యుద్ధంలో వుండగా యిరు పక్షాలూ తమ సైన్యాన్ని ఉత్సాహపరచడానికి ‘మనం విజయపథంలో వున్నాం, మనల్ని ఎదుర్కున్నవాడు మట్టిలో కలిసిపోతాడు’ అని రణనినాదాలు యిస్తారు. అవన్నీ నిజాలు కావలసిన పని లేదు. ఈ క్లెయిమ్స్ ఒక్కోప్పుడు శ్రుతి మించుతాయి. అలాటి వాటిల్లో ఒకటి ప్రసుత్తం ప్రభుత్వంతో జరుగుతున్న సమరంలో కొందరు ఉద్యోగ నాయకులు ‘మాతో పెట్టుకుంటే ప్రభుత్వాలు తారుమారై పోతాయి. ఎన్నికలొచ్చినపుడు మా తడాఖా చూపిస్తాం.’ అనడం. ఒక్కోప్పుడు వాళ్లు స్వయంగా అనకపోయినా, వాళ్ల తరఫున వాదించేవాళ్లు అంటూంటారు, ఈ భయంతోనైనా ప్రభుత్వం దిగిరావాల్సిందే అంటారు. ఈసారే కాదు, ఎన్నో దశాబ్దాలుగా యిది వింటున్నాను. అలాగే ప్రభుత్వం వైపు నుంచి కొందరు రెచ్చగొడుతూంటారు. ‘పోనీ కదాని ఏదో యిచ్చాం. అయినా వీళ్లు హద్దు మీరి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం తలచుకుంటే ఎక్కడ తేలతారో తెలుసుకోవటం లేదు.’ అంటూంటారు. ‘మాకు ఎదురు తిరిగితే ప్రజలే బుద్ధి చెప్తారు.’ అని కూడా బెదిరిస్తారు.
ఈ హెచ్చరికలు ఏ వరకు ఫలిస్తాయనేది చర్చించడానికే యీ వ్యాసం. ఉద్యోగుల డిమాండు సబబా, ప్రభుత్వ వాదన సబబా అనేది చర్చకు తీసుకుని రావటం లేదు. ఎందుకంటే పూర్తి వివరాలు మనకు అందుబాటులోకి రావు. ఇరు పక్షాల వారి ప్రకటనలను దగ్గర పెట్టుకుని చూసినా క్లియర్ పిక్చర్ రాదని ఎన్నో ఏళ్లగా అనుభవంతో తెలుసుకున్నాను. ఉద్యోగి వర్గాలు ‘మన దగ్గరిస్తున్న సిసిఏ కేరళ వంటి చిన్న రాష్ట్రం కంటె తక్కువ’ అని చెప్తాయి, ప్రభుత్వమేమో ‘మన దగ్గరిస్తున్న ఎచ్‌ఆర్‌ఏ యుపి వంటి పెద్ద రాష్ట్రం కంటె ఎక్కువ’ అంటుంది. గోవా కంటె మెడికల్ బెనిఫిట్స్ తక్కువని ఒకళ్లు, త్రిపుర కంటె లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఎక్కువని మరొకరు చెప్తారు. ఇలా నలుగురు గుడ్డివాళ్లు ఏనుగుని వర్ణించినట్లు వుంటుంది తప్ప ఎవరూ సమగ్ర రూపం యివ్వరు. ఈ వేతనాల సవరణ వలన జీతాలు యింత పెరిగాయి అని చెప్పడానికి ప్రభుత్వం రేపోమాపో రిటైరయ్యే సీనియర్ మోస్ట్ ఉద్యోగి జీతాన్ని ఉదహరిస్తుంది. జీతాలు యింతే పెరిగాయి అని చెప్పడానికి ఉద్యోగి సంఘం డిగ్రీ యింక్రిమెంటు కూడా లేని నిన్నోమొన్నో చేరిన ఉద్యోగి జీతాన్ని ఉటంకిస్తుంది.
ఉద్యోగులు అడిగినంత జీతం యిస్తే ప్రభుత్వంపై యింత భారం పడుతుంది అని ప్రభుత్వం సీనియర్ మోస్ట్ యింక్రిమెంట్‌పై లెక్కవేసి ఓ పేద్ధ అంకె చెపితే, అబ్బే యింతకంటె పడదు అని ఉద్యోగుల సంఘం జూనియర్ మోస్ట్ యింక్రిమెంటు ఆధారంగా లెక్కవేసి చిన్న అంకె చెపుతుంది. అసలు ఏ స్కేలులో ఎంతమంది వున్నారు, 1% పెంచితే అది ఎంతమందికి అప్లయి అవుతుంది, అనే లెక్కల్లో ఎప్పుడూ గందరగోళం వుండేది. ఉద్యోగి సంఘాల్లో నాయకులందరూ యిలాటి లెక్కల్లో ప్రవీణులు కారు. మేనేజ్‌మెంట్‌తో చర్చల్లో కూర్చునే కమిటీలో ఒకళ్లో యిద్దరో మాత్రం నోటితో చెప్పేయగలిగేవారు. మేనేజ్‌మెంట్ సైడు నుంచి వీళ్లను కౌంటర్ చేయగల మేధావులు ఒకళ్లిద్దరే. తక్కినవాళ్లలో ఒక్కోరిది ఒక్కో విద్య. గతచరిత్ర చెప్పేవాళ్లు, పరుషంగా మాట్లాడి అవతలివాళ్లను రెచ్చగొట్టేవారు, శాంతంగా మాట్లాడి వేడి చల్లార్చేవారు, ప్రభుత్వానికి అదనపు ఆదాయం ఎలా రావాలో సలహాలు చెప్పేవారు… యిలా ఉంటారు.
