ప్రతి బాబాకి ఒక భక్త బృందం ఉంటుంది. సదరు బాబా దేవుడు కాదో.. వాడికి మహిమలు ఉన్నాయో లేదో ఎవడికీ తెలియదు. అలాగే రాంగోపాల్ వర్మకి కూడా ఒక భక్త బృందం ఉంటుంది. ఆయన ఏం చెప్పినా ఆహా ఓహో అనుకునే వారుంటారు! ఆయన చెప్పిన ప్రతి మాటనీ.. ప్రజలంతా ఆహా ఓహో అనేదాకా ఊదరగొట్టి పదేపదే ప్రచారం చేయడానికి టీవీ ఛానెళ్లు ఎటూ ఉండనే ఉన్నాయి.
రాంగోపాల్ వర్మ ఒక స్వయంప్రకటిత మేధావి. అన్నీ తనకే తెలుసునని అనుకుంటారు. అలా అనుకుంటే పరవాలేదు. మరెవ్వరికీ ఏమీ తెలియదని కూడా అనుకుంటారు. అరాచకవాదనల్ని ఇష్టపడే వాళ్లంతా ఆయన మాటల్ని చూసి, విని.. తాము అలా మాట్లాడలేకపోతున్నందుకు మధనపడుతూ మురిసిపోతుంటారు.
ఇదంతా అలా ఉంచితే.. రాంగోపాల్ వర్మ ‘నేను ఒక ఫిలిం మేకర్‌గా’ అని చెప్పుకుంటూ ప్రభుత్వం సినిమా టికెట్ ధరల పెంపును అడ్డుకుంటున్న వ్యవహారంలోకి తలదూర్చాడు. ప్రస్తుతానికి పేర్ని నానికి, ఆర్జీవికి మధ్య సుదీర్ఘమైన రసవత్తరమైన చర్చ నడుస్తూ ఉంది.
పేర్ని నాని చాలా స్పష్టంగా.. ఈ దేశంలో ఒక చట్టం ఉన్నదని, ఏ ప్రభుత్వమైనా సరే ఆ చట్టం ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటాయని.. చెబుతున్నారు. వర్మ చట్టం చూశారో లేదో తెలియదు. సినిమా గురించి జగన్ కు, మంత్రులకు ప్రభుత్వానికి అవగాహన లేదని అంటున్న రాంగోపాల్ వర్మకు అసలు చట్టం గురించి, దాని ద్వారా ప్రభుత్వానికి సంక్రమించే బాధ్యతలు, అధికారాల గురించి ఏ కొంచెమైనా తెలిసినట్టు లేదు. వర్మ అయాన్ రాండ్ ను మాత్రమే కాకుండా… ఇలాంటి వాదనలు చేయాలని అనుకున్నప్పుడు చట్టాన్ని, రాజ్యాంగాన్ని కూడా చదివితే బాగుంటుంది.
అదేమీ లేకుండా మా ప్రాడక్ట్ కి మీరు ధర ఎలా నిర్ణయిస్తారు? అనేది ఒక్క పాయింట్ మాత్రమే పట్టుకుని వేళ్లాడినంత కాలం ఉపయోగం లేదు. సినిమాకు 500కోట్ల బడ్జెట్ పెట్టి.. ఒక అద్భుతమైన చిత్రం తీశాం అని మేకర్స్ అనుకుంటే గనుక.. అది ప్రజలను మెప్పిస్తుందని అనుకుంటే గనుక.. ఏ రేంజిలో మెప్పించాలి..? ప్రజలు.. మామూలు ధరకే ఒక ఏడాది పాటు పదేపదే థియేటర్లకు వచ్చి ఆ సినిమాను చూసేంత గొప్పగా అది ఉండాలి. అలా తీయగలిగినప్పుడు వారికి నష్టాలు ఎందుకు వస్తాయి.
వారం రోజుల మించి థియేటర్లో నిలబడే అవకాశం లేని చెత్త సినిమాలు తీసి.. మేం వంద కోట్లు పెట్టేశాం.. వారంలో ఈ వంద కోట్లు దండుకునేస్తాం అని వాదిస్తే ఎలాగ? తలాతోకా లేని ఈ వాదనలతో ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలనని వర్మ అనుకుంటే పొరబాటు.
తనను ప్రభుత్వంలోని వారు, పార్టీ వారు టార్గెట్ చేస్తారనే భయంతో.. ‘నేను పేర్ని నాని ఫ్యాన్ ని’, ‘జగన్ అంటే నాకు చాలా లైకింగ్’, ‘అనిల్ యాదవ్ నాకు ఇష్టం’ లాంటి మెరమెచ్చు మాటలు చెబుతూ.. మరోవైపు అర్థంపర్థంలేని వాదనలతో మాట్లాడడం రాంగోపాల్ వర్మకు మంచిది కాదు!