పొలిటికల్ ట్రోల్స్ మీద బతికే సోషల్ మీడియా పేజీలకు కటెంట్ కొరత ఏదైనా ఏర్పడిన సమయంలో తెలుగుదేశం ఆశాకిరణం నారా లోకేష్ బయటకు వస్తే సరిపోతుంది. దాదాపు పదేళ్ల నుంచి పొలిటికల్ ట్రోల్ పేజీలకు తనదైన కంటెంట్ ను అందిస్తున్న లోకేష్.. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి దిగి.. మళ్లీ తన కామెడీని చేశారు!
అదేంటో ఈ మధ్య లోకేష్ కు 1978 అనే మాట పట్టుకుంది. ఆయన ఏదో మాట్లాడబోతూ.. 1978 అనేస్తున్నారు! పాపం.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపడానికి లోకేష్ చాలా పోరాడుతున్నారు. ఆ పోరాటం ఇప్పుడు కాదు లెండీ.. అప్పుడెప్పుడో 1978లోనట.. తెలుగుదేశం పార్టీ విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా పోరాడిందట. ఎవ్వరికీ తెలియని ఈ విషయాన్ని లోకేష్ ఒకటికి వంద సార్లు చెబుతున్నారు.
ఇటీవలే తమ పార్టీ నేతొకరు దీక్ష చేస్తే.. ఆ సమయంలో లోకేష్ ప్రసంగిస్తూ.. 1978లో విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీనే అని ఆ సందర్భంగా ప్రకటించారు. అయ్యా లోకేషా.. 1978 నాటికి తెలుగుదేశం ఎక్కడిది? అని చాలా మంది ప్రశ్నించారు. అవన్నీ లోకేష్ పట్టించుకోరు.. ఇప్పుడు ఆయన 1978లో తెలుగుదేశం ఉంది అని నిరూపించే పనిలో ఉన్నారంతే!
అందుకే మరో మాట సెలవిచ్చారు. అదేమిటంటే.. 1978లో నాటి ప్రధాని వాజ్ పేయి విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని చూస్తే తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు అడ్డుపడినట్టుగా లోకేష్ చెప్పుకొచ్చారు!
అసలు 1978 ఏమిటి? వాజ్ పేయి ఏమిటి? చంద్రబాబు నాయుడు ఏమిటి? అంటూ జుట్టు పీక్కుంటే అది జనాల ఖర్మ కానీ, లోకేష్ మాత్రం తను చెప్పాలనుకున్నదే చెప్పాడు.
మొన్నేమో 1978 లో తెలుగుదేశం అన్నారు. అలా నవ్వులపాలైనా.. తగ్గేది లేదన్నట్టుగా 1978లో వాజ్ పేయి ప్రధాని,చంద్రబాబు సీఎం అని సెలవిచ్చారు తాజాగా!
ఇదీ లోకేష్ తీరు. ఏం మారలేదు. 1978లో తెలుగుదేశం ఎక్కడిది అని తనను ట్రోల్ చేసిన వాళ్లకు కూడా బైర్లు కమ్మేలా.. అప్పట్లో ప్రధాని వాజ్ పేయి అని లోకేశం సెలవిచ్చారు. ఒప్పుకుంటారో, ఒప్పుకోరు.. జనాల ఖర్మ. లోకేష్ మాత్రం అలాగే చెప్తారంతే.