సోనియా గాంధీ గారికి దిల్లీ వాతావరణం పడటం లేదట. గోవా కెళ్లారు. అసలే కాన్సర్, ఆ పై ఊపిరితిత్తుల సమస్య. దిల్లీలో కాలుష్యం రికార్డు స్థాయిలో వుంది. ఇక్కడ వుంటే ముప్పని డాక్టర్లు చెపితే కొడుకుని తీసుకెళ్లి గోవా వెళ్లారు. వెళుతూవెళుతూ పార్టీకి చేసిన ఉద్ధరింపు ఏమిటంటే – మూడు కీలకరంగాలపై మూడు కమిటీలు వేశారు.
నిజానికి అవి ప్రభుత్వం చూసుకోవలసినవి – ఆర్థికం, జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాలు. వీటిపై వీళ్లు అధ్యయనం చేసి, సలహాలు చెప్పినా బిజెపి విని చచ్చేది ఎలాగూ లేదు. మరెందుకు వేశారూ అంటే లేఖ రాసి, సణుగుతున్న నాయకులకు ఏదో పని కల్పించాం అని చెప్పుకోవడానికి, ఆ కమిటీల్లో వారికి చోటు యిస్తూనే భజంత్రీమేళానికి కూడా పీట వేశారు. ఈ కమిటీ నియామకాలతో అసంతృప్తవాదులు ‘తృప్తాస్మ’ అంటారని వీరి ఊహ కాబోలు.
కమిటీ అంటూ వేయాల్సి వస్తే విదేశీ వ్యవహారాలపై కాదు, పార్టీ వ్యవహారాలపై వేయాలి. తన బదులు ఎవరు అధ్యక్షులైతే బాగుంటుంది అని పార్టీ తరఫున సెర్చ్ కమిటీ వేయాలి. ‘మీ దృష్టిలో ఎవరున్నారు చెప్పండి’ అంటూ ఓ నెంబరు యిచ్చి పార్టీ కార్యకర్తలను దానికి మెసేజిలు పంపమనాలి.
పార్టీని పైనుంచి కిందదాకా ప్రక్షాళన ఎలా చేయాలి, కామరాజ్ ప్లాన్ వంటిది అమలు చేసి, వృద్ధనాయకత్వాన్ని యింటికి పంపి కొత్త రక్తం ఎలా ఎక్కించాలి అనే విషయంపై ఆలోచనలు చెప్పండి అని కమిటీలు వేయాలి. ఇవేమీ వేయకుండా గోవా వెళ్లి కూర్చుంటే ఎలా? దిల్లీలో ఆవిడకే కాదు, పార్టీకీ ఊపిరాడటం లేదు. కళ్లు తేలేసేట్లు వుంది. తనకు ప్రాణం మీదకు వచ్చినప్పుడు కూడా తనతో పార్టీని తీసుకెళదామని ఆవిడ అనుకుంటోంది తప్ప దాన్ని బతికిద్దామని చూడటం లేదు.
‘వరుస పరాజయాలతో పార్టీ కృంగిపోతోంది, అధిష్టానం స్తబ్దంగా వుంది, కాస్త కంటికి కనబడి, కలిసి గోడు వినిపించుకోవడానికి వీలుపడే నాయకులు పైన వుంటే బాగుంటుంది’ అని 23 మంది ప్రముఖ కాంగ్రెసు నాయకులు పార్టీ అధినాయకత్వంపై తిరుగుబాటు చేసి, ఆగస్టు 7న బహిరంగ లేఖ రాసి, ప్రెస్‌కు రిలీజ్ చేసి, హంగామా చేసి మూడున్నర నెలలు దాటింది.
2019 పార్లమెంటు ఎన్నికల అనంతరం ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ జులైలో అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసి, అస్త్రసన్యాసం చేసి కూర్చుంటే, గీతాబోధన చేసి యుద్ధానికి పురికొల్పే జగద్గురువు కనబడలేడు సరికదా, ఆ అర్జునుడి చుట్టూనే కూర్చుని నీవు తప్ప నితఃపరంబెరుగ అని అదే విషాదముద్ర పట్టి కూర్చున్నవాళ్లే కనబడ్డారు. ‘అర్జునుడికి ఆయాసం వచ్చేసింది, ఏ అభిమన్యుణ్నో వెతుకుదాం పదండి’ అన్నవాడూ లేకపోయాడు.
మా గాంధీ కుటుంబంలోంచే నాయకులను వెతకనవసరం లేదు. బయటివాళ్లెవరైనా ఫర్వాలేదు, నన్ను మాత్రం చంపుకు తినకండి’ అని రాహుల్ మొత్తుకున్నా వినేవాళ్లు లేకపోయారు.