ఇప్పుడు కూడా చూడండి, కొన్నిటి గురించి బేసిక్‌లో యింత పర్శంటేజి అని చెప్తారు. మరి కొన్ని చోట్ల అబ్సల్యూట్ ఫిగర్స్ యిస్తారు. సిసిఎ (సిటీ కాంపెన్సేటరీ ఎలవన్స్) యింత యిచ్చేస్తున్నాం అని ప్రభుత్వం అంటుంది. అంత జనాభా ఉన్న సిటీలు నాలుగో ఐదో ఉన్నపుడు ఆ బెనిఫిట్ ఎంతమందికి చేరుతుంది? ప్రస్తుత ప్రభుత్వ విధానం ప్రకారం అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి, అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ అయితే ప్రతీదీ పెద్ద సైజు పట్టణంగానే మారుతుంది కానీ మెగాసిటీ కాదు. ఆ వూరి జనాభా బట్టి సిసిఏ, ఎచ్‌ఆర్ఏ (హౌస్ రెంట్ ఎలవన్స్) తగుమాత్రంగానే వుంటాయి. సినిమా టిక్కెట్ల విషయంలో చూడండి, జీవోలో గ్రామ పంచాయితీలో నాన్ఏసి థియేటర్లో టిక్కెట్టు 5 రూ. అని ఉన్నదాన్ని చూపించి, చాక్‌లెట్ రేటుకి వందల కోట్లు ఖర్చయిన సినిమా చూపించాలా? అని వాదించారు కొందరు. 5 రూ.లు టిక్కెట్టు అమ్మే థియేటర్లు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? వందల కోట్ల రూ.లు ఖఱ్చు పెట్టిన సినిమాలు తెలుగులో ఎన్ని తయారవుతున్నాయి? అనే వివరం ఎవరూ యివ్వరు.
ఇలాటి అరకొర సమాచారంతో, పాక్షిక సత్యాలతో ఒక అభిప్రాయానికి రావడం ఎవరికైనా కష్టమే. 11వ పిఆర్‌సి (పే రివిజన్ కమిషన్) అమలు తర్వాత జీతాలు పెరుగుతాయని ప్రభుత్వం అంది. అబ్బే కాదు, దీనితో జీతాలు తగ్గుతాయంటూ హైకోర్టులో పిల్ వేసిన పిటిషనర్ ప్రభుత్వాధికారుల సంఘం అధ్యక్షుడి జీతమే రూ.28 వేలు పెరిగిందని ప్రభుత్వ లాయరు నిరూపించారట. ఇదేమిటి!? నాకు అర్థమైనంతవరకు ఇంటెరిమ్ రిలీఫ్ (ఐఆర్) ను జీతంలో భాగంగా గణించుకుని, అంతకింతైతే యింతకెంత? అనే గాలిమేడ కట్టుకున్న ఉద్యోగులు ఊహించుకున్న జీతం కంటె ప్రభుత్వం యివ్వజూపుతున్న జీతం తక్కువై వుంటుంది. 27% ఐఆర్ అనేది మధ్యంతరంగా యిచ్చినది కాబట్టి దాన్ని పక్కకు పెట్టి చూస్తే, పెరిగిన జీతం 23% కాబట్టి, గతంలో కంటె ఎక్కువే అయివుంటుంది. కానీ యిబ్బంది ఎక్కడ వచ్చిందంటే, ఐఆర్ 2019 జులై నుంచి యిస్తే, మానిటరీ బెనిఫిట్ మాత్రం 2020 ఏప్రిల్ నుంచి యిస్తానంటున్నారు. పైగా ఆ 9 నెలల ఐఆర్‌ను వచ్చే ఎరియర్స్ నుంచి రాబడతామని అంటున్నారు. ఇది చాలా అన్యాయంగా తోస్తుంది.
కానీ ప్రభుత్వం ఏమంటోందంటే – ఇలా యిచ్చినా, ఐఆర్‌తో సహా మాకు ప్రస్తుతం రూ.67.34 కోట్లు ఖర్చవుతూంటే వేతన సవరణ తర్వాత 10 వేల కోట్ల రూ.లు అదనంగా వ్యయమౌతుంది, ఇది వార్షికవ్యయంలో 36%, ఇంతకంటె ఏమిస్తాం? అని. అబ్బే, ఏళ్ల తరబడి బకాయి పెట్టిన డిఏ ఎరియర్స్ కలిపి వేసిన లెక్క అది, అసలుకి చూస్తే జీతాలు తగ్గుతాయి అని ఉద్యోగులంటారు. తగ్గుతాయని అని ఊరుకోకుండా, యిదిగో ప్రభుత్వవ్యయం యీ మేరకు తగ్గుతుంది అనే అంకె విడుదల చేయవచ్చుగా? చేసినట్లు లేదు. ఎంతసేపూ జీఓ రద్దు చేస్తేనే చర్చలకు వస్తామంటూ ప్రకటనలిస్తున్నారు. ఐఆర్, డిఏ మెర్జ్‌డ్ స్కేల్స్‌లో వున్న సాంకేతికత గురించి తర్వాతి పేరాల్లో చెప్తాను. ప్రస్తుతానికి ఉద్యోగులలో, ప్రజల్లో ఉండే భావాల గురించి జనరల్‌గా మాట్లాడతాను.
ఏ ప్రభుత్వానిదైనా పనితీరు బాగుండాలంటే ఉద్యోగులతో అది వ్యవహరించే తీరు బాగుండాలి. ఎందుకంటే ఉద్యోగులే ప్రభుత్వ కరచరణాలు. ఎంత గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టినా, అది అమలు కావలసినది, ప్రజలకు చేరవలసినది ఉద్యోగుల ద్వారానే. ఏ వ్యక్తి యైనా తన ఉపకరణాలతో పేచీ పెట్టుకోకూడదు. అదే సమయంలో నెత్తిన పెట్టుకోకూడదు. దేన్నయినా బాదడానికి సుత్తి వాడాలంటే వాడాల్సిందే. సుత్తికి నొప్పి కలుగుతుందేమోనని బీరువాలో పెడితే తుప్పు పడుతుంది. అలాగే సుత్తి చేతిలోంచి ఎగిరి నెత్తి మీద పడకుండా గుప్పిట్లో దాన్ని గట్టిగా బిగించి పట్టుకోవాలి. పాలకులు ఐదేళ్ల కోసారి మారతారు. కానీ ఉద్యోగులు 30, 35 ఏళ్లు సర్వీసులో వుంటారు. ఇన్‌చార్జి మంత్రి ఉన్నా లేకపోయినా, యంత్రాంగం కంటిన్యువస్‌గా సాగిపోవడానికి వాళ్లే కీలకం.
