పరీక్షా పత్రాల లీకు కుంభకోణం తెలంగాణను ఎలా కుదిపేస్తోందో చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం యిప్పటికైనా మేల్కొని గుజరాత్ ప్రభుత్వం యీ దిశగా ఏం చేసిందో గమనించి, వారిని అనుసరించి, అలాటి చట్టం చేస్తే మంచిదని తోస్తోంది. ఎందుకంటే యీ విషయంలో గుజరాత్ అనుభవం విస్తృతమైనది. గత పదేళ్లగా వాళ్లు దీనితో వేగుతున్నారు. చివరకు అది పరాకాష్టకు చేరి యీ ఏడాది కఠినమైన చట్టం చేసేవరకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పదేళ్లు ఆగకుండా ముందే ఆ పని చేస్తే మంచిదని భావిస్తూ గుజరాత్ సమస్య గురించి యీ వ్యాసం రాస్తున్నాను.
పరీక్షలలో ఒకరి బదులు మరొకరు రాయడం, పేపర్లు లీక్ కావడం 2012 నుంచి విపరీతంగా జరుగుతోందని గుజరాత్‌లోని భావనగర్ పోలీసులు చెప్పారు. ఈ ఏప్రిల్ 16న రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న గూడుపుఠాణీ గురించి ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తూ వారీ మాట చెప్పారు. ఈ ముఠాకు సూత్రధారులుగా ఉన్న నలుగుర్ని, మరొకరికి బదులుగా పరీక్షలు రాస్తున్న యిద్దర్ని అరెస్టు చేశారు. మొదటి బ్యాచ్‌లో ముగ్గురూ, రెండో బ్యాచ్‌లో యిద్దరూ ప్రభుత్వోద్యోగులే. డమ్మీ కాండిడేట్ల చేత పరీక్ష రాయించడానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా తీసుకుంటున్నారని, మరొకరికి బదులు పరీక్ష రాసే అతనికి రూ.25 వేలు చేతిలో పెడుతున్నారని పోలీసుల అభియోగం.
ఇక పేపరు లీకుల విషయానికి వస్తే గత 9 ఏళ్లలో 13 ప్రభుత్వ పరీక్షలలో పేపర్లు లీకయ్యాయి. ఈ ఏడాది జనవరి 29న జరిగిన గుజరాత్ పంచాయత్ సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్షలో జరిగిన స్కాము 13వది. 2014లో గుజరాత్ పబ్లిక్ సర్వీస్ చీఫ్ (జిపిఎస్సి) ఆఫీసర్ రిక్రూట్మెంట్ పరీక్ష పేపరు లీకైంది. 2015లో ఎల్‌డిసి ఉద్యోగాలకు నిర్వహించిన తలాతీ (విలేజ్ ఎక్కౌంటెంట్, కరణం) పరీక్ష పేపరు, 2016లో గాంధీనగర్, మొడాసా, సురేంద్రనగర్లలో ఖాళీలు నింపడానికి పెట్టిన తలాతీ పరీక్ష, 2018లో మహిళా పోలీసుల నియామకానికై పెట్టిన ఎంట్రన్స్ పరీక్ష, టీచర్స్ రిక్రూట్మెంట్ (టిఎటి), రూ. 32 వేల జీతం వచ్చే రెవెన్యూ డిపార్టుమెంటులో నాయబ్ చిట్నీస్ నియామకాలు, లోక రక్షక్ దళ్ ఎంట్రన్స్ పరీక్ష – యివన్నీ లీకయ్యాయి. 2019లో నాన్-సెక్రటేరియట్ క్లర్క్ పరీక్షా పత్రాలు లీకయ్యాయి.
2021లో హెడ్ క్లర్క్, దక్షిణ గుజరాత్లో రాష్ట్ర విద్యుత్ సంస్థ, విద్యుత్ సహాయక్, సబ్ఆడిటర్ పరీక్ష – వీటన్నిటి పేపర్లూ లీకయ్యాయి. 2022లో ఫారెస్ట్ గార్డ్స్ పరీక్షా పత్రం లీకయ్యింది. ప్రస్తుత లీక్ సంగతికి వస్తే, నెలకు రూ.19,950 జీతం వచ్చే 1181 జూనియర్ క్లర్క్ ఉద్యోగాలకై పరీక్ష నిర్వహిస్తామని సెలక్షన్ బోర్డు 2016లో ప్రకటించింది. అప్పణ్నుంచి మూడు సార్లు రద్దయింది. 2014లో అభ్యర్థుల సంఖ్య మరీ ఎక్కువగా ఉందంటూ రద్దు చేశారు. 2022 నవంబరులో రాష్ట్ర ఎన్నికలంటూ రద్దు చేశారు. ఇన్నాళ్లకు మళ్లీ పెడితే లీకైందంటూ రద్దు చేశారు. 9.5 లక్షల మంది యువతీయువకులు పరీక్షకు సిద్ధపడ్డారు. పరీక్ష జరగడానికి కొన్ని గంటల ముందే పేపరు లీకయ్యినట్లు తెలిసిపోయి పరీక్ష రద్దు చేయాల్సి వచ్చింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా యువత రోడ్డుకెక్కారు.
ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెసు, ఆప్ ప్రభుత్వాన్ని తూర్పార బట్టారు. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మే 7న మళ్లీ పరీక్ష పెడతామంది. 2995 పరీక్షా సెంటర్లకు వచ్చిన విద్యార్థులకు యింటికి బస్సుల్లో ఉచితంగా తిరిగి వెళ్లవచ్చు అంది. (దానితో పాటు ప్రతీ అభ్యర్థికి రూ. 50 వేల పరిహారం యివ్వాలని డిమాండ్ చేసింది ఆప్!) ప్రభుత్వం మేల్కోక తప్పలేదు. ఫిబ్రవరి మొదటి వారంలో గుజరాత్ పంచాయత్ సర్వీస్ సెలక్షన్ బోర్డు చైర్మన్‌గా సందీప్ కుమార్ అనే ఐఏఎస్ అధికారిని తీసేసి, ఆయన స్థానంలో హస్ముఖ్ పటేల్ అనే ఐపిఎస్ అధికారిని నియమించింది. ఫిబ్రవరి 16న గుజరాత్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్ 2023 పేర అసెంబ్లీలో చట్టం చేసింది. దీని కింద నేరస్తులకు కనీస శిక్ష రూ.1 లక్ష జరిమానా, మూడేళ్ల జైలు. అత్యధిక శిక్ష రూ.1 కోటి జరిమానా, ఏడు నుంచి పదేళ్ల జైలు. తన బదులు వేరేవారి చేత పరీక్ష రాయించిన వ్యక్తి రెండేళ్ల పాటు ఏ పరీక్ష రాయకుండా నిషేధింపబడతాడు. ఈ చట్టం కింద బుక్ అయినవారికి బెయిలు యివ్వబడదు.
నిజానికి యివన్నీ 2022 జులైలో గుజరాత్ స్టేట్ లా కమిషన్ చేసిన సిఫార్సులే. మాజీ సుప్రీం కోర్టు జజ్ ఎంబి షా అధ్యక్షతన ఆ కమిషన్ గుజరాత్లో పరీక్షా పత్రాలు బయటకు పొక్కిపోవడం వ్యవస్థీకృతమై పోయిందని, దాని కారణంగా పరీక్షకు సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్న యువతీయువకులు ఎంతో నష్టపోతున్నారని, మానసికంగా ఆందోళనకు గురవుతున్నారని లెజిస్లేటివ్ ఎఫయిర్స్ శాఖకు నివేదిక యిచ్చింది. దానిలోనే ‘ఈ స్థాయిలో జరుగుతోందంటే రాష్ట్ర ప్రభుత్వంలోని పలుకుబడి గల కొందరు పెద్దల ప్రమేయం తప్పకుండా ఉంటుందని, కానీ ఆ పెద్ద చేపలు ఎప్పటికీ బయటపడవని, చిన్నాచితకా చేపలకి మాత్రమే శిక్ష పడుతుంది.’ అని కూడా చెప్పింది. చట్టం చేస్తే తమలో ఎవరికి యిబ్బంది అవుతుందో అనే భయంతో కాబోలు, ఆ కమిషన్ రిపోర్టును ప్రభుత్వం పక్కన పెట్టింది. ఇప్పుడీ 13వ స్కామ్ బయటపడి అల్లరల్లరి కావడంతో చట్టాన్ని తీసుకుని వచ్చింది.
గుజరాత్లో చాలామంది ఉద్యోగాలు చేయడం కంటె వ్యాపారాలు చేసుకోవడానికే మొగ్గు చూపుతారనే ప్రతీతి ఉంది. ప్రయివేటు కంపెనీలు కూడా గుజరాత్లో కోకొల్లలుగా ఉన్నాయి. అయినా ప్రభుత్వోద్యోగాల కోసం నేటి యువత అర్రులు చాస్తోందని అర్థమౌతోంది. 1181 ఉద్యోగాలకై 9.50 లక్షల మంది పోటీ చేశారంటే ఒక ఉద్యోగానికి 800 మంది అర్థులున్నారన్నమాట. దీన్ని బట్టి నిరుద్యోగ సమస్య తీవ్రంగానే ఉందని తెలుస్తోంది. దాని కారణంగానే ఉద్యోగాలపై మోజు పెరగడం, ఎలాగోలా ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నించడం, వారి దురాశను సొమ్ము చేసుకోవడానికి కొన్ని గ్యాంగులు వ్యూహరచన చేయడం, వారికి ప్రభుత్వంలో పెద్దల అండదండలుండడం – యివన్నీ అర్థం చేసుకోవచ్చు.