రాజీనామా చేస్తూ రాహుల్ చేసిన విలాపం నిజంగా జాలి పుట్టిస్తుంది. పార్టీలో అతని మాట వినేవాడు లేడు, అంతా తమ చిత్తం వచ్చినట్లే జరగాలనేవాళ్లే. నాయకులే తప్ప పార్టీకి కార్యకర్తలు కరువయ్యారు. టిక్కెట్ల కోసం కాట్లాడడమే తప్ప, నెగ్గడం చేతకాని వాళ్లందరూ తయారై, ఎన్నికలలో ఓడిపోగానే రాహుల్ కారణంగానే ఓడిపోయాం అనసాగారు.
రాహుల్‌కు రాజకీయాలంటే ఏ మక్కువా లేదు. పరిపాలన చేసేద్దామన్నా కుతూహలమూ లేదు. పార్టీ ఆఫీసులో కూర్చుని, రాష్ట్రాల నుంచి వచ్చి ఫిర్యాదులు చేసే నాయకులతో మాట్లాడే ఆసక్తి బొత్తిగా లేదు. మంత్రి పదవి తీసుకుని, దర్జా చెలాయిద్దామన్నా కోరికా లేదు.
అతను తలచుకుంటే మన్‌మోహన్ కాబినెట్‌లో ఉపప్రధాని కాకపోయినా, ఏదైనా ముఖ్యమైన మంత్రిత్వ శాఖ తీసుకుని, కష్టపడి పనిచేసి, విమర్శకుల నోళ్లు మూయించేవాడు. కానీ అతనికి ఆ ఓపిక లేదు. ఏదో ఫ్రెండ్స్‌తో కులాసాగా కాలక్షేపం చేద్దామా, తరచు విదేశాలకు వెళ్లిపోయి గర్ల్‌ఫ్రెండ్‌తో తిరుగుదామా అనే తప్ప దేశవ్యవహారాలు పట్టవు.
అయితే అతని ఖర్మ ఏమిటంటే సోనియాకు కొడుకుగా పుట్టడం. ఆవిడ ఓ బ్రహ్మరాకాసి. ‘కాంగ్రెసు నాయకత్వం మన కుటుంబం చేతుల్లోంచి జారిపోయి, వేరే వాళ్ల చేతిలో యిరుక్కుపోయినప్పుడు, కష్టపడి వెనక్కి లాక్కుని ప్రతిపక్షంలో వున్న పార్టీని అధికారంలోకి తెచ్చాను కదా. దాని ఫలాలు నా సంతానం అనుభవించకపోతే నా కష్టమంతా వృథాయే కదా’ అని పంతం పట్టి కూర్చుంది.
నిజానికి 2004లో ఆవిడే ప్రధాని అయితే పోయేది. కానీ విదేశంలో పుట్టానన్న ముద్ర, దానికి తోడు పాలనానుభవం బొత్తిగా ఏమీ లేకపోవడం, 58 ఏళ్ల వయసులో ఓనమాల దగ్గర్నుంచి నేర్చుకోవడం కష్టమనుకుని, మన్‌మోహన్‌కు బాధ్యతలప్పగించి, హక్కులన్నీ తన దగ్గర వుంచుకుంది.
తనకున్న యిబ్బంది పిల్లలకు లేదు, వాళ్లు యిక్కడ పుట్టినవారే, తగిన వయసులో వున్నారు, వాళ్లు స్వయంగా పాలకులైతే చూసి సంతోషిద్దామని అనుకుంది. అంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ పిల్లల యిష్టాయిష్టాలు కూడా ఆవిడ పట్టించుకోవాలి కదా! ఆ మధ్య నటవారసత్వం వుంది కదాని ఓ యువనటుడిని అతని కుటుంబం సినిమాల్లో తోయబోయింది. ఆ అబ్బాయి కళ్లు తేలేశాడు. మొరాయించాడు. ప్రేక్షకులూ ఆ అబ్బాయి పక్షాన నిలిచి, అతని సినిమాలు ఫ్లాప్ చేసి, కుటుంబం కళ్లు తెరిపించారు.
రాహుల్ విషయంలో కూడా ప్రజలు ఎప్పటికప్పుడు అతనికి మొండిచెయ్యి చూపించి, తల్లి కళ్లు తెరిపించేందుకు తమ వంతు కృషి తాము చేస్తున్నారు. అయినా తల్లికి బుద్ధి రావటం లేదు. బడికి వెళ్లేందుకు మొరాయింటే చిన్నపిల్లాడిలా కొడుకు ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి వెనకాడుతున్నాడని, కూతుర్ని కూడా తోసి చూసింది.
