ఎమ్బీయస్: ఆరోగ్యం గురించి కాస్త…

జనవరి 1న నేను రాసిన ఆర్టికల్‌లో ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలని రాస్తే, చెప్పిన తీరు చాలామందికి నచ్చింది. ‘ఆంగ్ల సంవత్సరాదికి రాశారు, తెలుగు సంవత్సరాదికి కూడా రాసి ఉండాల్సింది’ అని కొందరు మెయిల్స్…

జనవరి 1న నేను రాసిన ఆర్టికల్‌లో ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలని రాస్తే, చెప్పిన తీరు చాలామందికి నచ్చింది. ‘ఆంగ్ల సంవత్సరాదికి రాశారు, తెలుగు సంవత్సరాదికి కూడా రాసి ఉండాల్సింది’ అని కొందరు మెయిల్స్ రాశారు. అందుకని ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్యదినోత్సవ సందర్భంగా, జనరల్ విషయాలు కొన్ని రాస్తూ, చివర్లో ఉపయోగకరమైన సమాచారం యిస్తాను. పేపర్లో మనం నిత్యం ఆరోగ్యం గురించి చదువుతూనే ఉంటాం. టీవీల్లో మధ్యాహ్నకార్యక్రమాలన్నీ ప్రాయోజిత మెడికల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవి కాక ప్రముఖ వైద్యులతో ఇంటర్వ్యూలుంటాయి. ఇవన్నీ చాలనట్లు నేను కూడా చెప్పాలా? అంటే అవన్నీ చెప్పేది డాక్టర్లు. ఇక్కడున్నది రోగి. సెవెన్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. అదీ తేడా. డాక్టర్లు ఓపెన్‌గా చెప్పలేనివి నా బోటి సామాన్యుడు చెప్పగలడు. ఈ వ్యాసంలో నేను ముఖ్యంగా చెప్పబోయేది, వైద్యం పట్ల, వైద్యుల పట్ల మన ఏటిట్యూడ్ ఎలా ఉండేది అనేది. తర్వాత యిద్దరు ప్రముఖులు పునీత్ రాజకుమార్, బప్పీ లాహిడీ మరణాలకు కారణమైన వాటి గురించి సేకరించిన సమాచారం యిస్తాను.

పేపర్లో కానీ, టీవీల్లో కానీ వ్యాసాలు చదివేసి మనకు చాలా మెడికల్ నాలెజ్ వచ్చేసింది అనుకోవడం ఎంత పొరపాటంటే, టీవీలో చెప్పినది విని జ్యోతిష్యం వచ్చేసిందని అనుకోవడమంత! వాళ్లు ఆరేళ్లలో చదువుకున్నది మనకు అరగంటలో వంటబట్టేస్తుం దనుకోవడం తప్పు. పైగా పులికి పిల్లి చెట్టెక్కడం నేర్పనట్లు, వాళ్లు మనకు పూర్తి సమాచారం యివ్వరు. సోరియాసిస్ – హోమియో చికిత్స అని కాప్షన్ పెట్టి సోరియాసిస్ ఎలా వస్తుందో, ఎందుకు వస్తుందో మూడు కాలమ్స్ సరిపడా రాస్తారు. ఆఖరి పేరాలో దీనికి హోమియోపతిలో చాలా మంచి మందులున్నాయి అని ముగిస్తారు. అది చదివితే మనకున్నది సోరియాసిస్సో కాదో తెలిసి చావదు. ఒకవేళ సోరియాసిస్ అని ముందే తెలిసినా, ఏ మందు వేసుకోవాలో తెలియదు.

కొందరు కాలమిస్టులు మాత్రం అరడజను మందుల పేర్లు రాసి అక్కడ పెడతారు. ఆ పేపరు కటింగు పట్టుకుని హోమియో షాపు కెళ్లి చూపిస్తే వీటిలో ఏది కావాలి అని అడుగుతాడు. వీరివీరి గుమ్మడిపండు అన్నట్లుగా ఏదో ఒకటి ఎంచుకుని, చెపితే ఏ పొటెన్సీలో కావాలి? మాత్రలా? మదర్ టించరా? అని అడుగుతారు. ఏదో ఒకటి అని లాటరీ వేసి తెచ్చుకుంటే అది రోజుకి ఎన్నిసార్లు వేసుకోవాలో, ఎప్పుడు మానేయాలో తెలియదు. హోమియో అనే కాదు, ఆయుర్వేదమైనా అంతే. వాళ్లు మందు పేరు రాస్తే అది ఒక పర్టిక్యులర్ కంపెనీని ప్రమోట్ చేసినట్లవుతుందనో ఏమో, మందు పేరు రాయరు. అందువలన కంటగులరాకు లేదా గుంటకలరాకు పొడి తీసుకుని పిప్పళ్ల రసంతో కలిపి, నూరి.. అంటూ ఏవో రాస్తే ఆ మొక్కలూ కాయలూ ఎలా వుంటాయో మనకు తెలియదు. మూలికలు అమ్మే షాపు వెతికి పట్టుకుని కొనబోతే వాళ్లు యిచ్చినవి అవో, కాదో తెలియదు. వస్త్రగాళితం చేసి.., ఆ పై వడకట్టి.. అంటే ఆ ప్రాసెస్ ఏవిటో తెలియదు.

