కోవిడ్ కారణంగా మనుష్యులే కాదు, ప్రభుత్వాలే ఎగిరిపోతున్నాయనిపిస్తోంది, ఇటలీ కథ వింటే! కోవిడ్‌ను సరిగ్గా హేండిల్ చేయలేదంటూ ప్రధానిని దింపేశారు. కొత్తాయన అధికారంలోకి వచ్చాడు. రోగనిరోధక శక్తి వుంటే రోగాన్ని తట్టుకోగలం, అలాగే పార్టీ, ప్రభుత్వం పటిష్టంగా వుంటే యిలాటి విమర్శలను తట్టుకోవచ్చు. ఇటలీ ప్రభుత్వం ఓపిక అంతంతమాత్రం కాబట్టి కూలిపోయింది. ఈ ప్రభుత్వమనే కాదు, రెండో ప్రపంచయుద్ధానంతర ప్రభుత్వాలన్నిటివీ అర్ధాయుష్షే. 73 ఏళ్లలో 68 ప్రభుత్వాలు మారాయంటే అర్థం చేసుకోవచ్చు – అవి పక్కవాళ్లు తుమ్మినా ఊడే ముక్కులని. ప్రస్తుత ప్రభుత్వం కథ తెలుసుకుంటే, పాత వాటి సంగతి కూడా తెలుసుకున్నంత జ్ఞానం అబ్బుతుంది. ఇక్కడో చిన్న మాట – ఇటాలియన్ పేర్ల ఉచ్చారణ చాలా కష్టం. నాకు తోచినది రాసేస్తున్నాను. తెలిసినవారు చెపితే సవరించుకుంటాను.
2018 మార్చిలో 630 మంది సభ్యులున్న దిగువ సభ ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్‌కి, 315 మంది సభ్యులున్న ఎగువ సభ సెనేట్ ఆఫ్ ద రిపబ్లిక్‌కు ఎన్నికలు జరిగితే త్రిశంకు పార్లమెంటు ఏర్పడింది. రైటిస్టు పార్టీ ఐన లీగ్‌కు, దాని పొత్తుదారులకు యితరుల కంటె ఎక్కువ సీట్లు వచ్చాయి కానీ 50 శాతానికి మించిన ఓట్లు రాలేదు. మధ్యేవాద పార్టీ ఐన స్టార్ పార్టీకి, దాని భాగస్వాములకు ఓట్లు బాగా వచ్చాయి కానీ, సీట్లు అంతగా రాలేదు. లెఫ్ట్ పార్టీల కూటమి మూడో స్థానంలో నిలిచింది. మొత్తం సీట్లు ఎన్ని వచ్చాయో తెలుసుకోవాలంటే మూడు రకాల ఫలితాలు కలిపి చెప్పాలి. ప్రపోర్షనల్, ఫస్ట్-పాస్ట్-ద-పోస్ట్, ఇటాలియన్స్ ఎబ్రాడ్. అవన్నీ కలిపి చూస్తే లీగ్‌కు 125, రైట్ కూటమిలోని దాని ప్రధాన భాగస్వామి ఫోర్జా ఇటాలియాకు 104, తక్కిన యిద్దరు పొత్తుదారులకు కలిపి 36, మొత్తం 265 వచ్చాయి. లెఫ్ట్ కూటమిలో ప్రధాన పార్టీ ఐన డెమోక్రాటిక్ పార్టీకి 112, దాని నలుగురు భాగస్వాములకు కలిపి 10, మొత్తం 122 వచ్చాయి. మధ్యే మార్గ పార్టీ ఐన స్టార్ పార్టీకి 227 వచ్చాయి. ఎవరితోనూ పొత్తు లేని ఇతర పార్టీలకు 16 వచ్చాయి.