మొన్నటికి మొన్న ఆ అమ్మడు తిరిగిన చోటల్లా ఓడించి, ప్రజలు తమ సందేశాన్ని అందించారు. ‘ఇన్నాళ్లూ మీ పార్టీ వాళ్లు జనాల్లోకి రాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు కదా, యిప్పుడూ యింటికెళ్లి కూర్చోండి’ అని ఘాటుగా చెప్పారు. అయినా తల్లి దారి తల్లిదే. కూతుర్ని మరీ ముందుకు తోస్తే ఆమెకు బేనజీర్ భుట్టో గతి పడుతుందేమోనన్న భయం వుంది కాబట్టి, ఎలాగైనా సరే, కొడుకుని తోవలో పెడదామనుకుని తెగ తోమేస్తోంది.
తల్లిపై ఎంత మంట వున్నా, రాహుల్ పైకి చెప్పుకోలేడు పాపం. తన రాజీనామా లేఖలో తమ కొడుకులకు టిక్కెట్లు యివ్వమని పట్టుబట్టిన యితర నాయకుల గురించి చెప్పగలిగాడు కానీ, పార్టీ నిర్మాణంలో కొడుకు తేదలచిన మార్పులను అడ్డుకున్న తన తల్లి గురించి ఒక్కమాట అనలేకపోయాడు.
ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఇష్టం లేకపోయినా, మంత్రసానితనం ఒప్పుకున్నాం కదాని, రాహుల్ పార్టీలో యువతరాన్ని, కొత్త మొహాల్ని తెచ్చి దానికి కాస్త ప్రాణం పోద్దామని ప్రయత్నించాడు. ఇలా పని మొదలెట్టాడో లేదో రాష్ట్రాలలో వున్న పాతతరం వాళ్లందరూ సోనియాకు ఫిర్యాదు చేశారు. ఏదైనా ప్రయోగం ప్రారంభించినప్పుడు, దాని ఫలితాలు రావడానికి కొంత టైము పడుతుంది. కానీ ఆ సమయం కూడా యివ్వకుండానే చిన్న సెట్‌బాక్ రాగానే సోనియా రాహుల్ నిర్ణయాలను తిరగతోడేసింది. ఆ విధంగా రాహుల్‌కు ఏమీ చేతకాదని లోకానికి తనే చాటి చెప్పింది.
ఇలాటి తల్లిని రాహుల్ బహిరంగంగా తిట్టిపోయగలడా? పళ్లు నూరుకుంటూనే బండి లాక్కుని వచ్చాడు. అతనికి స్వతహాగా తెలివితేటలు తక్కువ. విషయపరిజ్ఞానం తక్కువ. తెలుసుకోవాలనే తపనా లేదు. ఒక హేపీ గో లక్కీ ఫెలో. ఏదో బడికి పంపిస్తున్నారు కాబట్టి, పరీక్షలకు అప్పుడప్పుడు హాజరు కావాలి కాబట్టి సబ్జక్టు కాస్త ముక్కున పెట్టుకుని, పార్లమెంటులో అప్పుడప్పుడు ఉపన్యాసాలు యిచ్చేసి, హమ్మయ్య, యివాళ్టికి యీ తద్దినం పూర్తయింది అనుకుంటాడు. దీన్నే ఒబామా ఎత్తి చూపాడు.
సోనియా కాలం చేశాక, రాజకీయాలు వదిలేసి, నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని విదేశాల్లో కాపురం పెడతాడని నాకు గట్టి నమ్మకం. సోనియాకు ఆరోగ్యం యివ్వకపోయినా భగవంతుడు ఆయుర్దాయం యిచ్చాడు. అందుకే రాహుల్ త్రిశంకులోకంలో వేళ్లాడుతున్నాడు. రాలుగాయి కుర్రాడు మధ్యమధ్యలో బడి ఎగ్గొట్టి పారిపోతూన్నట్లు పార్లమెంటు సెషన్స్‌లో వున్నా, సిడబ్ల్యుసి సమావేశం వున్నా, ఫారిన్ ఉడాయిస్తాడు. మొన్న బిహార్ ఎన్నికలు హోరాహోరీ జరుగుతూంటే మూడంటే మూడే రోజులు వచ్చి, ఆ తర్వాత షిమ్లాకు తుర్రుమన్నాడు.