అందువలన వాళ్లను క్రమశిక్షణలో పెడుతూనే, వాళ్ల నైతిక స్థయిర్యం దెబ్బ తినకుండా చూడడం పాలకుల నేర్పుపై ఆధారపడుతుంది. ప్రజల చప్పట్ల కోసం, ఓ మంత్రి కలక్టర్‌ను లేదా తాసిల్దారుని పబ్లిక్ ఎదురుగా తాట తీస్తా, తోలు తీస్తా అంటూ తిట్టడం వాళ్ల మొరేల్‌పై దెబ్బ కొట్టడమే. మర్నాడు అతని సబార్డినేట్స్ అతని మాట వింటారా? ఇలాటివి జరిగితే అతను ఎంత పని చేసినా ఏం లాభం? అనే ఉదాసీనతకు లోనవుతాడు. అవినీతికి పాల్పడకుండా, పని మాత్రం ఎగ్గొట్టే ప్రభుత్వోద్యోగిని ఎవరూ ఉద్యోగంలోంచి పీకలేరు. మామూలు రోజుల్లో పెద్దగా తెలియదు కానీ, ఏవైనా విపత్తులు వచ్చినపుడు ప్రభుత్వోద్యోగుల అవసరం బాగా తెలిసి వస్తుంది. ఆ సమయంలోనే ప్రజల్లో అసహనం హెచ్చు మోతాదులో వుంటుంది.
వరద వచ్చి నా యిల్లు మునిగి గంట సేపైనా, ఒక్క అధికారీ వచ్చి మా ముఖం చూడలేదు అంటూ టీవీల ముందు వాపోతూ వుంటారు. అవతల ఆ అధికారి యిల్లు కూడా మునిగిందేమో, యింట్లో తట్టాబుట్టా బయట పడేసుకుని వస్తున్నాడేమో అని ఎవరూ ఆలోచించరు. అవి చక్కబెట్టుకుని ఆదరాబాదరాగా వీళ్ల దగ్గరకు వచ్చేసరికి, అప్పుడే అక్కడకు చేరిన ఎమ్మెల్యే టీవీ కెమెరాల ఎదుట వీళ్లపై విరుచుకు పడతారు. రేపు మళ్లీ వీళ్ల మొహాలు చూడాలి కదా, వీళ్ల చేతనే యీ వరదబాధితులకు బస, తిండి, నష్టపరిహార పంపిణీ ఏర్పాటు చేయాలి కదాన్న యింగితం వుండదు.
ఉద్యోగులు యిలాటి అవమానాలు పడుతూ, తల ఒంచుకుని పోతున్నా యిది పద్ధతి కాదు అని ఖండించని ఉద్యోగి సంఘాల నాయకులు సమ్మెవేళ మాత్రం రెచ్చిపోతారు. మేం తలచుకుంటే ఎన్నికల సమయాన ఫలానా పార్టీని అధికారంలోకి రాకుండా చేయగలం అంటూ హుంకరిస్తారు. నిజంగా చేయగలరా? సమాజంలో ఉద్యోగులు, వాళ్ల కుటుంబసభ్యులు ఓట్లు ఫలితాలను తారుమారు చేయగల స్థాయిలో వున్నాయా? అయినా ఉద్యోగులందరూ ఏకపక్షంగా ఓటేస్తారా? ప్రాంతాల వారీగా, కులాలవారీగా, రాజకీయాభిమానాల వారీగా విడిపోరా? వారి కుటుంబసభ్యులు వారి మాట విని తీరతారా? ఎన్టీయార్ ఉద్యోగుల పదవీకాలాన్ని 58 నుంచి 55కి తగ్గిస్తే ఉద్యోగంలో వున్న తండ్రులు భోరుమన్నారు, ఉద్యోగం కోసం ఎదురు చూసే కొడుకులు ఎగిరి గంతేశారు, నాన్న ఉద్యోగం ఊడి, నాకు వస్తుంది కదాని.
ఇక్కడే యింకో విషయం చెప్పాలి. 55కి తగ్గిస్తే భోరుమన్నవాళ్లు అనుకోకుండా అప్పటికప్పుడు రిటైరైన వాళ్లు. ప్రమోటై వాళ్ల స్థానంలోకి వద్దామనుకున్నారు సంతోషించారు. రిటైరయ్యేవాళ్ల జీతభత్యాలను నెలలోపే లెక్కలు వేసేసి, చేతిలో పెట్టి యింటికి పంపారు. అంతకు ముందు చెన్నారెడ్డి 55 నుంచి 58కి పెంచినపుడు దాన్ని అడ్డుకోవడానికి కొందరు ఉద్యోగులు కోర్టుకి వెళ్లారు. ఎందుకు? సీనియర్లు రిటైరై పోతారు. మనల్ని వాళ్ల స్థానంలోకి ప్రమోట్ చేస్తారు అని ఆశ పడినవాళ్లు ఆ అదృష్టానికి యింకో మూడేళ్లు ఆగాలిట అనగానే హతాశులై కోర్టుకి వెళ్లారు. గతంలో చంద్రబాబు 58 నుంచి 60కి పెంచినా, యిప్పుడు జగన్ 60 నుంచి 62కి పెంచినా ఉద్యోగుల్లో ఒక వర్గం వారే హర్షిస్తారు. ఇక యువత అయితే నిరాశ పడతారు. ఇప్పుడైతే ప్రభుత్వోద్యోగాలపై ఆశలు బాగా తగ్గిపోయాయి కాబట్టి ప్రభావం తక్కువగా వుంటుందేమో కానీ, ఎన్టీయార్ టైములో చాలా వుండేది.
ఉద్యోగులు, వాళ్ల కుటుంబసభ్యులు కలిసి లక్షల్లో వుంటారు కాబట్టి వాళ్ల ఓట్ల కోసం వాళ్లు అడిగినంతా యిచ్చేస్తే ఎన్నికలలో గెలుపు ఖాయమనే హామీ ఎవరైనా యివ్వగలరా? తెలంగాణ ఏర్పడగానే కెసియార్ ప్రభుత్వోద్యోగులకు యిబ్బడిముబ్బడిగా జీతాలు పెంచారు. అతన్ని చూసి బాబు కూడా ఆంధ్ర ఉద్యోగులకు పెంచారు. రాజధానిని హైదరాబాదు నుంచి అమరావతికి మార్చాలని హఠాత్తుగా నిర్ణయించినప్పుడు, ఇళ్ల స్థలాలతో సహా వాళ్లకు సకల సౌకర్యాలూ యిచ్చారు. హైదరాబాదు నుంచి ప్రత్యేక రైళ్లు, వారానికి రెండు సెలవులు, సోమవారం ఆలస్యంగా రావచ్చు, శుక్రవారం త్వరగా వెళ్లిపోవచ్చు, యిలా నెత్తి మీద పెట్టుకున్నా 2019లో బాబు గెలవగలిగారా? కెసియార్ గెలిచారంటే వేరే కారణాల వలన గెలుస్తున్నారు తప్ప ఉద్యోగుల వలన కాదు. అలా అయితే తెరాస ప్రభ ఎప్పటికీ తగ్గకూడదు. 2019లో అనుకున్నన్ని ఎంపీ సీట్లు రాలేదుగా, ఉపఎన్నికలలో ఓడిపోతున్నారుగా!
