ఈ రోజు చైనాపై మనమే కాదు, ప్రపంచమంతా కత్తి కట్టి వుంది, కరోనా కారణంగా. కరోనా క్రిమిని పుట్టించిందో లేదో నిర్ధారణగా చెప్పలేం కానీ, లాక్‌డౌన్ సమయంలో ప్రపంచ మార్కెట్లలో కంపెనీలు మూతపడుతూ వుంటే చైనా కంపెనీలు వాటిని కారుచౌకగా కొనేసుకున్నాయని మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు. మనకు చైనాతో స్నేహం, వైరం యీనాటివి కావు. రెండూ ఒకేసారి రైలుపట్టాల్లా నడుస్తూనే వుంటాయి.
ఏదీ శాశ్వతం కాదు. చైనా అభివృద్ధిని చూసి మనం కుళ్లుకుంటున్నది లేదు. సరేలే అని ఊరుకుంటాం. కానీ పాశ్చాత్య దేశాలకు మాత్రం చైనా అంటే మహా మంట, మేం అతి తుచ్ఛంగా చూసిన ఆ దేశం యీ రోజు మమ్మల్ని ఆడిస్తుందా, సూపర్ పవర్‌గా ఎదిగి, మాతో పోటీకి వస్తుందాని.
చైనా చరిత్ర మనలో చాలామందికి తెలియదు. నక్సలైట్లు మావో, మావో అనడం చేత చైనాలో ఓ కమ్యూనిస్టు నియంత వుండి, తుపాకీ గొట్టం ద్వారా అధికారం చేజిక్కించుకున్నాడని తెలుసు తప్ప, ఎవరి నుంచి అధికారం తీసుకున్నాడో, అంతకుముందు వేల సంవత్సరాలుగా ఎవరు, ఎలా పాలించారో మనకు తెలియదు.
‘‘ద లాస్ట్ ఎంపరర్’’ (1987) అనే సినిమా చూస్తే ఆఖరి చైనా చక్రవర్తి జపాన్ చేతిలో ఎలా కీలుబొమ్మగా వున్నాడో, విప్లవం అతని జీవితంలో ఎలాటి మార్పు తెచ్చిందో తెలుస్తుంది. చైనా చరిత్రలో నల్లమందు యుద్ధాలనే కొన్ని పుటలను మీకు పరిచయం చేస్తున్నాను. ఈ సమాచారాన్ని జవహర్‌లాల్ నెహ్రూ రాసిన ‘‘గ్లింప్సెస్ ఆఫ్ వ(ర)ల్డ్ హిస్టరీ’’ అనే అద్భుతమైన పుస్తకం నుంచి తీసుకున్నాను.
మన దేశాన్ని ఆంగ్లేయులు ఎన్ని కుయుక్తులతో ఆక్రమించుకున్నారో మనకు తెలుసు. చైనా పట్ల ఎలాటి దుశ్చర్యలు చేశారో దీని ద్వారా తెలుస్తుంది. దీనితో బాటు యింకో విషయం కూడా! సాధారణంగా మనమంతా ముస్లిములు కత్తి ఝళిపించి తమ మతాన్ని వ్యాప్తి చేశారని, క్రైస్తవులు సేవల ద్వారా తమ మతాన్ని వ్యాప్తి చేశారని అనుకుంటూ వుంటాం.
ఇది చదివితే సామ్రాజ్యవాదం, క్రైస్తవం ఎలా ముడిపడి వున్నాయో అర్థమవుతుంది. రెండిందాలా నష్టపడిన చైనా యిప్పుడు పాశ్చాత్యదేశాలను భయపెట్టే స్థితికి వచ్చిందంటే పొయెటిక్ జస్టిస్ జరుగుతోందా అనిపిస్తుంది.
