కరోనా రావడానికి ముందే దేశ ఆర్థికవ్యవస్థ కుదేలైంది. పారిశ్రామిక రంగం దెబ్బ తింది. బ్యాంకులకు ప్రభుత్వధనాన్ని యిచ్చి ఆదుకోవలసి వచ్చింది. నిరుద్యోగిత బాగా పెరిగింది. ఇంతలో కరోనా వచ్చింది. ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారింది. ఉద్యోగాలు పోతున్నాయి. ప్రజల దగ్గర డబ్బు లేదు. భవిష్యత్తు అగమ్యగోచరమైంది. కరోనా విషయంలో కూడా ప్రభుత్వం నుండి చాలా తప్పులే జరిగాయి. ఆలస్యంగా మేల్కొనడంలో, లాక్‌డౌన్ హఠాత్తుగా ప్రకటించడంలో, వలస కార్మికుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడంలో, రాష్ట్రప్రభుత్వాలను ఆదుకోకపోవడంలో ప్రభుత్వ వైఫల్యాలు చాలా వున్నాయి. దానికై ప్రజలు కేంద్రప్రభుత్వంపై, దాన్ని నడుపుతున్న బిజెపిపై ఆగ్రహం చెంది, దాన్ని ఓడిస్తారని అనుకున్నవారి అంచనాలు తల్లకిందులు చేస్తూ, దేశమంతా జరిగిన ఉపయెన్నికలలో బిజెపి నెగ్గింది.
దక్షిణాదిన తెలంగాణ, కర్ణాటక నుంచి ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ వరకు, అధికారంలో వున్న చోటా, లేనిచోటా కూడా బిజెపి గెలిచింది. మొత్తం 11 రాష్ట్రాలలో 59 అసెంబ్లీ స్థానాలకు ఉపయెన్నికలు జరిగితే వాటిలో 40 (68 శాతం) గెలిచింది. వీటిల్లో ఎక్కువగా 19 గెలిచినది మధ్యప్రదేశ్‌లో. అవన్నీ గతంలో కాంగ్రెసు స్థానాలే. తర్వాత ఎక్కువగా 8 గెలిచిన రాష్ట్రం గుజరాత్. అక్కడా కాంగ్రెసును ఓడించింది. తర్వాతది యుపి. 7 స్థానాలు గెలిచింది. అవన్నీ తన స్థానాలే. మణిపూర్‌లో 5 స్థానాల్లో 4టిని కాంగ్రెసు నుంచి గెలుచుకుంది. కర్ణాటకలో 2 చోట్ల జరిగితే ఒక జెడిఎస్ స్థానాన్ని, ఒక కాంగ్రెసు స్థానాన్ని గెలుచుకుంది. ఈ ఐదు రాష్ట్రాలలో బిజెపి అధికారంలో వుంది. పోగొట్టుకున్నది ప్రతిపక్షంలో ఉన్న ఒడిశాలో 1 స్థానాన్ని. ప్రతిపక్షంలో ఉన్నా గెలిచినది తెలంగాణలో 1 స్థానాన్ని.
కాంగ్రెసు తను అధికారంలో వున్న ఛత్తీస్‌గఢ్‌లో 1 స్థానాన్ని గెలుచుకుంది, అధికారం పంచుకుంటున్న ఝార్‌ఖండ్‌లో 1, బిజెపి అధికారంలో వున్న మధ్యప్రదేశ్‌లో 9 స్థానాలు, హరియాణాలో 1, నిలుపుకుంది. మొత్తం 12 (59 స్థానాల్లో యిది 20 శాతం) కాగా పోగొట్టుకున్నవి – మధ్యప్రదేశ్‌లో 19, గుజరాత్‌లో 8, మణిపూర్‌లో 5, కర్ణాటకలో 1. మొత్తం 33 (56 శాతం). సమాజ్‌వాదీ యుపిలో 1 స్థానాన్ని, జెఎంఎం ఝార్‌ఖండ్‌లో 1 నిలుపుకున్నాయి. బిజెడి ఒడిశాలో 1 స్థానాన్ని నిలుపుకుని, బిజెపి నుంచి మరో స్థానాన్ని గెలుచుకుంది. నాగాలాండ్‌లో 1 స్థానం ఎన్‌డిపిపి నిలుపుకోగా, మరో దాన్ని స్వతంత్రుడు గెలుచుకున్నారు. మణిపూర్‌లో ఒక స్వతంత్రుడు గెలిచాడు.