అవతల ప్రధాని పదవిలో వున్నా 70 ఏళ్ల మోదీకి ప్రచారానికి తీరిక, ఓపిక వుంటుంది కానీ ప్రతిపక్షంలో వున్న 50 ఏళ్ల రాహుల్‌కి తీరిక, ఓపిక వుండవు. రాహుల్ అలాగే వుండాలని బిజెపి కోరిక. ‘మోదీపై ఫిర్యాదులున్నాయా? అంటే రాహుల్ కావాలనా? చాల్లేవయ్యా ఎవరైనా నవ్విపోతారు.’ అనాలంటే మోదీకి రాహులే ప్రత్యామ్నాయంగా కనబడాలి.
మాటవరసకి ఏ జ్యోతిరాదిత్య సింధియానో (యిప్పుడు కాదు), కపిల్ సిబ్బల్‌నో మోదీకి ప్రత్యామ్నాయంగా చూపగలిగిందనుకోండి, అప్పుడు ఓటరు కాస్త ఆలోచనలో పడతాడు. రాహుల్ విషయంలో అయితే ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా ఒద్దు బాబోయ్ అంటాడు. రాహుల్‌కు వున్న ‘పప్పూ’ యిమేజే బిజెపి ఎదుగుదలకు శ్రీరామరక్ష. ఎన్నికలలో దాని విజయానికి గ్యారంటీ కార్డు. రాహుల్ కాంగ్రెసు ప్రధాని అభ్యర్థిగా వున్నంతకాలం ఆ గ్యారంటీ కార్డు చెల్లుతుంది.
తనకున్న ‘దెబ్బలబ్బాయి’ (వ్హిపింగ్ బాయ్) యిమేజి – అంటే అతని మాట ఎవరూ వినరు కానీ, ఏదైనా తప్పు జరగగానే అతనిదే పొరపాటని నిర్ణయించి శిక్షిస్తూంటారు – గురించి రాహుల్‌కు బాగా తెలుసు. తల్లి కోసం కొంతకాలం భరించాడు కానీ, 2019 ఎన్నికల ఫలితాలు చూశాక పూర్తిగా మనసు విరిగిపోయింది.
పార్లమెంటుకున్న మొత్తం సీట్లలో 10 శాతం కూడా రాలేదు. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. తను స్వయంగా అమేఠీలో ఓడిపోయాడు. అందువలన వదిలేసి కూర్చున్నాడు, మీ ఛావు మీరు చావండి అని. కొడుక్కి వచ్చిన బుద్ధి తల్లికి రాలేదు, కాన్సర్ వచ్చింది కానీ! సాధారణంగా అలాటి రోగం రాగానే ప్యాకప్ వేళ అయిందని గ్రహించి, వ్యవహారాలు టై-అప్ చేసుకుంటారు తప్ప ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ కూర్చోరు.
కానీ ఆవిడ తరహాయే వేరు. కొడుకు రాజీనామా చేసిన ఒక నెల కల్లా తనే మధ్యంతర అధ్యక్షురాలై పోయింది. ఆ నెల ఎందుకు పట్టిందంటే కొడుకు మీద ఒత్తిడి తెచ్చి రాజీనామా వెనక్కి తీసుకునేట్లు చేయాలని ప్రయత్నించింది. కానీ అతను ససేమిరా అనడంతో, మళ్లీ ఎవరికైనా అప్పగిస్తే వెనక్కి రాదన్న భయం చేత తనే పగ్గాలు చేపట్టింది. పోనీ తన చుట్టూ యువతీయువకులను, ఆరోగ్యవంతులను పెట్టుకుని, తను చికిత్స కోసం తరచుగా విదేశాలు వెళ్లి వస్తున్నా పార్టీ నిర్వహణకు యిబ్బంది రాకుండా చూసుకుందా? అబ్బే, మళ్లీ అదే 71 ఏళ్ల అహ్మద్ పటేల్ (ఇప్పుడు ఆయనా ఆపసోపాలు పడుతున్నాడు), 79 ఏళ్ల ఆంటోనీ వగైరాలే.
కాంగ్రెసు వర్కింగ్ కమిటీలో మొత్తం 80 మంది వుంటే ఒకరికి 90 దాటాయి, ముగ్గురికి 80 దాటాయి, 11 మందికి 70 దాటాయి, 13 మందికి 60 దాటాయి. తక్కిన 20 మందికి 60 లోపు. సరాసరి వయసు 62! వీళ్లు రెగ్యులర్‌గా కలవరు. ఏదైనా కొంపలు మునిగినపుడే వచ్చి కూర్చుంటారు. బిహార్‌లో తేజస్వి తన చిన్నవయసు కారణంగానే అంత గ్లామరు తెచ్చుకున్న యీ రోజుల్లో యీ వృద్ధ జంబూకాలతో కాంగ్రెసు ఏ సందేశం యిద్దామనుకుంటోంది? అవతల బిజెపి జగన్నాథ రథం దూసుకుని వెళ్లిపోయి, తన చక్రాల కింద కాంగ్రెసును నలిపివేస్తోంది. దేశంలో కనబడిన నాయకుణ్నల్లా నయానాభయానా లాగేసుకుంటోంది. అయినా యీవిడ కుర్చీ వదల్లేదు.