పాశ్చాత్య రచయితలు కొంతమంది తూర్పు దేశాలు సంకుచిత మనస్తత్వంతో విదేశీయులతో చాలాకాలం వ్యాపారం చేయనీయలేదని, వారిది క్లోజ్‌డ్ మైండ్ అని రాశారు. ఇది అబద్ధం. ఇండియా కానీ, చైనా కానీ గ్రీసు, రోమ్, అరేబియా వంటి అనేక ప్రాంతాలతో క్రీస్తు పూర్వం నుంచీ వ్యాపారబంధాలు కలిగి వున్నాయి.
విదేశీయులను స్వేచ్ఛగా అనుమతించేవారు. అయితే వాళ్లు తర్వాతి రోజుల్లో వ్యాపారం పేరుతో అనుమతులు తీసుకుని, ఎప్పణ్నుంచి స్థానిక రాజకీయాల్లో తలదూర్చసాగారో, తమ వెంట క్రైస్తవ మిషనరీలను తీసుకుని వచ్చి వాళ్లను తమ పావులుగా వాడుకోసాగారో అప్పణ్నుంచి యీ దేశాలు జాగ్రత్తపడ్డాయి.
ప్రస్తుతం చైనా గురించి చెపుతున్నాను కాబట్టి కాంగ్ హై (1654-1722) అనే చైనా చక్రవర్తి గురించి ప్రస్తావించాలి. అతను చాలా గొప్పవాడు. చైనీస్ సాహిత్యానికి, విజ్ఞానాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. విదేశీ వ్యాపారులకు తోడుగా వచ్చిన క్రైస్తవ మిషనరీలు వచ్చి తమ మతం వ్యాప్తి చేసుకుంటామంటే సరేనన్నాడు.
వ్యాపారస్తులు కొన్ని నెలలు వుండి వెళ్లిపోయినా, యీ మతగురువులు మాత్రం యిక్కడే తిష్ట వేసి, నివాసం ఏర్పరచుకున్నారు. కొద్దికాలం గడిచేసరికి, ఆ మిషనరీలు స్థానికంగా వున్న సామంత రాజులలో పుల్లలు పెట్టి, కుట్రలు పన్ని తద్వారా తమ దేశ రాజుల విస్తరణ పథకాలకు దోహదపడుతున్నారని అనుమానం వచ్చింది. తమ దేశాలవారు దండెత్తి వచ్చినపుడు ఏయే మార్గాల ద్వారా రావచ్చో సమాచారం సేకరించి వ్యాపారస్తుల ద్వారా అందచేస్తున్నారని తెలిసింది.
కాంటన్ నగరంలో వున్న ఒక మిలటరీ ఆఫీసరు చైనా, జపాన్, ఫిలిప్పీన్స్‌లో వున్న యీ దేశాల మిషనరీలందరూ కూడబలుక్కుని యీ గూఢచర్యం చేస్తున్నారని రిపోర్టు రాసి 1717లో చక్రవర్తికి పంపాడు. దీన్ని చైనా గ్రాండ్ కౌన్సిల్ వారు పరిశీలించి, నిజమేనని నిర్ధారించుకుని, చక్రవర్తికి సిఫార్సు చేశారు.
ఆ మేరకు చక్రవర్తి విదేశీ వ్యాపారాన్ని, క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలను నియంత్రిస్తూ ఆదేశాలు జారీ చేశాడు. ఇలాటి చర్యల వలన చైనా తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోగలిగింది. ఔరంగజేబు (1618-1707) తర్వాత మొఘల్ సామ్రాజ్యం బలహీనపడి, భారతదేశమంతా చిన్నచిన్న రాజ్యాలుగా విడిపోవడంతో విదేశీయుల కుతంత్రాలకు బలై పోయింది.
