విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొన్నాళ్లుగా జరుగుతున్న ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు కేవలం ఉత్తరాంధ్రకే పరిమితం అయ్యాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే దాని పరిధి విశాఖను దాటి బయటకు రాలేదు. అసలు ఇతర ప్రాంతాల్లో ఆ ఊసే లేకపోయే సరికి, ఉక్కు ఉద్యమం ప్రాంతీయ సమస్యగా మారిపోయిందని అనుకున్నారంతా. కానీ రాష్ట్ర బంద్ అనేసరికి ఉక్కు ఉద్యమానికి అన్ని జిల్లాలు కలిసొచ్చాయి.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు బంద్ ప్రశాంతంగా మొదలైంది. అటు ప్రభుత్వం కూడా బంద్ కి సహకరిస్తామని చెప్పడంతో ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ స్తంభించింది.
ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ప్రజా, కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాలతో రోడ్డెక్కాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ.. అన్ని ప్రాంతాల్లో కూడా ఉదయాన్నే నిరసనకారులు రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు.
ఏపీ అంతటా అన్ని విద్యా సంస్థలు, విశ్వ విద్యాలయాలు మూతబడ్డాయి. లారీ యజమానుల సంఘాలు, మహిళా, కార్మిక సంఘాలు బంద్ కి మద్దతివ్వడంతో ఎక్కడా ఎలాంటి కార్యకలాపాలు మొదలు కాలేదు.
బీజేపీ మినహా ఇతర పార్టీలన్నీ ఈ ఉద్యమానికి మద్దతు తెలిపాయి. ప్రభుత్వం కూడా మధ్యాహ్నం వరకు కార్యాలయాలు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు కూడా మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత మాత్రమే రోడ్లెక్కుతాయని తెలిపింది.
జగన్ హయాంలో బంద్ లు కూడా ప్రశాంతంగానే..
రైతు ఉద్యమానికి మద్దతుగా దేశవ్యాప్త బంద్ జరిగినప్పుడు కూడా ఏపీలో ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న బంద్ కూడా అంతే ప్రశాంతంగా జరుగుతోంది. ఈ బంద్ కి దూరంగా ఉన్న బీజేపీ మాత్రం కక్కలేక, మింగలేక అన్నట్టు వ్యవహరిస్తోంది.
బీజేపీని నమ్ముకున్న జనసేన పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. ఉక్కు విషయంలో బీజేపీకి తాము మిత్ర పక్షమా, వైరి పక్షమా తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉంది. ప్రభుత్వం మద్దతు ఇవ్వకపోతే రెచ్చిపోదామనుకున్న టీడీపీ, వామపక్షాలు కూడా నెమ్మదించాయి. ప్రభుత్వమే స్వచ్ఛందంగా బంద్ కోసం ముందుకు రావడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ప్రశాంతంగా రాష్ట్ర బంద్ కొనసాగుతోంది.
ఓవైపు బంద్ కొనసాగుతుంటే, మరోవైపు ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. సీతమ్మధార ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ కు చెందిన దాదాపు 22 ఎకరాల భూమిని ప్రైవేటుపరం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల క్వార్టర్లు ఉన్నాయి. అవన్నీ శిధిలయ్యాయి.
ఈ ల్యాండ్ లో కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు అపార్ట్ మెంట్లు నిర్మించి అమ్మేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే ఒప్పందం జరిగిపోగా.. మరో వారం రోజుల్లో పనులు ప్రారంభంకాబోతున్నాయి.