బిజెపి తరఫున గెలిచినవారిలో ఫిరాయింపుదారులు ఎక్కువగా వున్నారు. ఓటర్లు యీ ఫిరాయింపులను ఆమోదించారని అనుకోవాలి. యుపిలో హాత్రాస్ మానభంగం సంఘటన జరిగినా, యుపికి చెందిన వలస కార్మికులు అష్టకష్టాలు పడినా, అవేమీ ఓటర్లను కదిలించలేదు. బిజెపి గర్వంగా చెప్పుకోదగ్గ విజయం దుబ్బాకది. తెలంగాణలో తమకు తిరుగులేదని విర్రవీగుతున్న తెరాస ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడినా, స్వల్ప మార్జిన్‌తోనైనా ఓడించడం గొప్పే. తెరాసకు బుద్ధి చెప్పాలని ఓటర్లు అనుకుని వుండవచ్చు, కాంగ్రెసు తన ఓట్లు బదిలీ చేసి వుండవచ్చు, ఏమైనా 63 వేల ప్లస్ ఓట్లు సాధించడం చిన్న విషయం కాదు. ముఖ్యంగా కెసియార్‌తో కలహించి వచ్చిన రఘునందన్‌ను ఓడించాలని తెరాస ఎంత పట్టుపట్టిందో ఊహించుకుంటే, యిది ఘనవిజయంగా చెప్పుకోవాలి. అలాగే కర్ణాటకలో ఒక్కళిగ కంచుకోటలోని సిరా సీటు గెలవడం కూడా విశేషమే! మాజిక్ చేయగలడని పేరు బడిన కర్ణాటక కాంగ్రెసు నాయకుడు డికె శివకుమార్ యీసారి భంగపడ్డాడు.
కాంగ్రెసు విషయానికి వస్తే దాని వైఫల్యం అన్ని చోట్లా కొట్టవచ్చినట్లు కనబడింది. ఎక్కడైనా ఎవరైనా నెగ్గినా, అది అభ్యర్థి గొప్పతనమే తప్ప, అధిష్టానం గొప్ప అనుకోవడానికి ఏమీ లేదు. రాహుల్ అయితే పప్పుసుద్ద, ప్రియాంకా అయితే పొడిచేస్తుందనుకున్నారు కానీ యుపిలో ఫలితాలు చూశాక అర్థమై వుంటుంది – సోనియా కుటంబంలో ఎవరూ నయాపైసాకు చెల్లరని! బిహార్ విషయానికి వస్తే కాంగ్రెసుకు ఎక్కువ సీట్లు యివ్వడం చేతనే మహాగఠ్‌బంధన్ కొద్దిలో అవకాశాన్ని జారవిడుచుకుంది. దానికి 70 సీట్లు కేటాయిస్తే 19 (27 శాతం) మాత్రం గెలిచింది. 2017లో యుపిలో అఖిలేశ్ యిదే తప్పు చేశాడు. కాంగ్రెసుకు 105 సీట్లు కేటాయించాడు. 7 (6.6 శాతం) గెలిచింది. అఖిలేశూ ఓడిపోయాడనుకోండి. అతను కనీసం 298లో 47 (16.7 శాతం) గెలిచాడు. కాంగ్రెసుతో పొత్తంటే ధృతరాష్ట్ర కౌగిలి అన్నమాట.
అయినా బిహార్ ఎన్నికల సమయంలో రాహుల్ ఏమంత బిజీగా వున్నాడని 9 స్థానాల్లో మాత్రమే ప్రచారం చేయాలి? అతనికి రాజకీయాల్లో ఏ యింట్రస్టూ లేదని స్పష్టంగా తెలుస్తోంది. సోనియాకు ఓపిక లేదు, ఆరోగ్యం లేదు. అయినా పదవి వదలదు. రాహుల్‌ను బలవంతంగా తెచ్చి కూర్చోబెడుతుంది. పార్టీపై నుంచి తమ కుటుంబం పట్టు తప్పిపోకూడదన్న తపన తప్ప మరేమీ లేదు. సంస్థాగత ఎన్నికలు జరపండి, ముసలీ, ముతకా తప్పుకోండి. కొత్త నీరు రానీయండి. యువతరాన్ని పార్టీలో తీసుకురండి అని హితవు చెప్పిన వాళ్లందరికీ శిక్షలు పడ్డాయి. పార్టీ నాశనమై పోయినా ఫర్వాలేదు కానీ, తమ ఉక్కు పిడికిలి నుండి జారిపోకూడదన్న పంతం తప్ప సోనియాకు వేరేమీ లేదు. ఆమె పిడికిలి నుంచి యిప్పటిదాకా పార్టీ జారిపోలేదు కానీ అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు జారిపోతున్నాయి. కాంగ్రెసును జాతీయ పార్టీగా రద్దు చేసేసి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వేర్వేరు యూనిట్లుగా మారిపోతే స్థానిక నాయకులైనా బతికి బట్ట కడతారు. బెంగాల్‌లో మమతా, మహారాష్ట్రలో శరద్ పవార్, ఆంధ్రలో జగన్.. బయటకు వచ్చి నిలదొక్కుకున్నవారే కదా!
