టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ మొదలై చాన్నాళ్లయింది. ఒకప్పటి హిట్ సినిమాలు వరుసపెట్టి థియేటర్లలోకి వస్తున్నాయి. వాటికి ప్రచారం కల్పించేందుకు ప్రత్యేకంగా ట్రయిలర్స్ కట్ చేసి విడుదల చేయడం కూడా మొదలుపెట్టారు. ఇప్పుడీ సంస్కృతిని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. రీ-రిలీజ్ సినిమాకు ఏకంగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టబోతున్నారు.
ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి సింహాద్రి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రచారం మొదలైంది, టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయితే ఇది చాలదని ఫీల్ అవుతున్నారు తారక్ ఫ్యాన్స్. అందుకే సింహాద్రి రీ-రిలీజ్ కు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టాలని డిసైడ్ అయ్యారట.
అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో 3 రోజుల్లో హైదరాబాద్ లో గ్రాండ్ గా సింహాద్రి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. ఈ వేడుకకు ఎన్టీఆర్ రాకపోవచ్చు. ఎందుకంటే, అతడు కొరటాల శివ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రాజమౌళి, కీరవాణి లాంటి ప్రముఖుల్లో ఎవరు వస్తారనేది ప్రస్తుతానికి డౌట్.
ఈ సినిమాతో మరో రికార్డ్ కూడా క్రియేట్ చేయబోతున్నారు ఫ్యాన్స్. మెల్ బోర్న్ లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్ పై సింహాద్రిని రీ-రిలీజ్ చేయబోతున్నారు.