ప్రధాన పార్టీల గురించి కాస్త తెలుసుకోవాలి. మొదటిది అత్యధికంగా 227 సీట్లు గెలుచుకున్న ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్ (ఎం5ఎస్ అంటారు, మనం స్టార్ పార్టీ అందాం), దీని సిద్ధాంతాలు వామపక్ష సిద్ధాంతాలకు దగ్గరగా వుంటాయి కానీ ఇది వలసవాదులకు వ్యతిరేకం, ప్రపంచీకరణకు వ్యతిరేకం, యూరోపియన్ యూనియన్‌కు వ్యతిరేకం. దానితో మధ్యేమార్గ పార్టీగా పేరుబడింది. దీని అధినేత ల్యూకీ డి మైయో. రెండోది రైటిస్టు భావాలున్న లీగ్. దీని అసలు పేరు లెగా నార్డ్. ఉత్తరాది ప్రాంతాలలో ప్రబలంగా వుండేది. దాని ప్రస్తుత అధ్యక్షుడు మాటియో సాల్వినీ దేశంలోని తక్కిన ప్రాంతాలలో కూడా విస్తరించడానికి ‘లెగా పెర్ సాల్వినీ ప్రీమియర్’ పేరుతో అనుబంధ పార్టీ పెట్టి, యీ రెండిటిని కలిపి నడుపుతున్నాడు. దీనికి సొంతంగా 125, పొత్తుదారులతో కలిపి 265 వచ్చాయి. ఇక మూడోదైన సెంటర్-లెఫ్టిస్టు డెమోక్రాటిక్ పార్టీ గురించి చెప్పాలంటే ఉదారవాద పార్టీలతో కలిసి 2014 నుంచి 2018 వరకు ఏలింది. ఆ పార్టీ నాయకుడైన మాటియో రెంజీ 2014 నుంచి 2016 వరకు ప్రధానిగా వున్నాడు.
మూడు నెలలపాటు చర్చోపచర్చలు జరిగాక జూన్ 1న మొదటి రెండు ప్రధాన పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో సహకరించుకున్నాయి. రెండూ కలిసి ఒక ప్రణాళికను రూపొందించుకున్నాయి. మన దగ్గర కామన్ మినిమమ్ ప్రోగ్రాం అంటూంటాం కదా, అలాటిదన్నమాట. అయితే దీన్ని అమలు చేసే ప్రధాని ఎవరు అన్నదానిపై వాదనలు జరిగి, చివరకు స్టార్ పార్టీ సూచనపై రాజకీయాలతో ముఖపరిచయం కూడా లేని లాయరు, లా ప్రొఫెసరు, ప్రభుత్వ జస్టిస్ బ్యూరోలో అధికారి ఐన 56 ఏళ్ల గ్యూసెప్పీ కాంటేను ప్రధాని చేశారు. రాజకీయనాయకుడు కాని వ్యక్తి ప్రధాని కావడం 1994 తర్వాత యిదే! అతను యీ రెండు పార్టీల నాయకులు – డి మైయో, సాల్వినీలను ఉపప్రధానులుగా వేసుకున్నాడు. అనేక కార్యక్రమాలను చకచకా చేసుకుపోయాడు. కనీసాదాయానికి గ్యారంటీ యిచ్చాడు, పార్లమెంటు సభ్యుల సంఖ్యను తగ్గించే రాజ్యాంగ సవరణ తెచ్చాడు, హైవేస్ సంస్థ ఎఎస్‌పిఐ, విమాన సంస్థ ఎలిటాలియా, స్టీల్ కంపెనీ ఇల్వా వంటి భారీ సంస్థలను జాతీయం చేశాడు. అక్రమవలసదారులపై నిషేధాలు అమలు చేశాడు. ప్రజలంతా అతన్ని మెచ్చుకోసాగారు. అంతర్జాతీయ పత్రికలు కూడా ‘పాప్యులిస్టే ఐనా ఆధునికయుగానికి తగినట్లు ఆలోచిస్తున్న టెక్నోక్రాట్ ప్రభుత్వం’ అని మెచ్చుకున్నాయి.
