తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే ఆకాంక్షతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలున్నాయి. ఢిల్లీకి వెళ్లి మరీ కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజ్వలించేందుకు వారు ఆహుతయ్యారు.
అంతజేసీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాకా సామాన్యులకు ఎంత మేలు జరిగిందో చెప్పే వారు లేరు. ఆత్మగౌరవం, స్వయం పాలన అనే రాజకీయ నినాదాలు అయితే సాకరం అయినట్టే. అయితే ప్రజాస్వామ్య దేశంలో అలాంటి నినాదాల వల్ల ఉపయోగం ఎంత? అనేది వేరే చర్చ.
ఆ సంగతంతా అలా ఉంటే.. తెలంగాణలో రాజకీయ కారణాల చేత ఆత్మహత్యలు చేసుకోవడం అనే తీరు కొనసాగుతూ ఉన్నట్టుంది. దుబ్బాక ఉప ఎన్నికే ఇద్దరు కార్యకర్తల ఆత్మహత్యకు కారణం కావడం విషాదకరం. వారిలో ఒకరు బీజేపీ కార్యకర్త, మరొకరు టీఆర్ఎస్ కార్యకర్త.
దుబ్బాక ఉప ఎన్నిక ప్రచార దశలో బీజేపీ నేత బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేయగా, ఆయనను తక్షణం విడుదల చేయాలంటూ ఒక కమలం పార్టీ కార్యకర్త పెట్రోల్ పోసుకుని తనను తాను దహించుకున్నాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలై అతడు మరణించారు.
ఉప ఎన్నికల సమయాల్లో నేతల అరెస్టులు, విడుదలలు మామూలే. అలాంటి దాని కోసం ఒక వ్యక్తి తన ప్రాణాలను తీసుకున్నారు. విజయం బీజేపీని వరించిన నేపథ్యంలో ఈ విజయాన్ని ఆ కార్యకర్తకు అంకితం ఇచ్చినట్టుగా తెలంగాణ బీజేపీ ప్రకటించింది. ఈ అంకితాలతో వచ్చేదేముంది? ఈ విజయంతో పోయిన వ్యక్తి ప్రాణాలు దక్కవు కదా.
ఇక దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోయిందని మరో కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆయన అంత్యక్రియలకు టీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావు హాజరై పాడె మోశారు.
గెలుపు కోసం పోరాటంలో ఆత్మహత్యలు, ఓడిపోయిన నిరుత్సాహంలో ఆత్మహత్యలు. అయితే దుబ్బాక ఉప ఎన్నికతో ప్రభుత్వాలు పడేది లేదు, లేచేది లేదు. అసలు ప్రభుత్వాలు పడినా, లేచినా ఆత్మహత్యలతో సాధించేది ఏమీ లేదు. రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకోవడమే చింతించాల్సిన అంశం, అలాంటిది రాజకీయం కోసం ఆత్మహత్యలు మరింత విషాదకరం. తెలంగాణలో ఈ తీరు మారాలి.