ఇక అలోపతి వైద్యులు కూడా రోగం గురించి బోల్డంత రాసి, భయపెట్టి, చివరి పేరాలో ఏ మాత్రం అనుమానం ఉన్నా మంచి వైద్యుడి వద్దకు వెళ్లి చూపించుకోండి అని సలహా రాస్తారు. మంచి వాళ్లెవరో వెతుక్కునే శ్రమ లేకుండా కింద తమ పేరు, ఫోటో, సెల్ నెంబరు, ఆసుపత్రి అడ్రసు కూడా యిచ్చేస్తారు. ఇవన్నీ చదివి బెంగ పడేవాళ్లు కొందరుంటారు. నేను పదో తరగతి చదివే రోజుల్లో మా ప్రెస్‌లో ‘కాన్సర్, హోమియో చికిత్స’ అనే పుస్తకం అచ్చయింది. నేను ప్రూఫ్‌లు చూడవలసి వచ్చింది. హోమియోలో రక్తపరీక్షలు అవీ పెద్దగా పట్టించుకోరు. లక్షణాల బట్టే చికిత్స జరుగుతుంది. అంటే దాహం వేసినప్పుడు చల్లనీళ్లు తాగాల్సి వస్తుంది, తీపి అంటే యిష్టమే కానీ తర్వాత యిబ్బంది పడతారు, పడుకునేటప్పుడు దుప్పటిలోంచి కాళ్లు బయటకు పెడతారు… యిలాటివన్నమాట. ఒక్కో కాన్సర్ లక్షణాలు చదువుతూంటే నాలో అవి ఉన్నాయనిపించేది.

తర్వాత జెరోమ్ కె జెరోమ్ రాసిన హాస్యనవల ‘‘త్రీ మెన్ ఇన్ ఏ బోట్’’కు తెలుగు అనువాదం ‘‘అద్దెబోటులో ముగ్గురే ముగ్గురు, కుక్క సంగతి సరేసరి!’’ చదివాను. దానిలో ఓ పాత్రకు అచ్చం యిలాటి అనుభవమే కలుగుతుంది. ఓ మెడికల్ పుస్తకం చదవడం పూర్తి చేసేసరికి, తనలో 48 రోగాలు గూడుకట్టుకుని ఉన్నాయని అతనికి తోస్తుంది. అప్పుడర్థమైంది, ప్రతివాళ్లకు యిలాగే అనిపిస్తుందని. పోనీ అనుమానం ఉంది కదాని వెళ్లి పరీక్ష చేయించుకుంటామా? అబ్బే, ఏం బయటపడుతుందో ఏమోనన్న భయం. రోగాన్ని ఊహించుకుంటూ, నిట్టూరుస్తూ బతికేయడమే మనకు అలవాటు. ఎవరైనా డాక్టరు దగ్గరకు వెళ్లమని సలహా యిస్తే విరుచుకుపడతాం ‘వెళ్లితే అనవసర పరీక్షలన్నీ చేయించి దోచేస్తారు. గోరంతదాన్ని కొండంతగా చూపించి హడలగొడతారు’ అని.

అంటే ఏమిటి? డాక్టర్లంటే అపనమ్మకం. మళ్లీ భయం వేస్తే వాళ్లనే ఆశ్రయించడం! ఇది ఇంగ్లీషు డాక్టర్ల విషయంలో మరీ వర్తిస్తుంది. ఇంగ్లీషు మీడియం లాగానే! తెలుగును బతికించుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే తెలుగు మీడియం పెట్టాలి అని ఉపన్యాసాలిస్తాం. ఉపరాష్ట్రపతిగారు గొప్పగా చెప్పుకుంటారు ‘నేను తెలుగుమీడియంలో చదివే ఇంతటివాణ్నయ్యాను’ అని, అక్కడకు వాళ్ల చవటపాలెంలో లాటిన్ మీడియం కూడా ఉన్నా కాదని ఈయన తెలుగు మీడియం వైపు మొగ్గు చూపినట్లు’! ‘అవి ఆ రోజులండీ, యిప్పుడు మీ మనవణ్ని ఏ మీడియంలో పెట్టారు చెప్పండి’ అంటే మాట్లాడరు. ఇంగ్లీషంటే భయమున్నా ఇంగ్లీషు మీడియంలోనే చదువుతాం, చదివిస్తాం. అలాగే ‘ఆయుర్వేదం మన దేశీయవైద్యం. వేల సంవత్సరాల క్రితమే యూరోపియన్లకు గుడ్డలు కట్టుకోవడం రాకపూర్వమే, మనవాళ్లు ఆపరేషన్లు చేసేశారు. అది గొప్ప వైద్యవిధానమని ఫలానా గ్రీకు శాస్త్రవేత్త అన్నాడు’ అని స్పీచి దంచుతాం. పిల్లవాడికి డొనేషన్ కట్టి ఎంబిబిఎస్‌లో చేర్పిస్తాం తప్ప, ఫ్రీగా వచ్చిన ఆయుర్వేద మెడికల్ కాలేజీలో చేర్చం.