ఇక బిహార్ ఎన్నికల ఫలితాలకు వస్తే, పూర్తి గణాంకాలు వచ్చాక విపులంగా విశ్లేషణ చేసుకోవచ్చు కానీ ప్రస్తుతానికి చెప్పుకోవలసిన దేమిటంటే, ఎంతో బలిష్టమైన బిజెపి-జెడియు కూటమిని తేజస్వి భయపెట్టగలిగాడు కానీ పదవీచ్యుతుల్ని చేయలేక పోయాడు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పయ్యాయి. అందరూ ఎంజిబి (మహాగఠ్‌బంధన్)కే, మార్జినల్‌గా నైనా ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. ఎబిపి- సిఓటర్ ఒక్కటే 104-128 సీట్లు ఎన్‌డిఏకు వస్తాయంది. (అంతిమంగా 125 వచ్చాయి) తక్కినవాళ్లందరూ 115 లోపే అన్నారు. బిజెపి తరఫున మోదీ దగ్గర్నుంచి అతిరథ, మహారథులందరూ పోరాడినా, అంగబలం, అర్థబలం వున్నా దానికి 74 సీట్లు మాత్రమే వచ్చాయి. ఒంటరి పోరాటం చేసిన 31 ఏళ్ల తేజస్వి దాని కంటె 1 సీటు ఎక్కువగా 75 తెచ్చుకున్నాడు. బిజెపి కొన్ని సీట్లు జెడియుకి యివ్వవలసి వచ్చిందిగా అనవచ్చు. కానీ ఆ కారణంగా దానికి జెడియు ఓట్లు పడి వుంటాయి. తేజస్వికి వున్న భాగస్వాములు అందరూ మైనస్సే. అందరి కంటె ముఖ్యంగా కాంగ్రెసు. అది తను మునగడమే కాక, ఆర్‌జెడిని ముంచింది. ఇక లెఫ్ట్ పార్టీలకు కొన్ని నియోజకవర్గాల్లోనే పట్టుంది. దానికి గతంలో 3 వుంటే యీ సారి 16 వచ్చాయి.
ఎన్‌డిఏ కూటమిలో లాభపడినది బిజెపి కాగా దెబ్బ తిన్నదెవర్రా అంటే జెడియు. గతంలో లాలూతో కలిసి పోటీ చేసి 71 తెచ్చుకుంటే యిప్పుడు 43 దగ్గర చతికిలపడింది. నీతీశ్, లాలూను దగా చేసి, బిజెపితో చేతులు కలపడం బిహార్ ఓటర్లు హర్షించలేదా? అలా అయితే 2019 పార్లమెంటు ఎన్నికలలో 39లో 16 సీట్లు ఎందుకిచ్చారు? మరి యీసారి ఏం జరిగింది? బిజెపి నుంచి ఓట్ల బదిలీ జరగలేదా? చిరాగ్ పాశ్వాన్‌ను బి టీముగా పెట్టి, బిజెపి కావాలని దెబ్బ తీసిందా? బిజెపి 110 స్థానాల్లో పోటీ చేసి, 74 గెలిచింది. అంటే స్ట్రయిక్ రేట్ 67 శాతం. మరి జెడియు 115 స్థానాల్లో పోటీ చేసి 43 మాత్రమే గెలిచింది. అంటే స్ట్రయిక్ రేట్ 37 శాతం, బిజెపిలో దాదాపు సగం!
జెడియు స్ట్రయిక్ రేటు అంత తక్కువగా వుండి, బిజెపి స్ట్రయిక్ రేట్ అంత బాగుండడం వింతగా లేదూ? బిహార్ ఎన్నికలలో స్టార్‌గా వెలిగిన జెడియు స్ట్రయిక్ రేట్ 53 మాత్రమే. నీతీశ్ సమర్థుడైన ముఖ్యమంత్రి, ఆయన తప్ప మా కూటమికి వేరెవ్వరూ నాయకుడు లేడు అని మోదీ దగ్గర్నుంచి అందరూ పదేపదే చెప్పారు కదా. అలాటాయన పార్టీకి అంత తక్కువ ఓట్లా? చిరాగ్ ఎల్‌జెపి 1 స్థానాన్ని 300 ఓట్ల తేడాతో గెలుచుకుంది, 8 చోట్ల ద్వితీయస్థానంలో వుంది, కానీ జెడియు అవకాశాలను 27 స్థానాల్లో దెబ్బ తీసిందట. వాటిల్లో ఎల్‌జెడికి పడిన ఓట్లు జెడియుకి పడి వుంటే అవి గెలిచి జెడియుకి 70 వచ్చి వుండేవి. మర్యాద దక్కి వుండేది. చిరాగ్ నిలబెట్టిన వారిలో 25 మంది బిజెపి నుంచి వచ్చిన నాయకులున్నారని గుర్తుంచుకోవాలి.