ఇతని చర్యలు నచ్చని రైటిస్టు లీగ్ 2019 ఆగస్టులో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టింది. వాళ్లు వాడుకున్న అస్త్రం – కోవిడ్‌ను సరిగ్గా అదుపు చేయలేదు అని. నిజానికి ఇటలీలో ప్రజలు నిర్లక్ష్యంగా వుండడంతో కోవిడ్ తన ప్రభావాన్ని తీవ్రంగా చూపింది. 85 వేల మంది (ఇప్పుడు 98 వేలకు చేరింది) మరణించారు. కానీ యూరోప్‌లో అందరికంటె ముందుగా లాక్‌డౌన్ విధించినది ఇటలీయే. లాక్‌డౌన్ సమయంలో ప్రధాని తన అధికారాలను పూర్తిగా వినియోగించి, అతి స్ట్రిక్ట్‌గా అమలు చేయడంతో ఆ కారణంగా తమ రాజ్యాంగహక్కులు హరించబడ్డాయంటూ జర్నలిస్టులు, ప్రతిపక్షాలు అభ్యంతరాలు తెలిపారు. అసలే అంతంతమాత్రమైన ఇటలీ ఆర్థిక స్థితి కోవిడ్ దెబ్బకు కుదేలైంది. 4.20 లక్షల మంది నిరుద్యోగులయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత దారుణమైన మాంద్యంలో మునిగింది. ఈ ముప్పులోంచి బయటకు రావడానికి ఇయు (యూరోపియన్ యూనియన్) వాళ్లు ప్యాకేజి ఒకదాన్ని అనుమతించారు.
ఏది ఏమైనా కాంటే విఫలం చెందాడు కాబట్టి, మేం మద్దతు ఉపసంహరిస్తాం అన్నాడు లీగ్ నాయకుడు సాల్వినీ. ‘ప్రజలారా, యూరోపియన్ యూనియన్‌తో బంధాలు తెంపేసుకుని, విడిగా వెళ్లిపోదాం, కొత్తగా ఎన్నికలు పెట్టించి, యీసారి నాకు ఎక్కువ సీట్లిచ్చి పూర్తి అధికారాలు అప్పగించండి, తడాఖా చూపిస్తా’ అంటూ ప్రకటన యిచ్చాడు. ఈ గొడవ పడలేక పదవి వదిలిపెట్టి వెళ్లిపోతానని కాంటే అన్నాడు కానీ స్టార్ పార్టీ ఒప్పుకోలేదు. రైటిస్టు పార్టీ ఐన లీగ్ స్థానంలో దాని కంటె ఎక్కువ సీట్లు తెచ్చుకున్న లెఫ్టిస్టు పార్టీ ఐన డెమోక్రాటిక్ పార్టీని భాగస్వామిగా తెచ్చి ప్రభుత్వాన్ని కొనసాగించింది. ఆ విధంగా రైటిస్టు, లెఫ్టిస్టు ప్రభుత్వాలను నడిపిన అరుదైన అవకాశం కాంటేను వరించింది.
సాధారణ రాజకీయ వేత్తలా కాకుండా ఒక టెక్నోక్రాట్‌గా వ్యవహరిస్తూ పరిస్థితిని చక్కదిద్దుతున్న కాంటే పట్ల యితరదేశాల వారు గౌరవం చూపి వుండవచ్చేమో కానీ, కొత్తగా భాగస్వామిగా చేరిన డెమోక్రాటిక్ పార్టీ నాయకుడు, మాజీ ప్రధాని ఐన రెంజీకి యీ వ్యవహారం నచ్చలేదు. బయటకు వచ్చేద్దామంటే అతని పార్టీలో యితర నాయకులు ఒప్పుకోలేదు. అందువలన పార్టీలోంచి 2019 సెప్టెంబరులో బయటకు వచ్చేసి ఇటాలియా వైవా అనే సెంట్రిస్ట్, లిబరల్ పార్టీ పెట్టుకున్నాడు. అతని తోటివారు కొంతమంది బయటకు వెళ్లిపోయారు. పార్టీలోంచి బయటకు వచ్చినా కాంటే ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తానన్నాడు.