చైనా మాత్రం ఒకే చక్రవర్తి పరిపాలన కింద వుండడంతో ఏ దేశానికి వలసరాజ్యంగా మారే దుస్థితి రాలేదు. కానీ 1850 తర్వాత నుంచి సార్వభౌమత్వం బలహీన పడసాగింది. దాన్ని యూరోప్ దేశాలు తమకు అనుకూలంగా మలచుకోబోయాయి కానీ తమలో తాము పోటీ పడడంతో పెద్దగా విజయం సాధించలేక పోయాయి. మన దేశంలో కూడా చూడండి – పోర్చుగీసువారు, డచ్చివారు, ఫ్రెంచ్ వారు వచ్చాక ఇంగ్లీషు వారు వచ్చారు.
మన గడ్డ మీద అవి భీకరంగా పోరాడుకున్నాయి. చివరగా ఫ్రెంచ్ వారిని ఓడించి, ఇంగ్లీషు వారు మొత్తం దేశాన్ని స్వాహా చేశారు. ఇవన్నీ ఆ యా దేశపు రాజులు డైరక్టుగా చేసిన యుద్ధాలు కాదు. ఆయుధసంపత్తితో కంపెనీల ద్వారా యిక్కడి చిన్న రాజ్యాలను మొదట అన్యాయంగా ఆక్రమించి, ఆ తర్వాత ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. మన దేశంలో 1857 వరకు ఈస్టిండియా కంపెనీయే పాలించింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858లో బ్రిటిషు రాణి అధికారాన్ని చేతిలోకి తీసుకుని రమారమి 90 ఏళ్లు, అంటే 1947 వరకు పాలించింది.
చైనా సంగతికి వస్తే విదేశీ వ్యాపారస్తులతో చైనాకు వచ్చిన చిక్కంతా మిగతా ఏ వస్తువులతోనూ కాదు, నల్లమందుతో వచ్చింది. 15 వ శతాబ్ది వరకు మందుల్లో వాడడానికి అది నల్లమందును ఇండియా నుంచి దిగుమతి చేసుకునేది. అది పరిమితంగానే వుండేది. ఈస్టిండియా కంపెనీ రంగంలోకి దిగాకనే ఆ వ్యాపారం బాగా వృద్ధి చెందింది.
తూర్పుదేశాల్లో వలస రాజ్యాలు ఏర్పాటు చేయడానికి వచ్చిన డచ్ వారు మలేరియా బారిన పడకుండా పొగాకు నల్లమందు కలిపి పొగ తాగేవారు. వాళ్ల ద్వారా చైనాలో వ్యాప్తి చెందింది. చైనావాళ్లు పొగాకు కలపకుండా నల్లమందు మాత్రమే తీసుకునేవారు. దాని కారణంగా అనేక దుష్ఫలితాలు కలిగేవి. మందకొడితనంతో ప్రారంభించి, మానసిక రోగాలు అనేకం రాసాగాయి. ప్రజాసంక్షేమం కోరి చైనా ప్రభుత్వం 1800లో నల్లమందు దిగుమతిని నిషేధించింది.
అయితే నల్లమందు లాభాలు మరిగిన విదేశీ కంపెనీలు దాన్ని స్మగుల్ చేయడం మొదలెట్టాయి. పట్టుబడకుండా అధికారులకు లంచాలివ్వసాగాయి. వాళ్లను పట్టుకోవడం కష్టం కావడంతో ప్రభుత్వాధికారులెవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశీయులను కలుసుకోడదని రూలు పెట్టింది. ఏం చేసినా లంచాలు మరిగిన అధికారులు దొంగరవాణాను ప్రోత్సహించారు.
ఆ విధంగా ఈస్టిండియాకు లాభాలు కురవడంతో తక్కిన బ్రిటిషు కంపెనీలు తమ ప్రభుత్వంతో మొరపెట్టుకున్నాయి. అప్పుడు నల్లమందు వ్యాపారంపై ఈస్టిండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని బ్రిటిషు ప్రభుత్వం తొలగించి వేసింది. ఇక అన్ని కంపెనీలు చైనాపైకి ఎగబడ్డాయి. నల్లమందు స్మగ్లింగ్ విపరీతమై పోయింది. ఇదంతా చూసి చైనా ప్రభుత్వం లిన్ అనే కమిషనర్‌ను నియమించి వీళ్ల పని పట్టమంది.