గుజరాత్ కాంగ్రెస్ ప్రతినిథి మనీశ్ దోషీ ‘‘రాష్ట్రంలో అన్ని రిక్రూట్మెంట్ విభాగాలు అవినీతితో కునారిల్లుతున్నాయి. ఆరెస్సెస్‌కు సంబంధించిన వారినే చైర్మన్లగా నియమిస్తున్నారు. వారే వీటికి పాల్పడుతున్నారు. అహ్మదాబాద్‌కు ఒకప్పుడు మేయరుగా పని చేసిన బిజెపి నాయకుడు అసిఫ్ వోరాను గుజరాత్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ చైర్మన్‌గా వేశారు. ఆ బోర్డు నిర్వహించిన హెడ్ క్లర్క్స్ పరీక్షాపత్రం లీకై పరీక్షలు కాన్సిల్ చేశారు. దాంతో అతను రాజీనామా చేయవలసి వచ్చింది.’’ అన్నాడు. చాలాకాలంగా యీ సమస్యపై పోరాటం చేస్తున్న గుజరాత్ ఆప్ నాయకుడు యువరాజ్ సిన్హ్ జడేజా ‘‘ప్రభుత్వం కావాలనే యిలా జరగనిస్తోంది. పరీక్ష కాన్సిల్ అయిపోయిందన్న మిషతో తాత్కాలిక నియామకాలు చేపట్టి, తమ పార్టీ కార్యకర్తలను ఆ ఉద్యోగాల్లో నియమించుకుంటున్నారు. వాళ్లకి పూర్తి జీతాలివ్వనక్కర లేదు కాబట్టి, ఖర్చు మిగులుతోందని ప్రభుత్వం సంతోషిస్తోంది.’’ అన్నాడు.
ఈ చట్టం పాసైన తర్వాత కూడా చర్యలు తీసుకుంటారన్న నమ్మకం చాలామంది ఉద్యోగార్థులకు లేదు. చట్టం అమలై, ఎవరికైనా శిక్ష పడ్డాకనే నమ్ముతాం అంటున్నారు. మద్యనిషేధం చట్టం పేరుకు ఉంది, కానీ ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతోంది, ఇదీ అలాగే అవుతుందేమో అంటున్నారు. ‘పరీక్ష రాసేవాడి దగ్గర లీకైన ఆన్సర్ పేపరు దొరికిందనుకోండి, చీటింగ్ కింద కేసు పెట్టి వదిలేయవచ్చు. పేపరు లీక్ కింద కేసు పెడితేనే శిక్ష పడి, ఫ్రాడ్ చేయడానికి జనాలు భయపడతారు’ అన్నాడొకతను. ఇన్ని స్కాములు జరిగాయంటే ప్రభుత్వ వ్యవస్థలోనే పందికొక్కులు ఉన్నాయని అర్థమౌతుంది. గుజరాత్‌లోని కొందరు ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్లను 2019లో బిట్స్ పిలాని ఆన్లైన్ పరీక్ష స్కాములో సిబిఐ అరెస్టు చేసింది. ఈ సారీ వారి పేరే వినబడుతోంది.
తమాషా ఏమిటంటే గుజరాత్ ప్రభుత్వం తాజా లీక్ కేసును గుజరాత్ ఏంటీ టెర్రరిస్ట్ స్క్యాడ్ (ఎటిఎస్) కు అప్పగించింది. ఎందుకంటే యీ కేసులో నిందితుడికి పేపరు హైదరాబాదు నుంచి వచ్చిందట, అక్కడే ప్రింటయి, లీక్ అయిందట. హైదరాబాదంటే టెర్రరిజంకు అడ్డా కదా, వారి దృష్టిలో! అందుకని ఎటిఎస్‌ను దించారు. వారు బిహార్, ఒడిశా గ్యాంగుల హస్తాన్ని కనుగొన్నారు. ఈ స్కాముకి టెర్రరిస్టు వేషం వేయదలిచారు కాబట్టి త్వరలోనే ఐఎస్ఐ హస్తం, ఐఎస్ఐఎస్ ప్రమేయం, కేరళలో మిస్సయిన ‘32వేల మంది’ అమ్మాయిల జోక్యం కూడా వార్తల్లోకి రావచ్చు. వీళ్లతో పాటు గుజరాత్ ప్రభుత్వంలో పెద్ద తలకాయల పేర్లు కూడా వస్తేనే ఆశ్చర్యపడాలి. (ఫోటో – లీక్‌పై ఉద్యోగార్థుల ఆందోళన)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2023)