ధనార్జన కోసం అలా చేశాం అనుకున్నా చికిత్స కోసమైనా మనం ఆయుర్వేదం వాళ్ల దగ్గరకు వెళ్లాలిగా! అబ్బే! చిన్నపుడు మా వూళ్లో ఒకాయన నాడి పట్టుకుని భూతవర్తమాన భవిష్యత్ రోగాలన్నీ వల్లె వేసేసేవాడు అని చెప్తాం కానీ యిప్పుడు మాత్రం ఆయుర్వేద డాక్టరు దగ్గరకు వెళ్లం. కానీ ఆనందయ్య మందు, చేపమందు లాటివి వచ్చినపుడు మనల్ని పట్టుకోతరం కాదు. ‘మన విధానం ఎంత మహత్తరమైనదో చూడండి, యీ ఇంగ్లీషు డాక్టర్లే వాళ్లను తొక్కేస్తున్నారు, ఫార్మా కంపెనీవాళ్ల మాయ..’ అంటూ వీరంగం వేసేస్తాం. మనకు జబ్బు రాగానే ఇంగ్లీషు మందే వేసుకుంటాం. అదేమంటే ఆయుర్వేదం మందులు వేడి చేస్తాయండి అంటాం. హోమియోవి పని చేస్తాయి కానీ చాలా స్లో, పైగా రోగాన్ని పెంచి, ఆ తర్వాత తగ్గిస్తాయి, పెరిగినప్పుడు బాధ తట్టుకోలేం అంటాం. నిజానికి ఇవన్నీ అపోహలే, వాడి చూస్తేనే తెలుస్తుంది. ఈ ధోరణి వలననే ఎంబిబిఎస్ సీట్లకున్న డిమాండ్ బిఎఎమ్‌ఎస్‌కు, బిఎచ్ఎమ్ఎస్‌కు లేదు.

మనకు ఇంగ్లీషు మందు కావాలి, కానీ డాక్టరు దగ్గరకు వెళ్లేందుకు భయం. అందువలన మెడికల్ షాపు వాణ్నే ఆశ్రయిస్తాం. రోగలక్షణాలు చెప్పగానే అతనే మందులిచ్చి ఎలా వేసుకోవాలో కూడా గీతోపదేశం చేస్తాడు. ఆ ట్రిక్కు పనిచేయక, డాక్టరు దగ్గరకు వెళ్లినా ఆయనిచ్చిన మందులన్నీ కొనం. మందుల కంపెనీలతో కుమ్మక్కయి ఎక్కువ రాశాడని అనుమానం. సగం మందులే కొంటాం, అవీ పది చెప్తే ఐదు కొంటాం. ఐదూ యింటికి తెచ్చినా మూడిటితో తగ్గిపోయిందంటే మిగతావి వేసుకోము. ‘కోర్సు మధ్యలో మానేస్తే ఎలా?’ అని ఎవరైనా అంటే ‘మందులెక్కువగా వాడితే కిడ్నీలు పోతాయి తెలుసా?’ అని దబాయిస్తాం. మిగిల్చిన రోగశేషం మళ్లీ రగులుకుని పై నెలలో జబ్బు తిరగబెడితే ‘ఈ డాక్టర్లందరూ వేస్టండి, అసలు చిన్నపుడు మా నాయనమ్మ అల్లం చారుతో సకల రోగాలూ పోగొట్టేది’ అని తిట్టిపోస్తాం. పోనీ ఆ అల్లంచారు వైద్యాన్నే నమ్మవచ్చుగా! ఏతావతా ఇంగ్లీషు డాక్టరనేవాడు ఒక నెససరీ ఈవిల్‌గా మారిపోయాడు.