అతను నల్లమందు రవాణాకు మూలకేంద్రమైన కాంటన్ రేవు పట్టణానికి వెళ్లి, విదేశీ వ్యాపారస్తులను కలిసి ‘మీ దగ్గరున్న నల్లమందు మొత్తాన్ని స్వాధీనం చేయండి’ అని అడిగాడు. వాళ్లు పోవోయ్ అన్నారు. లిన్ వాళ్ల ఫ్యాక్టరీల చుట్టూ కట్టడి చేశాడు. వాళ్ల దగ్గర పనిచేసే చైనా పనివాళ్లను లోపలకి వెళ్ల కూడదన్నాడు.
బయట నుంచి ఆహారం వెళ్లకుండా చూశాడు. కొన్ని రోజులకు వాళ్లు దిగివచ్చారు. తమ వద్ద ఉన్న 20 వేల నల్లమందు కేసులను అతనికి అప్పగించారు. లిన్ దాన్ని నాశనం చేయించాడు. ఇకపై ఏ విదేశీ నౌకైనా కాంటన్ రేవులోకి రావాలంటే ‘మా నౌకలో నల్లమందు లేదు’ అని కెప్టెన్ హామీపత్రం యివ్వాలి. అది అబద్ధమని తేలితే చైనా ప్రభుత్వం ఆ నౌకను స్వాధీనం చేసుకోగలదు అని రూలు పెట్టాడు.
లిన్ నాశనం చేసిన నల్లమందులో చాలాభాగం బ్రిటిషు కంపెనీలదే. ఈ నష్టానికి, కొత్త నిబంధనల వలన కలగబోయే నష్టానికి వాళ్లు భగ్గుమన్నారు. తమ ప్రభుత్వంతో చెప్పి చైనాపై యుద్ధం చేసి, మమ్మల్ని మా దొంగవ్యాపారం చేసుకునేట్లా చేయండి అన్నారు. ‘మీ చర్య వలన మా జాతిగౌరవం దెబ్బ తింది’ అని సాకు చెప్పి 1840లో బ్రిటిషు ప్రభుత్వం చైనాపై యుద్ధానికి దిగింది.
చైనా నెత్తిన నల్లమందు రుద్దడానికి ఉద్దేశించిన యుద్ధం కాబట్టి దీన్ని చరిత్రకారులు ‘నల్లమందు యుద్ధం’ అన్నారు. కాంటన్ రేవును, యితర రేవులను బ్రిటన్ తన యుద్ధనౌకలతో దిగ్బంధం చేసింది.
రెండేళ్ల యుద్ధం తర్వాత చైనాకు రాజీ పడక తప్పలేదు. 1842లో నాన్‌కింగ్ సంధి జరిగింది. దాని ప్రకారం విదేశీ వ్యాపారానికై 5 రేవులను తెరవవలసి వచ్చింది. కాంటన్‌కు దగ్గరగా వున్న హాంగ్‌కాంగ్‌ను బ్రిటన్ తన అధీనంలోకి తీసుకుంది. అప్పణ్నుంచి వదలలేదు. 1898లో 99 ఏళ్లకు లీజ్ తీసుకుంది.
156 ఏళ్లు అనుభవించి, చివరకు 1997లో హాంగ్‌కాంగ్‌ను చైనాకు అప్పగించింది. వీటితో బాటు తమకు స్మగ్లింగ్‌లో జరిగిన నష్టం, యుద్ధం చేయడానికి అయిన ఖర్చు అంటూ పెద్ద మొత్తాన్ని గుంజింది. బ్రిటన్ దౌష్ట్యాన్ని ఎదుర్కోలేని చైనా చక్రవర్తి బ్రిటన్ రాణి విక్టోరియాకు ఫిర్యాదు చేస్తూ స్వయంగా లేఖ రాశాడు. ఆవిడ దాన్ని పక్కన పడేసింది.
