టాలీవుడ్లో పెద్ద మనిషిగా పేరొందిన ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ చిత్ర పరిశ్రమకు సంబంధించి తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. సినిమా టికెట్ల ధరల పెంపు, అలాగే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ పెద్దపై చేసిన వ్యాఖ్యలపై భరద్వాజ స్పందించారు.
అసలు సినిమా టికెట్ ధరల తగ్గింపు అనేది పెద్ద సమస్యే కాదని కొట్టి పడేశారాయన. సినిమా టికెట్ ధరలు తగ్గించడం వల్ల చిన్న సినిమాలకు సమస్యే ఉండదన్నారు. ప్రజలందరికీ అందుబాటులో సినిమా టికెట్ ధరలు అందుబాటులో ఉండాలని ఏపీ ప్రభుత్వం చెబుతోందన్నారు.
టికెట్ ధరలు తగ్గించడం వల్ల కొంతమంది ఆనందిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా టికెట్ ధరలు తగ్గించడం వల్ల కేవలం పెద్ద సినిమాలకే సమస్య అన్నారు. పెద్ద చిత్రాలకు వేరే ధరలు నిర్ణయించాలని ప్రభుత్వాన్ని కోరితే సరిపోతుందని ఆయన సలహా ఇవ్వడం గమనార్హం. ఆ పని చేయడం వదిలేసి కొంతమంది కావాలనే ఎవరో ఒకరి మీద బురద జల్లడం కోసమే టికెట్ ధరలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి పెద్ద కాదు, బిడ్డగా ఉంటానని ప్రకటించడంపై తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి అన్నదాంట్లో తప్పేం ఉందని ఆయన ప్రశ్నించారు. చిత్ర పరిశ్రమ మెగాస్టార్ చిరంజీవిని పెద్ద దిక్కుగా భావించిందన్నారు. కానీ గత కొంత కాలంగా ఇండస్ట్రీలో నెలకున్న పరిస్థితులతో ఆయన విసిగిపోయి…అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని భరద్వాజ అభిప్రాయపడ్డారు.
సినిమా టికెట్ల ధరపై ప్రభుత్వంతో చర్చించేందుకు చిరంజీవి ముందుకు రాలేదనే విమర్శలపై కూడా ఆయన స్పందించారు. అసలు ఆయన ఎందుకు ముందుకు రావాలని తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు. టికెట్ల ధరలపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ స్పందించాలని హితవు చెప్పడం గమనార్హం.
వాళ్లతో సమస్య పరిష్కారం కానప్పుడు మాత్రమే చిరంజీవి, బాలకృష్ణ, లేదా నాగార్జున, మోహన్‌బాబు దగ్గరకు వెళ్లి సాయం కోరాలని తమ్మారెడ్డి భరద్వాజ సూచించడం విశేషం. తమ్మారెడ్డి మాటల్లో ప్రాధాన్య అంశాలున్నాయి. కొంతమంది కావాలనే ఎవరో ఒకరి మీద బురద జల్లడం కోసమే టికెట్ ధరలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని తమ్మారెడ్డి ఎవరిని ఉద్దేశించి అన్నారనే చర్చకు తెరలేచింది. మొత్తానికి ఉద్దేశ పూర్వకంగా టికెట్ల ధరల విషయాన్ని సమస్యగా చిత్రీకరిస్తున్నారని తమ్మారెడ్డి మనసులో మాటగా పలువురు అంటున్నారు.