ఈ పరిస్థితి రావడానికి కారణం కార్పోరేటు ఆస్పత్రులనే చెప్పాలి. వారం క్రితమే కాంటినెంటల్ ఆస్పత్రి చైర్మన్ ఆంధ్రజ్యోతికి యిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. విదేశీ పెట్టుబడిదారులు వచ్చి మన ఆసుపత్రుల యాజమాన్యాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు. భారీ ఇన్సెన్టివ్‌లిచ్చి సిఇఓలను పెట్టుకుని మూడేళ్లలో గడువులో ఆదాయాన్ని విపరీతంగా పెంచమంటున్నారు. ఆదాయం పెరగగానే ఆ ప్రొజెక్షన్ చూపించి, మరో విదేశీ కంపెనీకి అమ్మేస్తున్నారు. ఆదాయాన్ని పెంచడానికి ఈ సిఇఓలు హెచ్చు జీతాలతో యితర ఆస్పత్రుల నుంచి డాక్టర్లను తెప్పించి ఎక్కువ ప్రొసీజర్లు చేయాలని, ఎక్కువమంది పేషంట్లను చూడాలని, ఎక్కువ సర్జరీలు చేయాలని టార్గెట్లు పెట్టి ఒత్తిడి పెంచుతున్నారు. దానితో వైద్యవ్యయం పెరుగుతోంది అని వాపోయారాయన. మన ప్రభుత్వాలు వైద్యరంగంలోకి ఎఫ్‌డిఐలను అనుమతించి, ఆ తర్వాత పెంచి చాలా తప్పు చేశాయి. చౌకధరల్లో మందులు, టీకాలు చేసే ఫార్మా కంపెనీలు విదేశీ హస్తగతమై పోయాయి. వైద్యులు స్థాపించి, రీజనబుల్‌గా నడుపుతూ వస్తున్న కార్పోరేటు ఆసుపత్రులు యిప్పుడీ యిన్వెస్టర్ల పాలన బడ్డాయి.

కరోనా సమయంలో కష్టమూ, రిస్కూ డాక్టర్లది కాగా, లాభాలు ఆసుపత్రి యాజమాన్యాలవి అయ్యాయి. రిస్కుతో పాటు అవమానాలు కూడా! మీరు ఆసుపత్రిలోనే పడుక్కోండి, ఇంటికి వచ్చి కాంప్లెక్సులో అందరికీ కరోనా అంటించవద్దు అంటూ యిరుగుపొరుగులు అడ్డుకున్నారు. చెప్పవచ్చేదేమిటంటే, వైద్యుణ్ని నిందించి ప్రయోజనం లేదు. వ్యాపారస్తుడి చేతిలో యిరుక్కున్నందుకు జాలిపడాలి. మన జాగ్రత్త మనం పడాలి. సాధ్యమైనంత వరకు ప్రతి చిన్నదానికి కార్పోరేట్ ఆస్పత్రికి వెళ్లకుండా, ప్రయివేటు ప్రాక్టీసు పెట్టుకున్న డాక్టరు దగ్గరకు వెళ్లాలి. ముఖ్యంగా ఎంబిబిఎస్ మాత్రమే చదివిన డాక్టరు దగ్గరకు వెళ్లి, అతన్ని ఫ్యామిలీ ఫిజీషియన్‌గా ఏర్పాటు చేసుకోవాలి. ఏదైనా రాగానే స్పెషలిస్టు దగ్గరకు వెళ్లడం పరిపాటి అయిపోయి అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. ఎలాగో వివరిస్తాను.

నాకు తరచుగా తలనొప్పి వస్తోందనుకోండి. ఇది న్యూరో ప్రాబ్లెమ్ అయి వుంటుంది అనుకుని న్యూరో సర్జన్ దగ్గరకు వెళతాను. ఆయన దగ్గరకు వెళ్లమని ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పలేదు. తనికెళ్ల భరణి చెప్పినట్లు గట్ల నేనే డిసైడ్ జేసిన. నాకేమైనా వీటి గురించి తెలుసా? తలనొప్పి రావడానికి పద్ధెనిమిది కారణాలుంటాయని, వాటిని వివిధ విభాగాల వారు చూస్తారని తెలుసా? ఎవడో ఫ్రెండు ఎప్పుడో చెప్పాడు, లేకపోతే యిదిగో పేపర్లో చదివాను, లేదా టీవీలో చూశాను. వెళ్లాను. ఆయన న్యూరో ప్రాబ్లెమ్ ఏదీ లేదని పొమ్మన్నాడు. ఇలాగే యిద్దరు, ముగ్గురు స్పెషలిస్టుల దగ్గరకి వెళ్లి వాళ్ల చేతా యిదే చెప్పించుకుని, విసుగెత్తి ఏమీ చేయకుండా బాధపడుతూ గడిపేస్తాను. ఏ పదేళ్లకో రోగం ముదిరి, మరో విభాగానికి వెళితే మీకు కాన్సర్, చాలా ఆలస్యంగా వచ్చారు అంటూ పెదవి విరుస్తారు. దానికి బదులు మామూలు డాక్టరు దగ్గరకు వెళితే ఆయన ట్రాఫిక్ కానిస్టేబుల్‌లా నువ్వు ఫలానా స్పెషలిస్టు దగ్గరకు వెళ్లాలి అని సూచిస్తే యీ అవస్థ రాదు కదా!