అప్పణ్నుంచి చైనా కష్టాలు ప్రారంభమయ్యాయి. విదేశీ వ్యాపారులు వచ్చి ప్రాణాంతకమైన నల్లమందు ప్రజలకు అమ్ముతూంటే నిస్సహాయంగా చూస్తూ కూర్చోవలసి వచ్చింది. ఈ వ్యాపారస్తులతో బాటు క్రైస్తవ మిషనరీలు కూడా దిగడ్డారు. వీళ్లు సామ్రాజ్యవాదానికి తొత్తులుగా పని చేస్తూ, చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారు, ప్రజలను రెచ్చగొట్టేవారు. వీళ్లపై చర్యలు తీసుకుందామా అంటే విదేశీయులపై చైనా చట్టాలు పని చేయవంటూ విదేశీ ప్రభుత్వాలు అభ్యంతరం తెలిపేవి.
ఏమైనా అంటే మళ్లీ యుద్ధం అంటారేమోనని భయం. విదేశీయులకే కాదు, క్రైస్తవం తీసుకున్న చైనావారు నేరాలు చేసినా, వారిని చైనా చట్టాలు శిక్షించకూడదని అన్నారు కొంతకాలానికి. ఈ మిషనరీల పుణ్యమాని గ్రామాల మధ్య చిచ్చు రేగేది. కొన్ని గ్రామాలవారు యిదంతా యీ మతగురువుల వలననే వస్తోందని ఆగ్రహించి వారి చర్చిలపై దాడి చేసి, మతగురువులను చంపేసేవారు.
అలాటి ఘటన జరగగానే ‘అదిగో, మాకు నష్టం వాటిల్లింది, దానికి నష్టపరిహారంగా మాకు డబ్బు కట్టండి, ఇంకా ఎక్కువ రాయితీలు యివ్వండి, మేం ఫలానా చోట వ్యాపారం చేసుకోవడానికి అనుమతి యివ్వండి’ అంటూ కంపెనీలు అల్లరి పడి, సాధించేవి. ఈ విధంగా క్రైస్తవులపై ఎన్ని దాడులు జరిగితే వాళ్లకు అంత లాభం ఒనగూడసాగింది.
ఇక క్రైస్తవంలోకి మారిన వాళ్లు అత్యాచారాలు చేసి, మతం ముసుగులో విదేశీ శక్తుల అండ పొందేవారు. అలా మతం మారిన హూంగ్ అనే ఒకడు ‘‘విగ్రహారాధకులను చంపండి’’ (హిందువుల్లాగే అప్పట్లో చైనీయులు విగ్రహారాధకులు) అనే నినాదం చేపట్టి అనేకమంది అనుయాయులను తయారు చేసుకుని వారి ద్వారా దారుణ మారణకాండ నిర్వహించాడు.
దీన్ని ‘‘తైపింగ్ తిరుగుబాటు’’ అన్నారు. 12 ఏళ్లు సాగిన ఆ హననపర్వంలో దాదాపు 2 కోట్ల మంది చావుకి గురయ్యారు. మొదట్లో అతన్ని ఆమోదించిన మిషనరీలు తర్వాతి రోజుల్లో భయపడి, అతన్ని తప్పుపట్టాయి. అయినా ఎవరూ నమ్మలేదు. ఎందుకంటే హూంగ్ వెనుక సామ్రాజ్యశక్తుల బలం వుందని అందరికీ తెలుసు. చైనా ప్రభుత్వం నిస్సహాయంగా చూస్తూ వుండిపోయింది.
ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేక, అది భారీగా పన్నులు వేసి, పీడించడంతో ప్రజలు దానికి దన్నుగా నిలబడడం మానేశారు. ఇటు ప్రభుత్వమూ, అటు మతం అడ్డుగా పెట్టుకుని చెలరేగిపోతున్న సామ్రాజ్య శక్తులు, రెండిటి మధ్య వాళ్లు నలిగిపోయారు.
నాన్‌కింగ్ ఒప్పందంతో బ్రిటన్ లాభపడిన తీరు చూసి, యితర సామ్రాజ్యదేశాలకు కన్ను కుట్టింది. దోచుకోవడానికి చైనా దొరికిందనుకుంటూ చలో చైనా అన్నాయి. ఫ్రాన్స్, అమెరికా వచ్చి వాణిజ్య ఏకపక్ష ఒప్పందాలు చేసుకున్నాయి. అన్నీ వాళ్లకు లాభసాటిగా వుండేవే! తిరుగుబాటుతో సతమతమవుతున్న చైనా వాళ్లతో బేరాలాడలేక అన్నిటికీ తలొగ్గింది.
తనకు పోటీగా ఫ్రాన్స్, అమెరికా కూడా ఎగబడడంతో, బ్రిటన్ మరో యుద్ధం చేసి చైనాను యింకా వంచాలనుకుంది. 1856లో ఒక చైనా నౌక యితర నౌకలను దోచుకుంటోందని (పైరసీ) కాంటన్ రేవు చైనా అధికారి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ‘అది మా నౌక, దాన్ని పట్టుకుంటావా?’ అంటూ బ్రిటన్ యుద్ధానికి దిగింది.
ఆ నౌక చైనీయులదే. సిబ్బందీ చైనీయులే. మరి విదేశీ కనక్షన్ ఏమిటంటే, అది హాంగ్‌కాంగ్ పర్మిషన్ తెచ్చుకుని బ్రిటిష్ జండా ఎగరేస్తోంది. ఆ పర్మిషన్ ఎక్స్‌పైర్ అయిపోయింది కూడా. అయినా ‘నువ్వు కాకపోతే మీ అమ్మ నన్ను తిట్టింది’ అంటూ గొఱ్ఱెపిల్లను తినేసిన తోడేలులా యీ సాకు చాలనుకుంది బ్రిటన్.
యుద్ధం ప్రకటించి ఇంగ్లండు నుంచి సైన్యాలను పంపించింది. సరిగ్గా అప్పుడు, అంటే 1857లో ఇండియాలో సిపాయిల తిరుగుబాటు జరగడంతో సైన్యదళాలను అటు మళ్లించవలసి వచ్చింది. దాన్ని అణచివేశాక 1858లో చైనా మీదకు వచ్చింది.
ఈలోగా ఫ్రెంచి వాళ్లు యుద్ధానికి ఓ సాకు వెతికారు. ‘మీ చైనాలో ఎక్కడో కానీ మా దేశపు మిషనరీని చంపేశారు. అందుకని యుద్ధం చేస్తాం.’ అని ప్రకటించారు. ఇంగ్లండు, ఫ్రాన్స్ కలిసి అమెరికా, రష్యాలను కూడా ఆహ్వానించారు, ‘రండి మీరూ ఏ చెయ్యి వేద్దురుగాని, దీన్ని నంచుకు తినేద్దాం’ అని. వాళ్లు ‘యుద్ధం ఎందుకుగాని, మీరు విందుకు కూర్చున్నపుడు మమ్మల్నీ పిలవండి చాలు’ అన్నారు.
ఓ పక్క తిరుగుబాటుతో సతమతమవుతున్న చైనా ప్రభుత్వం ‘యుద్ధం వద్దు, ఏదోలా రాజీ పడదాం’ అనేసింది. ఇది మహ బాగుంది అనుకుని, ఈ నాలుగు దేశాల వారూ మాకు యీ హక్కులు కావాలి, ఆ హక్కులు కావాలి అంటూ హిరణ్యాక్షవరాలు కోరారు. చైనా ప్రభుత్వం అన్నిటికీ తలొగ్గింది.