కానీ ఉద్యోగులు ఓట్ల సమయంలో ఫలితాలను తారుమారు చేయగలరు అనే ధోరణిలో కొందరు మాట్లాడతారు. మారుమాల ఊళ్లలో చదువురాని వాళ్ల ఓట్లపై ఉద్యోగులు వాళ్లకు యిష్టమైన పార్టీకి గుద్దేస్తారు అంటూంటారు. ఇవిఎంలు వచ్చిన రోజుల్లో యిది సాధ్యమా? పేపరు బాలెట్ రోజుల్లో కూడా గ్రామ పెద్దల మాటే చెల్లేది తప్ప వేరే ఊరి నుంచి డ్యూటీపై వచ్చిన ఉద్యోగులు తమ చిత్తం వచ్చినట్లు చేయగలిగేవారు కారు. పైగా ఇప్పుడు ఓటర్లు తెలివిమీరారు. ఓటుకి డబ్బు వసూలు చేయడమూ తెలుసు, ఎలా వేయాలో తెలుసు. బూతుల వారీ లెక్కలు బయటకు వచ్చినపుడు తమకు డబ్బిచ్చినవాళ్లు ఓట్లు ఎటు పడ్డాయో గ్రహిస్తారనీ తెలుసు. అందువలన తమ ఓట్లను మానిప్యులేట్ చేసే అవకాశం ఉద్యోగులకు యిస్తారని అనుకోవడానికి లేదు.
పరిస్థితి యిది కాగా ఉద్యోగులు ‘మేం తలచుకుంటే..’ అనే బ్లాక్‌మెయిలింగుకి దిగడం అనవసరం. ప్రభుత్వాలను ఉద్యోగులు తమ యిష్టానుసారం పడగొట్టగలిగితే యిక ప్రజాస్వామ్యెందుకు? మెజారిటీ ప్రజల అభీష్టాన్ని వాళ్లు దారి మళ్లించగలరు అనుకోవడం సరి కాదు కదా! తక్కిన వర్గాల ప్రజలందరినీ ఎండగట్టి కేవలం ఉద్యోగులను చూసుకుంటే చాలా? రాజకీయ నాయకులు కూడా యీ భ్రమలో పడ్డారేమో ననిపిస్తుంది. మా సమ్మె కారణంగానే తెలంగాణ ఏర్పడింది, అందువలన మాకు తగిన పారితోషికం యివ్వాలని ఉద్యోగులు అడగ్గానే కెసియార్ విపరీతంగా జీతాలు పెంచారు. తెలంగాణ వస్తే రోజుకి రెండు గంటలు ఎక్కువగా పనిచేసి, బంగారు తెలంగాణ నిర్మించుకుంటాం అని ఉద్యోగులు అనేవారు. ఎక్కువగా పనిచేయడం కాదు కదా, టైముకి ఆఫీసుకి రావడమే అరుదైంది. మంత్రుల ఆకస్మిక తనిఖీలలో యిది అనేకసార్లు బయటపడింది. అవినీతి గతంలో కంటె పెచ్చుమీరిందని ప్రభుత్వంతో పనిబడిన వారు చెప్పుకుంటున్నారు. ఉద్యోగులను బుజ్జగిస్తే ప్రజలేమైనా హర్షించారా?
చంద్రబాబుది వేరే కథ. చండశాసనుడిగా పేరు బడడం చేతనే, నిద్రపోను..పోనివ్వను డైలాగు వలననే ప్రభుత్వోద్యోగులు కుట్ర చేసి 2004లో ఓడించారని ఆయనకెవరో చెప్పారు, ఆయన నమ్మినట్టున్నారు. అందుకే 2014లో ఆంధ్రకు ముఖ్యమంత్రి కాగానే వారికి వరాలు కురిపించారు. గుండెల్లో నిద్రపోతా డైలాగులు వదలలేదనుకోండి. కానీ 2004లో ఫలితమే 2019లో వచ్చింది. ఎందువలన? 2004లో ఆయన ఓటమికి కారణం కరువు కాటకాలు, వ్యవసాయంలో నెగటివ్ గ్రోత్, గ్రామసీమలు పాడుపడడాలూ, వైయస్ పాదయాత్ర ఎట్సెట్రా. అలాగే 2019లో ఓటమికి కారణాలు వేరే. ఉద్యోగుల ప్రమేయం లేదు. 2004లో వాళ్లే ఓడించగలిగి వుంటే, 2019లో నెగ్గించగలిగేవారుగా! ఇన్ని తెలిసినా, రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో వున్నపుడు సమ్మె చేసేవాళ్లని సమర్థించడమే కాదు, రెచ్చగొడతారు కూడా, మేం అధికారంలోకి వస్తే మీకు ‘అన్యాయం’ జరగకుండా చూస్తాం అంటారు. అధికారంలోకి వచ్చాక వాళ్ల టోన్ మారిపోతుంది. ఎంత చేసినా మీకు తృప్తి లేదు అంటూ నిందిస్తారు.
నిజానికి ఉద్యోగి అనేవాడు తనే యజమానిగా మారేవరకు నిత్య అసంతృప్త ద్రావణమే. ఎంత యిచ్చినా, యింకా యివ్వవచ్చు కదా అంటాడు. మరో రంగంలో వున్న ఉద్యోగుల్ని చూసి కుమిలిపోతూంటాడు. వాళ్ల కంటె నీకు జీతం ఎక్కువే కదా అంటే, మరి వాళ్లకున్న పెర్క్ ఒకటి నాకు లేదు కదా అంటాడు. వర్క్ క్లయిమేట్ బాగా లేదంటాడు, గౌరవం లేదంటాడు. తన ప్రతిభకు తగ్గ ఉద్యోగం కాదంటాడు. బదిలీలు ఉన్నాయంటాడు, ఉన్న చోటే ఉద్యోగం వుండే సందర్భాల్లో మొనాటనీ అంటాడు. పోనీ ఉద్యోగం మానేసి, వ్యవసాయమో, వ్యాపారమో చేసుకో అంటే రిస్కంటాడు. ఇలా సెల్ఫ్‌పిటీలో మునిగిపోయే వీళ్లు, సమ్మె రోజుల్లో మాత్రం ప్రభుత్వాలను కూల్చేయగల ధీరులం, శూరులం అని చెప్పుకుంటూంటే నవ్వొస్తుంది.