మనం డాక్టరును శత్రువుగా, సందిస్తే దోచేసేవాడిగా చూడకూడదు. ఆయన నిజాయితీపై, పటిమపై నమ్మకం పెట్టుకునే వెళ్లాలి. ఫెయిత్ హీలింగు అనేది కొన్ని సందర్భాల్లో వర్కవుట్ అవుతుంది. డాక్టరుపై నమ్మకం సగం రోగాన్ని తగ్గిస్తుంది, బాధను భరించే శక్తి నిస్తుంది. నా ఉద్దేశంలో కార్పోరేట్ గ్రూపు ఇమేజి కంటె డాక్టరు యిమేజే ముఖ్యం. ఫలానా అ-లోలో అందరూ డాక్టర్లు గొప్పవారు అనుకోకూడదు, ఫలానా కామి-నిలో సరిగ్గా చూడరు అనుకోకూడదు. మీకు తగిలిన డాక్టరు బట్టి, మీరు ఆ గ్రూపుపై అలాటి అభిప్రాయం ఏర్పరచుకుంటున్నారు. కానీ డాక్టర్లు యిక్కణ్నుంచి అక్కడకు మారుతూంటారని గుర్తించాలి. మీరు ఆసుపత్రి మార్చి వేరే దానికి వెళితే అక్కడా ఆ డాక్టరే తగలవచ్చు. తెలిసున్నవాళ్ల దగ్గర డాక్టరు గురించి వాకబు చేసి వెళ్లడమే బెస్టు.

ఇంత నమ్మకం పెట్టుకుని వెళుతున్నాం కాబట్టి డాక్టరు కూడా దానికి తగ్గట్టే ప్రవర్తించాలి. ముఖ్యంగా రోగి గోడు వినాలి. ఇక్కడో విషయం చెప్తాను. మనకు జ్వరం వచ్చిందనుకోండి. కళ్లు మండుతాయి, కాళ్లు పీకుతాయి, తలనొప్పిగా ఉంటుంది, ఆకలి పెద్దగా వేయదు… యిలాటి లక్షణాలన్నీ చెప్పి విపులంగా సరైన మందు ఎంచుకోవడంలో డాక్టరుకి సహకరిద్దామని మన తాపత్రయం. కానీ డాక్టరుగారికి మన కళ్లు చూడగానే జ్వరం వుందని తెలిసిపోతుంది. దానికి ఉండే లక్షణాలన్నీ ముందే తెలుసు. రోజంతా ఆయన వినేది యీ లక్షణాలే! అందుకని మనం చెప్పడం మొదలుపెట్టగానే ఆయన మందు రాసేసి చీటీ చేతిలో పెడతాడు. సరిగ్గా వినకుండా మందిచ్చేశాడే అని మన బాధ. ఇలాటి సందర్భాల్లో మనం ఒకటి చెప్పగానే డాక్టరు మాట అందిపుచ్చుకుని మరో రెండు గడగడా చెప్పేశాడనుకోండి, మనకు తృప్తిగా వుంటుంది.

కానీ చాలామంది డాక్టర్లకు అసహనం జాస్తి. అసలు పేషంటు తమ వద్దకు ఎందుకు వచ్చాడో వాళ్లు ఆర్థం చేసుకోవాలి. కేవలం మందు కోసమే అయితే మెడికల్ షాపు వాడే యిచ్చేస్తాడు, డయాగ్నస్టిక్ లాబ్ వాడే డాక్టరు మీకు యిదే రాస్తారు చూడండి అని చెప్పేస్తాడు. తను సరైన మార్గంలోనే, సురక్షితమైన హస్తాలలోనే ఉన్నాననే ధీమా రోగికి కలిగించడమే వైద్యుడి ప్రథమ కర్తవ్యం. అలాటప్పుడు రోగం గురించి పేషంటుకు సూక్ష్మంగానైనా వివరించడం నామోషీగా ఫీలయితే ఎలా? రోగం గురించి, మందుల గురించి పేషంటు ముందే తెలుసుకుని వస్తే చాలామంది డాక్టర్లు భరించలేరు. మనం ఏదైనా ప్రశ్న వేస్తే, ఎదురు ప్రశ్న వేసి ‘నీకేం తెలుసు?’ అని ఎద్దేవా చేస్తారు. ఈ రోగమెందుకు వచ్చింది అంటే ఏమో అన్నట్లు భుజాలెగరేస్తారు లేదా బిపి, సుగర్‌, వయసు, స్థూలకాయాలనే విపింగ్ బాయ్స్‌పై నెపం నెట్టేస్తారు. మందు యిచ్చినపుడు ఫలానా సైడ్ ఎఫెక్టులు వస్తాయేమో గమనించండి అని చెప్పరు. మనమే నెట్‌లో చూసి తెలుసుకోవాలి. దేనికీ టైము లేనట్లుంటారు. పైన కాంటినెంటల్ డాక్టరు గారు చెప్పినట్లు వాళ్లపై ఒత్తిడే దీనికి కారణమేమో తెలియదు. కానీ పేషంట్ల పట్ల చూపించే చికాకు వలన తమ బాడీ హ్యూమర్స్ చెడిపోయి తమకే కీడు జరుగుతోందని వాళ్లు గుర్తించాలి.