ఈ కథ యింతటితో ముగియలేదు. పద్థతి ప్రకారం యీ ఒప్పందాలకు ఆ యా ప్రభుత్వాలు ఆమోదముద్ర వేసి ఏడాదిలోగా బీజింగ్‌లో కలిసి పత్రాలు యిచ్చిపుచ్చుకోవాలి. ఆ ప్రకారం రష్యా ప్రతినిథి భూమార్గం ద్వారా వచ్చేశాడు. తక్కిన మూడు దేశాల వాళ్లు పైహో నదీ మార్గం ద్వారా వస్తామన్నారు. ‘ఆ నదీతీరం తిరుగుబాటుదారుల చేతిలో వుంది. అందువలన మీరలా రావద్దు, భూమార్గం ద్వారానే రండి’ అని చైనా చెప్పింది.
అమెరికా ప్రతినిథి సరేనని వేరే మార్గం ద్వారా వచ్చాడు. కానీ ఇంగ్లండు, ఫ్రాన్స్ ప్రతినిథులు మాత్రం నదీమార్గం ద్వారానే రాబోయారు. తిరుగుబాటు దారులు, చైనా ప్రభుత్వసైన్యం మధ్య కాల్పుల్లో వారికి నష్టం కలిగింది.
హత్తెరీ మా మీద కాల్పులు కాలుస్తావా? అంటూ వెనక్కి వెళ్లి భారీ సైన్యాలను వెంటపెట్టుకుని వచ్చి 1860లో బీజింగుపై దాడి చేసి, ఆ నగరాన్ని సర్వనాశనం చేశారు. తమకు కళలంటే తగని మక్కువ, ప్రపంచంలో ఎక్కడ ఏ కళాఖండం వున్నా తెచ్చి మేం భద్రపరుస్తాం అని చెప్పుకునే బ్రిటన్, ఫ్రెంచ్ వారు బీజింగులోని ఇంపీరియల్ సమ్మర్ పేలస్‌పై దాడి చేసి అక్కడున్న పుస్తకాలను, చిత్రాలను, కళాఖండాలను కొన్ని రోజుల పాటు తగలబెట్టారు.
అలెగ్జాండ్రియాలోని లైబ్రరీని రోమన్ సైనికులు తగలబెట్టినది క్రీ.పూ. 48లో, మరి యిది? క్రీ.శ. 1860లో! తూర్పు ప్రాంతాల నాగరికతపై వారి కున్న చిన్నచూపు యిలాటిది!
ఇక్కడితో చైనా చరిత్ర ఆపుతాను. ప్రస్తుతం శత్రు దేశమైన చైనా గురించి మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. శత్రువు బలాబలాలు మనం అర్థం చేసుకోవాలి కదా! కానీ అంతా ఒకేసారి చెపితే బోరు కొడుతుంది. అప్పుడప్పుడు చెప్పుకోవచ్చు. ఇక్కడ గమనించవలసిన విషయాలు రెండు. ఒకటి – తమ వ్యాపారం కోసం పాశ్చాత్యదేశాలు ఎంతటి దురాగతానికైనా తెగిస్తాయనడానికి యిది మరో ఉదాహరణ. అప్పట్లో ఇంగ్లండు, ఫ్రాన్స్ లీడర్లుగా వుండేవి. ఇతర దేశాలు వాటి వెనక్కాల వచ్చేవి.
ఇప్పుడు అమెరికా ఇంగ్లండు స్థానాన్ని ఆక్రమించింది. ఇంగ్లండు దానికి తోకగా మారింది. అప్పట్లో సుగంధద్రవ్యాలు, నల్లమందు లాటివైతే యిప్పుడు పెట్రోలు, ఆయుధాలు వగైరా. ఎక్కడ ఏ సంపద వున్నా యీ సామ్రాజ్యవాద దేశాలు వాలిపోతాయి.