పోనీ వీళ్ల వెనుక ప్రజాబలం వుందనుకుంటారా? అబ్బే, నేను రాసి యిస్తాను. ప్రజలకు ఏ ఉద్యోగి మీదా సింపతీ వుండదు, వాళ్ల కష్టాలు పట్టవు. నేను బ్యాంకులో పనిచేశాను. మాకు ప్రతి మూడేళ్లకు (తర్వాత ఐదేళ్లకు చేశారు) జీతాలు రివైజ్ చేసే బైపార్టయిట్ (ద్వైపాక్షిక) ఒప్పందం ఉంటుంది. ఆ గడువు నామమాత్రమే. గడువు పూర్తయ్యాక ఏడాది తర్వాత కానీ మేనేజ్‌మెంట్ చర్చలకు పిలవదు. ఆ చర్చలు నెలలు, ఏళ్లు గడుస్తూవుంటాయి. మేమంతా చకోరపక్షుల్లా ఎదురు చూస్తూ, పెరిగే జీతాన్ని మానసికంగా ఖర్చు కూడా పెట్టేసేవాళ్లం. చివరకు టాక్స్ ఫెయిలయ్యాయి, సమ్మె చేయాల్సిందే అనేవారు యూనియన్ లీడర్లు. అటూ, యిటూ పబ్లిక్ హాలీడేస్ వున్న మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకుని సమ్మె చేసేవాళ్లం, ఊరేగింపులు జరిపేవాళ్లం. మా బాధ వెల్లడిస్తూ ప్లకార్డులు పట్టుకుని వెళుతూంటే, జనాలెవరూ వాటిని చదివి, అయ్యోపాపం అనుకునేవారు కారు. వీళ్లవి ఫ్యాన్ కింద ఉద్యోగాలు, యిచ్చే జీతాలే దండగ, పైగా పెంచమని అడగడమొకటి అని యీసడించేవారు.
ఇది చాలనట్లు లంచగొండులనే నింద పడేవాళ్లం. బ్యాంకులో అవినీతి అంటూ ఉందంటే, అది లోన్లు యిచ్చే డిపార్టుమెంటులోనే వుంటుంది. అదీ కొంతమందిలోనే, అత్యధికమైన అక్రమాలు జరిగేది ఉన్నతస్థాయిలోనే! బ్యానర్లు పట్టుకుని తిరిగే మాలో కాదు. అయినా సామాన్యుడికి అదంతా అనవసరం. ఫలానా బ్యాంకులో కుంభకోణం అనగానే మమ్మల్నీ ఆ కోణంలోనే చూస్తాడు. అలాగే ప్రభుత్వోద్యోగుల విషయంలో కూడా అందరూ అవినీతిపరులే అనేస్తారు. జీతం లేకపోతే ఏం? అమ్యామ్యాతో బతికేయవచ్చుగా అంటారు. రెవెన్యూ వంటి కొన్ని డిపార్టుమెంటుల్లో తప్ప ఆర్కియాలజీ, సర్వే లాటి అనేక శాఖల్లో లంచాలకు ఆస్కారమెక్కడ? ఏవైనా కొనుగోళ్లు వుంటే అక్కడ జరిగే ఆస్కారం వుంది. అది కూడా కొందరు ఉద్యోగుల్లో మాత్రమే! అందరికీ ఒకే బ్రష్‌తో నలుపు పులిమేయడం అన్యాయం.
ప్రభుత్వోద్యోగులపై ఉండే ప్రధాన ఆరోపణ అలసత్వం, వాయిదా వేసే తత్వం. బ్యాంకుల్లో అయితే కస్టమర్ ప్రాంప్ట్ సర్వీస్ ఎక్స్‌పెక్ట్ చేసి వస్తాడు. టైము లోపునే డబ్బు కడుతున్నానుగా, డ్రాఫ్ట్ యివ్వడానికేం పోయేకాలం? అని అడుగుతాడు. గవర్నమెంటులో అయితే డబ్బు వ్యవహారాల్లో తప్ప ప్రతీదానికీ రేపు రమ్మనవచ్చు. నిర్ణయాన్ని నాన్చవచ్చు. ‘ఎవరూ టైముకి రారు, ఇవాళ పని జరగదు, వారం తర్వాత మళ్లీ రావలసి వస్తుంది, ఏదో ఒక కాగితం లేదంటూ తిప్పుతాడు’ అనే మైండ్‌సెట్‌తోనే ప్రభుత్వ కార్యాలయంలోకి సామాన్య పౌరుడు అడుగుపెడతాడు. తిరగాల్సివచ్చినా ఏమనుకోడు. బ్యాంక్‌కి వస్తే ‘మా సొమ్ము మీ దగ్గర పెట్టుకుని, తిరిగి యివ్వడానికేం తీపు తీసింది?’ అని తిట్లు లంకించుకుంటాడు. ప్రభుత్వాఫీసు కూడా అతని సొమ్ముతో నడుస్తున్నదే. కానీ అతనికి ఆ అవగాహన వుండదు. ఆస్తి రిజిస్ట్రేషన్‌కై పొద్దున్న ముహూర్తం చూసుకుని వెళితే ‘సబ్ రిజిస్ట్రార్ గారు యింట్లో తద్దినం పెట్టుకుని మధ్యాహ్నం మూడు గంటలకు కానీ రారు. అప్పుడే రిజిస్ట్రేషన్’ అంటే ‘నా కర్మ’ అని తిట్టుకుంటాడు తప్ప ‘సెలవు పెడితే వేరే వాళ్లు చేసేవాళ్లుగా’ అని నిలదీయడు. నిలదీస్తే ఏదైనా కొర్రీ వేస్తాడేమోనని భయం.
