలిరచనే ఘోస్ట్ చేత రాయించడమేమిటండీ!’ అని రమణగారిని అడిగితే రమణగారి సమాధానం – ‘‘నేను కథలు రాస్తానని బెదిరించడమే కానీ కాగితం మీద కలం పెట్టడానికి బద్ధకించడంతో, నాకు ధైర్యం చెప్పడానికి నా పేర బాపుయే కథ రాసి, బొమ్మ వేసి పెట్టాడు. ఇడ్లీ కన్న పచ్చడే బాగుందంటూ సంపాదకులు వేసుకున్నారు.’’ అని. తన స్నేహితుడి టేలంటును అందరి కంటె బాగా ముందుగా గుర్తించి, తనను ప్రోత్సహించడానికి బాపు ఎంత చొరవ తీసుకున్నారో తెలుస్తోంది కదా! అందుకే వారి స్నేహం అలా నిలబడింది!
ఇది తెలిశాక కథ ఎలాగైనా సంపాదించాలన్న పట్టుదల పెరిగింది. 2000 సం. ప్రాంతంలో ఇంటర్నెట్ విరివిగా వాడకంలోకి వచ్చింది. కొన్ని ప్రచురణ సంస్థలు తమ పాత పత్రికలను స్కాన్ చేసి నెట్‌లో పెట్టడం మొదలెట్టాయి. కొంతకాలానికి వాటి వలన ఆదాయం కానీ, ప్రచారం కానీ ఏమీ రావడం లేదని గ్రహించి నెట్‌లోంచి తీసేశాయి. ఆంధ్రప్రభా అలాగే చేసింది. దానిపైనే నిఘా వేసి వున్న నాకు ‘‘లక్ష్మి’’ కథ 1953 జనవరి 7 సంచికలో దొరికేసింది. కథ ఎలా వుందాన్న ఆత్రుత నాకెంత వుందో, ‘రచయిత’ రమణగారికి, ఘోస్ట్ రచయిత బాపుగారికి కూడా వుంది.
కథ స్వగతంలో సాగుతుంది. (నిజానికి దాన్ని బట్టే రమణగారిది కాదని చెప్పవచ్చు. ఆయన ఆత్మకథ తప్ప వేరే కథా స్వగతంలో రాయలేదు) అతను బొమ్మలు గీస్తూంటాడు. పల్లెటూరి నుంచి పట్నం వచ్చి చదువుకుంటూ వుంటాడు. ఊళ్లో మామయ్య కూతురు సరోజ అంటే యిష్టం వుంది. కానీ బయటపడి చెప్పే ధైర్యం లేదు. అంతలోనే ఆమె స్నేహితురాలు లక్ష్మి అనే అమ్మాయి పరిచయమౌతుంది. ఆమెది వేరే ఊరు. ఆమె అంటే అభిమానం పెంచుకుంటాడు తప్ప ఎవరికీ వ్యక్తం చేయడు. ఆమె ఏ వూళ్లో వుంటుందో అడిగే ధైర్యం చేయడు. పట్నంలో కమల అనే అమ్మాయిని చూసి లక్ష్మి పోలికలు ఆమెలో వెతుక్కుంటాడు.
చివరకు చదువు పూర్తయ్యాక మామయ్య ఊరెళ్లి సరోజనిచ్చి పెళ్లి చెయ్యమని అడుగుదామనుకుంటాడు కానీ అప్పటికే ఆమె పెళ్లి వేరే కజిన్‌తో ఫిక్సయిపోయింది. నిరాశగా పట్నం తిరిగి వచ్చి లక్ష్మి పోలికలతో బొమ్మలు వేస్తూంటాడు. ఆమె పోలికలున్నాయి కదాని కమలను చేసుకోవడం ధర్మం కాదనుకుని పెళ్లి మానేశాడు. కొన్నేళ్లు గడిచాయి. ఒకసారి సరోజతో మాట్లాడుతూ లక్ష్మి గురించి అడిగితే ‘‘నా పెళ్లికి కొన్నాళ్ల ముందర వాళ్ల వూళ్లో మశూచికం పోసి చచ్చిపోయిందట.’’ అంటుందామె.
