ఎట్టకేలకు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల్లో తలపడేందుకు ఓ తోడు దొరికింది. పొత్తు లేందే ఎన్నికల బరిలో టీడీపీ నిలబడలేని విషయం తెలిసిందే. బహుశా గత సార్వత్రిక ఎన్నికల్లో తప్ప …. ఇంత వరకూ అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకునే ముందుకెళ్లింది.
ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు తోడు దొరికింది. అది సీపీఐ రూపంలో కావడం గమనార్హం. గతంలో కూడా పలుమార్లు సీపీఐతో టీడీపీ పొత్తు కుదుర్చుకుంది.
రాజకీయ అవసరాల రీత్యా చంద్రబాబు వామపక్షాలను వాడుకుని వదిలేస్తుంటారు. తాజాగా మరోసారి వాళ్లిద్దరి మధ్య పొత్తు కుదరడంతో యుగళగీతాలు పాడుకుంటున్నారు. ఈ తోడు కలకాలం మున్ముందు కూడా కొనసాగుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెబుతున్నారు.
గుంటూరులో 8వ వార్డు అభ్యర్థి జంగాల రమాదేవికి మద్దతుగా నారాయణ గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో టీడీపీతో స్నేహపూర్వక పొత్తుతో వెళ్తున్నామన్నారు. భవిష్యత్‌లోనూ ఉమ్మడిగా కొనసాగే అవకాశం ఉందని ఆయన అన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నారు.
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామిని నిన్న యాదృచ్ఛికంగా కలిసినట్టు ఆయన తెలిపారు. పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నామన్నారు. తాము (కమ్యూనిస్టులు) నాస్తికులు కాదన్నారు. దేవుడనే భావనకు వ్యతిరేకం కాదని ఆయన సెలవివ్వడం గమనార్హం. మొత్తానికి టీడీపీతో పొత్తు కుదుర్చుకుని సీపీఐ ప్రతి మున్సిపాల్టీలో ఒకట్రెండు సీట్లలో పోటీ చేస్తోంది. దీంతో నారాయణ టీడీపీతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు.