ప్రఖ్యాత రష్యన్ రచయిత ఫొయోడోర్ దాస్తొయేవస్కీ (1821-81) ద్విశతజయంతి 2021 నవంబరులో జరిగింది. టాల్‌స్టాయ్ (ఈ మధ్య యీ పేరును యింకోలా పలుకుతున్నారు, ఆ మాటకొస్తే ఫొయోడోర్ కూడా సరైన ఉచ్చారణో కాదు తెలియదు) సమకాలీనుడైన యీ రచయిత దాదాపు అంత పేరూ తెచ్చుకున్నాడు. అతని ప్రఖ్యాత నవలలు చాలానే వున్నాయి. వాటిలో అమితంగా పేరు పొంది, యిప్పటికీ ప్రశంసించబడే ‘‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’’ (1866) నవలను పరిచయం చేస్తున్నాను. దానికి ముందు అతని జీవితం గురించి కాస్త చెపుతాను.
అతను 1840-50లలోనే రచనలు ప్రారంభించినా, సైబీరియా ప్రవాస శిక్ష తర్వాతే అతని మనోవిశ్లేషణా నవలలకు చాలా పేరు వచ్చింది. ‘‘నేరమూ-శిక్షా’’ ‘‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’’ తర్వాత రాసిన ‘‘ద ఇడియట్’’, ‘‘ద పొజెస్డ్’’, ‘‘ద డెవిల్స్’’, ‘‘ద బ్రదర్స్ కరమ్‌జోవ్’’ కూడా మంచి పేరు తెచ్చుకున్నాయి. మొత్తం 12 నవలలు, 4 నవలికలు, 16 కథలు, అనేకానేక వ్యాసాలు రాశాడు. మిలటరీ ఇంజనియరుగా శిక్షణ పొందినా, పత్రికా రచయితగా మారి సెయింట్ పీటర్స్బర్గ్ ఊళ్లోని ప్రజాజీవితాన్ని ప్రతిబింబించే కథలు రాశాడు. ‘‘పూర్ ఫోక్’’ (1846) అతని మొదటి నవల. ప్రభుత్వ వ్యతిరేక రచయితల సభలో పాల్గొన్నందుకు అతన్ని 1849లో జారిస్టు ప్రభుత్వం అరెస్టు చేసి, ఉరిశిక్ష విధించి, తర్వాత దాన్ని సైబీరియాలో కారాగార శిక్షగా మార్చింది. అది నరకప్రాయమైనదని జగద్విదితం. ఇతని చేతులకు, కాళ్లకు సదా సంకెళ్లు వేసి వుంచేవారు. అసలే ఆరోగ్యం అంతంత మాత్రం. మరీ పాడైతే నాలుగేళ్ల తర్వాత విడుదల చేసి ఆరేళ్ల పాటు నిర్బంధ మిలటరీ సర్వీసుకి పంపారు.
బయటకు వచ్చాక ‘‘ఇపోక్’’ అనే పత్రికను నడిపి దానిలో ‘‘నోట్స్ ఫ్రం ద అండర్‌గ్రౌండ్’’ అనే వ్యాసాలు ప్రచురించాడు. తర్వాత పైన చెప్పిన నవలలు బయటకు వచ్చి అతన్ని ప్రముఖస్థానంలో నిలబెట్టాయి. డబ్బు పెద్దగా సంపాదించలేదు, సంపాదించినది జూదంలో పోగొట్టుకుని తరచుగా అప్పుల పాలవుతూండేవాడు. రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. పిల్లలు అతని కళ్లముందే పోయారు. మూర్ఛరోగంతో బాధపడి 60వ ఏట మరణించాడు. అతను కమ్యూనిస్టు కాదు, మానవతావాది అంతే. మతంపై విశ్వాసం కలవాడు. పాపం చేసినప్పుడు ఒప్పుకుని, దైవచింతనతో ప్రక్షాళన చేసుకోవాలనే బోధించాడు. మానవహృదయంలోని చీకటి గదుల్లోకి చొచ్చుకుని పోయి, అక్కడ నిద్రాణస్థితిలో వున్న భావాలను వెలికి తీసిన రచయితగా అతన్ని గౌరవిస్తారు. పైకి మంచిగా కనబడినా, లోపల దుర్మార్గం వుంటుందని, పైకి దుష్టుడిగా కనబడినా గుండెల్లో తడి వుంటుందని అతను చిత్రీకరించిన సంఘటనలు తెలుపుతాయి.
మనిషి లోపల వుండే అంతరాత్మ కారణంగా సమాజసూత్రాలకు వ్యతిరేకంగా వ్యవహరించినప్పుడు సంఘర్షణకు గురవుతాడని, సమాజం యీ మాత్రమైనా నడుస్తోందంటే, దానికి కారణం పోలీసు వ్యవస్థ కాదనీ, మనిషిలో అంతర్గతంగా వుండే మంచీ-చెడూ విచక్షణే కారణమని అర్థమౌతుంది. ఇక నేరమూ-శిక్షా నవలకు వస్తే అది దైవోపహతుల కథ. దరిద్రం, దురదృష్టం, నిరాశ వెంటాడుతూంటే ఏం చేయాలో తోచక, వ్యసనాలపాలై కొట్టుమిట్టులాడే దౌర్భాగ్యుల కథ. అలాటివారు ఎంతకైనా తెగిస్తారని, తిరగబడతారని అనుకుంటాం. కానీ అందరూ అలా వుండరు. గతిలేక తప్పులు చేసినా వారిని పాపభీతి, మనస్సాక్షి బాధిస్తాయి. రచయిత ఎవరి పక్షమూ తీసుకోడు. పేదల్లో లోపాలను కూడా నిజాయితీగా ప్రదర్శిస్తాడు. 150 ఏళ్ల క్రితం రాసిన యిలాటి బాధాతప్తజీవుల కథను మెటీరియలిజాన్నే పరమావధిగా చూస్తున్న యిప్పటి పాఠకులు ఆస్వాదించలేక పోవచ్చు. కానీ ప్రపంచంలో గొప్ప నవలగా పేరొందింది కాబట్టి థీమ్ తెలుసుకుంటే మంచిది.
దీనిలో హీరో పేరు రస్కోల్నికోవ్. పట్నంలో లా చదువుతూ మానేశాడు. నిరుద్యోగంతో, దరిద్రంతో, ఒంటరి జీవితంతో బాధపడుతున్నాడు. అతని తల్లి, చెల్లెలు దన్యా పల్లెటూళ్లో వున్నారు. దన్యా ఒక ధనికుడి యింట్లో ఆయాగా పనిచేస్తోంది. అతను యీమెపై కన్నేశాడు. గతిలేక పనిచేస్తోందంతే. అది తప్పించుకోవడానికి లూజిన్ అనే ఒక డబ్బున్న భ్రష్టుడితో పెళ్లికి ఒప్పుకుంది. వాళ్ల బాధలు చూడలేక డబ్బు సంపాదించి పంపాలనుకున్న హీరో డబ్బున్నవాళ్ల నెవరైనా హత్య చేద్దామనుకున్నాడు. తాకట్టు పెట్టుకుని అప్పిచ్చే ఓ ముసలావిడను చూసి, ఆవిడైతే ప్రతిఘటించలేదనుకున్నాడు. వాచీ తాకట్టు పెట్టే మిషతో ఆమె యింటికి వెళ్లి, ఆనుపానులు గమనించాడు. కానీ హత్య చేయాలా వద్దాన్న సందేహంలో పడ్డాడు. అతనికి సేమోన్ అనే ఓ తాగుబోతు పరిచయమయ్యాడు. అతనికి భార్యా పిల్లలున్నారు. తన తాగుడుతో కుటుంబపు ఆస్తి తగలేశాడు. ఇల్లు గడవడానికి పెద్ద కూతురు సోన్యా వ్యభిచరిస్తోంది.
ఇంతలో హీరోకి తల్లి దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది. డబ్బు కోసం చెల్లెలు లూజిన్ను పెళ్లాడడానికి సిద్ధపడిందని. అతన్ని కలవడానికి పట్నానికి వస్తున్నామని రాసింది. ఇది సోన్యా వ్యభిచారం లాటిదే అనుకున్న హీరో, డబ్బుంటే దాన్ని ఆపవచ్చనుకుని, డబ్బు కోసం హత్య చేయడానికి నిశ్చయించుకున్నాడు. ముసలావిడ యింటికి వెళ్లి ఒక గొడ్డలితో ఆమెను నరికేశాడు. అంతలో అనుకోకుండా ఆమె సవతి సోదరి లోపలకి వచ్చింది. ప్రత్యక్షసాక్షి వుండకూడదని ఆమెను కూడా చంపేశాడు. నేరం చేశాక కంగారు పడిపోయాడు. డబ్బుమూటలన్నీ వదిలేసి, చేతికందిన చిన్న వస్తువులు, ఓ చిన్న పర్సు చేజిక్కించుకుని పారిపోయి వచ్చాడు. అతన్ని ఎవరూ చూడలేదు కానీ తను చేసిన పాపపు పనికి భయపడి అతనికి తీవ్రజ్వరం ముంచుకుని వచ్చింది. మర్నాడు పోలీసు స్టేషన్ నుంచి కబురు రాగానే హడిలిపోయాడు.
వెళ్లి చూస్తే అద్దె కట్టటం లేదు కాబట్టి ఖాళీ చేయమని యింటావిడ నోటీసు యిచ్చిందని చెప్పడానికి పోలీసులు పిలిచారు. ముందురోజు జరిగిన హత్య గురించి పోలీసులు మాట్లాడుకుంటూ వుంటే హీరో భయంతో మూర్ఛపోయాడు. త్వరలోనే తేరుకున్నా, అనవసరంగా వారిలో అనుమానం రగిలించానని గ్రహించాడు. బయటకు వచ్చాక, యింతకీ తనకు ఎంత డబ్బు దొరికిందాని చూడబోతే ఆ పర్సులో అతి తక్కువ డబ్బుంది. ఆ భాగ్యానికి అనవసరంగా ప్రాణాలు తీశానని బాధపడ్డాడు. తనతో పాటు చదువుకున్న ఫ్రెండును కలవబోతే అతను యితనికి ఒంట్లో బాగా లేదని గ్రహించాడు. విపరీతమైన జ్వరం వచ్చి, సంధి స్థితిలోకి వెళ్లిపోయాడు. అతని ఫ్రెండు సపర్యలతో కోలుకున్నాడు. హత్య విషయంలో ఆధారాలు ఏవీ దొరకలేదని, వేరే అతన్ని పోలీసులు అనుమానితుడిగా బంధించారని, ముసలావిడ వద్ద తాకట్టు పెట్టిన వారందరిని ప్రశ్నిస్తున్నారనీ విన్నాడు. తన మీద ఎవరికీ అనుమానం రాలేదని హీరో గ్రహించాడు. కానీ తనను అనుమానించి పట్టుకుంటే బాగుండుననే వింత కోరిక కలిగిందతనికి. తనే వెళ్లి నేరాన్ని ఒప్పేసుకుందామా అనుకుని కూడా ఆగిపోయాడు. ఈ సందిగ్ధావస్థ అతన్ని తినేయసాగింది.
ఇంతలో అతని తాగుబోతు మిత్రుడు చచ్చిపోతే తన తల్లి తనకు పంపిన డబ్బులో మిగిలిన 25 రూబుల్స్ అతని కుటుంబానికి యిచ్చేశాడు. డబ్బు గురించి హత్య చేసినవాడు యిలా దానాలు చేసేయడమేమిటి అనిపిస్తుంది కదా! హీరో ప్రవర్తన యిలా వింతవింతగా వుంటుంది. తనంతట తను లొంగిపోవడానికి జంకుతాడు. మళ్లీ తనపై అనుమానం కలిగేట్లు ప్రవర్తిస్తాడు. తనకు తనే లొంగిపోతే అది బలహీనత అనుకుని తనపై తనే కోపం తెచ్చుకుంటాడు. ఒక డిటెక్టివ్‌ను కూడా వెళ్లి కలుస్తాడు. అతని చెల్లి ఆయాగా పని చేసిన యజమాని ఊళ్లోకి వచ్చి ‘మా ఆవిడ చచ్చిపోయింది. నేను గతంలో చేసిన తప్పుల పరిహారార్థం పదివేల రూబుల్స్ యిస్తాన’నే ఆఫర్‌తో ఆకర్షిద్దామని చూస్తాడు. మరో పక్క లూజిన్ ఆమెను వదిలిపెట్టడు. ఈ గొడవలు యిలా నడుస్తూండగానే హీరో తన మానసిక సంఘర్షణ తట్టుకోలేక, సోన్యాతో తన హంతకుణ్నని చెప్పేస్తాడు. అది పక్క గదిలో వున్న యజమాని వినేసి, హీరో చెల్లిని బ్లాక్మెయిల్ చేస్తాడు. హీరోని పోలీసులు పట్టేసుకుంటారని మనం అనుకుంటూండగానే వేరే అతను వచ్చి తనే హంతకుణ్నని ఒప్పుకుంటాడు. …
ఇలా చిత్రవిచిత్రమైన సంఘటనలతో నవల నడుస్తుంది. పెద్దదే కాబట్టి కాస్త ఓపిక వుండాలి. ఫైనల్‌గా హీరోకి శిక్ష పడిందా లేదాన్న ఉత్సుకత తీర్చడానికి ముగింపు చెప్పేస్తాను. సోన్యా దైవభక్తురాలు. తప్పు ఒప్పుకోమని హీరోకి హితబోధ చేసింది. హీరో చివరి క్షణం వరకు తటపటాయిస్తూనే వెళ్లి ఒప్పేసుకున్నాడు. తనే అంగీకరించాడు కాబట్టి అతనికి 8 ఏళ్ల సైబీరియా శిక్ష పడింది. హీరో స్నేహితుడు హీరో చెల్లిని పెళ్లాడాడు. తల్లి చచ్చిపోయింది. సోన్యా హీరోతో పాటు సైబీరియా వెళ్లింది. ఆమెపై తన కెంత ప్రేమ వుందో హీరో గ్రహించాడు. ఆమె కోరిక మేరకు బైబిల్ చదువుతూ తన పాపప్రక్షాళన చేసుకున్నాడు. కథ క్లుప్తంగా చెప్పాను కాబట్టి హీరో సంఘర్షణ మీకు సరిగ్గా అర్థం కాక విసుగు పుట్టి వుండవచ్చు. కానీ ఒకసారి చదివితే మాత్రం మర్చిపోరు. దీని ఆధారంగా వివిధ దేశాల్లో అనేకానేక సినిమాలు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు, యిది ఎంతమంది రచయితలను కదిలించిందో!
రమేశ్ సైగల్ దర్శకనిర్మాతగా, రాజ్ కపూర్, మాలా సిన్హా హీరోహీరోయిన్లగా వచ్చిన ‘‘ఫిర్ సుబహ్ హోగీ’’ (1958) అనే హిందీ సినిమా దీనిపై ఆధారపడినదే. దీనిలో కూడా హీరో లా స్టూడెంటే. ఖర్చులకై కోసం తల్లి పంపే డబ్బుపై, ఒక వ్యాపారి దగ్గర పెట్టే తాకట్లపై ఆధారపడుతూంటాడు. ఓ పేద కుర్రాడి చికిత్సకు డబ్బు సమకూర్చి, వాళ్లింటికి తరచుగా వెళ్లడంతో అతని అక్కతో ప్రేమలో పడ్డాడు. వాళ్ల తండ్రి తాగుబోతు. హీరోయిన్‌పై కన్నేసిన తాకట్టు వ్యాపారి అతని తాగుడుకు మదుపు పెడుతూ వచ్చి, అప్పు తీర్చాలంటే, కూతుర్నిచ్చి పెళ్లి చేయాలన్నాడు. తాగుబోతు సరేననడంతో, పెళ్లి ఆపాలనే ఉద్దేశంతో హీరో తాకట్టు వ్యాపారి డబ్బు దోచుకుందా మనుకున్నాడు. ఆ సమయానికి ఆ వ్యాపారి రావడంతో అతన్ని చంపేశాడు. చంపేశాడే కానీ అతని అంతరాత్మ ఊరుకోలేదు. కానీ వెళ్లి తప్పు ఒప్పుకోవాలంటే ధైర్యం చాలలేదు. పోలీసు యిన్స్పెక్టరుకి హీరోపై అనుమానం వుంది కానీ ఆధారాలేవీ దొరక్క ఆగిపోయాడు.