కడుపులో పెట్టుకున్న యిలాటి ఫ్రస్ట్రేషన్సన్నీ సమ్మె సమయంలో బయటకు వస్తాయి. ‘వీళ్లందరి ఉద్యోగాలు పీకేసి, ఔట్‌సోర్స్ చేసేయాలండీ. కంప్యూటరైజేషన్ వచ్చాక యిన్ని ఉద్యోగాలెందుకు?’ అని ఆవేశపడిపోతారు. ఉద్యోగుల పట్ల అతి కఠినంగా వ్యవహరించిన వ్యక్తి ఎన్టీయార్. ఇప్పటిదాకా ఎవరూ అనని రీతిలో ‘పందికొక్కులు’ అని యీసడించాడు. ముందుగా వాళ్లకు చెప్పకుండా, ఏ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా, డ్రమటిక్ ఎఫెక్ట్ కోసం రాత్రికి రాత్రి పటేల్ పట్వారీ, మునసబు కరణాలను తీసేశాడు. ఎన్నో కార్పోరేషన్లను, ఎకాడెమీలను రద్దు చేశాడు. హఠాత్తుగా రిటైర్‌మెంటు వయసును 58 నుంచి 55కి తగ్గించాడు. ఉద్యోగులు, ఉద్యోగినులు ఎన్టీయార్‌ను సొంత ఛాంబర్‌లో తిట్టితిట్టి పోశారు. ఇంత చేసినా ప్రజలు తప్పుపట్టారా? నాదెండ్ల ఎపిసోడ్‌లో ఎన్టీయార్ పక్షానే పోరాడారు కదా! 1989లో ఓడిపోయాడంటే వేరే కారణాల వలన తప్ప ఉద్యోగుల ఆగ్రహం కాదు. ఐదేళ్లకే ప్రజలు మళ్లీ పట్టం కట్టారు. ఉద్యోగుల పట్ల యమకింకరుడన్న పేరు ఎన్టీయార్‌కు ఓట్లు కురిపించింది.
సాధారణ ప్రజల్లో ఎవరో కొందరికి తప్ప ప్రభుత్వోద్యోగులు సమ్మె చేసినా పెద్ద తేడా పడదు. మామూలు రోజుల్లో పనులు చకచకా అయిపోయి, సమ్మె కారణంగా బ్రేక్ పడిపోతే చింతించాలి. కానీ పరిస్థితి అది కాదు కదా! ప్రభుత్వాధికారులకు టార్గెట్స్ వుండవు. రోజుకి యిన్ని నిర్ణయాలు తీసుకోవాలని ఒత్తిడి చేసేవాళ్లు లేరు. వాయిదాలు వేస్తూ పోయినా రోజు గడిచిపోతుంది, జీతం పెరుగుతూ పోతుంది. ప్రజలు దానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు వీళ్లు సమ్మె మానేసి, అర్జంటుగా విధుల్లో చేరినా మన బిల్లులు పాస్ అవుతాయన్న గ్యారంటీ లేదు కదా! జగన్ సర్కారులో అయితే ఎప్పటికీ అవుతాయన్న గ్యారంటీ లేదు. మరి అలాటప్పుడు సమ్మె చేస్తే చేసుకోనీ అనుకుంటారు.
ఒకప్పుడు ప్రభుత్వ బ్యాంకులు సమ్మె చేశాయంటే ఆ రోజుకి ఆర్థికవ్యవస్థ యిబ్బంది పడేది. ఇప్పుడది లేదు. కంప్యూటరైజేషన్ వచ్చాక ఉద్యోగుల బార్గయినింగ్ పవర్ పోయింది. పైగా డబ్బు సరఫరాకు ప్రత్యామ్నాయాలు బోల్డు వచ్చాయి. బ్యాంకుల ప్రయివేటేజేషన్ ఆపమంటూ ఉద్యోగులు సమ్మెలు చేస్తున్నారు. పేపర్లో న్యూస్ చదవడమే తప్ప, ప్రజాజీవనం స్తంభించటం లేదు. బ్యాంకుల గతే యిలా వుంటే, రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల ప్రభావం ఏముంటుంది చెప్పండి.
సమ్మె సమర్థించే కొందరు సంక్షేమ పథకాలకు అంత డబ్బు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఉద్యోగులకు కాస్త జీతం పెంచితే ఏం? అంటున్నారు. ఇది ప్రజలను మరింత మండిస్తుంది. సంక్షేమ పథకాలపై ఆధారపడేవాళ్ల జీవన నాణ్యత ఎటువంటిది? ప్రభుత్వోద్యోగి జీవన ప్రమాణం ఎటువంటిది? ఏమైనా పోలిక వుందా? ఎలిమెంటరీ స్కూలు టీచరుకు ప్రయివేటు రంగంలో 30 వేలు జీతమిస్తే, ప్రభుత్వరంగంలో 70 వేలు యిస్తున్నారని ఎవరో అన్నారు. ఆ 70 వేలు సీనియర్ మోస్ట్‌కి అనుకున్నా, సరాసరి జీతం 50 వేలు వుండవచ్చు కదా! రెండేళ్ల కరోనా కాలంలో స్కూళ్లే లేవు కదా! ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పేశా రనుకుందామంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులలో లాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు ఎందరికి వుంటాయి?
‘బాబు హయాంలో ప్రభుత్వ స్కూలు విద్యార్థుల సంఖ్య 72.32 లక్షల నుంచి 70.43 లక్షలకు తగ్గింది. జగన్ వచ్చాక స్కూళ్ల స్థితిగతులు మెరుగుపరచడంతో 70.43 నుంచి 83.76కు పెరిగింది. గతంలో స్కూలుకి రాకపోయినా, పాఠాలు చెప్పకపోయినా నడిచిపోయింది. ఇప్పుడు సంఖ్య పెరగడంతో నిలదీసేవారు ఎక్కువయ్యారు. పైగా ఇంగ్లీషు మీడియంలో చెప్పడం నేర్చుకోండంటున్నాడు. అందుకని కడుపు మండి సమ్మెకు దిగారు.’ అని కొందరంటున్నారు. టీచర్ల గురించి యిలా అనుకున్నా, ఆరోగ్యశాఖ వాళ్ల గురించి అనలేం కదా, కరోనా టైములో ప్రాణాలకు తెగించి పనిచేసినవాళ్లు వాళ్లే. వారికి ఏదైనా ప్రత్యేక ఇన్సెన్టివ్ యిచ్చారా? వాళ్ల కిస్తే మా మాటేమిటని పోలీసువాళ్లు అడగవచ్చు. కర్ఫ్యూ ఉల్లంఘించారా, లాక్‌డౌన్‌లో బయటకు వచ్చారా, మాస్కులు పెట్టుకున్నారా లేదా అని చెక్ చేసే పని వాళ్లకు అదనంగా పడింది కదా! ఇలా తరచి చూసినకొద్దీ అనేక సందేహాలు.
