మే 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ప్రధాన అంశం – నిష్క్రియాపరత్వానికి మారుపేరుగా నిలిచిన మన్మోహన్ సింగ్ను గద్దె దించి, క్రియాశీలంగా వుండే మోడీని గద్దె నెక్కించడం. మోడీ భావజాలం పట్ల, కటుత్వం పట్ల ఎంత వ్యతిరేకత వున్నా, ఎవడో ఒకడు, కాస్త పనిచేసేవాడు వుంటే చాలు అనుకుని – 1980లో ఇందిరా గాంధీకి ఓట్లేసిన తీరులోనే – ఓట్లేశారు. అప్పుడు స్థానికంగా ఆ పార్టీ తరపున నిలబడిన అభ్యర్థి గుణగణాలు పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. మోడీ ఇమేజితో ఎన్నికల ప్రభంజనం వీచింది. అది శాశ్వతం కాదని మూణ్నెళ్లు తిరక్కుండా జరిగిన ఉపయెన్నికలు నిరూపించాయి.
బిహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక, పంజాబ్లలో 18 సీట్లకు ఉపయెన్నికలు జరిగితే వాటిలో ఎన్డీఏ 10 సీట్లలో ఓడిపోయింది. ముఖ్యంగా బిహార్లో బిజెపి కంగు తిందనే చెప్పాలి. 10 అసెంబ్లీ సీట్లకు ఉపయెన్నికలు జరిగితే వాటిలో కేవలం 4 మాత్రమే గెలిచింది. పార్లమెంటు ఎన్నికలలో పడినన్ని ఓట్లే పడి వుంటే గెలిచి వుండాలి. కానీ వాటిలో సగమే వచ్చాయంటే దానికి కారణం దాని ప్రత్యర్థులు ఏకం కావడం! మేలో బిజెపి-ఎల్జెపి-ఆర్ఎల్ఎస్పి కూటమికి 45% ఓట్లు రాగా మూడు నెలల్లో అది 7% తగ్గి 3% మాత్రమే వచ్చింది.. జెడి(యు), ఆర్జెడి-కాంగ్రెసు కూటమి విడివిడిగా పోటీ చేసి అప్పుడు 41% తెచ్చుకుంటే, ఇప్పుడు అవి చేతులు కలిపి 4.6% ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నాయి.
చిరకాలంగా ప్రత్యర్థులుగా వున్న లాలూ, నితీశ్ చేతులు కలిపి బిహార్లో బిజెపి జైత్రయాత్రకు అడ్డు వేయగలిగారు. నీతి ఏమిటంటే – సాధారణ ఎన్నికలు వేరు, ఉపయెన్నికలు వేరు. మొన్నటి ఎన్నికలలో తెరాస జయభేరి మోగించింది కదాని మెదక్ ఉప ఎన్నికలో కూడా అదే ధోరణి కొనసాగుతుందని అనుకోవడానికి లేదు. కాంగ్రెసు, బిజెపి చేతులు కలపడం లేదు కాబట్టి సరిపోయింది కానీ కలిపి వుంటే కథ మారిపోయేదేమో!
ఎమ్బీయస్ ప్రసాద్