చివరకు ఒక దొంగను పట్టుకుని అతన్ని బోనెక్కించాడు. కోర్టులో కేసు నడుస్తున్నంతకాలం హీరోలో అంతర్మథనం జరిగింది. తను చేసిన నేరానికై వేరేవాళ్లకు శిక్ష పడుతోందని బాధ పడి, వాదోపవాదాలు ముగిసిన ఆఖరి రోజున వెళ్లి ఒప్పేసుకున్నాడు. వ్యాపారికి డబ్బు లేకుండా చేసి, అతని దోపిడీని ఆపుదామనుకున్నానని, అనుకోకుండా ఆత్మరక్షణకై హత్యకు పాల్పడ్డానని అతను చెప్పినదాన్ని కోర్టు నమ్మి, అతనికి మూడేళ్ల శిక్ష వేసింది. నువ్వు తిరిగి వచ్చేవరకు నేను వేచి చూస్తానని హీరోయిన్ అనడంతో సినిమా ముగిసింది. సినిమా సక్సెస్ అయింది. సాహిర్ గీతరచన, ఖయ్యాం సంగీతరచన చేసిన యీ సినిమాలో పాటలు చాలా బాగుంటాయి. ఓ సుబహ్ కభీతో ఆయేగీ, ఆస్మాన్ పే హై ఖుదా, చీనో అరబ్ హమారా, ఫిర్ న కీజే మేరీ గుస్తాఖ్.. నా కిష్టమైన పాటలు. ముఖ్యంగా ఓ సుబహ్..!
నా కష్టకాలంలో నాకు ఉత్సాహాన్నిచ్చిన రెండు పాటల్లో యిది ఒకటి. హైదరాబాదు ఎగుడుదిగుడు (అప్పట్లో అన్నీ కొండలే, ట్రాఫిక్ పెరిగాక కాస్త చదునయ్యాయి) రోడ్లపై నిరాశగా సైకిల్ తొక్కుకుంటూ పోతున్నపుడు బ్యాక్‌గ్రౌండ్‌లో నాకు నేనే ‘జయమ్ము నిశ్చయమ్మురా’ పాట వినిపించుకునేవాణ్ని. ‘‘శభాష్ రాముడు’’ సినిమాలోని ఆ పాట రిక్షా తొక్కుతున్న ఎన్టీయార్‌పై చిత్రీకరించబడింది. ఇంట్లో వుండగా భవిష్యత్తు గురించి దిగులు వస్తే కూలినగోడలు కూలినట్లే వుండవనే తెలుగు సామెత గుర్తు తెచ్చుకుని లోగొంతుతో ‘ఓ సుబహ్ కభీ తో ఆయేగీ’ (ఆ ఉదయం ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరుతుంది) పాట పాడుకునేవాణ్ని. నాకు ఆ పాట ఆశకల్పిస్తే, ఆ సినిమా పేరు వాజపేయి, ఆడ్వాణీలకు ఆశ కల్పించింది.
దిల్లీ మునిసిపల్ ఎన్నికలలో జనసంఘ్ ఘోరంగా ఓడిపోయింది. దాని నాయకులైన వీళ్లిద్దరూ ఫలితాల నుంచి సేద తీరడానికి సినిమాకు వెళ్లారు. ఇద్దరికీ సినిమాలంటే పిచ్చి యిష్టం. ఏదో ఒకటి అని వెళ్లి హాల్లో కూర్చున్నారు. చూస్తే ఆ సినిమా పేరు ‘‘ఫిర్ సుబహ్ హోగీ’’ (మళ్లీ ఉదయమౌతుంది)! అది తమకు చెప్పిన భవిష్యవాణిగా యిద్దరూ ఫీలయ్యారని ఆడ్వాణీయే చెప్పారు. కొన్నేళ్లకు బిజెపి దశ తిరిగి, వాజపేయి ప్రధాని, ఆడ్వాణీ ఉపప్రధాని అయ్యారు. దాస్తొయేవస్కీ దగ్గర మొదలుపెట్టి ఆడ్వాణీ దాకా వచ్చాం. ఇంతకీ విషయమేమిటంటే నేరాన్ని అందరం తప్పుపడతాం కానీ సాధారణ ప్రజలను సైతం నేరం వైపు నెట్టే దుర్భర పరిస్థితులను మార్చాలని అనుకోం. గొప్పాబీదల మధ్య వ్యత్యాసాలు తగ్గించనంత కాలం గొప్పవారి భద్రతకు గ్యారంటీ లేదని మనమంతా గుర్తెరగాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2022)