వైద్యులు తాము తర్ఫీదు పొందిన వైద్యవిధానాలనే కాక, యితర వైద్యవిధానాలను కూడా గౌరవించడం నేర్చుకోవాలి. మనం ఆలోపతి డాక్టరు దగ్గరకు వెళ్లామనుకోండి. ఈ రోగం ఎప్పణ్నుంచి? ఇన్నాళ్లూ ఏం చేశారు? అని అడుగుతాడు. ‘దానంతట అదే పోతుందని కొంతకాలం వెయిట్ చేసి, నేనే పోతాననే భయం మొదలయ్యాక, డబ్బు శని వదిలితే తప్ప జబ్బు శని వదలదని నిశ్చయించుకుని మీ దగ్గరకు వచ్చాం’ అని అనలేం కదా!  ‘ఈ మధ్యే వచ్చింది, ఆయుర్వేదం, హోమియోపతి వాడి చూశా’ అని చెప్పగానే డాక్టరు యిచ్చే డర్టీ లుక్ గమనించండి. ఇంతటి అనాగరిక, ఆటవిక, అజ్ఞాన వ్యక్తితోనే నేను డీల్ చేస్తున్నది అన్న ఫేస్ పెడతాడు. పోనీ పోస్టు ద్వారా డిగ్రీ తెచ్చుకున్న ఆయుర్వేద, హోమియో వైద్యులంటే చులకన వుండవచ్చు. కానీ వీళ్లు చదివినట్లుగానే అయిదారేళ్లు చదివిన బిఏఎమ్ఎస్‌లను, బిఎచ్ఎమ్ఎస్‌ల గురించి కూడా అలాటి అభిప్రాయం ఉంటే ఎలా?

ఓకే ఆ ప్రిస్క్రిప్షన్ చూసినా వీళ్లకు బోధపడకపోవచ్చు. హోమియో వాళ్లయితే ప్రిస్క్రిప్షనే యివ్వరనుకోండి. మందు పేరు చెప్పరు కూడా. అందువలన వీళ్లు ఓకే అనేసి ముందుకు సాగవచ్చు. కానీ అనవసర వ్యాఖ్యలు చేయనక్కరలేదు. అదే కనక ‘వేరే అలోపతి డాక్టరు దగ్గరకు వెళ్లాం, ఆయన యీ మందులు రాశారు’ అన్నామనుకోండి. అప్పుడు వ్యాఖ్యలేమీ చేయకుండా ‘టెస్టులు మళ్లీ ఒకసారి చేయిద్దామండి, అప్టుడేట్‌గా వుంటుంది’ అంటారు. ఇక ఆయుర్వేద, హోమియోవాళ్లలో చాలామంది ఇంగ్లీషు వైద్యాన్ని తిట్టడమే పనిగా పెట్టుకుంటారు. సుగర్ తగ్గించేస్తా, కానీ మీరు యిప్పటిదాకా తీసుకుంటున్న ఇంగ్లీషు మందులన్నీ మానేయాలి అని షరతు పెడతారు. చేతిలో ఉన్న కొమ్మ వదులుకుని కొత్త కొమ్మను పట్టుకోవడానికి మనకు భయం. రెండూ వేసుకుంటామంటే ససేమిరా అంటారు. రోగి వైద్యుణ్ని నమ్మాలి సరే, వైద్యుడు కూడా సాటి వైద్యవిధానాల తాలూకు వైద్యులను నమ్మాలి. ఆరోగ్యరంగంలో యిలాటి ఆరోగ్యకరమైన మార్పులు వస్తాయని ఆరోగ్యదినం సందర్భంగా అభిలషిద్దాం.

ఇప్పుడు కాస్త సమాచారం యిస్తాను. ‘‘వీక్’’ వారపత్రిక వాళ్లు నెలకోసారి హెల్త్ సప్లిమెంటు యిస్తారు. పునీత్ రాజ్‌కుమార్ పోయినప్పుడు దేశమంతా ఉలిక్కిపడింది. ఇంతటి ఆరోగ్యవంతుడు అలా పోవడమేమిటని? వీళ్లు దానిపై కవర్ స్టోరీ యిచ్చి ఎక్సర్‌సైజ్ ఎంత చెయ్యాలి ఏమిటి అని వ్యాసాలు రాశారు. అది జరిగాక ఆంధ్రలో మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించారు. పునీత్ విషయంలో ముందురోజు ఛాతీ నొప్పి వస్తే అది గ్యాస్ ట్రబుల్ అనుకుని, మర్నాడు యథావిధిగా కసరత్తు చేసి ముప్పు తెచ్చుకున్నాడు అన్నారు. మేకపాటి విషయంలో అదీ లేదు. అందువలన కసరత్తుకు పరిమితులేమిటి అనేది రాసిన ఆ వ్యాసం మనకు ఉపయోగపడుతుందని దానిలో విశేషాలు రాస్తున్నాను.

