“క్షణక్షణం” సినిమా బ్యాంకు దోపిడీ సీన్ తో మొదలౌతుంది. రాటుదేలిన బ్యాంకు దొంగలు అలా ఉంటారా అని ఆసక్తిగా చూశారప్పట్లో ప్రేక్షకులు.
అలాగే ధూం 2 లో హృతిక్ రోషన్ దొంగతనాలు చూసి ఆశ్చర్యపడ్డారు జనం.
కానీ రియల్ లైఫులో ఉన్న గజదొంగల్ని చూస్తే పాపం ఆ సినిమా దొంగలు చిన్నపిల్లల్లా కనపడతారు.
క్షణక్షణం దొంగలు అంత పకడ్బందీ ప్లాను వేసి నానా మర్డర్లూ చేసి దొడ్డిగుమ్మాన దోచుకెళ్లింది కేవలం 1 కోటి.
కానీ, ఏ మర్డరూ లేకుండా రాజమార్గంలో బ్యాంకుల్నుంచి దోచుకెళ్లిన సొమ్ము వేల కోట్లల్లో ఉంటోంది.
ఈ మ్యాటర్ చెప్పగానే ఎవరికైనా గుర్తొచ్చే మొట్టమొదటి పేరు విజయ్ మాల్యా. బ్యాంకుల్ని నిండా ముంచి లండన్ లో సేద తీరుతున్నాడు. తనకు భారత పౌరసత్వం ఉన్నప్పుడే యూకే పౌరసత్వాన్ని కూడా సంపాదించి జాగ్రత్తగా దాచుకుని అవసరమొచ్చినప్పుడు ఆ అస్త్రాన్ని వాడుకున్నాడు. ఈ దొంగాపోలీసాటలో ఇప్పటి వరకు దొంగదే పైచేయిలా ఉంది. 140 కోట్ల జనాభాగల దేశం వెర్రి మొహమేసుకుని చూస్తోంది.
కానీ తెలుగువాళ్లకి తెలియాల్సిన మరొక బడా మాయగాడు సుజనా చౌదరి. ఈయన గారి లీలలు అన్నీ ఇన్నీ కావు. బ్యాంకుల్ని, షేర్ హోల్డర్స్ ని నిలువునా ముంచేసి దేశం మొత్తాన్ని మౌనంగా వెక్కిరిస్తున్న మహానుభావుడు.
చేసిన తప్పులన్నీ చేసేసి రాజకీయాల్లో చేరి వ్యవస్థల్ని తనకు అనువుగా పని చేయించుకునే పని సుజనాది. తెదేపాతో రాజకీయ జీవితం మొదలుపెట్టి ఆ పార్టీ ఓడిపోగానే సత్వరమే బీజేపీలో చేరి తలదాచుకున్న మేథావి సుజన.
సుజన మెటల్స్, సుజన టవర్స్, సుజన యూనివర్సల్ పేర్లతో ముంబై, ఢిల్లీ స్టాక్ మార్కెట్లలో స్థానాన్ని సంపాదించి, మసిపూసి మారేడు కాయ చేసి వేల కోట్లు కొల్లగొట్టేసి బ్యాంక్ డిఫాల్టర్ గా మిగిలాడు. పైకి దివాళా మొహం పెట్టినా, అంతా పక్కా ప్లానుతో చేసిన వ్యవహారమే అని ప్రాధమిక ఆర్థికశాస్త్రం తెలిసిన ఎవడైనా చెప్తాడు.
అలాగే రెజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో సుజనాకి చెందిన వైఎస్ కన్సల్టెన్సీ సర్వీసెస్, సుజనా ట్రాన్స్మిషన్స్, సుజన పోర్ట్, ఎస్టీం హోటల్స్ అన్నీ స్ట్రైక్ అయిపోయాయి. సాధారణంగా ఆదాయపు పన్ను ఫైల్ చేయకపోయినా, షెల్ కంపెనీల మాదిరిగా ఖాళీగా ఉన్నా, మరే ఇతర ఫైలింగ్ సరిగా లేకపోయినా స్ట్రైక్ చేసి పారేస్తుంది ఆర్వోసీ.
2017 నుంచీ ఈడీ కళ్లు సుజనాపై పడ్డాయి. రూ 1500కోట్ల కుంభకోణాన్ని తొలుత ఇక్కడ గుర్తించారు. తర్వాత 2018 నవంబర్లో అదే ఈడీ రూ 5700 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ అంశాన్ని ఆరోపిస్తూ సుజనాని వేలెత్తి చూపింది. ఈ వ్యవహారంలో సుజనాకు చెందిన 120 కంపెనీల లిస్టు బయటపడింది. 128 కంపెనీలకు చెందిన రబ్బర్ స్టాంపులు తమ రైడ్ లో దొరికాయని ఈడీ వెల్లడించింది.
ఎంత పెద్ద వ్యాపారవేత్తకైనా 128 కంపెనీల అవసరమేముంటుంది? అక్రమ మార్గాల్లో బ్యాంకుల్ని బురిడీ కొట్టించడానికి కాకపోతే?
2019లో సీబీఐ 3 ఎఫ్ఫయ్యార్లు కట్టింది సుజనాకు చెందిన కంపెనీల మీద. ఈ వ్యవహారంలో 3 బ్యాంకులు సుజనా కంపెనీలపై కంప్లైంట్లిచ్చాయి తమ రూ 364కోట్లకి శఠగోపం పెట్టాయని.
2019లో బీజేపీ పవర్లోకి రాగానే ఆ పార్టీలోకి దూకేసాడు సుజన. మూడేళ్ల సీబీయై మరియు ఈడీ రైడ్స్ అనంతరం, అన్నేసి కేసుల దర్మిలా ఇంకా సుజనా చౌదరి సుజనుడిగానే చలామణీ అవుతున్నారు మన దేశంలో.
బ్యాంకులు మునిగాయి, ఆర్ధిక శాఖకి రావాల్సిన పన్ను రాలేదు..కానీ సుజన హాయిగా ఉన్నారు.
విజయ్ మాల్యా కనీసం డబ్బు వెనక్కి కడతాను తనను ప్రొసెక్యూట్ చేయొద్దని ప్రాధేయపడుతున్నాడు.
కానీ సుజనా మాత్రం రూ 7500 కోట్ల ఎగవేసిన తన కంపెనీల నుంచి తన ఓనర్షిప్పుని వదులుకుని తప్పించుకున్నాడు.
ఒకరకంగా చూస్తే పారిపోయి పరాయి దేశంలో తల దాచుకుంటున్న విజయ్ మాల్యాకంటే నేరం చేసిన గడ్డమీదే ధైర్యంగా మహరాజులా బతుకుతున్న వ్యక్తి సుజనా. ఆయన ప్రస్తుతం బీజేపీ నేత మరియు దేశభక్తుడూను!
హరగోపాల్ సూరపనేని