గ్లోబలైజేషన్‌ను అమెరికా ప్రవేశపెట్టిందంటే ‘వసుధైక కుటుంబకమ్’ అనే సిద్ధాంతాన్ని నమ్మి పెట్టిందనుకోవడానికి లేదు. తమ వ్యాపార విస్తరణకై ప్రతిపాదించింది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో మధ్యతరగతి వాళ్లు ఎదిగి మార్కెట్ ఏర్పడుతోంది, దాన్ని కాజేద్దామని ప్రారంభించింది. అయితే 25 ఏళ్లలో అది ఎదురు తన్నింది. వాళ్ల చేత దోపిడీ చేయబడి, హీనంగా చూడబడిన చైనాయే వాళ్లకు పెద్ద భూతంలా తోచసాగింది. దాని పేరు చెపితే వణుకుతున్నారు.
గ్లోబలైజేషన్‌ను రివర్స్ చేద్దామంటున్నారు. కింద పడినవాళ్లకు పైకి వచ్చేందుకు కాలచక్రం ఛాన్సు యిచ్చిందనుకోవాలి. ఒకప్పుడు మనను అనాగరికులుగా చూసిన బ్రిటిషు వారు యిప్పుడు మనను ఆదరిస్తున్నారు కదా. భారతీయ సంతతివారిని మంత్రులుగా ఆమోదిస్తున్నారుగా!
ఇక రెండో విషయం ఏమిటంటే – మతాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాధికారం పొందడానికి చూడడం. క్రైస్తవాన్ని, క్రైస్తవ మతప్రచారకులను ఎలా వాడుకున్నారో పైన విపులంగా రాశాను కదా. ఇప్పుడు కూడా దీన్ని వాడుకోవడం జరుగుతూంటుంది. 200 ఏళ్ల క్రితం నాటి ట్రిక్కులు యిప్పుడు పనిచేయవు కాబట్టి కొత్త తరహాగా నడుస్తుంది. ఉదాహరణకి ఇండియాలో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి, దళితులపై దాడులు జరుగుతున్నాయి అని కంచె ఐలయ్య లాటి వాళ్లు విదేశీ మీడియాకు రిపోర్టులు పంపుతారు.
జరగటం లేదని అనటం లేదు, కానీ వాటిని ఔట్ ఆఫ్ ప్రపోర్షన్ చేసి, భూతద్దంలో వేసి, దీని వెనుక మెజారిటీ హిందువులందరూ ఉన్నారు అని ఆయన రాస్తూంటాడు. నిజానికి హిందువుల్లో అతి తక్కువ శాతం మంది మాత్రమే వాటిని సమర్థిస్తారు. అయినా వీళ్లు యావన్మంది హిందువులకు పులుముతారు.
దాంతో ఇండియాలో మైనారిటీల రక్షణకు యునైటెడ్ నేషన్స్ రక్షణ దళాలను ఏర్పాటు చేయాలి. ఆ దళంలో మా సైనికులు, ఇంగ్లండు సైనికులు వగైరాలు వుంటారు అంటూ అమెరికా మొదలెడుతుంది. వాళ్లు వచ్చి యిక్కడ గూఢచర్యం చేయడం, స్థానిక రాజకీయనాయకులను ప్రభావితం చేయడం యిలాటివి చేస్తారు. ఈ కార్యకలాపాల గురించి మాజీ డిజిపి అరవింద రావుగారు చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. ఆయన ప్రసంగాలు, వ్యాసాలు వింటే పూర్తి అవగాహన వస్తుంది.
ఎక్కడో మొదలుపెట్టి, ఎక్కడికో చేరాను, ఎప్పటిలాగానే! చివరిగా చెప్పేదేమిటంటే మతం వ్యక్తిగతమైనంత వరకు మంచిదే. కానీ సంస్థాగతం చేసి, దానిని యితర ప్రయోజనాలకు వాడడం మొదలుపెట్టడం ప్రారంభించాక, అది ఎక్కడెక్కడికో దారి తీసి, ప్రమాదకారి అవుతుంది. ఏ మతానికైనా యిది వర్తిస్తుంది. (ఫోటో – నాన్‌కింగ్ సంధి ఒడంబడిక)
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2020)
[email protected]