ఉద్యోగం ఇప్పిస్తామంటూ జరిగే మోసాలు ఎక్కువగా రైల్వే డిపార్ట్ మెంట్ లోనే జరుగుతుంటాయి. రైల్వే ఉద్యోగాల పేరిట మోసపోయిన బాధితులు దేశవ్యాప్తంగా ఉంటారు. ఈసారి కూడా అలాంటిదే మరో ఘటన బయటపడింది. ఇది హైటెక్ ఘరానా మోసం. ఎవ్వరికీ కనీసం అనుమానం కూడా రాకుండా జరిగిన ఛీటింగ్.
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన అశోక్ కుమార్.. విజయవాడకు చెందిన శ్రీనివాస్, ఢిల్లీకి చెందిన మిశ్ర, కోల్ కతాకు చెందిన దినేష్ తో ఓ గ్రూప్ ఏర్పాటుచేశాడు. రైల్వేలో టీసీ, ట్రాక్ మ్యాన్ పోస్టులు ఇప్పిస్తామంటూ.. వాట్సాప్, ఫేస్ బుక్ సహాయంతో వీళ్లు ఏపీ, తెలంగాణలో బాగా ప్రచారం చేశారు.
ఈ లింక్స్ చూసి నమ్మిన చాలామంది తెలుగు యువకులు వీళ్లను ఆశ్రయించారు. ముందుగా మెడికల్ టెస్టు పేరిట 50వేలు గుంజారు. సరిగ్గా ఇక్కడే వాళ్లు తమ చాకచక్యం చూపించారు. యువకులకు ఢిల్లీలోని రైల్వే ఆస్పత్రిలో మెడికల్ టెస్టులు చేయించిన తర్వాతే డబ్బులు తీసుకున్నారు.
ఢిల్లీలో పనిచేయాలనుకుంటే మిశ్రను, సౌత్ లోనైతే ఖరగపూర్ డీఆర్ఎం ఆఫీస్ లో దినేష్ ను కలవాలని.. వాళ్ల నుంచి ఆఫర్ లెటర్లు తీసుకోవాలని చెప్పారు. అక్కడికి వెళ్లిన అభ్యర్థులు.. మరో 2 లక్షలు సమర్పించుకున్నారు. ఇక్కడ కూడా ఈ ముఠా అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది. పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో ట్రయినింగ్ అంటూ 3 నెలలు శిక్షణ ఇచ్చిన తర్వాతే ఆ డబ్బు తీసుకున్నారు.
ఫినిషింగ్ ఆ తర్వాత మొదలైంది. శిక్షణ పూర్తయిన అభ్యర్థులకు ఎక్కడ కావాలంటే అక్కడ పోస్టింగ్ లు ఇప్పించారు. ఢిల్లీకి వెళ్లి జాయినింగ్ లెటర్, ఐడీ కార్డులు తీసుకోవాలని చెప్పారు. అయితే ఫైనల్ పేమెంట్ కింద 3 లక్షలు చెల్లించాలన్నారు. కళ్లముందు జాయినింగ్ లెటర్ కనిపించడంతో అభ్యర్థులు మూడేసి లక్షలు చెల్లించారు. ఆ తర్వాత ఆ లెటర్లు తీసుకొని ఢిల్లీ, ఖరగ్ పూర్ లోని రైల్వే ప్రధాన కార్యాలయాలకు వెళ్లిన తర్వాత తాము మోసపోయామనే విషయాన్ని గుర్తించారు.
ఓ నిరుద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. అశోక్, శ్రీనివాస్ లను అరెస్ట్ చేశారు. మిశ్ర, దినేష్ పరారీలో ఉన్నారు. వీళ్లు నలుగురు ఇప్పటివరకు వందల మంది నిరుద్యోగుల్ని ఇలా మోసం చేశారని పోలీసులు గుర్తించారు.