కానీ కోవిడ్ వలన దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే విషయంలో కాంటేను విమర్శిస్తూనే వున్నాడు. యూరోజోన్‌లో జర్మనీ, ఫ్రాన్స్‌ల తర్వాతి ఇటలీ మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థ. అందువలన 750 బిలియన్ యూరోల సహాయనిధిలో చాలా భాగం ఇటలీకి యిస్తానని ఇయు చెప్పింది. తొలి విడతగా వచ్చిన 220 బిలియన్ యూరోలను చితికిపోయిన ఆర్థికవ్యవస్థ కోలుకోవాలంటే యిప్పటికే ఆలస్యమైన వాక్సినేషన్‌ను చురుగ్గా చేపట్టాలని, అందరికీ ఉపాధి కల్పించాలని కాంటే సంకల్పించాడు. అబ్బే, దీర్ఘకాలిక ప్రణాళికలకై ఉపయోగించవలసిన నిధులను ఓట్ల కోసం యిలాటి ప్రజాకర్షణ పథకాలపై ఖర్చు పెడితే ఎలా? అంటూ రెంజీ అభ్యంతర పెట్టాడు. దీనికి తోడు అతని అనుచరులు కొందరు అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడంతో, అతనికి రష్యాతో ఉన్న లింకుల గురించి న్యాయశాఖ విచారణ చేపట్టడంతో ప్రధాని దగ్గర సీక్రెట్ సర్వీసెస్ శాఖ వుండకూడదని, అతని అధికారాలు కత్తెర వేయాలని అనసాగాడు.
ఇలా చేస్తూచేస్తూ వచ్చి 2021 జనవరి వచ్చేసరికి మద్దతు ఉపసంహరించేశాడు. అతని తరఫున వున్న యిద్దరు మంత్రులు రాజీనామా చేశారు. అతని ఒరిజినల్ పార్టీ డెమోక్రాటిక్ ఫ్రంట్ వాళ్లు అతన్ని విమర్శించారు. అయినా పట్టించుకోలేదు. దీని కారణంగా కాంటే ప్రభుత్వం మరోసారి సంక్షోభంలో పడింది. కాంటే తన బలాన్ని చూపించుకోవడానికి పార్లమెంటులో విశ్వాస పరీక్షను ఎదుర్కున్నాడు. ఛాంబర్ ఆఫ్ డెప్యూటీస్‌లో అనుకూలంగా 321 ఓట్లు, ప్రతికూలంగా 259 వచ్చాయి. రెంజీ అనుయాయులు 27 మంది గైరుహాజరయ్యారు. అక్కడ గట్టెక్కినా కాంటే 321 మంది సభ్యుల ఎగువ సభ అయిన సెనేట్‌లో దెబ్బ తిన్నాడు. అనుకూలంగా 156, ప్రతికూలంగా 140 వచ్చాయి. రెంజీ అనుయాయులు 16 మంది గైరు హాజరు కావడంతో అబ్సల్యూట్ మెజారిటీ రాలేదు. ప్రభుత్వం విశ్వాసపరీక్షలో విఫలమైంది కాబట్టి కాంటీ రాజీనామా చేశాడు.
ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాట్లలో పడ్డారందరూ. రైటిస్టు లీడర్ సాల్వినీ యిదే అదను కదాని పార్లమెంటు రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండు చేయడం మొదలుపెట్టాడు. అతని అత్యాశ చూసి ప్రజల్లో విసుగు పుట్టింది. అతనికున్న ప్రజామోదం 51శాతం నుంచి ఒక్క వారంలో 36శాతం కి పడిపోయింది. పైగా పార్లమెంటు సభ్యులెవరికీ యింత త్వరగా మళ్లీ ఎన్నికలకు వెళ్లడం యిష్టం లేదు. అందువలన ప్రత్యామ్నాయ ప్రభుత్వానికై అన్వేషించ సాగారు. ఎందుకంటే ఇటలీ పరిస్థితి ఏ విధంగానూ బాగా లేదు. రాజకీయనాయకులు తమలో తాము కుమ్ములాడుకుని, ఎన్నికలు తెచ్చి పెట్టారని ప్రజలు భావించి అందరికీ బుద్ధి చెప్పేట్లా వున్నారు. అందరూ కూచుని చర్చించినా ఎటూ తేలటం లేదు. ఇప్పటిదాకా పాలిస్తూ వచ్చిన కూటమి కాంటేను దింపేసి రెంజీకి ప్రధాని పదవి యిచ్చి ఊరుకోబెడదామాని కూడా ఆలోచించారు. అలా చేస్తే మేం మద్దతివ్వం అంటూ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన రెంజీ పాత సహచరులు హెచ్చరించారు.
ఇలాటి పరిస్థితిలో దేశ ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టాలంటే రాజకీయాలతో సంబంధం లేని మరో టెక్నోక్రాట్ ప్రధాని కావాలని దేశాధ్యక్షుడికి అనిపించింది. ఫిబ్రవరి 3న మేరియో డ్రాఘీ అనే ఆర్థికవేత్తను ఆహ్వానించి మాట్లాడాడు. ఎవరీ డ్రాఘీ? 73 ఏళ్ల ఇటలీకి చెందిన ఆర్థికవేత్త. 1980లలో ప్రపంచ బ్యాంకులో పనిచేశాడు. 1991ల ఇటలీకి తిరిగి వచ్చి ఇటాలియన్ ట్రెజరీకి డైరక్టరు జనరల్‌గా వున్నాడు. పదేళ్ల తర్వాత గోల్డ్‌మన్ సాక్స్‌లో చేరాడు. 2006లో బాంక్ ఆఫ్ ఇటలీకి గవర్నరుగా వుండి, 2008 నాటి ఆర్థికమాంద్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. 2011 నుంచి 2019 వరకు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్‌కు అధ్యక్షుడిగా వున్న 8 సం.లలో దానిని ఆర్థిక సంక్షోభంలోంచి గట్టెక్కించాడు, యూరో కరెన్సీని కాపాడాడు. అంతర్జాతీయంగా ఎంతో పేరుప్రఖ్యాతులున్నాయి.
అతనిలాటి వాడు ప్రధానిగా వుంటే ఇయుతో చక్కగా వ్యవహరించగలడని, ఇటలీని గట్టెక్కించగలడని రాజకీయనాయకులే కాదు, ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. అన్ని పార్టీలు అతని అభ్యర్థిత్వాన్ని బలపరిచాయి. వారం రోజుల పాటు వారందరితో సంప్రదింపులు జరిపి, డ్రాఘీ ఫిబ్రవరి 13న ప్రధాని పదవి చేపట్టాడు. 17న జరిగిన విశ్వాసపరీక్షలో సెనేట్‌లో అతనికి 262 అనుకూలంగా, 40 ప్రతికూలంగా వచ్చాయి. ఇద్దరు గైరుహాజరయ్యారు. 18న ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్‌లో 535 మంది అనుకూలంగా, 56 మంది ప్రతికూలంగా 56 మంది వేయగా 5గురు గైరుహాజరయ్యారు. ఇటలీ రాజకీయ చరిత్రలో యింత మెజారిటీ రావడమనేది ఒక అపూర్వఘట్టం. దీన్ని బట్టి అతనిపై అందరూ ఎంత ఆశలు పెట్టుకున్నారో అర్థమవుతుంది. అవి ఏ మేరకు నెరవేరుతాయో వేచి చూడాలి. – (ఫోటో – పైన కాంటే, రెంజీ కింద సాల్వినీ, డ్రాఘీ)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2021)
[email protected]