ఇదీ కథ. చాలా చప్పగా వుందనిపించింది. కొన్నిచోట్ల వాక్యాల్లో చమక్కులున్నాయి కానీ, రమణ పేర, బాపు పేర వెలువడిన యితర కథల స్టాండర్డ్ లేదు. నా వ్యాఖ్యలతో రమణగారికి కథ పంపాను. బాపుగారు ఫోన్ చేసి అడిగారు. చెప్పిన కథ విని ‘సెంటిమెంటల్ స్టఫన్నమాట, వదిలేయండి’ అన్నారు నవ్వుతూ. టెక్నికల్‌గా చూస్తే ఈ కథను సాహితీసర్వస్వంలోని ‘‘కథారమణీయం’’ పుస్తకాల్లో వేయాలి. కానీ వేయబుద్ధి కాలేదు. అలా అని యీ చిత్రమైన హిస్టారికల్ ఈవెంట్‌ను వదిలేయబుద్ధి కాలేదు. అందుకని ‘‘కదంబరమణీయం’’ – 2లో ‘‘వైవిధ్యరమణీయం’’ అనే శీర్షిక కింద కథ యిచ్చి, కింద రమణ పేర బాపు రాసిన కథ – 07 01 1953 అని తెలిపాను.
ఇలాటివి తెలుసుకుంటే పరిశోధన చేసే వాళ్ల కష్టాలు అర్థమవుతాయి. రమణగారి కథలు సేకరించే ప్రయత్నంలో బయటపడి, పుస్తకరూపంలో రాని కొన్ని కథలను ప్రస్తావిస్తూ 1994 జూన్ 28 ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘‘ముళ్లపూడికి బహిరంగలేఖ’’ అని రాసి ఆంధప్రభ వీక్లీకి పంపాను. దానిలో కథకుడిగా ఆయన వైవిధ్యాన్ని పాఠకులందరికీ ఒక్కసారి గుర్తు చేశాను. పనిలో పనిగా పుస్తకరూపంలో రాని, నేను సేకరించిన కొన్ని కథలను ఉదహరించాను. దీనిలో ఒక పొరపాటు దొరలింది. రమణశ్రీ అనే ఆయన రాసిన ‘ఆత్మసందేశం’ కథను ఈయన ఎక్కవుంటులో వేశాను. లైబ్రరీలో పేజీ చిరిగిపోయి ‘శ్రీ’ ఎగిరిపోయింది. ఈయన వట్టి ‘రమణ’ పేరుతో కూడా రాశారు కాబట్టి ఆయనదే అనుకున్నాను. ఆయనకు చూపిస్తే ‘ఏమో, గ్యాపకం లేదండీ’ అన్నారు.
ఆ కథ ఎన్నిసార్లు చదివినా రమణగారిదిలా అనిపించలేదు. మళ్లీ లైబ్రరీకి వెళ్లి యీసారి విషయసూచిక చూడబోయాను. ఆ పేజీ చినగలేదు. అక్కడ రమణశ్రీ అని వుంది. (తర్వాత నండూరి రామమోహనరావుగారు చెప్పారు, పిఠాపురం నుంచి ఒకాయన ఆ పేరుతో కథలు పంపేవారని) నాలిక కరుచుకున్నాను. ఆర్నెల్లలోపే నా తప్పు నాకు తెలిసింది కానీ ఈ లోపునే ఈ బహిరంగలేఖ అచ్చయిపోయింది, రమణగారి రచనలపై రిసెర్చి చేసిన ఒకావిడ తన పేపర్లో ఆ కథ పేరు రాసేశారు, నా పొరబాటు కారణంగా! ఇప్పటికీ ఫీలవుతాను.
సాహితీసర్వస్వం 5 వ సంపుటం కదంబ రమణీయం -2 లో ‘‘గిరీశం లెక్చర్లు’’ వేశాను. ఆ పేరుతో వున్న పుస్తకంలోని వ్యాసాలన్నిటితో బాటు 30 ఏళ్ల తర్వాత 1992లో ఆటా సభల సందర్భంగా, కన్యాశుల్కం శతజయంతి ఉత్సవాల సందర్భంగా పివి నరసింహారావుగారిపై ‘భాణాలు’ వేస్తూ రాసిన వ్యాసాలను కూడా జోడించాను. అమ్మయ్య, అన్నీ కవర్ అయ్యాయి అనుకున్నాను. 2004 జనవరిలో ఆ సంపుటం తొలి ముద్రణ జరిగింది.
గత మూడు నెలలుగా మా యింట్లో పాత సంచికలన్నీ దుమ్ము దులుపుతూంటే ‘‘విజయచిత్ర’’ 1967 జులై ప్రత్యేక సంచికలో రమణగారు రాయగా ‘‘ముద్దు ముచ్చట’’ పేర ప్రచురించబడిన ఒక గిరీశం లెక్చరు దొరికింది. అది పుస్తకరూపంలో యిప్పటిదాకా రాలేదు. కదంబ – 2 తదుపరి ముద్రణలో చేర్చాలి. కుదురుతుందో లేదో తెలియదు. ఇలాటి సంఘటనలు చూస్తూంటే సాహితీ పరిశోధన అనేది నిరంతర ప్రక్రియ అనిపిస్తుంది.
ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2020)
[email protected]