కరోనా రోజుల్లో కంపెనీలు మూతపడుతున్నాయి, అందరికీ ఉద్యోగాలు పోతున్నాయి. నిలిచినవారికి కూడా సగం జీతాలే వస్తున్నాయి. సమ్మెను సమర్థిస్తూన్న మీడియా సంస్థల్లో కూడా ఉద్యోగులను తీసేశారు. న్యూస్ తగ్గించేశారు. ఇలాటి పరిస్థితుల్లో ఉద్యోగులు తామాశించినంత మేరకు జీతం పెరగలేదని సమ్మె చేయడం భావ్యమా? అని ప్రజల్లో విమర్శ వస్తున్నమాట నిజం. ఇవేమీ పరిగణించకుండా ప్రభుత్వాన్ని విమర్శించ దలచుకునేవాళ్లు ‘సలహాదారులను పీకేసి, ఎమ్మెల్యేల అలవన్సులు తగ్గించేసి, సినిమా టిక్కెట్లు పెంచేసి వీళ్ల జీతాలు పెంచవచ్చు’ అనేస్తారు. అవన్నీ చేసినా అలా మిగిలే డబ్బు ప్రభుత్వోద్యోగుల జీతాలతో పోలిస్తే సముద్రంలో కాకిరెట్ట! వీళ్లడిగినంత ప్రభుత్వం యివ్వలేదు కదా అని లెక్కలు చూపిస్తే అవన్నీ ‘బాబు ఐఆర్ 20శాతం యిస్తానంటే గొప్పగా నేను 27శాతం యిస్తానని పాదయాత్రలో వాగ్దానాలు యిచ్చినపుడు చూసుకోవలసినది, మానిఫెస్టోలో పెట్టినపుడు చూసుకోవాల్సింది.’ అంటారు. ఇలా అనే హక్కు సామాన్యుడికి వుంది కానీ రాజకీయపక్షాలకు లేదు. చూస్తున్నాం కదా, ప్రతి పార్టీ ఆకాశాన్నంటే హామీలు యిచ్చేస్తోంది.
ఉద్యోగుల జీతాలు క్రమానుసారం పెంచాల్సిందే. అయితే ఏ మేరకు అనే దగ్గరే పేచీ వస్తుంది. పాత ఒప్పందం గడువు తీరగానే ఎప్పటికప్పుడు చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటే వదిలిపోతుంది. కానీ దానివలన ఉద్యోగుల్లో అసంతృప్తి రగులుతుంది, ఎందుకొచ్చిన గొడవ అనుకుని సమస్యను వాయిదా వేసి, అప్పటిదాకా మధ్యంతరంగా (ఐఆర్) అంటూ యిచ్చి ఊరుకోబెడతారు. రిటైర్‌మెంట్ వయసు పెంచడం కూడా యిలాటి టెక్నిక్కే. ఉద్యోగుల మీద ప్రేమ కాదు. రిటైరింగ్ బెనిఫిట్స్ యివ్వడానికి డబ్బు చాలక, సమస్యను వాయిదా వేయడం! బాబు చేసినదే జగన్ చేస్తున్నారు. ఈ ఐఆర్ నెలో, రెండు నెలలో అయి వుంటే దాన్ని జీతంగా అనుకునేవారు కాదు, అనామత్తు డబ్బుగానే అనుకునేవారు. కానీ ఏళ్ల తరబడి యివ్వడం, పైగా మధ్యమధ్యలో పెంచడంతో దాన్ని జీతంలో భాగంగా చూశారు. జీతాలు పెరుగుతాయంటే దాని మీద యింకా పెరుగుతాయని ఎదురు చూశారు. ప్రభుత్వం అది మధ్యంతరంగా యిచ్చింది కదా, దాన్ని లెక్కలోకి తీసుకోకండి, పాతజీతంతో పోలిస్తే పెరిగింది కదా అంటూంటే వారి మనస్సు ఒప్పుకోలేకపోతోంది.
డిఏ(కరువు భత్యం)ల విషయమూ అంతే. ఎప్పటికప్పుడు చెల్లిస్తూ పోతే సరిపోయేది. దాన్ని పెండింగులో పెట్టి, కోతిపుండుని బ్రహ్మరాక్షసి చేసి, యిప్పుడు అమ్మో అంత యివ్వలేం అంటే ఉద్యోగులు సమాధాన పడలేక పోతున్నారు. జగన్ ప్రభుత్వం అనే కాదు, బాబు ప్రభుత్వమూ యిలాటి పనులు చేసింది. రాష్ట్రప్రభుత్వాలే అని కాదు, మా బ్యాంకుల విషయమూ అంతే. మా పెన్షన్ ఎరియర్స్ విషయం పాతికేళ్లగా పెండింగులో వుంది. బ్యాంకు దగ్గర డబ్బుంది. చెల్లించమని కోర్టు ఆదేశాలున్నాయి. అయినా బ్యాంకు యివ్వదు. పెన్షన్ వ్యవహారం కాబట్టి, ఆ ఎరియర్స్ కోసం ఎదురు చూస్తూనే చాలామంది కాలం చేస్తున్నారు.