రాజీనామా చేస్తూ రాహుల్ ఏమన్నాడు? నా స్థానంలో అధ్యక్షులయ్యేవారు మా కుటుంబసభ్యులు కాకూడదు అన్నాడు. అతని మాటకు సోనియా పూచికపుల్లంతైనా విలువ నిచ్చిందా? అయినా మధ్యంతర అధ్యక్షురాలంటే ఏమిటి? నెలో, రెండు నెలలో వుండాలి. సంస్థాగత ఎన్నికల నిర్వహించి, పార్టీలో కార్యకర్తల ఆదరణ ఎవరికి వుందో తేల్చుకుని వారికి పదవి అప్పగించాలి.
కానీ ఏడాది దాటినా ఆ ముచ్చటే లేదు. కాంగ్రెసు చుక్కాని లేని నావలా గాలి ఎటు వీస్తే అటు పోతూ, మధ్యమధ్యలో నీళ్లలోకి మునిగి గుటకలు మింగుతూ సాగుతోంది. దశాబ్దాలుగా కాంగ్రెసును నమ్ముకుని రాజకీయ జీవితం గడుపుతున్నవారికి యిది ఆందోళన కలిగించింది. ఇలా అయితే పార్టీ దివాళా తీయడం ఖాయం అనిపించింది.
ప్రస్తుత పార్లమెంటులో వున్న 303 బిజెపి ఎంపీలలో 31 మంది కాంగ్రెసు నుంచి వెళ్లినవారే. 2015 నుంచి 2020 మధ్య వివిధ రాష్ట్రాలకు చెందిన 120 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు బిజెపి వైపు ఫిరాయించారు.
2014లో మోదీ సునామీ కారణంగా కాంగ్రెసుకు 44 మాత్రమే వచ్చాయనుకున్నా, నోట్ల రద్దు, ఆర్థిక మందగమనం వంటి అనేక అంశాల తర్వాత కూడా 2019 నాటికి కాంగ్రెసుకు పెరిగిన సీట్ల సంఖ్య 8! 2018 అసెంబ్లీ ఎన్నికలలో నెగ్గిన మూడు రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ జారిపోయింది. రాజస్థాన్ జారిపోబోయి, వేళ్ల సందున నిలిచింది. కర్ణాటకలో 13 మంది ఫిరాయించి, ప్రభుత్వాన్ని కూలదోశారు. నువ్వానేనా అన్నట్లు సీట్లు వచ్చిన గుజరాత్‌లో బిజెపి కాంగ్రెసు నుంచి ఎమ్మెల్యేలు లాగేసుకుంటూ అక్కడ బలాన్ని క్షీణింప చేసింది.
గోవా, మణిపూర్‌లలో అత్యంత పెద్ద పార్టీగా అవతరించినా, సకాలంలో చర్యలు తీసుకోక పోవడం చేత అవకాశాన్ని బిజెపి ఎగరేసుకుని పోయింది. పార్లమెంటులో వున్న మొత్తం వున్న 543 స్థానాలలో 46 శాతం అంటే, 249 సీట్లు 5 పెద్ద రాష్ట్రాలలో (ఉత్తర ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు)లో వున్నాయి.
ఆ 249లో కాంగ్రెసుకున్న పార్లమెంటు సీట్లు 12 (5 శాతం)! ఈ రాష్ట్రాలలోని మొత్తం 1462 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెసు గెలిచినది 130 (9 శాతం)! ఆంధ్ర, దిల్లీ, త్రిపుర, సిక్కిమ్, నాగాలాండ్‌లలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా లేదు.
ఆగస్టు నాటికే పరిస్థితి యిది. ఇది చూసి కడుపు మండి సంస్థాగత ఎన్నికలు జరపండి మహాప్రభో, బలమైనవారెవరో తెలుసుకుని వారికి పదవులివ్వండి. వారిలో ఎవరో ఒకరు, ఎవరైనా సరే, బాధ్యత వహించి, సంస్థకు నేతృత్వం వహించండి, మమ్మల్ని అనాథల్లా వదిలేయకండి అని లేఖారచయితలు మొత్తుకున్నారు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2020)
[email protected]