పునీత్ 46వ ఏట, హిందీ రంగానికి చెందిన సిద్ధార్థ శుక్లా 43వ ఏట, మందిరా బేదీ భర్త హిందీ డైరక్టరు రాజ్ కౌశల్ వయసు 49వ ఏట పోయారు. వీళ్లందరికీ వర్కవుట్ అయ్యాక చెస్ట్ పెయిన్‌ వచ్చింది. మన రక్తబంధువులు 60 ఏళ్ల లోపుగా గుండెజబ్బుతో పోతే మనం గుండె విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందేట. పునీత్ తండ్రి రాజ్‌కుమార్‌కు హృద్రోగం ఉండేది. 77 ఏళ్లు బతికి హార్ట్ ఎటాక్‌తో పోయారు. యిప్పటికీ ఆరోగ్యంగానే ఉన్న పునీత్ సోదరుడు రాఘవేంద్రకి 23 ఏళ్ల వయసులోనే హార్ట్ ఎటాక్ వచ్చిందట. పునీత్‌కు ఫ్యామిలీ హిస్టరీ వుందని గుర్తుంచుకోవాలి. ‘20-25 ఏళ్ల వయసు నుంచే మన ధమనుల్లో (ఆర్టరీస్) కొద్దికొద్దిగా కొలెస్టరాల్ పేరుకుంటూ వస్తుంది. పునీత్ విషయంలో అది మోడరేట్ లెవెల్‌కు వచ్చి వుండవచ్చు. వ్యాయామం మోతాదు మించడంతో గుండె వేగం హెచ్చి, అతిగా సంకోచించి, బిపి పెరిగి, రక్తపు వేగంతో ధమని చిట్లిపోయి వుంటుంది.’ అని ఫోర్టిస్ ఆసుపత్రికి చెందిన డా. వివేక్ జవాలీ అన్నారు.

ఫిజికల్ ఫిట్‌నెస్ వేరు, మెటబాలిజం వేరు. శ్రామికులు, గ్రామీణులు నిరంతరం పనిచేస్తూ వుంటారు కాబట్టి మెటబాలిక్ రేటు బాగా వుండి యిలాటి ప్రమాదాలు రావు. మొదట్లో అశ్రద్ధ చేసి, ఆ తర్వాత 30-40 ఏళ్ల వయసు వచ్చాక ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం విరగబడి వర్కవుట్ చేసేవారికే ముప్పు ఉంటుంది. ఒక స్థాయిలో చేసినా బాగుంది అనుకున్నాక దాన్ని పెంచుకుందామనే కోరిక కలుగుతుంది. అది ప్రస్తుతం ఉన్నదాని కంటె 10% ఎక్కువైతే ఫర్వాలేదుట. ఒక్కసారిగా పెంచేస్తేనే యిబ్బంది వస్తోంది. గుండె బలహీనపడడం ఒకటే కాదు, మోకాలి నొప్పులు, నడుం నొప్పి, కండరాల నొప్పి యివన్నీ వస్తాయి. మన కాళ్లు, చేతులు 14-16 సం.ల దాకా పెరుగుతాయి. వెన్నెముక 22 తర్వాత పెరగదు. అందువలన 18 ఏళ్ల లోపున వెయిట్ లిఫ్టింగ్ ప్రారంభించడం మంచిది కాదు.

మామూలుగా అయితే వారంలో ఐదు గంటల పాటు సాధారణ వ్యాయామం చేయవచ్చు లేదా ఏరోబిక్ యాక్టివిటీస్‌లో బ్రిస్క్ వాకింగ్, స్విమ్మింగ్ వంటి మోడరేట్‌వి వారానికి రెండున్నర గంటలు చేయవచ్చు. రన్నింగ్, ఏరోబిక్ డాన్సింగ్ వంటి మరీ బ్రిస్క్‌వి ఐతే వారానికి గంటన్నర చాలు. మన వర్కవుట్ ఎంత తీవ్రంగా ఉంది అని తెలుసుకోవాలంటే పూర్తికాగానే మాట్లాడి చూడాలి. బలంగా ఊపిరి పీలుస్తున్నా మాట్లాడగలుగు తున్నామంటే మోడరేట్ ఇంటెన్సిటీ అన్నమాట. నాలుగు మాటలు మాట్లాడగానే ఆగి గాలి పీల్చుకోవలసి వస్తోందంటే విగరస్ ఇంటెన్సిటీ అన్నమాట. మోతాదు ఎక్కువైందనే సంకేతాలు ఏమిటంటే – ఛాతీలో అసౌకర్యం, ఎసిడిటీ, గుండెల్లో మంట, అలసిపోవడం, రోజూ చేసే కసరత్తుకే ఊపిరి చాలకపోవడం. రెగ్యులర్ బేసిస్‌లో చేసుకుంటూ, క్రమేపీ మోతాదు పెంచుకుంటే ఫర్వాలేదు కానీ, ఒక టైము ఫ్రేమ్ పెట్టుకుని ఆ లోపున ఫిజిక్ మెరుగుపరుచుకోవాలని విపరీతంగా చేస్తే అనర్థాలు కలుగుతాయని అర్థమౌతోంది.