డిఏల విషయంలో ఏమవుతుందంటే, కొంతకాలం పోయాక దానిలో చాలాభాగాన్ని బేసిక్‌తో మెర్జ్ చేసి పెంచుతారు. డిఏ మెర్జ్‌డ్ బేసిక్‌పై లెక్కలు వేసినపుడు ఎలవన్సుల పర్సంటేజిలు మారతాయి. పాత బేసిక్ 10 వేలుండి, దానిపై ఎచ్‌ఆర్ఏ 12% యిచ్చి వుంటే ఎచ్‌ఆర్ఏ 1200 వస్తుంది. డిఏ మెర్జ్ చేసిన బేసిక్ 15 వేలై, దానిపి ఎచ్‌ఆర్‌ఏ 8% అయితే 1200 వస్తుంది. ఉద్యోగులు ఎచ్‌ఆర్ఏ 2% తగ్గించారంటూ గగ్గోలు పెడతారు. ఎమౌంట్ తగ్గలేదుగా అంటుంది యాజమాన్యం. ఇప్పుడీ ఆంధ్ర ఉద్యోగుల విషయంలో కూడా యిలాటి తకరారు ఉన్నట్లుంది. తాను కట్టబోయిన భ్రమరావతి హైదరాబాదు లెవెల్లో వుంటుందని ఊరించిన చంద్రబాబు సెక్రటేరియట్ ఉద్యోగులకు ముందుగానే హైదరాబాదుతో సమానంగా ఎచ్‌ఆర్‌ఏ, సిసిఏలు యిచ్చేశారు. ఇప్పుడు ఊరి జనాభా ప్రాతిపదికన యిస్తామని జగన్ ప్రభుత్వం అనడంతో యివి తగ్గిపోతాయని సచివాలయ ఉద్యోగుల ఘోష. తక్కిన ఊళ్లలో యింత తేడా రాదనుకుంటా. ఎచ్‌ఆర్ఏ తగ్గింపు అనేది కేంద్రప్రభుత్వ విధానాలను అనుసరించే చేశామంటోంది ప్రభుత్వం. అలాగే పదేళ్ల కోసారి వేతనాల సవరణ అనేది కూడా కేంద్రవిధానమే అంటోంది. ఉద్యోగులు అదేం కుదరదంటున్నారు.
ఇక్కడే పే కమిషన్‌ల గురించి ఓ మాట చెప్పాలి. కమిషన్ చైర్మన్‌లు ఉద్యోగుల శాపనార్థాలకు దడిసో, మనకే పోయిందనో భారీగానే రికమెండేషన్స్ యిస్తారు. వీళ్లే కాదు, ఏ కమిషన్ వేసినా సరే, వాస్తవ పరిస్థితి గమనించి, ఆచరణయోగ్యంగా వుండే సలహాలివ్వరు. వాటిని చూడగానే దడిసిపోయిన ప్రభుత్వం ఆ రిపోర్టును బయటపెట్టదు. పెట్టాలని డిమాండులు వస్తూనే వుంటాయి. ఈ కమిషన్ విషయంలో అది చంద్రబాబు హయాంలో వేసిన కమిషన్. ఆయన రిపోర్టు యివ్వబోయే ముందు జగన్ ప్రభుత్వంతో సాధ్యాసాధ్యాల గురించి చర్చ జరపలేదని, ప్రభుత్వాన్ని యిరకాటంలో పెట్టడానికే యిలాటి సిఫార్సులు చేశారనీ అనుమానాలున్నాయి.
ఆంధ్రప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కొందరు ఐఆర్ అంత యిచ్చి వుండకూడదు, ఇవ్వడం బట్టే ఉద్యోగుల ఆశలు పెరిగాయి అంటున్నారు. దానికి జగన్ ప్రభుత్వం యిస్తున్న సమాధానం ఏమిటంటే ‘మేం రాష్ట్రాన్ని విచ్చలవిడిగా అభివృద్ధి చేసేసి, ఐఆర్‌కు మించిన జీతాలను ఉద్యోగుల కిచ్చేయగలమనుకున్నాం, కరోనా వలన తారుమారై, యివ్వలేకపోతున్నాం.’ అంటోంది. ఆర్‌టిసి ఉద్యోగులను కూడా ప్రభుత్వోద్యోగులుగా మార్చినపుడు కూడా అదే ధైర్యం వుందా? చెప్పాలంటే ఫైనాన్షియల్‌గా యింత అధ్వాన్నంగా మేనేజ్ చేసిన ఏ రాష్ట్రప్రభుత్వాన్నీ నేను చూడలేదు. దేనికీ డబ్బు లేదు, గొప్పలకు చూస్తే కొదవ లేదు. రోజురోజుకీ కొత్త స్కీమలు వస్తూండడం చూస్తే పెరిగిన జీతాల మాట సరే, పాత జీతమైనా దక్కుతుందా అని ఉద్యోగులు బెంగపడి ఏదో ఒక దానికి ఒప్పుకోండ్రా నాయనా అని తమ నాయకులను బతిమాలినా ఆశ్చర్యం లేదు.
అసలు సమస్యంతా ఉద్యోగి సంఘాల నాయకులతో వస్తుంది. వారికి రాజకీయ ప్రయోజనాలుంటాయి. సొంత యిమేజి పెంచుకోవడానికి ‘ఈ ఫిట్‌మెంట్ వలన మనకు నష్టమే తప్ప లాభం లేదు. దీన్ని అడ్డుకోవడానికి చచ్చేదాకా పోరాడదాం’ అంటూ ఉద్యోగులను రెచ్చగొడతారు. ఒక స్టేజి తర్వాత ప్రభుత్వాన్ని పుష్ చేయలేమని గ్రహించాక, రాజీపడి సంతకాలు పెట్టేస్తారు. మొదటి దశలో ఉద్యోగులను సమ్మెకు ఒప్పించడానికి ఫిట్‌మెంట్ చెత్త అంటారు. సంతకాలు పెట్టేశాక ‘ఇలాటి అద్భుతమైన ఫిట్‌మెంట్ యిచ్చి మా అందర్నీ కన్న తండ్రిలా పోషిస్తున్నందుకు ముఖ్యమంత్రిగారికి, ఆర్థికమంత్రి గారికి కృతజ్ఞతలు’ అంటూ ప్రకటించి, ఫోటోలు తీయించుకుంటారు.
సాధారణ ఉద్యోగికి మతిపోతుంది, ఇంతకీ ఫిట్‌మెంట్ మంచిదా? కాదా? అని. ఇక కాబినెట్‌లో వున్న కొందరు మంత్రులు సమ్మె కాలంలో ‘ఉద్యోగులు తమను తాము ఎక్కువగా వూహించుకుంటున్నారు. తలచుకుంటే ఉద్యోగాలూడపీకి అందర్నీ యింటికి పంపిస్తాం’ అని ప్రలాపాలు వినిపిస్తారు. రాజీ కుదరగానే ‘ప్రభుత్వం ఉద్యోగులు అంటే ఆలూమగల సంబంధం. అందరం కుటుంబసభ్యులం. కలిసి ప్రజల్ని ఉద్ధరిస్తున్నాం.’ అని ప్రకటిస్తారు. ఈ శుభం కార్డు ప్రస్తుత సమస్యకు కూడా ఎప్పటికో అప్పటికి పడుతుంది. అదేదో త్వరగా జరిగితే యీ పోరాటాల న్యూస్ నుంచి మనకు రిలీఫ్.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2022)