చిరాగ్‌ను సుశీల్ మోదీ ‘ఓట్ కట్‌వా’ అన్నాడు. అతను బిజెపి ఓట్లను చీల్చలేదు కానీ, జెడియు ఓట్లను చీల్చాడు. నీతీశ్‌కు అప్తుడైన సుశీల్ ఒక్కడు తప్ప బిజెపిలో నాయకులెవరూ – మోదీతో సహా – చిరాగ్ రాజకీయ వ్యూహాన్ని ఖండించలేదు. నీతీశ్ సీట్లు తగ్గడం ఒక పథకం ప్రకారం జరిగిందనుకుంటే, కాంగ్రెసుతో జట్టుకట్టి తేజస్వి మునిగినట్లే బిజెపితో జట్టుకట్టి నీతీశ్ మునిగాడనుకోవాలి. ఇప్పుడందరూ అడిగే ప్రశ్నేమిటంటే – బిజెపి నీతీశ్‌ను ముఖ్యమంత్రి చేస్తుందా లేదా అని. ‘ఈ విజయమంతా మోదీదే’ అని ప్రకటించిన కైలాస్ విజయవర్గీయ కూడా ‘నీతీశ్ విషయంలో మాట తప్పం’ అని చెప్పాడు. బిజెపికి వరుసగా భాగస్వాములతో చెడుతూ వస్తోంది. నీతీశ్ విషయంలో దగా చేస్తే పరువు పోతుంది. అందువలన అతన్ని ముఖ్యమంత్రిని చేసి, అధికారాలు కత్తిరించి, ముఖ్యమైన పదవులన్నీ తాము తీసుకోవచ్చు.
మహారాష్ట్రలో శివసేన పనిని నీతీశ్ చేస్తాడా అని కొందరికి సందేహాలు వచ్చాయి. ఎందుకంటే బిజెపి కంటె ఆర్‌జెడికి ఎక్కువ సీట్లు వచ్చాయి. పైగా కాంగ్రెసు, లెఫ్ట్ వంటి పార్టీల మద్దతు కూడా వుంది కాబట్టి నీతీశ్ ఆ కూటమిలో చేరితే 153 సీట్లతో దాదాపు మూడింట రెండు వంతుల మెజారిటీతో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుంది. కానీ యిక్కడ వచ్చిన ప్రధానమైన చిక్కేమిటంటే తేజస్వి నీతీశ్ పేరెత్తితేనే మండిపడతాడు. నిజానికి నీతీశ్‌తో పొత్తుకు తన తండ్రి లాలూని 2015లో ఒప్పించింది తేజస్వియే. కానీ 2017లో తనపై లేనిపోని ఆరోపణ చేసి, పదవి పీకేసి యింటికి పంపేయడంతో అతను తన యింటి ముందు ‘నీతీశ్ కాకా తప్ప వేరెవరైనా రావచ్చు’ అని బోర్డు పెట్టుకున్నాట్ట. అటు తలుపులు మూసుకుపోయాయి కాబట్టి నీతీశ్ బిజెపి యిచ్చే తగు మర్యాదతోనే సరిపెట్టుకోవాలి.
బిహార్‌లో ఎన్‌డిఏ ఓటమి అధికారం కోల్పోయి వుంటే ఆ ప్రభావం బెంగాల్‌పై పడుతుందనుకున్నారు. ఇక్కడ గెలిచింది కాబట్టి, బిజెపి క్యాడర్‌కు ఉత్సాహం కలగవచ్చు కానీ, మమత తేజస్విలా కొత్త గిత్త కాదు, కాకలు తీరిన యోధురాలు. పైగా అధికారంలో వుంది. అక్కడ భాగస్వాముల గోల లేదు. ముఖాముఖీ పోరాటమే. నీతీశ్ 15 ఏళ్లగా పాలిస్తూ ప్రభుత్వవ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది. మమత పదేళ్ల నుంచి పాలిస్తోంది కాబట్టి ఆ మేరకు ప్రభుత్వవ్యతిరేకత ఎదుర్కోవాలి. ఇక్కడ కులసమీకరణాలైతే అక్కడ మతం పేర రాజకీయాలు జరుగుతున్నాయి. దాని విషయం మరోసారి. బిహార్ గణాంకాలు పూర్తిగా వచ్చాక ఏ వర్గం వారు ఏ పార్టీని ఆదరించారనేది చర్చించుకోవచ్చు.
ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2020)
[email protected]