రెండో కేసు బప్పీ లాహిడీ గురించి రాస్తున్నాను. అతను 69 ఏళ్ల వయసులో పోయాడు కాబట్టి, అకాలమరణం అనలేం. కానీ అతని మృత్యుకారణమైన ఆప్నియా మాత్రం మనందరికి చింత కలిగించేదే! ఎందుకంటే మనలో చాలామంది గురక పెడతారు. స్థూలకాయులైన వారు తప్పకుండా పెడతారు. బైదివే తెలంగాణ మహిళల్లో 30% మంది స్థూలకాయులని, హైదరాబాదుకి వస్తే అది 50% మందని పేపర్లో వచ్చింది. నమ్మాలో వద్దో తెలియటం లేదు. స్థూలకాయం ఎన్ని విధాల అపాయకరమో వేరే చెప్పనక్కరలేదు. మధ్యవయస్కులలో 80% మంది గురక పెడుతున్నారని ఓ సర్వే చెప్పింది. అదీ నమ్మబుద్ధి కావటం లేదు. ఈ గురక సమస్య ఉంటే స్లీప్ టెస్ట్ చేయించుకుంటే మంచిది. 5 వేల రూ.ల దాకా ఖర్చవుతుంది. కొన్ని కేసుల్లో గురక ఆప్నియాకు దారి తీస్తుంది. ఇతర ఆరోగ్యసమస్యలున్నా బప్పీ ఏడాదిగా బాధపడుతున్నది, చివరకు పోయినది అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా (ఒఎస్ఏ)తోనే. దేశంలో 70 లక్షల మందికి అది వుందని ఓ అధ్యయనం చెపుతోంది. పరీక్ష చేయించుకోని వాళ్లు యింకెంత మందో!

దీని కారణంగా నిద్రపోతున్నపుడు గొంతు కండరాలు శ్వాసకు అవరోధం కలిగిస్తాయి. దాంతో రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి, వెంటనే మెదడు మనిషిని నిద్ర లేపేస్తుంది. అతను లేచి సర్దుకోవడంతో మళ్లీ నిద్రపడుతుంది. ఇలా రాత్రంతా అంతరాయాలు కలగడంతో 8,9 గంటలు నిద్రపోయినా నిద్ర చాలదు. మర్నాడు మగతగా వుంటుంది. బిపి పెరుగుతుంది. గొంతు పొట్టిగా, లావుగా ఉండడం, ముక్కుదూలం వంకరగా వుండడం, నాలిక మందంగా ఉండడం, అధికమైన బరువుండడం యివన్నీ దీనికి దోహదపడతాయి. ఒఎస్‌ఏ ఏ స్థాయిలో వుందో తెలుసుకోవడానికి ఇఎస్‌ఎస్ (ఎప్‌వర్త్ స్లీప్‌నెస్ స్కేల్)ను ఉపయోగిస్తారు. 8 రకాల పరిస్థితుల్లో మీరు ఏ లెవెల్లో జోగుతున్నారో చూసి, దాని ప్రకారం నిర్ణయిస్తారు. ఆ ఎనిమిదీ ఏమిటంటే, పుస్తకపఠనం, టివి చూడడం, పార్కులో ఖాళీగా కూర్చోవడం, మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవడం, కారులో ప్రయాణం, ఎవరితోనైనా అనాసక్తంగా సంభాషించడం, భోజనానంతరం స్తబ్దంగా కూర్చోవడం, ట్రాఫిక్‌లో ఆగిపోయిన కారులో కూర్చోవడం.

వీటిలో వెంటనే కునికిపాట్లు బాగా వస్తాయి అంటే 3, వస్తే రావచ్చు అంటే 2, రాకపోవచ్చు అంటే 1, అస్సలు రావు అంటే 0. ఇలా 8 ఇంటూ 3 మొత్తం 24 పాయింట్లు వుంటాయి. వీటిలో 16 పాయింట్లు వస్తే మీకు నిద్రలేమి, బహుశా ఆప్నియా ఉన్నట్లే లెక్క. మధ్యవయసులోనే యిది ప్రారంభమవుతుంది కాబట్టి ముందే టెస్టు చేయించుకుని జాగ్రత్తపడితే మంచిది. మధ్యవయస్కుల్లో నిద్రపట్టకపోవడమనే జబ్బు చాలామందికి వుంది కాబట్టి యీ సమస్య గురించి అవగాహన కల్పిద్దామని యిదంతా రాశాను. ఇదంతా ఆయా వ్యాసకర్తలు చెప్పినదాన్ని బట్టి రాసినదే తప్ప నా పాండిత్యమేమీ లేదు. ఉగాది సందర్భంగా కొత్త సంవత్సరంలో అందరూ చక్కని ఆరోగ్యంతో వర్ధిల్లాలని ఆశిస్తున్నాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2022)

[email protected]