ఎస్మాకు భయపడేది లేదంటున్న ఉద్యోగులు

నయానో భయానో.. నచ్చజెప్పాలనుకున్నారు, ఎస్మాతో బెదిరించాలనుకున్నారు. కానీ ఏపీ ఉద్యోగులు రెండిటికీ లొంగలేదు, లొంగేలా కనిపించడం లేదు. ఫిబ్రవరి-1న కొత్త పీఆర్సీతో జీతాలు వేయాలనేది ప్రభుత్వం పట్టుదల. కానీ అది కుదరదని రెండు రోజుల…

నయానో భయానో.. నచ్చజెప్పాలనుకున్నారు, ఎస్మాతో బెదిరించాలనుకున్నారు. కానీ ఏపీ ఉద్యోగులు రెండిటికీ లొంగలేదు, లొంగేలా కనిపించడం లేదు. ఫిబ్రవరి-1న కొత్త పీఆర్సీతో జీతాలు వేయాలనేది ప్రభుత్వం పట్టుదల. కానీ అది కుదరదని రెండు రోజుల ముందే తేలిపోయింది. కానీ ఎలాగోలా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి కొత్త పీఆర్సీ బిల్లుల కోసం ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది, ఇంకా చేస్తోంది కూడా. 

కానీ కొద్దిమంది ట్రెజరీ ఉద్యోగులు మాత్రమే విధుల్లోకి వచ్చారు. కొన్ని డిపార్ట్ మెంట్ ఉద్యోగుల బిల్లులు మాత్రమే ప్రాసెస్ చేస్తున్నారు. పూర్తిస్థాయిలో పనిచేయకుండా, ఇంత తక్కువ టైమ్ లో ప్రాసెస్ చేయడం అసాధ్యం. ఈ దశలో ఎస్మా అస్త్రం కూడా ప్రయోగిస్తారనే వార్తలొచ్చాయి. దానికి కూడా ఉద్యోగులు భయపడేలా లేరు.

సమ్మెకు సిద్ధమైన ఉద్యోగులపై ఎస్మా అస్త్రం ప్రయోగించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఎస్మా ప్రయోగించినా, అంతకు మించి కఠిన చర్యలు తీసుకున్నా తమ డిమాండ్లు సాధించే వరకు తగ్గేది లేదని ఉద్యోగులు స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల తరపున ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్రంగా స్పందించారు. ఎస్మా ప్రయోగించినా భయపడేది లేదన్నారు. ఈ దశలో ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఉద్యోగులు మాట వినట్లేదు, ప్రభుత్వం వెనక్కు తగ్గి పాత పీఆర్సీ ప్రకారం జీతాలు వెయ్యాలనుకోవట్లేదు. ఇగో సమస్య ఇక్కడ మరింత తీవ్రం అయింది. ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య టీడీపీ అనుకూల మీడియా నిజంగానే చిచ్చుపెట్టింది. ఎవరూ తగ్గేది లేదంటుండే సరికి సగటు ఉద్యోగి, పెన్షనర్.. ఫిబ్రవరి-1న డబ్బుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి.

ఇప్పటికే ఆలస్యం అయిందా..?

ఉద్యోగుల పీఆర్సీ రెండేళ్ల ముందే తేలాల్సిన ప్రక్రియ. దాన్ని నాన్చి నాన్చి ఇప్పటి వరకు తెచ్చారు. పోనీ ఇప్పుడైనా వారిని సంతృప్తి పరిచారా అంటే.. గతంలో ఐఆర్ పెంచాం కదా, ఇప్పుడు పీఆర్సీలో ఆ స్థాయిలో పెంచలేమన్నారు. అక్కడితో కథ ఆగిపోలేదు. హెచ్ఆర్ఏ తగ్గింపుతో జీతం సొమ్ము పెరగకపోగా.. గతంలో తీసుకున్న డబ్బులు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితి. ప్రభుత్వం జీతాలు పెరుగుతాయని చెబుతోంది. ఉద్యోగులు పెంపు మా హక్కు, మీరిచ్చే భిక్ష కాదని ఖరాఖండిగా చెబుతున్నారు.

లెక్కలు, శాతాలు సామాన్యులకు అర్థమయ్యే విషయాలు కావు కానీ, ఉద్యోగులు మాత్రం పట్టుదలతో ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని అంచనా వేస్తే తగ్గాల్సింది ప్రభుత్వమేనని తేలిపోయింది. ఇక జగన్ నేరుగా రంగంలోకి దిగుతారా..? ఇంకా కమిటీలతోనే కాలయాపన చేస్తారా..? వేచి చూడాలి.